Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

కఠోర వాస్తవాలే డా||బోయ జంగయ్య కథా వస్తువులు

 

                                                                           రచన : విహారి

 

తెలుగు సాహితీ లోకంలో సుప్రతిష్ఠులు, ప్రతిభా వినయ సంపన్నులు డా||బోయ జంగయ్యగారు. జీవితం గురించి బాగా తెలిసిరాసే అరుదైన రచయితలలో బోయజంగయ్య ఒకరు అన్నారు కీ.శే పురాణం సుబ్రహ్మణ్యశర్మ.

1970 నుంచీ రచనలు చేస్తున్న జంగయ్యగారు. ఇప్పటికి 12 కథాసంపుటాలు, 3 నవలలు, 3 కవితా సంపుటాలు, 4 జీవిత చరిత్రలు గ్రంథ రూపంలో వెలువరించారు. వెలుతురు కవితా సంపుటి నుంచి కొన్ని కవితలు సెంట్రల్ యూనివర్సిటీ వారి ఎం.ఫిల్ కోర్సుకు సంబంధించబడినవి. దొంగలు కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారిచే ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయించబడింది. జాతర నవలకు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు, ఎచ్చరిక కథా సంపుటికి నాగార్జున యూనివర్సిటీ వారి శ్రీ శ్రీ స్మారక బంగారు పతకం లభించాయి. జంగయ్య గారిని తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ తో గౌరవించింది. ఇతర సత్కారాలు, సన్మానాలు లెక్కకు మిక్కిలిగా వారిని ఎన్నుకున్నవి.

శథాథికంగా ఉన్న జంగయ్యగారి కథల్లో అన్నిటా స్థానీయతా, వాస్తవికతా పూసల్లో దారంలా భాస్తిస్తుంటాయి. సమాజ పరిశీలన, సామాజిక సమస్యల అధ్యయనం రెండూ సహజ ప్రవృత్తిగా ఉన్న జంగయ్య గారికి కథాంశాలన్నీ తన చుట్టూ ఉన్న మనుషులూ, సంఘమూ అందించాయి. తమ ప్రాంతంలోని ప్రజల జీవన వైరుధ్యాలూ, అవి అలా తెట్టగట్టడానికి కారణాలూ, పారదర్శకంగా చూపారు. అయితే పురాణం వారన్నట్టే ఇలా చెయ్యండని ఒక పరిష్కార నిదాదంతో బయటకి వచ్చి గోలపెట్టడు. వారి కథల్లోని వ్యక్తుల్లో ఎక్కువభాగం బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు చెందినవారు.

ఉదాహరణకి ఇప్పపూలు కథలో తండాలలోని జీవన బిభత్సం చిత్రితమైంది. అమాయకులు తండాలో బట్టీపెట్టి ఇప్పపువ్వు సారా తీసి పూటగడుపుకుంటుంటే, అటు అబ్కారీ వారు, ఇటు పోలీసులు వారిని ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా కూడా దోచుకునే దుర్భర పరిస్థితి చిత్రించబడిందీ కథలో. కడకు, లచ్చీ నాయక్ వంటి నిర్భాగ్యులు - కన్నబిడ్డను పొట్టకూటి కోసం అమ్ముకునే దారుణ వాస్తవం కనిపిస్తుంది.

వ్యవస్థలోని అసమానతలూ, ఒక వర్గం ఆధిపత్య ధోరణీ, దోపిడీ ఈ భౌతిక వాస్తవాలకీ నిస్సహాయంగా తలవంచి అణగారిన నాయక్ లాంటి వారి చిత్రణ ఇప్పపూలు లో ఆ విధంగా ద్యోతకమైతే, ఇందుకు భిన్నమైన ముగింపుతో ఇవే పరిస్థితుల కథ చీములు గా వెలువరించారు జంగయ్యగారు.

ఊళ్ళో పెద్ద భూస్వామి సీతయ్య తర్వాత మట్టారెడ్డి. పంచాయితీ సర్పంచ్ స్థానం ఎస్.టీ ది కావడంతో ఎరుకలి సాయన్న సర్పంచ్ అయ్యాడు. ఆయన సాయన్నే. సర్పంచి గా పిలవరు. భూస్వాముల ఆధిపత్యం అహం. చెరువు నీరు పారించడం దగ్గర పేచీ వచ్చింది. కట్టెమ్మట ఉన్నోళ్ళ పొలంలో పోను పోను పెద్దోళ్ళవీ, ఇంకా కింద పేదోళ్ళవీ. ఈ కారు ఆఖరు వరకూ పారటం కష్టం. ఏం చేయాలనే నిర్ణయానికి చర్చ. సాయన్న ఎట్టసెప్తే అట్ట అని పిలిచారు గానీ తేలలేదు. సీతయ్య మట్టారెడ్డి మాట్లాడుకున్నారు. రాత్రికిరాత్రి ఈతచెట్లన్నీ నరికేశారు. నరికేయబడిన ఈదుల వెనుక గౌండ్లోండ్లు. పిచ్చికుంటోళ్ళు, ఎరకలోల్లు వీళ్ళందర్నీ సాయన్న లేపుకొచ్చిండు. పరిస్థితి అగ్గి అయింది. మొరిగే కుక్కలూ ఈ మనుషుల్తో చేరినై. మట్టారెడ్డి తన టైగర్ ని ఉసికొల్పాడు. అది కుక్కల మీద పడింది. ఈలోగా కొందరు తమ చేతులలోని కొడవల్ళను విసిరేశారు. టైగర్ ఒకటి రెండు కుక్కల్ని చీల్చేసింది. మట్టారెడ్డి మీసం దువ్వాడు. మనుషుల కళ్ళు ఎరుపెక్కినై. ఒక్కసారిగా బక్క కుక్కలన్నీ కలిసి టైగర్ మీదికి దూకినై. క్షణంలో టైగర్ ఊరకుక్కల నోళ్ళల్ల రక్తం వొడుసున్న మాంసం ముద్దలుగ మారిపోయింది. మట్టారెడ్డి నోరు తెరిచి చూస్తుండిపోయాడు. అంటూ కథ ముగుస్తుంది. పాత నీతే చలిచీమల చేత చిక్కిచావదె, బలవంతమైన సర్పం?!

చీమలు లోని కథాత్మక్తత వలన వాస్తవ పరిస్థితుల చిత్రణే ముగింపులో ప్రతిఘటనగా రూపుదిద్దుకుంది. ఇప్పుపూలు లో ఈ ప్రతిఘటన నాయక్ ధర్మాగ్రహంగా మౌనఘోషగా, వ్యవస్థకు బందీతత్వంగా ఎక్కడో లోలోపల ఉండిపోయింది. ఆలోచనాత్మకమైన వస్తువు, అందులో దేశీయత, వాస్తవికత, కథగా శిల్పనిర్మాణం చీమలు కథని గొప్ప కథని చేశాయి.

జంగయ్యగారి కథన పద్ధతి నిసర్గంగా సాగుతుంది. కథ చెప్పుకుంటూ పోతారు. సన్నివేశం, వ్యక్తులు, నేపథ్యం అన్నీ కళ్ళముందు నిలుపుతారు. జీవిత వ్యాఖ్యానాన్ని అందించవలసి వచ్చినప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న వాక్యాలతో పఠితని ఆకట్టుకుంటారు జంగయ్యగారు. ఉదాహరణకి తాగిన నోరు ఆముదాలు బుక్కిందట. అంటూ ఆడోళ్ళు మగవాళ్ళకు చురకలు వేశారు అంటారు. మట్టారెడ్డి తలనిండా ఆలోచనలే! సీతయ్య మట్టారెడ్డి మనసులో మంటను రాజేస్తున్నాడు. దూడపాలు తాగకుండా యజమాని మూతికి ముళ్ళు మూకుడు కట్టేది గుర్తొచ్చింది. యస్సై లచ్చియని చూసున్నాడు. అప్పుడప్పుడు చూపు కోతి తేనెపట్టుని చూసుతన్నట్టుంది అంటారు. ఎంతో భావగర్భితమైన వ్యక్తీకరణ. తేనెటీగలు కుట్టి పెడతై - పట్టుకుంటే! ఆయన తలమీది క్యాపు పాము పడగలా కనిపించిందామెకు! ఇలా అటు శైలీ, ఈ శైలి శిల్పంలో మిళితమై భాసించే సంవిధాన పద్ధతి కథౌన్నత్యాన్ని పెంచాయి.

జంగయ్యగారికి ఎంతో ఖ్యాతిని కూర్చిన కథ దొంగలు. గొర్రెల్ని పెంచుకుని బతిఏ బడుగు జీవి బీరప్ప. అప్పుకోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థలూ, అక్కడి ఉద్యోగుల్లో అవినీతి - చిత్రితమైన కథ ఇది. గొర్రెల్ని నంజుకునే దగుల్బాజీలు కొందరైతే, చేతి కడియాన్ని సైతం హరాయించే దొంగలు మరికొందరు. ఈ కథలోని పాత్రలు. చివరికి కడుపు రగిలిపోయిన బీరప్ప - ట్రెజరీ ఎక్కౌంటేంటు, సమితి ఎక్కౌంటేంటు బస్ లోకి పైసల కోసం వస్తే తెగించి తన కడియాన్ని గుంజుకుని దొంగలు, దొంగలు అని అరుస్తాడు. బస్ లోని జనం ఒక్కసారి లేచి ఇద్దర్నీ చితకతంతారు! అణగారిన ఆర్తులు గొంతు పెగుల్చుకుని కేక వేస్తేనే, పిడికిళ్ళు బిగించి ప్రతిఘటిస్తేనే ఈ దొంగలు వ్యవస్థ కొంతైనా మారుతుందనేది సందేశం. చాలా గొప్ప కథ.

అనేక కల్లోలాలతో నిండిన సమాజంలో బడుగుల బతుకు సంక్షిప్త సమస్యలతో, నిరాదరణతో మరింత దుర్భరమౌతున్నది. ఈ బతుకుల్లోని వైరుధ్యాల్ని, వైవిధ్యాల్ని, వైచిత్రాన్ని అత్యంత ప్రతిభావంతంగా, నేలమీది పాత్రలతో చిత్రించి తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన జంగయ్యగారు ఉత్తమ సారస్వతేయులుగా అభినందనీయులు, గౌరవనీయులు!!


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech