Sujanaranjani
           
  శీర్షికలు  
  పద్యం - హృద్యం
 

  నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్     

 
పద్య ప్రియులకునూతనసంవత్సర శుభాకాంక్షలు.గత ఆరుసంవత్సరాలుగా ఈశీర్షికని చదివి, ఔత్సాహిక పద్య రచయితలను ప్రోత్సహిస్తున్నమీ అందరకూ ధన్యవాదములు.ఈక్రొత్త సంవత్సరము నుండి ఈశీర్షికకు ఇంకొన్నిమెరుగులుదిద్ది, పద్యమనగానే అమ్మోఅని భయపడకుండా అందరూ పద్య సాహిత్యమును ఆనందించుటకు మాశీర్షిక సోపానము కావాలని మా కోరిక. ఆప్రణాళికలోభాగముగా శీర్షికలో, ప్రతినెలా ఉండే సమస్యాపూరణముతో పాటు, శ్రీభైరవభట్ల కామేశ్వరరావుగారి "పద్యములలోనవరసాలు" అనేవ్యాస పరంపరను ప్రారంభిస్తున్నాము. సంగీతము గురించి కొద్ది వివరాలు (స్వర, రాగ, తాళజ్ఞానము) తెలుసిన వారు కచేరిలను మిగిలిన వారి కంటే ఎక్కువ ఆనందిస్తారనేది జగద్విదితము. అలాగే, పద్యములు, వాటిలోని విశేషాలను తెలుకుంటే, పద్య సాహిత్యాస్వాసానందము ద్విగుణీకృతమౌతుంది.ఈవ్యాస పరంపర మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.

సీ||జనవరిమాసంబుధనలాభములనిచ్చు - ఫిబ్రవరినవంశవృద్ధిజరుగు

మార్చిఏప్రిలుమీకుగూర్చుశుభంబులు - మే, జూను, జూలైలుమేలుజేయు

ఆగష్టుసెప్టెంబరారోగ్యమునుబెంచు - అక్టోబరందుప్రాజెక్టుముగియు

భాగ్యంబులొసగునవంబరుమాసంబు - క్షేమంబునొసగుడిసెంబరునెల

 

.వె||ఒక్కొక్కనెలమీకుఒక్కొక్కరీతిన

పాతవెతలనన్నిపారద్రోల,

కొత్తవత్సరంబుకూర్మిమీరగనవ్య

 శోభదెచ్చిమీకుశుభములొసగు

సమస్యా పూరణము:

ఈక్రింది "సమస్యని" అంటే ఆవ్యాక్యన్నియదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి.ఒకవేళపద్యంకాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీజవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా (padyam@tallapragada.com)  మాకు20వతారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసపు సమస్య:

అర్జునుడొకపిడుగుపడగఅమ్మోఅనెనే!!

తమాసం సమస్యలు

1.     గానము వంటి విద్య మరి గానము (వేదుల బాలకృష్ణ గారు పంపినది)

2.   నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ స్వేచ్చా ఛందస్సులో పద్యము

ఈ సమస్యకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

వారణాసి సూర్యకుమారి, రాలే, నార్త్కేరొలీన

ఉత్పల మాలిక:

గానకళావిశారదులగాంచమె?ధాత్రినికొందరుందురా

కానుకదైవదత్తముగ| కారణజన్ములెవారిలన్| సదా

గ్లానినిబాపగల్గునదెగానము| పక్షిమెకమ్ములైననూ

మానవశ్రేణినైననికమైమరపించునుగానమేయనన్ 

తాననురాగమున్పొదిగితల్లిగపాడినజోల| పిల్లలున్

తాననుభక్తిగీతముల| దైవము| నెమ్మదిప్రీతినొప్పునే  

మానసముల్లసిల్లగనుమార్గముచూపునుగానమే| స్వర 

జ్ఞానులురాగముల్పలికిసాధ్యముచేతురువానజల్లులన్ 

మానునుకాదె| ఋగ్మతలుమానవకోటికిగానమాధురిన్ 

గానమువాణిహాసమనిగట్టిగచెప్పిరికోవిదుల్| మరా 

గానమెప్రాణమన్నశుభగాత్రము  సాధనతోడసాద్యమౌ 

గానమువంటివిద్యమరిగానముమేదినినెందుచూచినన్

 

.వె.||సుజనరంజనికివె శుభకామనలటంచు 

పాఠకులును హితులు పలుకుచుండ 

నవ్య వత్సరమ్ము నవ్వుచునరుదెంచి 

కార్యసిద్ది మనకు కలుగజేయు

 

కం|| నూతనసంవత్సరమా 

మాతలరాతలనుగూర్చుమా| సుఖశాంతుల్

ఖ్యాతినిపెంచుచుశుభమగు

రీతినిబ్రతుకంగనిమ్మ| శ్రీకరమగుచున్

 

గండికోటవిశ్వనాధం, హైదరాబాద్

.||  వీనులవిందుగావినినవేడుకగూర్చువినోదనాదమై
తేనెలసోనలైపరగుదేవమునీంద్రునిగానమోయనన్
మానసముల్లసిల్లతగుమంజులసుస్వరనాదమాధురీ
గానమువంటివిద్యమరిగానమువేరొకటెంతయున్ధరన్ 

.||ఎచ్చటజూచినన్ప్రగతిపెంపునసంపదశోభనింపగన్
అచ్చముగాప్రజావళికిఆశలుదీర్చెడినూత్నయత్నముల్
మెచ్చగ, సర్వసాధుజనఫ్రీతిగ, రమ్మిక, భాగ్యదాతవై
ముచ్చటరెండువేలపదమూడవవర్షమ! హర్షవర్షమై.   

చింతారామకృష్ణారావు, హైదరాబాద్
ఉ.||జ్ఞానసుధామరందమునుకమ్మనిపాటగనందఁజేయుయా
ధీనిధిబాలకృష్ణుఁడిల. దివ్యసుగాత్రముతోడపాటకున్
బ్రాణముపోయు.మంగళముపల్లిసుగాత్రమునెన్నివిన్నచో 
గానమువంటివిద్యమరిగానముసత్కళలందునందురే!
 

నేదునూరిరాజేశ్వరి, న్యూజెర్సీ

.||పానముజేయగారజతపాత్రమునిండుగపాయసాన్నముల్
వీనులవిందుగావినుచువీణియనాదముప్రీతిచెందగా
తానముజేసినన్తనరుధారిణి  పావనగంగయందునన్
గానమువంటివిద్యమరిగానములోకమునందునెయ్యెడన్ ! 

కం || శుభములనీయగజనులకు
నభమంటినయిడుములన్నినాశముజేయన్ !
అభయములిచ్చెడినేతలు
విభవమ్మునశుభముగూర్చవేవేలనుతుల్ ! 

తే.గీ||సుజనరంజనిపత్రికసొగసులలర
యలరుసాహిత్యసంపదనిలయమైన
వివిధవైవిద్యరచనలవేద్యమనగ
అందుకొనుమమ్మమాశుభాకాంక్షలివియె !

యం.వి.సి.రావు, బెంగలూరు.

ఆ.వె||మతపు ఘర్షణంబు,మానభంగంబులు

జాతి  వైర,చోర,జాడ్యములును

కొత్త వత్సరాన కొద్దిపాటియు లేక

సుఖము గల్గు గాత శుభములలర

 

ఉ|| గానమె త్యాగబ్రహ్మకు ప్రగాఢపు సిద్ధిని గల్గజేసె,నా 

గానమె నారదాది మునిగాయకులెల్లర విష్ణు సేవలం

బూనగజేసి బ్రహ్మ పదముంగనజాలిన మార్గమాయెగా

( గానము యొక్కటే  మనసుగాయము మాన్ పెడి మంత్రమౌటచే )

గానమువంటి విద్య మరి గానము ఎర్వది నాల్గు విద్యలన్  

 

డా.రామినేని రంగారావు  యం.బి.బి.యస్,పామూరు,ప్రకాశం జిల్లా.

.|| కూనలయేడ్పునాపగను, కూడినగుంపువివాదమాపగా,

మానసఖేద-వ్యాథులనుమాన్పుచుస్వస్థతశీఘ్రమివ్వగా,

ధేనులపాలుపొంగగను, తీగెలపూవులుతేనెలూరగా,

గానమువంటివిద్యమరిగానముగానముగానమెచ్చటన్

 

సీ.|| నీతిగ-నియమాలనిష్టతోజీవించి

                           పసివారితీర్చగాపంతులయ్య

ఆర్ద్రతబాధ్యతల్ఆదర్శములనెల్ల

                            ఆత్మబంధులలోనఅమలుజరుప

ఇరుగుపొరుగువారుఇంటివారికివోలె

                            భావించికష్టాలుపంచుకొనగ

నిర్లిప్తతనువీడినిజహక్కులనుపొంద

                            ప్రక్కవారినిచేర్చిపాటుపడగ

.వె||  పాతవత్సరానపడినట్టివెతలెల్ల

కళ్ళముందెకరిగికదలిపోవ

భోగ-భాగ్యములనుభోగితోకూడిన

కొత్తవత్సరంబుకూర్చుగాక.  

మాజేటిసుమలత, కూపర్టీనో, కాలిఫోర్నియా

.|| తానముసొంపుగానుహరినామముకీర్తనసేయుచున్సుధా

పానముచేతరించిపరమాత్మునిపాదముబట్టిరంతభో

గాన, సునాదయోగమునగల్గునుమోక్షముగానగాఇలన్

గానమువంటివిద్యమరిగానముహృదివిపంచిమీటగన్

 

తే.గీ||ఆయురారోగ్యఆనందసంపదలతొ

విజయమంగళకరమౌచువిమలగతుల

ఆంగ్లవత్సరమరుదెంచెఆదిగాను

శోభకాంక్షింతుజగతినిశుభముకలుగ

రావుతల్లాప్రగడ,సాన్హోసే, కాలిఫోర్నియా

సీ.|| కొడుకుండిలేనట్టిగొడ్రాలుఈమెరా!

          తెలుగుతల్లికిపట్టెతెగులుచూడు!

తళతళలాడిందితమిళమ్ముసోదరా

            కళకళలాడిందికన్నడముర!

తెలతెలాపోయిందివెలవెలాపోయింది

            విలవిలావొలవొలాతెలుగుతల్లి,

ఎంగ్లిమంగలమయ్యిఆంగ్లతిమింగ్లపు

            నోటిలోచిక్కుకునోరుమూసె!

 

.వె.|| తెలుగుతల్లినోరుతెరిచేదిఎవ్వరో,

తెలుగుమాటనోటతెచ్చిపెట్ట!

పుట్టడాధరతినపుణ్యాత్ముడొక్కడు,

కొత్తవత్సరమ్ముకొక్కడైన!?!

 

వేదుల బాలకృష్ణ మూర్తి, శ్రీకాకుళం

ఉత్పల మాలిక:

గానము వంటి విద్య మరి గానము, వీనులవిందుచేయుచున్‌

గానము మానసమందున గాన సుధన్‌ ప్రవహింపచేయుచున్‌

గానము భక్తితత్వమును జ్ఞాన ముఁ గూర్చు కళాస్వరూపమై

గానము వాఙ్మసః క్రియల వైక్యత కూర్చెడి నాద యోగ్యమై

గానము నాదయోగమున కంజదళాక్షుని గొల్చు నామమై

గానము నాదలోలుడగు గాగజటాధరు నామరూపమై

గానము మంత్రయుక్తముగ గానము చేయగ సామవేదమై

గానము రాగతాళములకన్వయమున్‌ కలిగించు భావమై

గానము నృత్యవాద్యముల కర్ధము తెల్పెడి మేటి పాటయై

గానము జంత్రగాత్ర సహకారమునన్‌వెలుగొందు గేయమై

గానము నాట్యలాస్యముల కాదరమున్‌ కలిగించు భాష్యమై

గానము భావరాగలయ కల్పనలన్‌ విలసిల్లు శాస్త్రమై

గానము పాండితీగరిమ గానకళల్ పలికించు గాత్రమై

గానము రాగమాలికల కందముగూర్చు కళా విలాసమై

గానము బాలబాలికల జ్ఞాపక శక్తిని పెంచు మార్గమై

గానము శోకమోహముల గాడతమస్సులద్రుంచు జ్యోతియై

గానము సర్వమానవుల కాశ్రమమిచ్చెడి జ్ఞానయోగమై

గానము ముక్తిమార్గమున కాంక్షలు తీర్చు సునాద గీతియై

గానము కచ్ఛపీ శృతిని గానమొనెర్చెడి వాణి వీణయై

గానము నారదీయమగు గానమునన్‌ మహతీ నినాదమై

గానము త్యాగరాజ మృదుగాత్ర విపంచి రసజ్ఞ రాగమై

గానము రాగరాజ కవిగాయక బృంద రసార్ధ్ర తానమై

గానము పల్లవించి నయగారము నిచ్చు కళాని ధానమై

గానము రామభక్తి సహకారమునన్‌ భువి భక్తి రాజ్యమై

గానము నాట్యశాస్త్రనిధి కాశిపురాధిపు నాట్యవేదమై

గానము శాంకీర ప్రణవ గానసుధాబ్ధి చరించు హంసయై

గానము మేలుకొల్పులను గానము చేయగ సుప్రభాతమై

గానము పవ్వళింపులకు గానము చేయగ జోలపాటయై

గానము సర్వదేవతల కార్యముల న్‌ స్వరరాగతాళమై

గానము ఇండ్లలోని శుభకార్యము లందు భజంత్రి మేళమై

గానము సర్వరోగముల కారణముల్ తొలగించు మంత్రమై

గానము ఎల్లవేళలను గాన గానము చేయగ ఆత్మబంధువై

గానము బాలకృష్ణకవి కర్ణరసాయన వేణునాదమై

గానము సర్వతోముఖ వికాసము కూర్చును మానవాణికిన్‌

 

సీ.|| జనవరినుండిడిశంబరుపూర్తియై - కొత్తవత్సరమొచ్చికొల్వుతీరె

రెండువేలుమరియుపన్నెండుయేండ్లుగడచి - పదమూడువచ్చెనుభవ్యరీతి

వేయికిరణములవేల్పురవిమకర - రాశినిచేరసంక్రాంతివచ్చె

పొంగలివంటలబొమ్మలకొలువుల - భోగిపండుగతెచ్చెభోగిపళ్ళు

 

తే.గీ//స్వాగతంబిదెనూతనసంవత్సరంబ!

ఆంధ్రులకుపెద్దపండుగయగుచురమ్ము

అఖిలజనులకుభోగభాగ్యములనిమ్ము

ప్రస్తుతులుకొమ్ముమాకుశుభాలిమ్ము

 

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై

 

 ఆ.వె.|| కలకలములు,  దేశ కలవరములుడిగి,

సకల జనుల నడుమ సమత పెరిగి,

పుడమి శా౦తి వెలయ, పుడమీ పతీ! హరీ!,

వరము లొసగ వయ్య, వచ్చు ఏడు!

 పద్యాలలోనవరసాలు - కానీవోయ్ రసనిర్దేశం!

-     భైరవభట్లకామేశ్వరరావు

సుజనరంజని పత్రికకి పద్యాల గురించి ఏమైనా కొన్ని వ్యాసాలు వ్రాయమని శ్రీ శ్యాంసుందర్గారు కోరారు. నవరసాల గురించీ, పద్యాలలో కవులు వాటిని పలికించిన తీరు గురించి అయితే బాగుంటుందని వారే సూచించారు. దానికి నేను వెంటనే " సరే!" అనేసాను. అన్నానే కాని తీరా దాని గురించి ఆలోచడం మొదలుపెడితే ఎన్నెన్నో అనుమానాలు. ఇది మరీ పాత చింతకాయి పచ్చడి అంశమేమోననీ, దీని గురించి తేలికైన పద్ధతిలో వివరించడం సాధ్యమవుతుందా అనీ, అసలీ విషయం గురించి నాకు తెలిసింది ఏపాటి అనీ, ఇలా ఇంకా చాలా. ఇప్పటికీ అనుమానాలు పూర్తిగా తీరిపోయాయని చెప్పలేను. అంచేత నా యీ ప్రయత్నం కొంత సాహసంతో కూడుకున్నదే. "విబుధవరుల వలన విన్నంత కన్నంత, తెలియ వచ్చినంత తేట పరతు" అన్న పోతనగారిని ఆదర్శంగా తీసుకొని, వీలైనంత తేలికగా, కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా - రసం అంటే ఏమిటి, దాని గురించి అలంకారశాస్త్రంలో మన పండితులు ఎలాంటి సిద్ధాంతాలు చేసారు, అనేది స్థూలంగా పరిచయం చేసి, తర్వాత ఒకో రసాన్ని సోదాహరణంగా వివరిస్తాను. ఉదాహరణలుగా ప్రాచీన కావ్యాలలో పద్యాలనే కాక, ఆధునిక కవుల పద్యాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే, నేను చెప్పే విషయాలు నూటికి నూరు పాళ్ళు అలంకారశాస్త్రాన్ని అనుసరిస్తాయని చెప్పలేను. దానికి కారణాలు - ఒకటి, ఆధునిక కవిత్వానికి అలంకారశాస్త్ర సిద్ధాంతాలు యథాతథంగా వర్తించకపోవచ్చు. ప్రాచీన కావ్యాలనైనా కొత్త దృష్టితో చూసేటప్పుడు ప్రాచీన సిద్ధాంతాలకి తగిన మార్పులూ చేర్పులూ అవసరం కావచ్చు. రెండు, వ్యాసాలు అలంకారశాస్త్ర పండితుల కోసం కాదు. వీటి ఉద్దేశం సిద్ధాంత చర్చ, విమర్శ కాదు. కవిత్వమంటే, అందునా పద్యకవిత్వమంటే యిష్టమున్న వారికి, అందులో ఉండాల్సిన ఒక ముఖ్యమైన అంశంగా మన ప్రాచీన విమర్శకులు భాచించిన రసాన్ని పరిచయం చెయ్యడం. అన్నిటికన్నా ముఖ్యమైన మూడో కారణం, నాకు అలంకారశాస్త్రం మీద కాని, రససిద్ధాంతం మీద కాని, పరిపూర్ణమైన పాండిత్యం లేకపోవడం. ఉపోద్ఘాతాన్ని యిక్కడితో ముగించి, యిక అసలు కథలోకి అడుగులు వేద్దాం...

అనగనగనగా... పూర్వ కాలంలో మన భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన శాస్త్రాలలో భాషా శాస్త్రం, సాహిత్య శాస్త్రం, చాలా ప్రధానమైనవి. శాస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా యీనాటికీ ఎంతో గుర్తింపూ గౌరవమూ ఉన్నాయి. రెండు శాస్త్రాలూ వాఙ్మయానికి సంబంధించినవే కావడం కాకతాళీయమేమీ కాదు. ప్రాచీన కాలం నుండీ మన దేశంలో, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, మొదలైన అనేక రూపాల్లో చాలా విస్తృతమైన వాఙ్మయం వెలువడింది. దాని ఆధారంగానే, ఒకే చెట్టుకి పుట్టిన రెండు శాఖల్లాగా భాషా సాహిత్య శాస్త్రాలు విస్తరించాయి. ఇందులో సాహిత్యశాస్త్రం ప్రధానంగా కావ్యాలను విశ్లేషిస్తుంది.


"కావ్యం కాంతా సమ్మితం" అనేది ఒక ప్రసిద్ధమైన మాట. దీని అర్థం - కావ్యం తాను చెప్పే విషయమేదైనా, ఒక ప్రియురాలు తన ప్రియునికి చెప్పినట్టుగా అందంగా, సుకుమారంగా, సరసంగా చెపుతుంది - అని. ఇక్కడ "కాంతా" అనే పదం చాలా అర్థవంతమైనది. పదానికి "ఆకర్షించేది/ఆకట్టుకొనేది" అనే అర్థం ఉంది (Magnetని అయస్కాంతం అంటాం కదా. అయస్సు అంటే ఇనుము. దాన్ని ఆకర్షించేది కాబట్టి అయస్కాంతం అయ్యింది). అంచేత కావ్యమనేది పాఠకుని హృదయాన్ని ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి. అది దాని ప్రాథమిక లక్షణం. మరి యీ ఆకర్షణ లేదా సౌందర్యం ఎలా కలుగుతుంది? కావ్యసౌందర్యానికి ముఖ్యమైన అంశం ఏమిటి? పాఠకుడు కావ్యాన్ని ఎలా ఆస్వాదించగలుగుతాడు? ఇలాంటి ప్రశ్నలను చర్చించి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించేదే సాహిత్యశాస్త్రం. దీనికే కావ్యశాస్త్రమనీ, సౌందర్యశాస్త్రమనీ కూడా పేర్లున్నాయి. అలంకారం అంటే అందాన్ని యిచ్చేది అని అర్థం. కాబట్టి యీ శాస్త్రానికి అలంకారశాస్త్రం అన్న పేరు కూడా వచ్చింది. పేరే ఎక్కువ ప్రాచుర్యం పొంది స్థిరపడింది. అలంకారశాస్త్ర సిద్ధాంతాలను చేసినవాళ్ళను ఆలంకారికులు అంటారు. కావ్యానికి ఆయువుపట్టు ఏదన్న విషయాన్ని గూర్చి వివిధ ఆలంకారికులు వివిధ రకాలైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వాటిలో ప్రముఖమైనది రస సిద్ధాంతం. సిద్ధాంతం రసాన్ని కావ్యానికి ఆత్మగా గుర్తిస్తుంది.

"రసేనైవ సర్వం జీవతి కావ్యం" అనీ, "వాక్యం రసాత్మకం కావ్యం" అనీ పేర్కొన్న ప్రాచీన ఆలంకారికులనుంచీ, "కానీవోయ్ రసనిర్దేశం", "రసము వేయిరెట్లు గొప్పది నవకథాధృతిని మించి" అని ప్రకటించిన ఆధునికకాలపు కవుల దాకా, ఎందరో కవిత్వంలో రసానికి చాలా విలువైన స్థానాన్ని యిచ్చారు. ఇంతకీ రసమంటే ఏమిటి? "రసం" అంటే ఏదో అర్థంకాని బ్రహ్మపదార్థమని కొంతమందికి ఒక అపోహ ఉంది. రససిద్ధాంతం గురించి యిలాంటి భ్రమ కలగడానికి కారణం కొందరు ఆధునిక విమర్శకులు ఏమి వ్రాస్తున్నారో తమకు గానీ, చదివేవాళ్ళకు గానీ తెలియకుండా పేజీలకు పేజీలు వ్రాసి పారేయడమని ఆచార్య పుల్లెల రామచంద్రుడుగారన్నారు. పుల్లెలవారు అలంకారశాస్త్రం గురించి చాలా ప్రామాణికంగా, సరళంగా తెలుగులో ఎన్నో మంచి పుస్తకాలను రచించారు. ప్రాచీన అలంకారశాస్త్ర గ్రంథాలని తెనిగించారు. వారు టూకీగా, తేలికైన భాషలో "రసం" అంటే ఏమిటో యిలా వివరించారు:


"ఏదైనా ఒక సన్నివేశాన్ని - అది ప్రేమసన్నివేశం కావచ్చు, కరుణ సన్నివేశం కావచ్చు, వీరత్వ ప్రదర్శన కావచ్చు, హాస్య సన్నివేశం కావచ్చు - చక్కగా నిర్వహిస్తే, నాటకం లేదా సినిమా అయితే అది చూస్తున్నంత సేపూ, శ్రవ్యకావ్యం అయితే అది చదువుతున్నంతసేపూ, ప్రేక్షకుడు లేదా పాఠకుడు తనను తాను మరచి, చూస్తున్న దానితో, చదువుతున్న దానితో తన్మయత్వం చెందుతాడు. తన్మయత్వమే రసం. అట్టి స్థితి ఒక మెరుపు లాగ వస్తే అది భావానుభూతి. దృష్టితో అర్థం చేసుకుంటే రససిద్ధాంతం ఎంత సదాతనమో (సార్వకాలికమో) తెలుస్తుంది."


పుల్లెలవారు చెప్పినది మరికాస్త వివరంగా పరిశీలిద్దాం. మనిషి మనసు భావాల పుట్ట. భావం అంటే మనసులో ఏర్పడే కదలిక, సంచలనం. రకరకాల సందర్భాలలో, సన్నివేశాలలో మనసు రకరకాలుగా చలిస్తుంది. ఏదైనా మనకు హాని కలిగే సంఘటన ఎదురైతే భయమూ, ఇష్టమైనదాన్ని కోల్పోయినప్పుడు బాధ, ఎవరైనా నచ్చని పని చేస్తే కోపమూ - ఎన్నెన్నో భావాలు. కోరిక, కోపం, ఏడుపు, నవ్వు, ఉత్సాహం, భయం, అసహ్యం యిలా. అయితే యిందులో పెద్ద విశేషమేమీ లేదు. ఇవన్నీ తన చుట్టూ ఉన్న లోకంలోని పరిస్థితులకు సహజంగా మనిషి మనసు పొందే స్పందనలు. ఇలాంటి స్పందనలు కొన్ని జంతువులకి కూడా సహజమే. మనిషి మనసుకున్న విశిష్టత, ప్రత్యేకత, మరొకటుంది. అదేమిటంటే, సరిగ్గా యిలాంటి అనుభూతులే, వాస్తవ జగత్తులోని విషయాల వల్ల కాక, కల్పనా జగత్తులో సృష్టింపబడిన సన్నివేశాల ద్వారా కూడా మనసు పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు పాండురంగ మాహాత్య్మం సినిమాలో " పాదసీమ కాశీ ప్రయాగాది" అనే పద్యం ఉన్న సన్నివేశం చూసిన ఎవరికైనా కళ్ళు చెమర్చకుండా ఉండవు కదా (కావాలంటే యిక్కడ చూడండి!: (http://www.youtube.com/watch?v=V-ekPzWfPjI). పుల్లెలవారు చెప్పిన భావానుభూతి అదే. అనుభూతి ఒక స్థాయిని చేరుకుంటే, మనసు అందులో పూర్తిగా లీనమై తన్మయత్వం చెందుతుంది. తన్మయత్వమే రసం. అలాంటి అనుభూతిని కలిగించడం, నాటకం, సినిమా వంటి దృశ్యప్రక్రియల ద్వారా కొంత సులువు. ఎందుకంటే, అక్కడ పాత్రలు కళ్ళకు కనిపిస్తాయి, సంభాషణలు చెవులకు వినిపిస్తాయి. అదే, చదువుకునే/వినే కావ్యం విషయంలో మరికొంత కష్టం. ఎందుకంటే సన్నివేశం మొత్తాన్నీ పాఠకుని హృదయానికి హత్తుకొనేలాగా కవి తన మాటల్లో చిత్రీకరించగలిగి ఉండాలి. అలాంటి రసానుభూతి, లేదా కనీసం భావానుభూతి పాఠకునిలో కలిగించడమే సిసలైన కవిత్వ లక్షణం.


అలాంటి అనుభూతి కలిగించే రెండు పద్యాలిప్పుడు ఉదాహరణగా చూద్దాం.


నీరసమైన నీ ప్రణయినీ హృదయమ్మిది మెల్లమెల్లగా

నీ రసగీతిలో కరగి నీరయిపోవుచునుండె, మోహనా

కార! రవంత వచ్చి కనికారము చూపవయేని కాల్వలై,

యేరయి, పొంగిపొర్లి ప్రవహింపదొ గోకుల మాకులమ్ముగాన్


అది యమునా సుందరతీరం. రమణీయ బృందావనం. బృందావనిలో తన ప్రియుని కోసం ఎదురు చూసే విరహిణి రాధ. ఎక్కడినుండో వేణుగానం వినిపిస్తోంది. గానం ఆమె విరహాన్ని మరింత పెంచుతోంది. అసలే అతని సాన్నిధ్యం కరవై కృశించి నీరసించిన హృదయం, వేణుగానలోలుని రసగీతిలో కరిగి నీరయిపోతోంది. బాధని భరించ లేక ఆర్తితో గోపాలబాలుని రమ్మని పిలుస్తోంది. వేదనని తన సున్నితమైన పదాలతో ఆత్మీయంగా ఆవిష్కరిస్తున్నాడు కవి. గొపాలకృష్ణుడు అసలే మోహనాకారుడు. మరి అతన్ని చూడలేకపోతే మనసు తట్టుకోగలదా! దుఃఖం పొంగుకొస్తోంది. అది ఉప్పెనై ఆబాలగోపాలాన్నీ ముంచెత్తేలా ఉందట. రవ్వంత కనికారం చూపించి వేగమే రమ్మని పిలుస్తోంది రాధ. "కనికరం" అనే పదం "కనికారం"గా సాగడంలో ఆమె ఆర్తి మరింత బాగా ధ్వనిస్తోంది! అది సహృదయుడైన (అంటే యిలాంటి కవిత్వానికి స్పందించగలిగే హృదయమున్నవాడు) పాఠకుని గుండెను కదిలించకుండా ఉంటుందా?! రాధ బాధ రవ్వంతయినా, చదివే పాఠకునిలోనూ కలిగితే, అది పుల్లెలవారు చెప్పిన భావానుభూతి.ఇప్పుడు ఇంకొక పద్యం.

చూచుచు జేరి, వ్రేల్మిడుచుచున్, దలయూచి, విలక్ష చిత్తయై

యా చపలాక్షి ముక్కుపయి నంగులమున్ గదియించి, "దీనికై

కీచక! యింత సేసితి, సుఖిత్వము బొందెదుగాక యింక,

ట్లేచిన నిట్లుగా కుడుగునే" యనుచున్ వెఱగందుచుండగన్


పై పద్యంలాగా చదవగానే పూర్తిగా అర్థమైపోయి మనసుని హత్తుకొనే పద్యం కాదిది. ఇది పూర్తిగా మనసుని తాకాలంటే, మొత్తం సన్నివేశం తెలియాలి. ద్రౌపది మీద అత్యాచారానికి పాల్పడిన కీచకుణ్ణి అర్థరాత్రి నర్తనశాలలో భీముడు మట్టుపెట్టాడు. మామూలుగా చంపడం కాదు, అతని కాళ్ళూ చేతులూ విరిచేసి, శరీరాన్ని నుగ్గునుగ్గు చేసి ఒక ముద్దలాగా తయారుచేసాడు. పక్కనే దాక్కొని ఉన్న ద్రౌపదిని అక్కడకి తీసుకువచ్చి, తన విజయాన్ని చాటుతూ, చిన్న గుడ్డిదీపపు వెలుతురులో పీనుగుని చూపెట్టాడు. అది చూసిన ద్రౌపది చేష్టలని కవి (ఇంకెవరు, తిక్కన!) యిక్కడ వర్ణిస్తున్నాడు. "చూచుచు జేరి" అంటే, దగ్గరకి రాకుండానే దూరం నుండే పీనుగుని చూస్తూ చూస్తూ దగ్గరకి వచ్చిందన్న మాట! అలా వచ్చి మెటికలు విరుస్తూ, తల ఊపుతూ, ముక్కుమీద వేలేసుకొని యిలా అంది, "ఓరి కీచకా! యింతా చేసిందీ చివరకి యిలా అవ్వడం కోసమా! ఇకనైనా సుఖంగా ఉండు. అలా ఎగిరెగిరిపడితే, ఇలా కాక మరేమవుతుంది!". అలా అంటున్నప్పుడు ఆమె "విలక్షచిత్త" - అంటే అబ్బురపాటుతో విచిత్రంగా ఉన్న మనసు కలిగినది. "చపలాక్షి" - అంటే కన్నులు యిటూ అటూ కదిలిస్తూ ఉంది. "వెరగందు"తోంది - అంటే ఆశ్చర్యపడుతోంది. ఇప్పుడు మరోసారి పద్యం చదవండి. ద్రౌపది మనస్స్థితిని ఆమె చేష్టలతో, మాటలతో మన కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు తిక్కన. యీ సన్నివేశాన్ని చదువుతూ ఉంటే, ద్రౌపది పాత్రలో లీనమైపోయి, మనం కూడా (మన మనసులోనే) ముక్కున వేలేసుకొని, కీచకుని శవాన్ని చూస్తూ (ఊహించుకుంటూ), "చీ! ఏం చావు చచ్చాడు. అంతటి దర్పం చూపించిందీ చివరికి యిలా చావడానికా! అలాంటి వాడికి యిలాగే అవ్వాలి" అని అసహ్యంతో ఆశ్చర్యంతో అనుకోకుండా ఉండలేం. అదీ చిక్కని రసానుభూతి అంటే! ఇది చదువుతూ ఉంటే, ఇప్పుడు, కాలంలో మన కళ్ళముందు తిరుగుతున్న కీచకులూ, వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలూ గుర్తుకు వచ్చి, వాళ్ళ పట్లకూడా యిదే అసహ్యం కలిగే అవకాశం కూడా ఉంది!


పైన ఉదాహరించిన రెండు పద్యాలూ పాఠకుని మనస్సుని తాకేవే. అవి కలిగించే స్పందన స్థాయిలో భేదం ఉంది. అది పాఠకుని మీద కూడా ఆధారపడి ఉంటుందనుకోండి. సాధారణంగా మొదటి పద్యం మనసులో ఒక భావవీచికని మాత్రం రేపుతుంది. రెండవ పద్యం (సన్నివేశం మొత్తాన్నీ చదువుతున్నప్పుడు) మరింత తీవ్రమైన అనుభూతిని కలిగిస్తుంది. స్థాయీభేదాలనే ఆలంకారికులు "స్థాయీభావము", "రసము" అని రెండుగా గుర్తించారు. స్థాయీభావం మరింత తీవ్రతరమై రసంగా ఎలా మారగలదు? అనే అంశం గురించి మన ఆలంకారికులు కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అసలు కల్పితమైన సన్నివేశంతో పాఠకుడు తన్మయానుభూతి ఎలా పొందుతాడు? అనే ప్రశ్నని గూర్చి విశ్లేషించారు. రసానుభవం వల్ల పాఠకుడు పొందే ప్రయోజనం ఏమిటి? అన్నదాని గూర్చి వివేచించారు. వీటి గురించి స్థూలంగా వచ్చే నెల వ్యాసంలో  తెలుసుకుందాం. అందాకా మీ మెదడుకి చిన్న మేత:


పై రెండు పద్యాలలో ఒకటి ప్రాచీనకాలానికి చెందిన ఆంధ్రమహాభారతంలోనిదయితే, మరొకటి ఆధునికకాలానికి చెందిన "కరుణామయి" అనే కవితలోది (దీని కవి కరుణశ్రీ అని వేరే చెప్పనక్కర లేదనుకుంటా!). కాలానుగుణంగా కవిత్వంలో రసపోషణ విధానంలో, వచ్చిన మార్పులను రెండు పద్యాలూ చక్కగా పట్టిస్తాయి. తేడాలేమిటో గమనించే ప్రయత్నం చెయ్యండి.

(సశేషం)

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
  

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech