Sujanaranjani
           
  కథా భారతి  
   

బ్యాక్ టు ఇండియా

 

రచన : ఇర్షాద్ జేమ్స్

 

వసంత్ నేను పని చేస్తున్న కంపెనీ లోనే సీనియర్ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్టు గా పని చేస్తున్నాడు.  అతను పదేళ్ళ క్రితం అమెరికా వచ్చాడు.  ఆస్టిన్ లో వున్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎం.ఎస్. చదివాడు. రకరకాల సాఫ్ట్ వేర్ కంపెనీలలో నానా రకాల ఉద్యోగాలు చేసి,  చివరికి మా కంపెనీలో చేరాడు.  వసంత్ వేరే డిపార్టుమెంటులో పని చెస్తాడు. కానీ అప్పుడప్పుడు లంచ్ టైములో కేఫెటేరియాలో కనిపిస్తూ వుంటాడు.

రోజు నేను పన్నెండున్నరకి కేఫెటేరియాలో సేండ్విచ్ తింటూంటే వసంత్ వచ్చి పలకరించాడు, తన లంచ్ బాక్సు తెరుస్తూ.

"హలో, హౌ ఆర్ యూ?" అన్నాడు వసంత్.

"హాయ్ వసంత్!" అన్నాను నేను, అతనితో కరచాలనం చేస్తూ.

" రోజు నా పర్ఫార్మెన్స్ ఇవేల్యుయేషన్ జరిగింది" చెప్పాడు వసంత్.

"అయితే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలా? అప్పుడే వద్దా?" అడిగాను నేను, ఉత్సాహంగా.

"కంగ్రాచ్యులేషన్స్ అవసరం లేదు. నేను ఎంత కష్టపడి పని చేసినా మా బాసు సంతోషించడు. సంవత్సరం నుంచి ఎన్నో సాయంత్రాలు, శనివారాలు, ఆదివారాలు కష్టపడి, మా ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేసాను. కానీ నా పర్ఫార్మెన్సు రివ్యూలో కేవలం 'మెట్ ఎక్స్పెక్టేషన్స్ ' అని మాత్రమే రాసాడు.", బాధ పడుతూ అన్నాడు వసంత్.

వసంత్ కి ప్రతి సంవత్సరం ఇది మామూలే. అయినా కష్టపడి పని చేస్తూ వుంటాడు.

"అయితే ఏం చెద్దాం అనుకుంటున్నావు?" అడిగాను నేను.

"నేను ఇండియా వెళ్ళిపోతాను. వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా."

"అవునా!" అన్నాను నేను, ఆశ్చర్యం నటిస్తూ.

"అవును. నాకు వెధవ అమెరికాతో విసుగెత్తిపోయింది. ఎన్నాళ్ళు ఇక్కడిలా వెట్టి చాకిరీ చెయ్యాలి?" అన్నాడు వసంత్.

"మరి ఇండియాలో ఏం చేస్తావు?"

"సాఫ్ట్ వేర్ ఉద్యోగమే చేస్తాను"

"అయితే అదేదో ఇక్కడే చెయ్యొచ్చుగా? ఇండియా వెళ్ళిపోవటం ఎందుకు?"

"ఇక్కడ నా బట్టలు నేనే వుతుక్కోవాలి. ఇండియా లొ అయితే చాకలి వాడు బట్టలు వుతికి, ఇస్త్రీ కూడా చేసి పెడతాడు.  ఇక్కడ నా గిన్నెలు నేనే కడుక్కోవాలి.  ఇండియాలోఅయితే పని మనిషి గిన్నెలు కడిగి పెడుతుంది.  ఇక్కడ నా బాత్ రూము నేనే శుభ్రం చెయ్యాలి. ఇండియా లో అయితే పని మనిషి చక్కగా బాత్ రూము శుభ్రం చేసి పెడుతుంది... " చెప్పుకుంటూ పోతున్నాడు వసంత్.

"ఆపు, ఆపు. నువ్వు ఇండియా వెళ్ళిపోతానని చాలా సంవత్సరాల నుంచి అంటున్నావు. నువ్వు నిజంగా వెళ్ళే రకం కాదు" అన్నాను నేను.

"లేదు. ఈసారి నేను సీరియస్. వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను" ఆవేశంగా అన్నాడు వసంత్.

"కాని ఇప్పుడు నీకు ఇండియాలో ఉద్యోగం దొరుకుతుందా? అక్కద జాబ్ మార్కెట్ బాగా లేదని విన్నాను.  అక్కడ ఇక్కడకన్నా ఇంకా ఎక్కువగా కష్టపడి పని చెయ్యాలి !"

"నాకు అమెరికాలో పదేళ్ళు ఎక్స్పీరియెన్సు వుంది. నాకు తప్పకుండా ఇండియాలో జాబ్ దొరుకుతుంది. మ్యానేజిమెంట్ జాబ్ కూడా దొరకవచ్చు." ధీమా గా అన్నాడు వసంత్.

"గుడ్. అప్పుడు నువ్వు మిగతా వాళ్ళకి పర్ఫార్మెన్సు రివ్యూలు చెయ్యొచ్చు" అన్నాను నేను.

"నేను ఇండియా వెళ్ళిపోతానంటూంటే వెటకారంగా వుందా?" కోపంగా అన్నాడు వసంత్.

"నువ్విక్కడ ఇన్ని సంవత్సరాలుగా వున్నావు. ఇండియాలో ఎలా అడ్జస్ట్ అవ్వగలవు?"

"అడ్జస్ట్ అయిపోతాను. నో ప్రాబ్లెం !!" అన్నాడు వసంత్.

"మరి నీ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగు సగంలో ఆగిపోతుంది కదా? గ్రీన్ కార్డ్ వచ్చాక వెళ్ళొచ్చు కదా?" అడిగాను నేను.

"పోతే పోయింది వెధవ గ్రీన్ కార్డు. అయినా, ఇప్పుడు అమెరికాలో ఫ్యూచర్ లేదు. ఇప్పుడు చైనాలో, ఇండియాలో ఫ్యూచర్ వుంది.  అమెరికా వైభవం ఇప్పుడు పోయింది" అవేశంగా అన్నాడు వసంత్.

"ఒకే. ఎయిర్ పోర్ట్ లో ఎప్పుడు డ్రాప్ చెయ్యలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను", నవ్వుతూ అన్నాను నేను.

నా వైపు కోపంగా చూసాడు వసంత్.

          **********         

 

కొన్ని వారాల తరువాత మళ్ళీ కేఫెటేరియాలో కనిపించాడు వసంత్.

"నాకు ఇండియాలో జాబ్ దొరికింది. నేను వచ్చే వారమె వెళ్ళిపోతున్నాను." చాలా ఉత్సాహంగా అన్నాడు వసంత్.

"అవునా!" ఈసారి నిజంగా ఆశ్చర్యపడ్డాను నేను.

"అవును. ఇక్కడ జాబు రిజైను చేసేసాను. వచ్చే శుక్రవారమే నా ఆఖరి రోజు ఇక్కడ. ఆదివారం రాత్రి ఎమిరేట్స్ ఫ్లైట్ లో హైదరాబాదు వెళ్ళి, అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నాను." చెప్పాడు వసంత్.

"ఇంత ఫాస్టు గా వెళ్ళిపోతావని అనుకోలేధు. అయితే శుక్రవారం సాయంత్రం నీకు సెండాఫ్ పార్టీ. మా ఇంట్లో పెట్టుకుందాం. నేను మన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను." అన్నాను నేను.

"సూపర్ గురూ !! " చాలా ఆనందంగా అన్నాడు వసంత్.

శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో వసంత్ కోసం మంచి సెండాఫ్ పార్టీ ఏర్పాటు చేసాను. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వసంత్ కి ఇష్టమైన ఇండియన్ రెస్టారెంటు నుంచి కేటరింగు కూడా చేయించాము.

పార్టీ చివరలో అందరూ వసంత్ ని స్పీచ్ ఇవ్వమని గోల చేసారు.

వసంత్ ముందు మొహమాట పడ్డాడు. కానీ అందరూ విజిల్సు వేసి, చప్పట్లు కొట్టి, వసంత్ ని ప్రొత్సాహ పరిచారు.

చివరికి వసంత్ లేచి కొన్ని నిముషాలు మట్లాడాడు. అతను అమెరికా వచ్చిన కొత్తలో విషయాలు, యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు, మొదటి ఉద్యోగం దొరకటం, ఎన్నో ఉద్యోగాలు మారటం, కొత్త స్నేహితులతో పరిచయాలు, ఇంకా చాలా ఏవేవో మాట్లాడాడు.

చివరలో,  "... సో,  మై డియర్ ఫ్రెండ్స్, రోజుతో నాకు వెధవ అమెరికా నుంచి విముక్తి.  చక్కగా ఇండియా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి హ్యాఫ్ఫీగా వుంటాను. గుడ్ బై ఫ్రెండ్స్ !!" అని ముగించాడు వసంత్.

ఆదివారం సాయంత్రం నేను వసంత్ ని ఆస్టిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపి, ఇంటికి వెళ్ళిపోయాను.

          **********         

ఒక నెల రోజుల తరువాత నేను ఆఫీసులో పనిచేసుకుంటూంటే నా ఫోను మ్రోగింది.

కాలర్ ఐడీ లో ఇండియా నంబరు కనపడింది.

'ఎవరై వుంటారు...' అనుకుంటూ, ఫోను ఎత్తి "హలో", అన్నాను.

"హలో, నేను వసంత్ ని మాట్లాడుతున్నాను. మా కంపెనీకి అమెరికాలో కొత్త లాంగ్ టెర్మ్ ప్రాజెక్టు దొరికింది. నన్ను అమెరికా పంపిస్తున్నారు. యాం కమింగ్ బ్యాక్ టు అమెరికా !!" చెప్పాడు వసంత్ !! 

          **********     
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech