Sujanaranjani
           
  కథా భారతి  
 

గంధపు చెక్క

 

                                                                           రచన : రాధిక

 

సీతమ్మకు అరవై అయిదేళ్ళు. గొప్పింటి వారికి అదేమీ పెద్ద వయసు కాదు. ఆ వయసులో కూడ వారు ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా మందులతో దానిని కొనేసుకుంటారు. కాని సీతమ్మ పేదరాలు. అరవై రాక ముందు నుంచే బక్కపలచగా ఉండి నల్లగా కనబడుతుంది. వయసులో ఉన్నప్పుడు తెల్లపిండి బొమ్మలా ఉండేది. రాను రాను పురుళ్ళు, పొలాల్లోను, ఇంటిలోను పనులు పిల్లలతో చాకిరీ, అనారోగ్యం, చాలీ చాలని తిండి, చిరిగిన చీరలు వీటితో అందమైన మనిషి అడుక్కోడానికి వేషం కట్టినట్టు కనబడుతుంది. ఆమెకు పోషకాహారం కాదు కదా కనీసం కడుపునిండా తిండి కూడా లేదు ప్రస్తుతం. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోతే మనుమలకు సీతమ్మ కాపలా ఉంటుంది. అదికూడా జీతం, బెత్తం లేని చాకిరీయే.

సీతమ్మకు కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా ఎదురింటి మేడవైపు చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కావలసినంత డబ్బు, అరగలేనంత తిండి అని అనుకుంటూ ఉంటుంది. మేడలోని కుక్కలకు పెట్టే ఆహరపు ఖర్చుతో ఆ వీధివీధంతా బ్రతికేయవచ్చు.

ఆ మేడలోని ఆవిడ పేరు వసుంధర. పిల్లలు దూరంగా ఉద్యోగాలలో ఉంటారు. ఆవిడ ఒక్కతీ పనివాళ్ళను పెట్టుకుని ఉంటుంది. పిల్లలు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. వసుంధరకు కీళ్ళనొప్పులు, మంచం మీద నుండి లేవలేదు. లేచినా మెల్లిగా చంటిపిల్ల లేచి తప్పటడుగులు వేసినట్లు వేసి బాత్ రూమ్ కి వెళతారు. ఆవిడ కిటికీలోనుండి సీతమ్మను చూసినప్పుడల్లా సీతమ్మ ఎంత అదృష్తవంతురాలో చక్కగా పిల్లలతో, మనమలతో కలసి ఉంటుంది అనుకుంటుంది. సీతమ్మ పిల్లల చీదరింపులు గానీ, మనుమల తిట్ల అరుపులు గానీ ఏనాడు వసుంధర చెవిన పడలేదు. వారిద్దరూ ఒకరికొకరు దూరపుకొండలు వారి బ్రతుకులు భద్రత లేని మట్టికుండలు.

ఓ రోజు వసుంధర, సీతమ్మ కొడుకు నాగూరుని పిలిచి మా పనమ్మాయి రెండు నెలలు పాటు ఊరెళుతుందట. మీ అమ్మను వచ్చినాకు తోడుగా ఉండమను. అని అడిగింది. మా అమ్మ కాపలాగా ఖాళీగా కూర్చుంటుంది కానీ ఏ పనీ చేయలేదమ్మగారు. దానికి కాళ్ళు, చేతులు నొప్పులు అన్నాడు. దానికావిడ పర్వాలేదు నాకు తోడుగా ఉంటే చాలు. పని చెయ్యనక్కర్లేదు అన్నారు. మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా గిడతాడు. అయినప్పటికి బ్రతికినంతకాలం ఒంటరిగా బ్రతకలేడు. తోడు కావాలి. ఒంటరితనాన్ని శాపంగా భావిస్తాడు. స్తబ్దత వద్దు - నిరంతర ఘోషకావాలి. స్ఫర్ధలు వద్దు. చైతన్యవంతమైన చెట్లు భాషలా ఉండాలి జీవితం మనిషికి. సంఘ జీవి. తానున్న ఇల్లు ఎవరూలేని దీవిలా ఉంటే అంతకంటే శిక్ష మరొకటి ఉండదు.

నాగూరు ఇంటికి వచ్చి వసుంధర గారు ఆవిడకు తోడుగా ఉండడానికి రమ్మన్నారని చెప్పాడు. నేనేం చేయగలను నాయనా, మీ పిల్లల్నే ఎత్తుకోలేకపోతున్నాను. మీరు కష్టపడి వచ్చేసరికి ఓ ముద్ద ఒండి పెట్టలేక ఇంట్లో తుమ్మ మొద్దు లా ఉంటున్నాను అంది.

ఆ సంగతులన్నీ అమ్మగారికి చెప్పాను లేవే. నీవు ఏమీ చేయలేవని తెలుసు. అయినా ఊరికే ఆవిడ మంచం దగ్గర కూర్చుని ఆవిడ ఏమైనా చెబితె ఊకొట్టు చాలు. ఆవిడ మాట్లాడిస్తేనే మాట్లాడు. నీవు ఆవిడ దగ్గర మన పేదింటి సంగతులు, అత్తా కోడళ్ళ తగాదాలు ఏకరువు పెట్టకు. అన్నాడు. అలాగేనని తల ఊపి కర్రసాయంతో మెల్లగా వసుంధర దగ్గరకు వెళ్ళింది సీతమ్మ. సీతమ్మ మనసులో ఏదో తెలియని భయం. వసుంధర కు ఆ కట్టె లాంటి మనిషే ఎంతో అభయం.

నాగూరు తల్లిని వసుంధర దగ్గర వదిలి తన పిల్లలను తన వదిన గారి దగ్గర పెట్టి పనిలొకి వెళ్ళిపోయాడు. నాలుగురోజులు గడిచేసరికి సీతమ్మకు బెదురుపోయింది. వసుంధర గారు ఒంటరితనంతో డిప్రెషన్ లోకి వెళ్ళకూడదని సీతమ్మను అక్కడే ఉండిపొమ్మని వసుంధర గారి కొడుకు చెప్పాడు. పెద్దవారి మాట తీసెయ్యలేక సరేనంది సీతమ్మ. సీతమ్మకు భోజనం అక్కడే. మూడు చీరలు కొని రప్పించింది వసుంధర. చిరిగిన చీరలు ఓ పక్కన పెట్టి ఆవిడకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, శుభ్రంగా ఉండాలి కాబట్టి ఆ కొత్త చీర కట్టుకుంటుంది సీతమ్మ. వారం తిరిగేసరికల్లా సీతమ్మ మొహంలో ఆరోగ్యపు కళ వసుంధర మొహంలోకి ఆనందపు కళ వచ్చేసాయి.

వంట మనిషి ఆవిడకు యాపిల్, దానిమ్మలాంటివి పెట్టినా, జ్యూస్ లు చేసి ఇచ్చినా అవి కాస్తో కూస్తో సీతమ్మ కుపెట్టకుండా ఉండదు వసుంధర. మరోవారం గడిచేసరికి చేతిలో కొంచెం శక్తి వచ్చింది సీతమ్మకు. దానితో చిన్న చిన్న పనులు చేయగల్గుతోంది. వసుంధరకు కీళ్ళకు మర్దనా చేయడానికి రోజు ఒకావిడ వస్తుంది. ఆవిడ ఒక నెల శెలవు పెట్టేసరికి సీతమ్మ మెల్లిగా శక్తిని కూడదీసుకుని వసుంధరకు మర్ధనా చేయడం మొదలుపెట్టింది. మొదట్లో చేతులు సహకరించలేదు. కాని మర్దనా చేయగా చేయగా సీతమ్మ కీళ్ళు కూడా సాగి ఇప్పుడు బాగానే చేయగల్గుతోంది.

ఇప్పుడు ఇద్దరూ రామాయణం, భాగవత కథలు చెప్పుకుంటున్నారు. ఒక నెల తరువాత వసుంధర పిల్లలు, సీతమ్మ పిల్లలు వీరిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు. సీతమ్మను చూసుకొని ఆవిడకు భరోసా, వసుంధరను చూసుకొని సీతమ్మకు జీవితంపై ఆశ.

ఓ రోజు సీతమ్మ కొడుకుతో అంది చూడు నాయనా ఇక్కడి మంచితిండి వల్ల నా కీళ్ళనొప్పులు తగ్గిపోయాయి అని, దానికి వసుంధర...కారణం అది కాదు నాగూరు, నేను ఎప్పడి నుంచో మంచి తిండి తింటున్నాను. నాకు ఈ నొప్పులు ఎందుకు వచ్చాయి? అసలు సంగతి ఏమిటంటే నా కాళ్ళ నొప్పుల నూనెలు మంచి మూలికలతో చేసినవి. సీతమ్మ ఆ నూనెతో మర్దనా చేసి మిగిలిన నూనె కడుక్కోకుండా కాళ్ళకు రాసుకునేది. ఆ నూనె ప్రభావంతో సీతమ్మ నొప్పులు తగ్గాయి. ఆ నూనెలు మంచి గంధము తుడిచిన బట్ట, మల్లెపూల బట్ట లాంటివి అందావిడ.


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech