Sujanaranjani
           
  కబుర్లు  
  వార్త - వ్యాఖ్య
         

మరో 'మిథునం'

 
 

- రచన:  టీవీయస్.శాస్త్రి  

 
 

 

"కాలగతిన ప్రాప్తించును బడుగుతనం, కాంక్షకు మాత్రం నిలుచును కలకాలం పడుచుదనం"అని సి.నారారాయనరెడ్డి గారు, మనసుకు బడుగుతనం ఉండదని కవితాత్మకంగా చెప్పారు. సరోజినీ నాయుడు గారి సోదరుడు, బెంగాలీ, ఆంగ్ల భాషలలో ప్రఖ్యాత కవి, వామపక్ష భావజాలం వున్నవ్యక్తి, మన బెజవాడ నుండి మొట్ట మొదటి M.P.గా ఎన్నికైన వాడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు అయిన శ్రీ హరీంద్రనాధ ఛట్టొపాధ్యాయ గారు ఇలా అన్నారు- "Though there is snow on my head, still there is fire in my heart" అని. మన ఆరోగ్యానికి మూలకారణం, మానసిక ఆనందమే! వృద్ధాప్యంలో ఆరోగ్యానికి మూల కారాణాలు మూడు. ఒక వంతు వైద్యుల సలహా మేరకు మందులను వాడటం, ఇంకొక వంతు మానసిక ఉల్లాసం, ఆఖరి వంతు విధి విలాసం. అంటే, మన ఆరోగ్యం రెండువంతులు మన చేతిలోనే వుంది. మూడవ దానిని గురించి మనం ఆలోచించి, ఆందోళన చెంది కూడా యేమీ చెయ్యలేము. వయసు పెరుగుతున్నకొద్దీ, సాధ్యమైనంతవరకు detachedగా వుండటం నేర్చుకోవాలి, అంతేకానీ, అనవసరమైన వాటిని గురించి చాలామంది attachments పెంచుకుంటారు. ఏమీ చేయలేని వయసులో బాధలు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు చాలామంది.

నేను మధ్య ఒక ఆధ్యాత్మిక గ్రంధంలో 'Attachment with detachment' అనే ఒక చక్కని వ్యాసాన్ని చదివాను. వృద్ధాప్యంలో అందరి దగ్గర ఇమిడిపోయే తత్త్వం అలవరుచుకోవాలి. దేనినీ, ఎక్కువగా పట్టించుకోకూడదు. మధ్య మా ఇంటి ఎదురుగా వున్న నా ఆత్మీయుడు ఒక రోజు, హడావిడిగా నా దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. ఆయన, వయసులో నా కన్నా 15 ఏళ్ళు పెద్ద. భార్య చనిపోయింది. కొడుకూ, కోడలు దగ్గర ఉంటున్నాడు. కొడుకూ, కోడలు ఇద్దరూ చాలా మంచివారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. నిదానస్తులు పెద్దాయనను ప్రేమగా, గౌరవంగా బాగా చూసుకుంటారు. ఇంతకీ ఆయన బాధ ఏమిటంటే, కోడలు ఆఫీసుకు వెళ్ళుతూ," మామయ్యగారూ! వర్షం వస్తే, బట్టలను లోపల ఆరెయ్యండి. "అని చెప్పిందట. "అందులో తప్పేమీ వుందండి?" అని నేను ఆయనను ఊరడించాను. "76 ఏళ్ళ ఒక మగవాడిని పట్టుకొని, బట్టలను లోపల ఆరెయ్యమనటం ఏమి భావ్యం? నా భార్య బతికున్నంత కాలం, ఎప్పుడూ నాకు ఇలాంటి పనులను చెప్పలేదు." అని అన్నాడు.

ఫలానా పనులను మగవాళ్ళు చెయ్య కూడదనే, భావం ఆయనలో జీర్ణించుకొని పోవటం వల్ల అలా మాట్లాడుతున్నాడు. నిజానికి, మనం చదువుకున్నాం గానీ,'ఆలుమగల అన్యోన్యతను 'నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజలను చూసి నేర్చుకోవలసిందే! భర్త కావడితో నీళ్ళు తెస్తాడు, మంచాలను బిగదీస్తాడు. అలా అబలలు చేయలేని పనులన్నీచేసి, కాస్త చద్ది అన్నంతిని పొలానికి వెళ్ళుతాడు. ఇల్లాలు, ఇంటి పనులన్నిటినీ పూర్తిచేసుకొని, అన్నం తీసుకొని, భర్త వున్న పొలానికి వెళ్ళుతుంది. పచ్చని పొలాల మధ్య చిలకా గోరింకల్లగా ఇద్దరూ కలసి ముద్దులాడుకుంటూ  ముద్దలు తింటారు. భర్త కాసేపు కునుకు తీస్తే, ఇల్లాలు, పొలంలో తనకు చేతనైన పనిని చేస్తుంది. ఆలుమగలు కలసి జీవించే అర్ధనారీశ్వరతత్వాన్ని ప్రత్యక్షంగా చూసి పరవశించి పోవలసినదే! దానినే, 'శ్రమైక జీవన సౌందర్యం' అని మహాకవి శ్రీశ్రీ అని ఉండవచ్చేమో!  ఇదంతా నేను ఉబుసుపోక చెప్పటం లేదు. మధ్య ఒక పత్రికలో వలివెల (తూ.గో.జిల్లా)కు చెందిన శ్రీమతి కామేశ్వరిగారు, తన జ్ఞాపకాలను గురించి చక్కగా చెప్పారు. మధ్యకాలంలో నన్ను ఎక్కువగా ఆకర్షించిన రచన ఇది. ఎందుకంటే, ఆలుమగల అన్యోన్యతను గురించి అన్ని తరాలవారు చదివి నేర్చుకోవలసిన విషయాలు అందులో వున్నాయి. ఆమె జ్ఞాపకాలను, ఆమె భాష,భావం లోనే విందాం!


***
" పెళ్లి నాటికి నా వయసు తొమ్మిది. మా వారి వయసు పదకొండు. మాది బాల్య వివాహం. అప్పట్లో అన్నీ బాల్య వివాహాలే అనుకోండి. పెళ్ళైన కొత్తలోనే, మా అమ్మ-- 'భర్త ఎంగిలి తింటే భర్తకు ఆయుష్షు పెరుగుతుంది' అని చెప్పింది.నేను అది నిజమని నమ్మాను. రోజూ కాఫీ తాగేటప్పుడు మా వారి దగ్గర తప్పకుండా ఒక గుక్క కాఫీ తాగుతాను. ఆయన భోజనం చేసేటప్పుడు తప్పకుండా నాకో ముద్ద పెడతారు. అంతేకాదు, నేను స్నానం చేసి వచ్చేసరికి, నా బొట్టుపెట్టె సిద్ధంచేసి ఉంచుతారు. అందులోనే, బొట్టు, కాటుక, దువ్వెన, అద్దం, పౌడర్ ...అన్నీ పెట్టుకుంటాను. నాకు ఒక్కొక్కటిగా అన్నీ ఆయనే అందిస్తారు. ఇప్పుడు నా వయసు 91, మా వారి వయసు 93.

పదిహేనేళ్ళ క్రితం ఒకసారి, మావారు మా మనవడి తాంబూలాలకు వెళ్ళారు. ఎప్పుడూ ఇద్దరం కలసి వెళ్ళేవారం. రోజు నాకు జ్వరంగా వుండటం వల్ల వెళ్ళలేదు. నన్ను విడిచి వెళ్ళటం ఆయనకు ఇష్టం లేదు. కానీ తప్పదాయే! నేను లేకుండా వెళ్ళటం అదే మొదటిసారి. ఆయన వెళ్ళుతున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, గంట గడిచేసరికి నాకు దు:ఖం ఆగలేదు. ఆయన ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కూర్చున్నాను. నా మనవరాలే ఓదార్చింది. నా దు:ఖం గురించి తెలుసుకున్న మా వారు. "ఇంకెప్పుడూ నిన్ను వదలి వెళ్ళనులే!" అని సముదాయించారు.  ఒకసారి నాకు అనారోగ్యం చేస్తే, నాకు చీర కూడా ఆయనే కట్టారు. అయితే, ఇంట్లో ఇంకెవ్వరూ లేరా? పని చేయటానికి అనుకోవచ్చు.ఇంట్లో ఎందరున్నా, నాకు ఆయన తరువాతే అందరూ!

ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించకుండా జాగ్రత్తపడ్డాను. కానీ, నా మనవడికి పెళ్ళైన తర్వాత వాడి పెళ్ళాం గమనించి, "అమ్మమ్మగారూ! తాతయ్యగారికి రోజూ ఒక ముద్దే అన్నం ఎందుకు ఎక్కువ అవుతుంది?" అని అడిగితే, మా అమ్మ నాకు చెప్పినమాటే మనవరాలికి చెప్పాను. "మీరు తాతయ్యగారు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేనన్నారు కదా! కాన్పు సమయంలో పుట్టింటికి వెళ్లి ఉంటారు కదా!" అని అడిగిన ప్రశ్నకు తాతయ్యగారు ఇల్లరికం రావడం వల్ల ఇన్ని సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా ఆయన లేకుండా ఉండవలసిన అవసరం రాలేదని చెప్పాను.

రోజుకీ ఇద్దరం కలిసే భోజనం చేస్తాం. నా మనవరాలు (మనవడి పెళ్ళాం) నవ్వుతూ వడ్డిస్తుంది. మాకు నలుగురు అబ్బాయిలు,  ఇద్దరు అమ్మాయిలు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు కలిపి 40 మంది దాకా వున్నారు. మేం ఏనాడూ ఎక్కువ తక్కువలు అనుకోలేదు. నాకు తెలిసిందల్లా ఆనందంగా గడపటమే. మా పిల్లలకూ, మనవళ్ళకూ అదే చెప్పాను. మీకూ అదే చెబుతున్నాను. భార్యాభర్తలు 'పాలు,తేనె'లా కలసి వుండాలి. "

***
91 ఏళ్ళ వయసులో తన భావాలను కలంతో కదంతొక్కించిన శ్రీమతి కామేశ్వరిగారు,'అనుభవం'వల్ల రచయిత్రిగా కూడా అయ్యారనిపిస్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలో, చక్కగా వివరించి చెప్పిన శ్రీమతి కామేశ్వరి గారిని, భగవంతుడు'దీర్ఘసుమంగళి'గా దీవించాలని వేడుకుంటూ, నిత్యనూతన దంపతులకు నా అభినందనలు!   


 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech