Sujanaranjani
           
  సారస్వతం  గగనతలము-34  
 

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు  

 

మనిషి చేష్టలు – ప్రకృతి విపరీతచేష్టలు

ప్రకృతివైపరీత్యాలకు మన తప్పిదాలే కారణమని చెప్పే కొన్ని శాస్త్రీయాంశాలపై ప్రత్యేకముగ చర్చించుకొనడమే ప్రస్తుతవ్యాసము యొక్క సారాంశము. అనేకరకములుగ సంభవించే ప్రకృతివైపరీత్యములు ప్రమాదసూచికలే కానీ ప్రమాదములు కావు.

ప్రకృతివైపరీత్యమంటే

దీనినే ఉత్పాతము, ఉపసర్గ, విపత్తు , ఆపద అని అనేకపేర్లతో జ్యోతిషం చర్చిస్తుంది. ఈ విషయాలకు సంబంధించిన విస్తృతవివరములు జ్యోతిషము యొక్క సంహితాస్కంధములో లభిస్తాయి. ప్రకృతి అంటే స్వభావము అని అర్థము. ప్రతీ వస్తువుకు ప్రతీ ప్రాణికి ఒక ప్రకృతి ఉంటుంది. అదే విధముగ మనము జీవించడానికి ముఖ్యకారణములైన పంచమహాభూతములకు ఒక ప్రత్యేకమైన సహజసిద్ధమైన స్వభావము ఉంది. సూర్యుడు మరియు నిప్పుకు కాలే స్వభావము,నీటికి పల్లములో పారే స్వభావము, చందృనిలో చల్లదనము, రాయిలో కాఠిన్యము ఇలా ప్రతీ వస్తువుకు ఒక నిశ్చితమైన స్వభావము ఉంటుంది. ప్రకృతికి లేక స్వభావమునకు విరుద్ధముగ గనక వస్తువు లేక ప్రాణి ప్రవర్తిస్తే దానిని మనము వికృతి అంటాము. ఆ వికృతినే సంస్కృతములో ఉత్పాతము అంటారు. ప్రకృతేరన్యత్వముత్పాతః అని బృహత్సంహితలో వరాహమిహిరాచార్యులు పేర్కొన్నారు.

నీరు తన గాంభీర్యాన్న కోల్పోయి ఉప్పెన రూపము ధరించడము, వేల కాని వేల వర్షము రావడము, ఒక జంతువుకు వేరే జంతువు పిల్ల పుట్టడము, విగ్రహములు పాలు తాగడము, విగ్రహాలకు చెమటలు పట్టడము, ఏడవడము, పూలు రాని చెట్లకు పూలు రావడము ఇలా వికృతులను అనేక రూపములుగ మనము చూడవచ్చును.

మరి ఈ ఇబ్బందులకు కారకులు ఎవరు

          మనమే. నరుల తప్పిదాలు పరిధులు దాటినప్పుడు వారికి సూచనప్రాయంగా దేవతలు (పంచమహాభుతాదులు) వీటిని సృష్టిస్తాయని శాస్త్రం చెబుతోంది. అంటే మనిషికి నష్టము ప్రకృతివైపరీత్యము ద్వారా కాదు దాని తదుపరి వచ్చే పర్యవసానములవలన అని అర్థము. జరగబోయే ప్రతీ ఘోరము ముందు దానకి సంబంధించిన సూచన మనిషికి తెలియజేయబడుతుందని దానికి తగ్గ ప్రతీకారము(శాంతి) అతను చేసుకుంటే మనిషి తనకు కలగబోయే నష్టాన్ని వారించుకోవడమో లేక తగ్గించుకోవడమో చేసుకోవచ్చని ఆచార్యుల అభిప్రాయము.

పాపములు పేరుకుని పరిధులు దాటినపుడు మానవునికి సూచనారూపములో సంభవించే ప్రకృతివైపరీత్యములు మూడు రకములుగ ఉంటాయి. వాటినే దివ్యోత్పాతములు, అంతరిక్షోత్పాతములు, భౌమోత్పాతములు అని అంటారు. మనము ప్రస్తుత సంచికలో కొన్ని భౌమోత్పాతములు (సూచనలు) గూర్చి చర్చించుకుందాము.

1.                లింగవికృతము[1] - దేవతావిగ్రహములు, మందిరములు, గోపురములు, శివలింగములు మొదలగువానియందు కారణములేకుండ బీటలు తీయడము, పగలడము, నడవడము, చెమటలు పట్టడము, కన్నీరు రావడము, శబ్దములు రావడమును లింగవికృతము అంటారు. ప్రస్తుతకాలములో మనము ఇలా సంభవించే వాటిని తరచు మీడియాద్వారా చూస్తుంటాము. ఇవన్నీ మనకు రాబోయే కష్టములకు సూచనలే కానీ చమత్కారములు కావు. దేశమునకు మరియు దేశాధిపతికి ఇవి అరిష్టమును సూచిస్తాయి.

2.                అగ్నివైకృతము - నిప్పునుండిమంటు పుడుతుంది. అదే నిప్పులేకుండ మంట పుడితే లేక నిప్పు ఉన్ననూ జ్వాల రాకున్న దానిని అగ్ని వికృతము అంటాము

3.                వృక్షవైకృతము – వృక్షములకు ఋతువు కాని ఋతువులో ఫలములు మరియు పుష్పములు కనిపించిన, ప్రారంభదశలోనే ఫలములు పుష్పములు కనిపించిన, వృక్షములనుండి ఏడుపు, నవ్వు, శబ్దములు వినిపించిన దానిని వృక్షవైకృతము అంటారు. ఇది దేశానికి అరిష్టప్రదము (సూచకము)

4.                సస్యవైకృతము – అతిశయముగ దిగుబడి, పుష్పములు కవలలుగ సంభవించడము సస్యవైకృతమనబడుతుంది. అలా జరిగితే అది రాబోయే యుద్ధమును సూచిస్తుంది.

5.                వృష్టివైకృతము – అనావృష్టి దుర్భిక్షమును, అతివృష్టి దుర్భిక్షము మరియు ఇతరదేశములనుండి భయమును, ఋతువుకాని ఋతువులో వర్షము రోగములను, మేఘరహితవర్షము దేశాధిపతికి కీడును సూచిస్తాయి. దీనినే వృష్టివైకృతమంటారు.

6.                నదులు క్షీణించడం , ప్రవాహదిశమారడం వంటివి జల వైకృతములు

7.                ప్రసవవైకృతము – ఐదుగురు లేక అంతకన్న ఎక్కవ సంతానము ఒకే కాన్పులో కలగడం, అపరిపక్వ దశలో లేక కాలాతీతము అయిన పిదప ప్రసవించడము దేశము మరియు వంశమునకు అరిష్టప్రదములని గ్రహించాలి.

8.                చతుష్పదవైకృతము – వేరు వేరు ప్రజాతుల పశువులు సమాగమమును పొందుట, ఒక జాతి పశువుపాలు వేరు జాతి పశువు పిల్లలు తాగడం, సమయము కాని సమయమునందు ఆసక్తిని కలగడం వంటివి చతుష్పదవైకృతములు. ఇవి అశుభసూచకములు.[2] 

9.                స్థిరప్రవృత్తి కలవి నడవడం నడిచే లక్షణము ఉన్నవి స్థిరములవడం వాయవ్యవైకృతము.

10.             మృగములు వాని ప్రకృతికి విరుద్ధముగ జనులు సంచరించు స్థానములలో సంచరించడం, రాత్రిచరములు పగలు, దినచరములు రాత్రియందు సంచరించడము, పశుపక్ష్యాదులలో స్వభావవిరుద్ధ లక్షణములు కనిపించడము మృగపక్షివైకృతము.

11.             పిచ్చివారిమాటలు, పిల్లలమాటలు, స్త్రీలవచనములు అసత్యములు కాజాలవు. కావున వారి ముఖమునుండి వెలువడిన అశుభవచనములు రాబోవు అశుభమును సూచిస్తున్నవని గ్రహించాలి.[3]

12.             విభిన్న ఋతువులలో సంభవించే ఉత్పాతములు ఆయా ఋతువులలో కలిగెనేని అవి శుభకరములే కానీ అశుభసూచకములు కావు.

ఇక్కడ పేర్కొన్న ప్రకతి వైపరీత్యములన్నియూ మనము ఇంచుమించు చూచుచున్నవే. అవి కనిపించినపుడు లోకకల్యాణార్థము శాంతిని చేయించవలెనన్నది స్పష్టార్థము. దానికన్న ముందు గ్రహించవలసిన విషయము మరొకటున్నది. ఈ అనర్థములకు కారణము మనిషిలో పాపప్రవృత్తి పాపకార్యములందు అనురక్తి పెరగడమే. కావున శాంతితో బాటు ధర్మమార్గములో నడచినేని ఆ ధర్మమే లోకమును రక్షించగలదు.

అన్నీ తెలిసినా మనిషి తప్పు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది అతని నైజము. ఈ నైజమును మన అదుపులో ఉంచుకోవడానికే భారతీయసంప్రదాయములో యోగశాస్త్రము వంటివి ఉద్భవించాయి. ఒకానొక సమయములో సుసమాజస్థాపనకు దోహదపడినవీ సాంప్రదాయబద్ధమైన సంస్కృతిలో అంతర్భాగములైన సంస్కారములే.

ఈ మానవతప్పిదాలు లేక అపరాధములను మనము వేరే మార్గములో కూడ తీసుకొనవచ్చును. మనిషి అపరాధమువలనే ప్రకృతివైపరీత్యములు సంభవిస్తున్నాయని చెప్పబడిన వాక్యమును మనము నేటి కాలుష్యసందర్భములో తీసుకోవచ్చును. ఈ.చెత్త, మరియు పంచమహాభూతముల ప్రదూషణమే చాలా వరకు అనర్థముల కారణము అన్నది నిర్వివాదాంశము. అనగ అది నేటికి 1500 సంవత్సరాలు పూర్వము వరాహాచార్యుని సమయమైనా సరే, నేడు విజ్ఞానయుతమైన సమాజమైనా సరే మనషి మనుగడకు ఇబ్బందికలిగించే పరిస్థితులన్నీ మనిషి కల్పితములే.

మన కనీసధర్మము¿¿¿

రాబోయే ఆపదలను సూచించడానికి ప్రకృతివైపరీత్యములు ఏర్పడతాయని మనము ఇంతవరకు చర్చించుకున్న విషయము యొక్క తాత్పర్యము. వానినుండి మనము మనను మన సమాజమును రక్షించాలనుకుంటే తత్ప్రతీకారచర్యలు ఆచరించవలసినదే శాంతికర్మలు మాత్రమే వానిని నివారించగలదన్నది నిర్వివాదాంశము.

శాంతికర్మ అనునది ఎవరికర్తవ్యమనే మీమాంసను వదలి దీనిని ప్రతిఒక్కరి కర్తవ్యముగా భావించాలి. దీనికి భారీ ఏర్పాటులు అవసరమే లేదు. మన కనీసకర్తవ్యములను మనము దైనందిన జీవితములో విస్మరించకుడ ఆచరించడమే మనము నిర్వహించే అతిపెద్దశాంతికర్మ.

సశేషము…….



[1]     అనిమిత్తభంగచలనస్వేదాశ్రునిపాతజల్పనాద్యాని

          లింగార్యతనానాం నాశాయ నరేశదేశానామ్. బృహత్సంహిత

[2] .   యోనిషుయదాయాంతి మిశ్రీభావః ప్రజాయతే

          ఖరోష్ట్రహయమాతంగా మనుష్యా వా న సాధు తత్. గర్గః

[3]     ఉన్మత్తానాం చ యా గాథాః శిశూనాం యచ్చ భాషితమ్

          స్త్రియో యచ్చ ప్రభాషన్తే తస్య నాస్తి వ్యతిక్రమః.. బృహత్సంహిత

 



 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech