Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  నరకంలో నాలుగు వారాలు
 

 - రచన: డా||కె.గీత   

 
 

ఎలర్జీ వెయ్యి నాల్కల విలయాగ్ని-

కణాల్ని, క్షణాల్నీ దహించి వేస్తుంది

క్షణాలు దొర్ల లేని బండ రాళ్లయి

కణాల మీద సమ్మెట మోతలవుతాయి

నీలో నీకు ఏమవుతుందో తెలీదు

అంగాంగానికీ ఎరుపు రంగు ముద్రలేసినట్లు

గోళ్లతో చర్మాన్ని రక్కి పడేయాలన్నట్లు

వేల కొవ్వొత్తులతో ఒళ్లంతా  వాతలేసినట్లు

ఎలా ఎలా?

బైట పడే దెలా?

వెయ్యి వెయ్యి- అవీల్, సిట్రిజిన్, క్లారిటిన్ప్రెస్నిడోన్..

రోజుకో డాక్టరు- రోజుకో వైద్యం-

ప్రయోగాల పుట్టిల్లు, మెట్టినిల్లు తగలడినా తగ్గదు

వేల నాల్కల విషాగ్ని

నరాల పాకి

కండరాలు పీల్చి

తట్టై తేలి నిలువునా నాశనం చేస్తుంది

అందరూ జ్ఞాపకం వస్తారు- భగవంతుళ్లు, స్నేహితులు

అమ్మా, నాన్నా- బాల్యం, యౌవనం- ఏవేవో తెరలై తేలే దృశ్యాలు

కళ్లని ధారాపాతం చేస్తాయి

ఇప్పటికిప్పుడు ఈ శరీరాన్నొదిలి అమ్మ కడుపున హాయిగా నిద్రించాలనుంది

బాధని మర్చి క్షణమైనా బతకాలనుంది

ఎప్పటికైనా బాగు పడతానా?

ఇంతలోనే ఇలా డీలా పడితే ఎలా?

దేవుడా! ఇదేం పరీక్ష

ఆ! ఎన్నో చూసాను- ఇదో పెద్ద లెక్కా?

బతికున్న వాళ్లక్కాకపోతే సమస్యలు--

ఎన్నెన్నో స్వంత అనుమానాలు- స్వయం ఓదార్పులు

లాభం లేదు-

ఏం చేసైనా ఎలర్జీని చంపెయ్యాలి

అది నన్ను చంపేలోగా-

బుర్రంతా దొలిచేసే క్రిమినల్ ఐడియాలు-

కర్పూర తైలం, మంచి గంధం-

కాలమైన్, కెలాడ్రిల్ పూతలేసుకుని

చన్నీళ్ల తువ్వాళ్లు ముసుగులేసుకుని

కూర్చోవాల్సిందే వెనకడుగేసేవరకు

చిన్నప్పుడెప్పుడో ఆటలమ్మ ఒళ్లంతా  కమ్మినప్పుడు

అమ్మమ్మ వేపాకుతో విసిరిన జ్ఞాపకం-

చంకనెత్తుకుని గరగ దేవతకు దణ్ణం పెట్టించిన జ్ఞాపకం-

రాత్రంతా అంతా చుట్టూ చేరి కన్నీళ్లు పెట్టుకున్న జ్ఞాపకం-

మరణం అంచుకి చేరి ఎన్ని సార్లు కరాళ నృత్యం చేసినా-

ఇంకా బతుకు మీద ఒక చెడ్డ ఆశ-

ఒక తీపి ప్రాణం-

పిల్లలేమవుతారో-నమ్ముకున్న వాళ్లు నట్టేట ములుగుతారేమో-

ఎన్నెన్ని బంధాలు- ఎన్నెన్ని భవిష్యదాలోచనలు

నరకంలో నాల్గు వారాల తర్వాత -

తిరిగి అందర్నీ చూసి చిర్నవ్వు నవ్వే వరకు-



 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech