Sujanaranjani
           
  కథా భారతి  
 


ది డైరీ ఆఫ్ డాక్టర్ వనమాలి. (నవల)

 

 

                                                                             రచన: కొండగుంటవెంకటేశ్.

.

   “కొంచెం సేపట్లో మీ మొహానికి ఉన్న కట్లు విప్పుతున్నాను ధర్మరాజుగారు” అన్నాడు డాక్టర్ వనమాలి.
ఆ మాటలు వినగానే ధర్మరాజు మొహం ఆనందంతో వెలిగిపోయింది. వనమాలి రెండు చేతులు పట్టుకుని అన్నాడు.

“నిజంగానా డాక్టర్. నా మొహం మీద మచ్చ పూర్తిగా పోయిందా.”

“నేను చెప్పటం ఎందుకు. మీరే చూస్తారుగా. మీకెదురుగా అద్దం ఉంది. మొహం మీద కట్లు విప్పగానే అద్దంలో చూసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు. ఇది నా మొహమేనా అని సందేహపడతారు. ఒక్క అయిదు నిమిషాలు ఓపికపట్టండి.” అంటూ ధర్మరాజు మొహం మీద ఉన్న కట్లువిప్పటం మొదలుపెట్టాడు వనమాలి.
అయిదు నిమిషాల తరువాత అది పూర్తయింది. ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసుకుని మెల్లగా తెరిచాడు ధర్మరాజు. ఎదురుగా ఉన్న అద్దంలో తన మొహం చూసుకుని ఒక్కసారిగా అదిరిపాటుకు లోనయ్యాడు. అద్దంలో కనిపిస్తున్న మొహం తనది కాదు. వేరేవరిదోలా ఉంది. తన మొహం మీద ఇంతకుముందున్న మచ్చ మాయమైనందుకు సంతోషించాలో కొత్త మొహం ఉన్నందుకు ఆశ్చర్యపడాలో ధర్మరాజుకు అర్ధం కాలేదు. ఒక్క నిమిషం పాటు ఏదో ఆలోచిస్తూ అచేతనంగా ఉండిపోయాడు. తరువాత తేరుకుని అన్నాడు.

“థాంక్యు డాక్టర్. మీ హస్తవాసి అమోఘం. మొత్తం నా మొహాన్నే మార్చేశారు. ఇది నా మొహమేనా అని నాకే సందేహంగా ఉంది. నా తల్లి తండ్రి నాకు జన్మనిచ్చారు. మీరు నాకు పునర్జన్మ ఇచ్చారు. చెప్పండి డాక్టర్. మీరు చేసిన సహయానికి ఎంత ఫీజు ఇమ్మంటారు.”అడిగాడు ధర్మరాజు.

“ఈ హాస్పటల్ ఛైర్మెన్ అయిన మల్హోత్ర మీకు మంచి స్నేహితులు. అలాంటప్పుడు మీరు మాకు బాగా కావలసిన వారు. మీ దగ్గర ఫీజు ఎలా తీసుకుంటాను. ఆ విషయం మరచిపోండి. సంతోషంగా కొత్త జీవితం మొదలుపెట్టండి” అన్నాడు వనమాలి.

ధర్మరాజు ఇంకోసారి వనమాలికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు. దూరంగా అతని కారు పార్క్ చేసి ఉంది. అటు వైపు నడిచాడు. అప్పుడే ఎవరు ఊహించని పరిణామం ఎదురైంది. పోలీస్ వ్యాన్ వేగంగా వచ్చి ధర్మరాజుకు కొంతదూరంలో ఆగింది. అందులో ఒక పోలీస్ అధికారితోపాటు పదిమంది సిబ్బంది ఉన్నారు. కారువైపు వెళుతున్న ధర్మరాజును చూసి పోలీస్ అధికారి మైక్ తీసి “మిస్టర్ తేజాసింగ్. మర్యాదగా లొంగిపో. మీ చుట్టు పోలీస్ బలగం ఉంది. ఏ మాత్రం తప్పించుకోవటానికి ప్రయత్నించినా కాల్పులు జరుపుతాం. చేతులు పైకెత్తి మా వైపుకు రండి.” అంటూ హెచ్చరించాడు.

ధర్మరాజు ఆ మాటలు పట్టించుకోలేదు. తనని కాదనుకుని కారు దగ్గరకు వెళ్ళి కారు తలుపులు తెరవపోయాడు. అప్పుడే పోలీస్ అధికారి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఒక్కసారిగా ఇరవై తుపాకులు ఒకేసారి పేలాయి. ఢాం ఢాం అంటూ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. కొన్ని వందల తూటాలు ధర్మరాజు శరీరంలోకి దూసుకుపోయాయి. అసలు తనని ఎందుకు కాలుస్తున్నారో తెలియకుండానే ధర్మరాజు శరీరం అచేతనమైంది.

అతని ప్రాణాలు క్షణంలో గాలిలో కలసిపోయాయి. దూరంగా కన్సల్టింగ్ గదిలో కిటికిలోంచి చూస్తున్న వనమాలి మొహం వింత కాంతితో మొరసిపోయింది. అతనిపెదవులు అనుహ్యమైన విజయం సాధించినట్టు మెల్లగా విచ్చుకున్నాయి.

ంంంంంంంంంంంంం
అసలు కధ ప్రారంభం

ఇండియన్ ఏయిర్ లైన్స విమానం రన్ నే మీద మెత్తగా దిగింది. ప్రయాణికులందరు దిగిన తరువాత చివరగా దిగాడు డాక్టర్ వనమాలి. పావు గంటలో కస్టమ్స్ ఫార్మాలిటిస్ ముగించుకుని విజిటర్స్ లౌంజ్ లోకి వచ్చాడు. అతని కళ్ళు భార్య మిత్రవింద కూతురు శృతి కోసం ఆత్రంగా చూశాయి. కాని వాళ్ళు మాత్రం ఎక్కడ కనిపించలేదు. నిన్న లండన్ నుంచి బయలుదేరుతున్నప్పుడు మిత్రవిందకు ఫోన్ చేశాడు. తను ఏ ఫ్లైట్ లో వస్తున్నాడో వివరంగా చెప్పాడు. ఆ శుభవార్త వినగానే మిత్రవింద సంతోషంతో ఊగిపోయింది. రెండు సంవత్సరాల తరువాత భర్తను చూడబోతున్నాను అన్న ఆనందం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. తప్పకుండా అతన్ని
రిసివ్ చేసుకోవటానికి ఎయిర్ పోర్ట్ కు వస్తానని మరీ మరీ చెప్పింది. కూతురిని కూడా వెంటతీసుకువస్తానని అంది.

చెప్పినట్టుగానే అతను గమ్యస్ధానం చేరుకున్నాడు. కాని మాటప్రకారం భార్య మాత్రం ఏయిర్ పోర్ట్ కు రాలేదు. అయిన అతను నిరుత్సాహపడలేదు. రాజధానిలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. రోజుకు కనీసం రెండు సార్లయినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నాలుగైదు గంటలు గడిస్తే కాని అది క్లియర్ కాదు. ఒకవేళ భార్య అలాంటి పరిస్ధితిలో ఇరుక్కుందేమోనని అతని అనుమానం. అందుకే ఇంకో పావు గంట ఎదురుచూడాలని నిశ్చయించుకున్నాడు.

కాఫీ తాగుతూ టైం పాస్ చేశాడు. పదిహేను నిమిషాలు గడిచాయి. భార్య జాడ లేదు. ఇంకా ఎదురుచూడవలసిన అవసరం అతనికి లేదనిపించింది. సామాన్లు తీసుకుని బయలుదేరాడు. అప్పుడే అతని కుడికన్ను అదిరింది. ఏదో ఉద్వేగానికి లోనైనట్టు శరీరం సన్నగా జలధరించింది. అప్రయత్నంగా భార్యకు కూతురికి జరగకూడనిది ఏదో జరిగిందని తోచింది. వెంటనే టాక్సి మాట్లాడుకుని బయలుదేరాడు. గమ్యస్ధానం చేరుకునేంతవరకు అతను చాల అసహనంగా ఉన్నాడు.

అర గంటలో ఇల్లు చేరుకున్నాడు. మెయిన్ గేటు దగ్గర పోలీస్ జీపు కనిపించింది. దానిని అనుకుని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు.

“మీరేనా డాక్టర్ వనమాలి” వనమాలిని చూస్తూ అడిగాడు కానిస్టెబుల్.
“అవును. ఏమిటిదంతా. మీరంతా నా ఇంటికి ఎందుకు వచ్చారు” కంగారుగా అడిగాడు వనమాలి.
కానిస్తేబుల్ జవాబు చెప్పకుండా చేత్తో ముందుకు చూపించాడు. ఇంటి గుమ్మం దగ్గర పోలీస్ ఇన్ స్పెక్టర్ కనిపించాడు.
అతను వనమాలిని చూసి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. వనమాలికి ఏం అర్దం కాలేదు.
కాని జరగరానిది ఏదో జరిగిందని మాత్రం అనుమానం వేసింది. మెల్లగా పోలీస్ అధికారి దగ్గరకు వెళ్ళాడు.

“మీరు డాక్టర్ వనమాలి కదు. హాలలో మీ ఫోటో చూశాను. వెరీ సారీ డాక్టర్. ఈ చేదు నిజం చెప్పటానకి నాకు చాలా బాధగా ఉంది. కాని చెప్పక తప్పదు. నిన్న రాత్రి మీ భార్యను కూతురిని ఎవరో దారుణంగా చంపేశారు. చంపటానికి ముందు మీ భార్యను అమానుషంగా మానభంగం చేశారు. అంతటితో విడిచిపెడితే బాగుండేది. కాని అంతకంటే భయంకరమైన పని ఇంకోకటి చేశారు. ముక్కుపచ్చలారని పసిపాప అని కూడా చూడకుండ పాప మీద లైంగిక దాడి చేశారు. నా సర్వీసులో ఎన్నో కేసులు చూశాను. కాని ఇంత దారుణమైన చైల్డ్ అబ్యూజ్ కేసు ఇంతవరకు చూడలేదు. ఇదే మెదటిసారి. ఇద్దరి శవాలు బెడ్ రూంలో ఉన్నాయి. మీరు వెళ్ళి చూడకపోతే మంచిది. చూస్తే తట్టుకోలేరు”అంటు ఇంకా ఏదో అనబోయాడు ఇన్ స్పెక్టర్.

కాని అంతవరకు ఆగలేదు వనమాలి. వేగంగా లోపలకు వెళ్ళాడు. బెడ్ రూంలో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురిచేసింది. మంచం మీద అస్తవ్యస్తంగా ఉంది మిత్రవింద. ఆమె శరీరం మీద బట్టలు లేవు.
పూర్తిగా నగ్నంగా ఉంది. ఒంటి నిండా గాయాలు రక్కులతో భయంకరంగా ఉంది. ప్రక్కనే ఇంకో మంచం మీద నిర్జీవంగా ఉంది శృతి. పాప శరీరం రక్తపు ముద్దలా ఉంది. వనమాలి తన వృత్తిలో ఇంతకంటే ఎన్నో భయంకరమైన దృశ్యాలు చూశాడు. ఎప్పుడూ చలించలేదు. కాని ఈ రోజు మాత్రం గదిలో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. హాలులో కూలబడిపోయాడు.

జరిగింది తలుచుకుంటే వనమాలి మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఈ చేదునిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. పోలీసులు తమ తతంగం పూర్తిచేసుకుని వెళ్ళిపోయారు. శవాలను వనమాలికి అప్పగించి పోలీస్ అధికారి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక్కడే మిగిలిపోయాడు వనమాలి. ఇల్లంతా నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది. గంట సేపయిన తరువాత అతను తేరుకున్నాడు. కట్టుకున్న భార్యకు కన్న కూతురికి చివరి విడ్కోలు ఇచ్చి ఇంటికి చేరుకున్నాడు.

ంంంంంంంంంంంంంం

ఆ రోజు నుంచి వనమాలి జీవితం పూర్తిగా మారిపోయింది. భార్యను కూతురిని మరచిపోలేక త్రాగుడికి బానిసఅయ్యాడు. రోజు త్రాగటం మత్తులో సోలిపోవటం అలవాటుగా మారింది. తను ఏ ఉద్దేశం కోసం లండన్ వెళ్ళి ప్లాస్టిక్ సర్జరి కోర్స్ చదివాడో ఆది మరచిపోయాడు. తన అభివృద్దికి ఎంతో సహయపడిన మల్హోత్రను మల్హోత్ర సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను విస్మరించాడు. ఇరవై నాలుగు గంటలు త్రాగుతూ మనస్సును నిద్రపుచ్చుతున్నాడు.

ఆ రోజు కూడా త్రాగుతూ కూర్చున్నాడు. అప్పుడే హాస్పటల్ ఛైర్మెన్ మల్హోత్ర వచ్చాడు. వనమాలి ఉన్న పరిస్ధితిని చూసి కోపంతో రగలిపోయాడు.
“నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్దమవుతుందా. ఏ లక్ష్యం కోసం లండన్ వెళ్ళావో మరచిపోయావా.
నిన్ను లండన్ పంపించటానికి నీ భార్య ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అఫ్ కోర్స్ నీ బాధను నేను అర్దం చేసుకుగలను. అందుకే నీకు ఇన్ని రోజులు గడువు ఇచ్చాను. నువ్వు ఏం చేస్తున్నా చూసిచూడనట్టు ఉండిపోయాను. కాని ఇక నా వల్ల కాదు. బాధలు అందరికీ ఉంటాయి. కాని అందరు తమ ఆశయం మరచి నీలాగ ప్రవర్తించటంలేదు. నీ కుటుంబానికి ఘోర అన్యాయం జరిగిన మాట నిజమే. కాని అదే సమయంలో నీ భార్య ఆశయం లక్ష్యం మరచిపోకూడదు. నువ్వు గొప్ప ప్లాస్టిక్ సర్జన్ కావాలని గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆమె ఎంతో తాపత్రయపడింది. అందుకే నీ యడబాటును భరిస్తూ రెండు సంవత్సరాలు ఒంటరిగా గడిపింది. నిన్ను ఇలా చూస్తే జాలిపడదు సరికదా అసహించుకుంటుంది. నా భర్త ఇంత మానసిక బలహీసుడా అని వాపోతుంది. ఆమె ఆత్మకు కూడా శాంతి దొరకదు. నిజంగా నువ్వు ఆమెను ప్రేమిస్తున్నటయితే నువ్వు మారాలి. మునుపటి వనమాలి లాగ మారిపోవాలి. ఏ ఉద్దేశం కోసం నువ్వు ఇంత చదువు చదివావో అది పూర్తి చెయ్. నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోగా నిన్ను నువ్వు సిద్దం చేసుకో. హాస్పటల్ కు రావాలి. రేపు ఊదయం నువ్వు రిపోర్ట్ చెయ్యలి. లేకపోతే నీ మీద చట్టరీత్య చర్య
తీసుకుంటాను.”

“లండన్ వెళ్ళేముందు మనిద్దరం రాసుకున్న అగ్రిమెంట్ మరచిపోయావనుకుంటాను. నీ చదువు పూర్తయిన తరువాత నువ్వు నా హాస్పటల్ లో పనిచెయ్యాలి. అలా జరగకపోతే నీ మీద చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం నాకుంది. అంతేకాదు. నీకు ఎక్కడా ఉద్యోగం దొరకకుండ కూడా చెయ్యగలను. చెప్పవలసింది చెప్పాను. వెళ్తాను. గుర్తుంచుకో రేపు ఉదయం పదిగంటలకు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను” అంటు వెళ్ళిపోయాడు మల్హోత్ర.

వనమాలి మత్తు ఒక్కసారిగా దిగిపోయింది.

ంంంంంంంంంంంంం

“గుడ్ మార్నంగ్ సార్” అంటు మల్హోత్ర చాంబర్స్ లోకి అడుగుపెట్టాడు వనమాలి. ఏదో ముఖ్యమైన ఫైలు చూస్తున్న మల్హోత్ర తలెత్తి చూశాడు. ఎదురుగా ట్రిమ్ గా నీట్ గా డ్రస్ చేసుకున్న వనమాలి కనిపించాడు.
ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మల్హోత్ర. నిన్న తను ఇచ్చిన ఉపన్యాసం ఇంత తొందరగా వనమాలిలో ప్రభావం చూపిస్తుందని అతను అనుకోలేదు. నిజానికి మల్హోత్ర కావాలనే అతన్ని అలా తిట్టాడు. ఆమాటలు విని అయిన వనమాలి మారతాడని అతని ఆలోచన. అతను ఊహించినట్టుగానే వనమాలిలో మార్పు వచ్చింది. వెంటనే డ్యూటిలో జాయిన్ అయ్యాడు.

“గుడ్ వనమాలి. ఇప్పుడు నువ్వు గొప్ప డాక్టర్ అనిపించావు. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. నాతో రా. నీ డిపార్ట్ మెంట్ చూపిస్తాను” అంటు వనమాలిని ప్లాస్టిక్ సర్జరి డిపార్ట్ మెంట్ కు తీసుకువెళ్ళాడు మల్హోత్ర. లోపల అమర్చిన అధునాతనమైన పరికారాలు చూసి వనమాలి విస్తుబోయాడు. అవి చాలా ఖరీదైనవి. అమెరికా ఇంగ్లాండ్ లో మాత్రమే దొరుకుతాయి. వాటిని అక్కడనుంచి ఇక్కడకు తీసుకురావటం మాములు విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మల్హోత్ర వాటిని విదేశాల నుంచి దిగుమతి చేశాడంటే ఎంత ఖర్చు పెట్టి ఉండాలి. ఎంత తక్కువగా అనుకున్న దాదాపు పదిహేను కోట్లు ఇచ్చిఉండాలి.

వనమాలి ఉద్దేశం గమనించిన మల్హోత్ర చిన్నగా నవ్వి అన్నాడు.
నీ డిపార్ట్ మెంట్ కోసం ఆ మాత్రం ఖర్చు చెయ్యకపోతే ఎలా. నువ్వు గొప్ప పాస్టిక్ సర్జన్ కావాలి.
నీ వల్ల నా హాస్పటల్ కు మంచి పేరు రావాలి. ఇండియాలోనే నెంబర్ వన్ సూపర్ స్షేషాలిటిగా పేరు తెచ్చుకోవాలి. దాని కోసం ఎంత ఖర్చయినా చేస్తాను. ఏమైనా చేస్తాను. ఈ రోజు మంచి రోజు. నెళ్ళి నీ చాంబర్ లో కూర్చో.నిష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటు అభినందించి మల్హోత్ర వెళ్ళిపోయాడు.

వనమాలి వెళ్ళి తన చాంబర్స్ లో కూర్చున్నాడు. రివాల్వింగ్ కుర్చిలో కుర్చుంటుంటే అతనికి ఎంతో ఆనందంగాను ఉద్వేకంగాను ఉంది. ఈ స్ధానం కోసమే అతను ఎంతో కష్టపడ్డాడు. వారాలు చేసుకుని చదివాడు. ఎన్నో అవమానాలు భరించాడు. అతనితో పాటు అతని భార్య మిత్రవింద కూడా ఎన్నో కష్టాలు పడింది. తన భర్త ఒక ప్లాస్టిక్ సర్జ్ న్ గా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశపడింది. అందుకే అన్ని కష్టాలు భరించింది. చివరకు రెండు సంవత్సరాలు భర్తకు దూరంగా ఒంటరిగా ఉంది.

ఆమె కోరుకున్నట్టుగానే వనమాలి ప్లాస్టిక్ సర్జ్ రిలో పెద్ద డిగ్రి సంపాదించాడు. లండన్ యూనివర్స్ సిటిలో మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఈ శుభవార్త విన్న మిత్రవింద ఎంతో సంతోషడింది. తను పడిన కష్టాలు వృధా కాలేదని ఆనందించింది. వనమాలి కూడా ఎంతో ద్రిల్లింగ్ గా ఫీలయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత భార్యను కూతురును కలసుకుంటున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. కాని అతని సంతోషం ఆనందం గాలిబుడగల్లా పేలిపోయింది. చిరునవ్వుతో ఎదురువస్తుందనుకున్న భార్య కూతరు నిర్జీవంగా దర్శనం ఇచ్చారు.

భార్య కూతురు గుర్తుకురాగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళు తుడుచుకోబోతుంటే అప్పుడే ఒక అటెండర్ వచ్చి “సార్ మీ కోసం ఇనస్పక్టర్ నాయక్ వచ్చారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట పంపించమంటారా”అని అడిగాడు.
“పంపించు”అంటు వెనక్కి వాలి కూర్చున్నాడు.
“గుడ్ మార్నంగ్ డాక్టర్” అంటు వనమాలికి ఎదురుగా కూర్చున్నాడు నాయక్.

“చెప్పండి ఆఫీసర్. నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారంట. ఏ విషయం గురించి” అడిగాడు వనమాలి.
“మీ భార్య కూతురి హత్య కేసు నేనే దర్యాప్తు చేస్తున్నాను. ఈ దారుణం చేసింది ఎవరో మాకు తెలిసింది. వాళ్ళ ఫోటోలు కూడా సంపాదించాం. ఇద్దరు పాత నేరస్తలే. వాళ్ళలో ఒకడి పేరు ఏసుపాదం రెండో వాడి పేరు డేవిడ్. డేవిడ్ రెండు మూడుసార్లు దొంగతనం చేసి పోలీస్ రికార్ట్ లోకి ఎక్కాడు. ఏసుపాదం రెండు చైల్డ్ అబ్యుస్ కేసులో నిందితుడిగా ముద్రపడ్డాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరు ఒక్కసారి కూడా అరెస్ట్ కాలేదు. అయితే ఆ నేరాలు వాళ్ళే చేశారని పోలీసుల దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. “

“మీ భార్య కూతురిని కూడా వాళ్ళే చంపారని మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళను పట్టుకోవటానికి మా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొందరలోనే వాళ్ళను పట్టుకుంటామనే నమ్మకం ఉంది. ఈ విషయం మీకు చెప్పాలనే వచ్చాను” అన్నాడు నాయక్.
ఆ నేరస్తుల ఫోటోలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా”అడిగాడు వనమాలి.
“ఉన్నాయి. మీకు చూపించాలని తీసుకువచ్చాను”అంటూ రెండు ఫోటోలు ఇచ్చాడు నాయక్.
కొన్ని క్షణాలపాటు ఆ ఫోటోలవంక తదేకంగా చూస్తుండిపోయాడు వనమాలి. అతని గుండెలో అగ్నిపర్వాతాలు బ్రద్దలవుతున్నాయి. నిజంగా వీళ్ళిద్దరు కాని అతని ఎదురుగా ఉంటే తన చేతులతోనే చంపేసేవాడు. అది ఒక్క క్షణం మాత్రమే. వెంటనే తేరుకుని ఫోటోలు తిరిగి వాయక్ కి ఇచ్చేశాడు.

“వస్తాను డాక్టక్. మీరు వర్రి కాకండి. నేరం చేసిన వాడు నా చేతల్లోంచి తప్పించుకోలేడు. వీళ్ళ గతి కూడా ఇంతే. తొందరలోనే వీళ్ళను పట్టుకుని చట్టానికి అప్పగిస్తాను. అంతవరకు నిద్రపోను”అంటు లేచాడు వాయక్.
“నాదో చిన్న కోరిక”అన్నాడు వనమాలి.
“ఏమిటది. సందేహించకుండా చెప్పండి. నా పరిధిలో చెయ్యగలిగినదైతే తప్పకుండ చేస్తాను.”
“పెద్ద పనేం కాదు. హంతకులను పట్టుకోవాలని మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు తొందరగా పట్టుబడాలని నేను కోరుకుంటున్నాను. అందుకే వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు సమాచరం నాకు తెలియాలి.
మీకు అభ్యంతరంలేకపోతే మూడు రోజులకు ఒకసారి రింగ్ చేసి మీ దర్యాపు గురించి చెప్పండి. అది చాలు”
“తప్పకుండ. ఇది వా డ్యూటి. వస్తాను”అని చెప్పి వెళ్ళిపోయాడు వాయక్.

ంంంంంంంంంంంం

పది సంవత్సరాలు గడిచాయి. వనమాలి ప్లాస్టిక్ సర్జన్ గా పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఇండియన్ ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ కు వైస్ పెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అతని అతని భార్య ఏ లక్ష్యం కోసం అంతగా కష్టపడ్డారో అది నెరవేరింది. ఇండియాలోనే నెంబర్ వన్ సర్జన్ గా ఎదిగాడు. అతని హస్తవాసి చాలా గొప్పదని పేషంట్స్ తో పాటు తోటి డాక్టర్లు కూడా నమ్ముతున్నారు. తల్లి తండ్రి జన్మనిస్తారు. కాని వనమాలి పునర్జన్మ ఇస్తాడని పేషంట్లు నమ్ముతున్నారు.

జీవితంలో సాధించవలసిదంతా సాధించాడు. పెద్దపేరు పేరుతో పాటుడబ్బు పుష్కలంగా సంపాదించాడు. అతని భార్య కోరిక నెరవేరింది. మాములుగా అతని స్ధానంలో ఇంకేవరైన ఉంటే సాధించిన విజయం తలుచుకుని సంతోషపడేవాళ్ళు. గాలిలో తేలిపోయేవాళ్ళు. తమ కంటే ఇంకేవరు లేరని విర్రనిగేవాళ్ళు. నిజానికి వనమాలి సాధించింది తక్కవ విజయం కాదు. కాని అతనికి మాత్రం ఏ మాత్రం సంతోషం లేదు. అతని భార్య కూతురిని చంపినవాళ్ళ ఆచూకి ఇంకా తెలియలేదు. వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్ మెంట్ తీవ్రంగా గాలిస్తుందని పేపర్ లో చదివాడు. కాని ఆ ముష్కరులు మాత్రం ఇన్ని సంవత్సరాలు గడిచిన దొరకలేదు. వనమాలి కూడా తన వంతు ప్రయత్నం చేశాడు. నేరస్తులకోసం తనువెతికాడు. ఫోటోలు చూశాడు కనుక వాళ్ళను చూస్తే తేలికగా గుర్తుపట్టగలడు.

ఇలాంటి నేరస్తులు చౌకబారు క్లబ్బులలో ఉంటారని చదివాడు. అందుకే సిటిలో ఉన్న అలాంటి క్లబ్బుల లిస్ట్ సంపాదించి తన అన్వేషణ మెదలు పెట్టాడు. రాత్రి వేళ ఎవరికి తెలియకుండ అక్కడకు వెళ్ళాడు. జేబుదొంగలు, హంతకులు వ్యభిచారులతో కలసి కూర్చున్నాడు. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. ఏసు పాదం జాన్ డేవిడ్ కనిపించలేదు. దాదాపు రెండు నెలలు వాళ్ళ కోసం తిరిగాడు. తరువాత విసుగొచ్చి మానేశాడు. వాళ్ళ గురించి తాత్కాలికంగా మరచిపోయి వృత్తి మీద తన దృష్టిని లగ్నం చేశాడు. ఏ కోరికలు సుఖాలు అనుభవించకుండా వృత్తికి పూర్తిగా అంకితమయ్యాడు. ఈ రాక్షసులు దొరకలేదుకాని అతని భార్య ఆశయం మాత్రం నెరవేరింది.

అది గతం. ప్రస్తుతానికి వస్తే ఆ రోజు వనమాలి మాములుగా హాస్పటల్ కు వచ్చాడు. చాంబర్స్ లో కూర్చోబోతుంటే అటెండర్ వచ్చిమిమ్మల్ని మల్హోత్ర పిలుస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. కారణం చెప్పలేదు. పిలిచింది బాస్ కనుక వెంటనే వెళ్ళాడు. మల్లోత్ర ఆఫీసు మూడో అంతస్తులో ఉంది. అక్కడే క్యాన్సర్ వార్ట్ ఉంది. మల్హోత్ర చాంబర్స్ చేరుకున్నాడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. మెల్లగా తెరిచి లోపలకు చూశాడు.

ఎదురుగా కనిపించిన దృశ్యం వనమాలికి ఆశ్చర్యంతో పాటు అసహ్యం కలిగించింది. విశాలమైన మహఘని టేబుల్ వెనుక కూర్చున్నాడు మల్హోత్ర. అతని ఒళ్ళో కూర్చని గారాలుపోతుంది అతని పర్సనల్ సెక్రటరి. ఆమె అతని మెడ చుట్టు చేతులు వేసింది. మల్హోత్ర మాత్రం తక్కువ తిన్నాడా. టేబుల్ మీద ఉన్న ద్రాక్ష పళ్ళు ఒక్కొక్కటి తీసి ఆమె నోటికి సుతారంగా అందిస్తున్నాడు.

వనమాలికి ఈ దృశ్యం ఆసహ్యయం కంటే ఆశ్చర్యం కలిగించింది. మల్హోత్ర మంచి డిసిప్లినేరియన్. హాస్పటల్ లో అందరు డిగ్నిపైడ్ గా ప్రవర్తించాలి. ప్రేమలు దోమలు లాంటి పదాలు ఆయన డిక్షనరిలో లేవు. కారణం లేకుండ అనవసరంగా డాక్టర్ లతో లేడి నర్సులు మాట్లాడటానికి వీల్లేదు. అలా ఎవరైనా చేస్తే వెంటనే చర్య తీసుకుంటాడు. ఇంతకుముందు ఇలాగే ఇద్దరిని అతను ఇంటికి పంపించాడు.

అలాంటి మల్హోత్ర తన సెక్రటరితో అసభ్యంగా ప్రవర్తించటం ఆశ్చర్యంకాక ఏముంది. అందుకే అంటారు రూల్స్ ఆర్ టు బి బ్రోకన్. రూల్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళే వాటిని అతిక్రమిస్తారు. ఇది ఎక్కడైన సహజంగా జరిగేదే.

తమిద్దరిని వనమాలి చూస్తున్నాడని మల్హోత్ర కు తెలయదు. కాని అతని పర్సనల్ సెక్రటరి వనమాలిని చూసింది. వెంటనే సిగ్గుతో లేచి లోపల గదిలోకి పారిపోయింది. అప్పుడు వనమాలిని చూశాడు మల్హోత్ర.

“రా వనమాలి నీ కోసమే ఎదురుచూస్తున్నాను. వచ్చి కూర్చో” అంటు సాధరంగా ఆహ్వానించాడు.
అతని మొహంలో తప్పు చేశానన్న గిల్టినెస్ కాని ఆ దృశ్యాన్ని ఒక డాక్టర్ చూశాడన్న సిగ్గుకాని ఏ కోశాన లేవు. చాల మాములుగా ఏం జరగనట్టు చాల రిలాక్స్ గా ఉన్నాడు.
వనమాలి అతని ఎదురుగా కూర్చుని “ఎందుకో రమ్మన్నారంట”అన్నాడు ముక్తసరిగా.
“అవును వనమాలి. నువ్వు వెంటనే ముంబాయి వెళ్ళాలి.”
“నేను ముంబాయి వెళ్ళాలా. ఎందుకు”.
“అక్కడ ఆల్ ఇండియా సూపర్ హాస్పటల్ అసోసియేషన్ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ కు నేను హాజరుకావాలి. కాని అనుకోకుండ ఒక ముఖ్యమైన పని వచ్చింది. హాస్పటల్ ఇంకా అభివృద్ధి చెయ్యటానికి మనం బ్యాంకలో లోన్ ఆప్లికేషన్ పెట్టుకున్నాం. అది సాంక్షన్ అయ్యే చాన్స్ ఉంది. ఆ నేపధ్యంలోనే హాస్పటల్ ను చూడటానికి బ్యాంకు అధికారులు వస్తున్నారు. వాళ్ళను రిసివ్ చేసుకోవటానికి నేను తప్పని సరిగా ఇక్కడే ఉండాలి. ఇది ఎంత ముఖ్యమో మీటింగ్ కు వెళ్ళటం కూడా అంతే ముఖ్యం. కాని ఒక్కడిని రెండు పనులు చెయ్యలేను కదా. బ్యాంకు వాళ్ళను రిసివ్ చేసుకోవటానికి నేను తప్పనిసరిగా ఇక్కడే ఉండాలి. మీటింగ్ కి నేను వెళ్ళకపోయిన నా తరుపు ఇంకో మనిషిని పంపించవచ్చు. అందుకే నిన్ను పంపిస్తున్నాను. ఈ రోజే నువ్వు ముంబాయి వెళ్ళాలి. ఏయిర్ పోర్ట్ లో అసోసియేషన్ సెక్రటరి నిన్ను రిసిన్ చేసుకుంటాడు. సాయంత్రం ఆరుగంటల ఫ్లైట్ కు టికెట్టు రిజర్వ్ చేశాను. మద్యాహ్నం రెండుగంటలకు నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.”అన్నాడు.

“మీ అసోసియేషన్ మీటింగ్ గురించి నాకేం తెలుసు. అక్కడ నేనేం మాట్లాడగలను.”అన్నాడు వనమాలి.

“ఆ విషయం నాకు తెలుసు. అందుకే తగిన ఏర్పాటు చేశాను. అక్కడ ఏం మాట్లాడాలో ఈ కాగితం మీద రాశాను. ఒక వేళ నిన్ను మాట్లడమని బలవంతం చేస్తే నేను రాసిన రిపోర్ట్ చదువుచాలు. ఇదిగో రిపోర్ట్.

టిక్కేట్లు అటెండర్ తో పంపిస్తాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు” అంటు ఫైలులో తలదూర్చాడు.

వనమాలి రిపోర్ట్ తీసుకుని తన చాంబర్స్ లో కూర్చున్నాడు. తన అసిస్టేంట్ ను పిలిచి విషయం చెప్పి చార్జ్ అప్పగించాడు. తరువాత ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఆరుగంటలకు ముంబాయి ఫ్లైట్ ఎక్కాడు. సీటులో కూర్చబోతుంటే అప్రయత్నంగా అతని కుడి కన్ను అదిరింది. శరీరం సన్నగా జలధరించింది. ఇంతకుముందు వనమాలి చాల సార్లు ముంబాయి వెళ్ళాడు. కాని ఎప్పుడు ఇలా జరగలేదు.

సిక్స్త సెన్స్ మీద అతనికి బొత్తిగా నమ్మకం లేదు. అయినా ఏదో మూల అనీజీ. జరగారానిది ఏదో జరగబోతుందని చిన్న అనుమానం.

రాత్ర సరిగ్గా ఏడుగంటలకు ముంబాయి చేరుకున్నాడు వనమాలి. అతన్ని రిసీవ్ చేసుకోవటానికి సంఘం సెక్రటరి వచ్చాడు. మాములు ఫార్మాలిటిస్ ముగిసిన తరువాత ఇద్దరు కారులో హోటల్ చేరుకున్నారు..

“సార్ మీ కోసం స్పెషల్ సూట్ రిజర్వ్ చేశాను. హాయుగా విశ్రాంతి తీసుకోండి. రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. డిన్నర్ కూడా అక్కడే. వస్తాను సార్”అని చెప్పి వెళ్ళిపోయాడు సెక్రటరి.

మీటింగ్ ముగిసిన తరువాత అక్కడే భోజనం చేశాడు వనమాలి. తరువాత సెక్రటరి అతన్నిహోటల్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ప్రోగ్రాం ప్రకారం మరునాడు ఉదయం ఫ్లైట్ లో అతను తిరిగి వెళ్ళిపోవాలి. కాని ఎందుకో అతనికి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకో రోజు ఉండి తరువాత వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. టిక్కెట్టు క్యాన్సిల్ చేసి తీరికగా బాల్కని లో నిల్చున్నాడు. చల్లగా గాలి వీస్తుంది. లైట్ల వెలుగులో ముంబాయి నగరం కొత్త పెళ్ళి కూతురిలా మెరసిపోతుంది.

ఒక గంట సేపు తరువాత బోర్ కొట్టింది. ఏం తోచక హాలులోకి వచ్చి కూర్చున్నాడు. ఏదైన పుస్తకం కనిపిస్తుందేమో అని టీపాయ్ క్రింద చూశాడు. ఒక ఫోటో ఆల్బం కనిపించింది. అందులో చాల మంది అందమైన అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఫోటో కింద ఆ అమ్మాయి పేరు వయస్సు మొదలైన వివరాలు ఉన్నాయి. వనమాలికి అంతా అర్ధమైంది. ఆ ఆల్బం లో ఉన్న ఫోటోలు హై క్లాస్ కాల్ గల్స్ వి, కస్టమర్స్ తమకు నచ్చిన అమ్మయిని సెలక్ట్ చేసుకుని హోటల్ మేనేజర్ కు ఫోన్ చేసి చెబితే అతనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈ తతంగం ప్రతి ఫై స్టార్ హోటల్ లో జరుగుతుంది. ఈ సంగతి పోలీస్ డిపార్ట్ మెంట్ కు తెలుసు. అయిన వాళ్ళ చూసి చూడనట్టు ఉంటారు. కారణం వాళ్ళకు అందవలసింది అందుతుంది కనుక.

క్యాజువల్ గా ఆల్బమ్ చూస్తున్న వనమాలి ఒక ఫోటో చూసి ఆగిపోయాడు. అశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. తను చూస్తుంది నిజమా కాదా అన్నసందిగ్ధంలో పడ్డాడు. అది తీర్చుకోవాలని కళ్ళు నులుపుకుని మరి చూశాడు. సందేహం లేదు. అది రోసి ఫోటో. ఎక్కడో ఊటిలో ఉందనుకున్న రోసి ముంబాయికి ఎలా వచ్చింది. కాల్ గరల్ గా ఎప్పుడు మారింది. భయంకరమైన ఈ చేదునిజం ఒక సనామి అలమాదిరి అతన్ని తాకింది. కొన్న క్షణాలపాటు స్తబ్దుగా ఉండిపోయుడు. తరువాత తేరుకుని మేనేజర్ కు ఫోన్ చేసి వివరంగా మాట్లాడాడు. రెండు గంటల తరువాత రోసి అతని గదిలోకి వస్తుందని చెప్పాడు మేనేజర్.
ఆ మాటలు అతని గుండెలను చిధ్రం చేశాయి.

ఈ చేదు నిజం ఎలా జీర్ణం చేసుకోవాలో అతనికి అర్ధంకాలేదు. జీవితంలో ఎంతో మందికి అనూహ్యమైన సంఘటనలు ఎదురుపడి ఉంటాయి. కాని ఇలాంటి సంఘటన ఎవరికి ఎదురై ఉండదు. కాల్ గరల్ గా మారిన అక్క తమ్ముడి గదిలోకి రావటం ఎవరు చదివి ఉండరు. విని ఉండరు. కనీసం సినిమాలలో కూడా ఇలాంటి సన్నివేశం చిత్రికరించలేదు.

నిజానికి రోసి రక్తంపంచుకున్న అక్క కాదు. దేవుడిచ్చిన అక్క. ఆమె సహయం చెయ్యకపోతే వనమాలి ఇంతవాడు అయ్యేవాడు కాదు. ఆమె చేసిన సహయం అతను జన్మలో మరచిపోలేడు. రోసిని కలుసుకున్న రోజు అతనికి ఇంకా గుర్తుంది. పుట్టినప్పటినుంచి వనమాలి అనాధ. అదృష్టవశతు నారయణరావు దంపతులు అతన్ని పెంచుకున్నారు. పద్నాలుగు సంవత్సరాలు వనమాలి ఏ లోటు లేకుండ పెరిగాడు.దురదృశష్టవశతు పెంచిన వాళ్ళ మీద కోపగించుకుని ఇంటినుండి వచ్చేశాడు.

చేతిలో పుస్తకాలు బట్టలు నిండిన సంచి తప్పు అతడి చేతిలో ఒక్క పైసా లేదు. రాత్రి వేళ రైల్వే స్టేషన్ చేరుకున్న అతడికి ఎక్కడకు వెళ్ళలో తెలియలేదు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తోచింది. టిక్కేట్టు కొనటానికి డబ్బు లేదు. అందుకే ఎదురుగా ఫ్లాట్ ఫారం మీద ఉన్న గూడ్స్ బండి ఎక్కాడు. అది బొగ్గు తీసుకువెళ్ళే బండి.
అతను ఎక్కిన కంపార్ట్ మెంట్ లో అతనితో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అతడి కంటే పెద్దవాళ్ళు. రౌడీలులా ఉన్న వాళ్ళను చూసి వనమాలి భయపడ్టాడు. సంచి తలక్రింద పెట్టుకుని మూలగా వెళ్ళి పడుకున్నాడు.
నిజానికి వాళ్ళిద్దరు తోడు దొంగలు. గూడ్స్ లోంచి బొగ్గు అపహరించటం వాళ్ళ వృత్తి. దాదాపు రెండు సంవత్సరాలనుంచి ఆ రూట్ లో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కాని ఇంతవరకు పోలీసులకు పట్టుబడలేదు. గూడ్స్ బండిలో బొగ్గు దొంగతనం జరుగుతుందని రైల్వే డిపార్ట్ మెంట్ కు తెలుసు. సెక్యూరిటీని కూడా పటిష్టం చేశారు. కాని దొంగతనాలు మాత్రం ఆగలేదు.

ముందు వనమాలిని చూసి దొంగలు కొంచం కంగారుపడ్డారు. కాని తరువాత అతన్ని పట్టించుకోవటం మానేశారు. ఆఫ్టారాల్ ఒక పద్నాలుగు సంవత్సరాలున్న అబ్బాయ్ ఏం చెయ్యగలడులే అన్న నమ్మకం కావచ్చు. పైగా వనమాలి నిద్రపోతున్నాడు. అందుకే వాళ్ళు ఏ మాత్రం సంకోచం లేకుండ తాము చెయ్యబోయే దొంగతనం గురించి నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు. కాని నిజానికి వనమాలి నిద్రపోవటం లేదు. పడుకున్నాడు అంతే. నాళ్ళ మాటలన్ని అతడికి వినబడుతున్నాయి.

గూడ్స్ బండి చాల సేపు ప్రయాణం చేసి ఒక స్టేషన్ లో ఆగింది. వనమాలి ఫ్లాట్ ఫారం మీద దిగి ఎదురుగా కనిపిస్తున్న స్టేషన్ మాస్టర్ గదిలోకి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ ను కలుసుకుని ఆ దొంగల గురించి చెప్పాడు. ఆయన వెంటనే రైల్యే పోలీసులను అలర్ట్ చేశాడు. పోలీసులు వెంటనే వచ్చి ఆ ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ మాస్టర్ వనమాలిని అభినందించాడు. అతడి గురించి వివరాలు తెలుసుకున్నాడు. వనమాలి ఒక అనాధ అని తెలియగానే చాల జాలిపడ్డాడు. ఎంతో కాలంగా దొంగతనం చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న దొంగలను పట్టించినందుకు వనమాలికి ఏదైన సహయం చెయ్యాలని భావించాడు స్టేషన్ మాస్టర్.

“చూడు బాబు ఇక్కడనుంచి తిన్నగా లోపలకు వెళ్ళితే ఒక క్రిస్టియన్ అనాధాశ్రమం వస్తుది. దాన్ని నడిపిస్తున్న ఫాదర్ డానియల్ చాల మంచివాడు. మానవతావాధి. అనాధ పిల్లలంటే ఎంతో ఇష్టపడతాడు. తన స్కూలులోనే ఆశ్రయం ఇచ్చి చదువుకూడా చెప్పిస్తాడు. నువ్వు అయనను కలుసుకుంటే తప్పకుండ మేలు జరుగుతుంది. వెళ్ళు”అంటు ధైర్యం చెప్పి పంపించాడు.

అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు కావస్తుంది. ఆ ప్రాంతమంత చాలా చీకటిగా నిర్మానుష్యంగా నిస్తేజంగా ఉంది. సహజంగా వనమాలి ఈడు వయస్సు పిల్లలు ఆ సమయంలో ఒంటరిగా వెళ్ళటానికి భయపడతారు. కాని వనమాలి మాత్రం భయపడలేదు. ధైర్యంగా బయలుదేరాడు. అవసరం మనిషిని ఎంతకైన తెగించేలా చేస్తుందని ఇది ఒక ఉదాహరణ.

అరగంట తరువాత అక్కడికి చేరుకున్నాడు. ఆశ్రమం మెయిన్ గేటు మూసిఉంది. లోపలనుంచి తాళం వేసుంది. అంతరాత్రివేళ తను ఎంత గట్టిగా అరిచిన తలుపులు తియ్యరని వనమాలికి తెలుసు. అందుకే గేటు ప్రక్కన ఉన్న అరుగు మీద పడుకున్నాడు. ఉదయం నుంచి ఏం తినలేదు. పైగా గూడ్స్ బండిలో ప్రయాణం. మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయాడు వనమాలి. అందుకే పడుకున్న వెంటనే గాఢంగా విద్రపోయాడు.

తిరిగి అతడు కళ్ళు తెరిచేసరికి బాగా తెల్లవారిపోయింది. ఒక అబ్బాయి వచ్చి అతడిని లోపలకు తీసుకువెళ్ళి ఫాదర్ డానియల్ ముందు నిలబెట్టాడు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్టుగానే ఫాదర్ డానియల్ చాల మంచివాడు. మానవత్వం మూర్తీభవించిన మనిషి. వనమాలి గురించి అంతా తెలుసుకుని తన హాస్టల్ లో చేర్చుకున్నాడు. అక్కడే రోసి అతడకి పరిచయం అయింది. ఆమె వనమాలి ఇంగ్లీష్ టీచర్. పరీక్షలో అన్ని సబ్జక్ట్స్ లోను మొదటి స్ధానంలో నిలిచిన వనమాలి ఇంగ్లీష్ లో మాత్రం చాల తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీనికి కారణం అంతకుముందు వనమాలి తెలుగు మీడియంలో చదవటం వల్ల. ఈ విషయం తెలుసుకున్న రోసి అతడికి ట్యూషన్ చెప్పటానికి ఒప్పుకుంది. అలా మొదలైన వాళ్ళ సంబంధం రోజు రోజుకు పెనవేసుకుని గట్టి పడింది. రోసిని వనమాలి తనకు దేవుడిచ్చిన అక్కగా భావించాడు. రోసి కూడా అతడిని సొంత తమ్ముడిలా ఆదరించింది. ఆమెకు మరో ఊరు ట్రాన్స్ ఫర్ అయిన ఆమె మాత్రం వనమాలిని మరచిపోలేదు. ప్రతి నెల డబ్బు పంపేది.

అలాంటి రోసి ఉన్నట్టుండి డబ్బు పంపించటం మానేసింది. కనీసం ఉత్తరం కూడా రాయలేదు. వనమాలి ఆమెకు ఎన్నో సార్లు ఉత్తరాలు రాశాడు. కాని ఆమె దగ్గర నుంచి ఒక్క దానికి సమాధానం రాలేదు.
వనమాలి ఎంతో బాధపడ్డాడు. ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా అతనికి తెలియలేదు. లేకపోతే తప్పకుండ వెళ్ళి కలుసుకునేవాడు.

రోజులు సంవత్సరాలు గడిచాయి. వనమాలి ఆమె కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తునే ఉన్నాడు. కాని ఏం లాభం లేకపోయింది. దాదాపు రోసిని మరచిపోయే స్ధితికి వచ్చాడు. అలాంటిది అనుకోకుండా ఇక్కడ రోసి కనిపించటం అతనికి విపరీతమైన షాక్ కలిగించింది. అది కాల్ గరల్ రూపంలో. ఆది మాత్రం జీర్ణం చేసుకోలేకపోతున్నాడు.

అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ తలుపు మీద చప్పుడయింది. వనమాలి వెళ్ళి తలుపు తెరిచాడు. గుమ్మం దగ్గర రోసి కనిపించింది. ఆమెను చూసి ఒక్కక్షణం అచేతనవస్తలో ఉండిపోయాడు. తరువాత తేరుకుని “రా అక్క నీ కోసమే ఎదురుచూస్తున్నాను”అన్నాడు గంభీరంగా.

ఒక సునామి అలతాకినట్టు నిర్ఘాంతపోయింది రోసి. ఊహించని ఈ పరిణామానికి సిగ్గుతో చితికిపోయింది. ఏ విషయం అయితే తెలియకూడదని అనుకుందో ఇప్పుడు ఆ చేదు నిజం వనమాలికి తెలిసిపోయింది. అది తలుచుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది ఆమెకు, మాటలురానట్టు ఈజిప్షియన్ మమ్మీలా ఉండిపోయింది.

తరువాత మెల్లగా తేరుకుని లోపలకు అడుగుపెట్టింది. ఇద్దరు ప్రక్కప్రక్కనే మంచం మీద కూర్చున్నారు. కొన్ని క్షణాల వరకు ఇద్దరి మద్య నిశబ్ధం విలయతాండవం చేసింది. ముందుగా విశబ్దాన్ని చిధ్రం చేస్తూ అన్నాడు వనమాలి.

“ఇలా ఎందుకైంది అని నిన్ను సంజాయిషి అడగాను. అది నాకు అనవసరం కూడా. నాకు కావల్సింది ఒక్క నిజం మాత్రం. నిన్ను ఈ స్ధితికి తీసుకువచ్చింది ఎవరు. పవిత్రమైన టీచర్ వృత్తిలో ఉన్న నువ్వు ఈ రొచ్చలోకి ఎలా వచ్చావు. అది మాత్రం చెప్పు చాలు. దీనివల్ల రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి నాకు చెప్పుకోవటం వల్ల నీ మనస్సులో బాధ తగ్గుతుంది. రెండు నీ పరిస్ధితికి కారకుడు ఎవరో తెలుస్తుంది. జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నాకు తెలియదు. అప్పుడే నాకు శాంతి కలుగుతుంది. నా అక్క నిప్పు.. పరిస్ధితుల ప్రభావం వల్ల ఇలా జరిగిందని సరిపెట్టుకుంటాను.”

“రోసి బలహీనంగా నవ్వి అంది.
“నువ్వు ఇంతగా అడగుతున్నావు కనుక అంతా చెప్తాను. డబ్బు కోసమో లేక శారీరక సుఖాలుకోసం నేను ఈ పని చెయ్యలేదని నువ్వు నమ్మితే నాకంతే చాలు. నా కధంతా విన్న తరువాత ఇంకా నేను తప్పు చేశానని నువ్వు భావిస్తే ఇక జన్మలో నీకు కనిపించను. అది మాత్రం నిజం. సరే అసలు విషయం చెప్తాను” అంటూ మొదలు పెట్టింది రోసి.

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech