Sujanaranjani
           
  శీర్షికలు  
       ఎందరో మహానుభావులు       

నాద బ్రహ్మ త్యాగరాజు

 

 

 - రచన : తనికెళ్ళ భరణి      

 

అంబ నవాంబోజ్వల కరాంబుజ శారద తన వీణయైన కఛ్ఛపిని ఒక్కసారి మీటింది. ఆ నాదం త్రిలోకాల్ని సంచరించి.. నారద మహాముని మనస్సుని స్పర్శించి.. ఆయన వీణయైన మహతీ నాదంతో కలిసింది. ద్విగుణీకృతమైన నాద ద్వయం వల్మీకి మహర్షి ఆత్మని ఆవాహన చేసుకుని త్రిగుణాత్మకమైన తేజోపుంజం ఒకటి.
సత్యలోక..
తపోలోక..
మహర్లోకాలను దాటుకుంటూ భూలోకానికి వచ్చి కాకర్ల రామబ్రహ్మం సతీమణి అయిన సీతమ్మ గర్భం జొచ్చింది.
అన్నమయ్య నందకం అంశతో జన్మిస్తే..
త్యాగయ్య సరస్వతీ ... నారద.. వాల్మీకి అంశలతో సర్వజిత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టినాడు తిరువారూరు లో జన్మించారు.
తిరువారూర్ లో వెలసిన శివుడి పేరు త్యాగరాజు. ఆయన అనుగ్రహంతో పుట్టినవాడు కనుక తమ బిడ్డకు త్యాగరాజు అనే పేరు పెట్టారు.

పుట్టగానే బిడ్డ ఆరున్నొక్క రాగం ఆలపించాడు.
అమ్మా అని పిలిచాడో రామా అనే పిలిచాడో ఆ పరమేశ్వరుడికే ఎరుక!
చనుబాలు...షడ్జమం.. స
ఉగ్గుపాలు...రిషభం...రి
లాల...గాంధారం...గ
జోల..మధ్యమం...మ
నిదుర....పంచమం...ప
మెలకువ...దైవతం...ద
నవ్వు...నిషాదం...ని

సంగీతమంతా పాపై పుట్టి ఆ ఇంట్లో పారాడుతున్నట్లుండేది. పాకుతూ పాకుతూ వెళ్ళి రామ పంచాయతనంలోని రాముడి కాళ్ళు పట్టుకున్నాడు.

పట్టి విడువ రాదూ నా చేయి పట్టి విడువ రాదూ..

శ్రీ రాముడు నవ్వుకునీ గడుసువాడే , పట్టుకున్నది తనూ వొదలద్దంటున్నది నన్నూ..అని ఓరగా సీతమ్మ వారి కేసి చూశాడు.

వాడు నా బిడ్డ అంది గర్వంగా!
త్యాగయ్య కన్నీటి బొట్టు అమ్మవారి పాదల మీద చిట్లీ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అన్నది త్యాగరాజాత్మ!
తల్లి బాల్యంలోనే త్యాగు కి
జయదేవుడి అష్టపదులు
రామదాసు కీర్తనలూ..
అన్నమాచార్యుల సంకీర్తనలూ నేర్పింది.
తండ్రి పోతన భాగవతాన్ని నూరిపోసాడు. అందుకేనేమో పోతనలోని లేతదనం, కొత్తదనం, మెత్తదనం త్యాగయ్య వంటకూడా పట్టాయి. అందుకే ఎనిమిదో ఏటో నమో రాఘవాయా అంటూ మొట్టమొదటి దివ్యనామ సంకీర్తనం చెశాడు.
నారద, శారద, వాల్మీకాదులు శుభం భూయాత్.. అంటూ ఆశీర్వదించారు.
త్యాగరాజు కంఠ మాధుర్యాన్ని గ్రహించిన తండ్రి... తులజాజీ మహారాజు చేత అర్ధ సింహాసన గౌరవాన్ని పొందిన శోంఠి వెంకట రమణయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి, వీణ్ణి మీ శిష్యుణ్ణి చేసుకొమ్మని పాదాల మీద పడేసాడు.

శొంఠి వారు ఇంటిపేరు మటుకే ఘాటు, మనసు చక్కెర పొంగలి. శొంఠి వెంకట రమణయ్య దక్శిణామూర్తి స్వరూపమైతే త్యాగరాజు అపర సుబ్రహ్మణ్యేశ్వరుడు.
ఇక సంగీత రత్నాకర మధనం ఆరంభమైంది.
ఇంతా చేస్తే సంగీత సంద్రమంతా... అగస్త్యుడిలా ఆపోసన పాట్టేశాడు!!
గాత్రం పచ్చిదనం ముదిరి పండింది.
గురువు గారి పాదాభివందనం చేసుకుని మేనమామైన వీణ కాళహస్తయ్య దగ్గర వీణావాదన సాధన..
కొండలు అరిగించుకునే వాడికి కుండలు ఏ పాటి!
త్యాగరాజు ఎంత సంగీతం నేర్చుకున్నా ఇంకా కొన్ని సందేహాలు ఉండిపోయాయి. ఆ బ్రహ్మ రహస్యాన్ని విప్పాలంటే బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడికే చెల్లు! అంచేత ఆయనే స్వయంగా ఓ యతి వేషధారియై వచ్చి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు. స్వరార్ణవం చదువుతోంటే త్యాగరాజు హృదయంలో సప్త స్వరాలు సప్త సాగరాలై పొంగి కళ్ళవెంట ధారాపాశమై గొంతు గద్గదమై, శ్రీ నారద మౌనీ గురు రాయా కంటి ఏనాటి తపమో గురు రాయ అంటూ పాడాడు.
సరిగ్గా ఇదే సమయంలో మరుదనల్లూరు మఠంలోని ఓ సన్యాసి వచ్చి త్యాగరాజుకి తారక మంత్రోపదేశం చేశాడు.
త్యాగరాజు 18వ ఏట పార్వతమ్మ అనే కన్యతో పెళ్ళైంది. కాని ఆవిడ రెండేళ్ళకే పరమపదం చేరటం వల్ల ఆవిడ చెల్లెలైన కమలాంబతో ద్వితీయ వివాహం చేశారు. ఇల్లాలైతే అమిరింది గాని ఇల్లా, వాకిలా? పొద్దుగూకులూ రామనామంలో మునగానాం, తేలానాం.. ఇంటిల్లి పాదికీ అన్న సంపాదనే గాని అణా సంపాదన లేదు. అన్నగారు జపేశానికి ఒళ్ళు మండుకొచ్చేది. ఇంత విద్యా పెట్టుకుని ఏ రాజాశ్రయమో పొందితే కనకాభిషేకాలు, గజారోహణలు చేస్తారు గదా వెర్రివాడా!
రామనామం కూడెడుతుందా, గుడ్డెడుతుందా అంటూ విసుక్కున్నాడు, తిట్టాడు, కొట్టబోయినంత పనిచేశాడు! ఆఖరికి త్యాగరాజ స్వామి ఆరాధ్యదైవమైన రామ పంచాయతనం మీద దృష్టి పడింది. అదీ వాడు చెడిపోవడానికి మూల పురుషుడు వీడూ! అంటూ ఓ అర్ధరాత్రి ఆ విగ్రహాల్ని పట్టుకెళ్ళి కావేరీ నదిలో గిరవాటేసి చక్కా వచ్చాడు. మర్నాడుదయం రమించు వారెవరురా నిను వినా రఘోత్తమా అంటూ పూజ చేసుకోవడానికి వచ్చిన త్యాగరాజుకి రాముడు కనిపించలేదు. సీతా కనిపించలేదు. పీఠం ఖాళీ.. అంతే హృదయం శూన్యం.

గుండె ఉంది. చప్పుళ్ళేదు.
మెదడుంది.. ఆలోచన్లేదు.
కళ్ళున్నాయి..చూపులేదు..

గుండె గాజుగోళంలా బద్దలైపోయి ఆత్మంతా పెంకులు గుచ్చేసుకున్నాయి. మాటలేదు. అని మౌనమూ గాదు. అప్రయత్నంగా కళ్ళ వెంట నీరు.. నన్ను వొదిలి వెళ్ళిపోయావా, రామా, నువ్వు లేకుండా బతికెయ్యమంటావా నన్ను. అంటూ అహోరాత్రులూ విలపించాడు. త్యాగరాజు బాధ చూళ్ళేక రాముడు స్వయంగా తన విగ్రహాల్ని వెదికి కావేరీ నది ఒడ్డున పెట్టి మాయమయ్యాడనుకుంటా.

అంతే దొరికిన విగ్రహాల్ని గుండెకి హత్తుకుంటూ కనుగొంటినీ శ్రీరామునీ నేడూ..అంటూ కరువుదీరా పాడుకున్నాడు.

ఇదిలా ఉండగా తంజావూరు ప్రభువైన శరభోజీ మహారాజు త్యాగరాజుని తమ కొలువులో ఆస్థాన విద్వాంసుడిగా ఉండి తనని కృతార్ధుడ్ని చేయమని అర్ధిస్తూ అమూల్యమైన వస్త్రాలు, ఆభరణాలు పంపాడు. కానీ వాటన్నింటినీ తృణప్రాయంగా ఎంచిన త్యాగరాజు ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా? నిజముగ తెలుపు మనసా?..’ అనే కీర్తన పాడి ఆహ్వానాన్ని తృణీకరించారు.

అంతే! ఒక్కసారి రాజసం బుసలు కొట్టింది.
నా అంతటి వాణ్ణి కాదంటాడా? త్యాగరాజుని కాళ్ళు చేతులు విరిచి కట్టి నా దగ్గరికి ఈడ్చుకు రండి. అంటూ ఆదేశించాడు శరభోజి. రాజాజ్ఞ అయింది.
కత్తులు కటార్లతో దండనాథులు బయల్దేరారు.
కాని, శివుడాజ్ఞ కాలేదు!
త్యాగయ్యకి చీమ కూడా కుట్టలేదు.
కాని శరభోజి మహారాజు కడుపులో శూలం పెట్టి పొడుస్తున్నట్లు..
మెలికలు తిరిగిపోతున్నాడు రాజు! అల్లాడిపోతున్నారు రాజ వైద్యులు.
ఎవరో విజ్ఞులు.. బహుశా ఉత్తముడైన త్యాగరాజుల వార్ని బంధించి తెమ్మన్నారు. కనక... అర్ధోక్తితో ఆపాడు.. అర్ధమైంది శరభోజి మహారాజుకి.
లెంపలు వాయించుకున్నాడు. మనసులోనే ఆ నాదబ్రహ్మ కు సాష్టాంగ పడ్డాడు.
కడుపునొప్పి మాయమైంది.
తను చేసిన తప్పుకి మనసా వాచా పశ్చాత్తాప పడి, తనే స్వయంగా త్యాగరాజ స్వామి సన్నిధికి చేర్తి, ఆయన స్నేహం సంపాదించి ఆయన పాడుతుంటే పక్కనే కూర్చుని వినీ తనూ అనుకున్నాడు.
నిధి చాలా సుఖమా అని..
త్యాగరాజ స్వామి వద్ద అలా చాలా మంది శిష్యులుండేవారు. ఆయన ఆశువుగా, అర్ధ్రంగా పాడుతుంటే పాడినవి పాడినట్లు పల్లవి ఒకరు, అను పల్లవి ఒకరు, చరణాలు ఒకరు వ్రాసుకునేవారట. అలా దాచడం వల్లే మనకీమాత్రం కిర్తనలైనా దొరికాయి.

(అన్నమాచార్యుల వ్వారి సంకీర్తనలు రాగి, ఇత్తడి ఫలకాల మీద ఉంటే దొరికినవి దొరికినట్టు రాగి బిందెలు, ఇత్తడి చెంబులు చేసుకుని...సంకీర్తనలకి నువ్వులూ నీళ్ళూ
ఒదిలిన జాతి మనది..లేకపోతే ఆయన రాసినవి 32 వేలు....మనకి దొరికినవి??)

త్యాగయ్య గారు మరొక గొప్ప పని చేశాడు. తన శిష్య బృందాన్ని వేసుకుని వీలైనన్ని క్షేత్రాలు తిరుగుతూ, వీలైనంత మంది దేవుళ్ళ మీద కీర్తనలు రాసాడు. కంచి, వాలాజీపేట, శ్రీరంగం.. నాగపట్టణం, తపస్తీర్ధం, ఘటికాచలం, పుత్తూరు.. తిరుపతి! తిరుపతి చేరే సరికి మూలవిరాట్టుని మూసేస్తూ తెర!
అప్పుడు త్యాగయ్య
తెరతీయగ రాదా నాలోని
తిరుపతి వెంకటరమణా
మత్స్రరమను తెరతీయగ రాదా
అని పాడే సరికి, తెర తొలగి పోయిందని బతిహ్యం!

ఆ తర్వాతే శ్రీ వేంకటేశ్వరుడి దివ్య మంగళ విగ్రహాన్ని చూసి నోట మాటరాక..
వెంకటేశు నిను జూడ పదివేల కనుల కావలెనయ్యా అంటూ ఆనంద భాష్పాలు రాల్చారు.
త్యాగరాజ స్వామి రచించిన కీర్తనల్లో ఖ్యాతి పొందిన పంచరత్నాలు చాలా ఉన్నాయి. ఘనరాగ పంచరత్నాలు, నారద పంచరత్నాలు, తిరువత్తియూరు పంచరత్నాలు, కోవూరు పంచరత్నాలు, నాగపుర పంచరత్నాలు, శ్రీరంగ పంచరత్నాలు..
వీటిలో ఘనరాగ పంచరత్నాలు ప్రసిద్ధాలు!

1. జగదానంద కారకా - నాట రాగంలో
2. దుడుకుగల నన్నే దొరా - గౌళ రాగంలో
3. సాధించెనే ఓ మనసా - ఆరభి రాగంలో
4. కన కన రుచిరా- వరాళి రాగంలో
5. ఎందరో మహానుభావులు - శ్రీరాగం

ఎందరో మహానుభావులు అన్న కృతిని బహుశా తెలుగు వారందరూ వినే ఉంటారు. మామూలుగా వినడం కాదు. తమిళనాడులోని తిరువయ్యూరులో ఆయన సమాధి అయిన చోట ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళెవరయినా ఆరాధనోత్సవాలకి హాజరై పంచరత్న కిర్తనలు పాడటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చెంబై వైద్యనాథ భాగవతార్ లగాయితు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి దాకా, జేసుదాసు నుంచి తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ దాకా తమ తమ గాత్రల్నీ, వాద్యాల్నీ వినిపించిన వారే. కచేరికి లక్ష రూపాయలు తీసుకునే విద్వాంసుడైనా సరే తన టికెట్ తను కొనుక్కుని అక్కడికెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తారు. నిజంగా ఆ రోజుల్లో అక్కడికెళ్తే హోరెత్తే సంగీత సముద్రం. స్వరార్ణవం.. అక్కడ కనిపిస్తుంది.
వీణలు, మృదంగాలు, కంజీరాలు, వాయులీనాలు, ఘటాలు, మోర్సింగులు... అదో సంగీతానుభూతి.

మొన్న అనుకోకుండా తంజావూరువెళ్ళడం, అక్కడ నుంచి కావేరి నది ఒడ్డున త్యాగరాజ స్వామి వారి సమాధి చూడ్డం, అక్కడ తెలుగు లిపిలో ఉన్న కిర్తనలు చూసి పులకరించి పోతూ గట్టిగా పాడుకుంటూ కన్నీళ్ళు కార్చడం, త్యాగరాజస్వామి వారి సమాధిమీదున్న చిటికెడు విభూదిని నోట్లో వేసుకోవడం, ఆ మహానుభావుడి ఆత్మకి సాష్టాంగ ప్రమాణాలాచరించడం స్వీయానుభవం!

ఆ ఎదురుగుండానే వినమ్రంగా చేతులు జోడిస్తూ ఆ సమాధి మీద ఆలయం నిర్మిచడానికి తన యావదాస్తిని ధారపోసిన గాయని బెంగుళురు నాగరత్నమ్మ విగ్రహానికి కూడా దణ్ణం పెట్టుకున్నాను.

నేను త్యాగరాజ స్వామివారి నిర్యాణం గురించి ప్రస్తావించలేదు. ఎందుచేతంటే, కర్ణాటక సంగీతం సజీవం. దానికి మరణం లేదు. అంచేతే త్యాగరాజస్వామి చిరంజీవి.
చిలకలగూడా రైల్వే క్వార్తర్స్ లో ఉండగా ప్రఖ్యాత వేణునాద విద్వాంసుడు టి.ఆర్. మహాలింగం గారి శిష్యుడు శ్రీ చంద్రశేఖరన్ గారు, గుళ్ళో త్యాగరాజస్వామి ఉత్సవాలు జరుగుతుంటే అందరూ పడుకున్నాక... త్యాగరాజుల వారి మెళ్ళో వేసిన గారెలదండ చంద్రశేఖరన్ గారి అబ్బాయి, నేను దొంగతనం చేసాం. దొంగతనమైనా ఆ మహానుభావుడి ప్రసాదం తిన్న పుణ్నమేమో ...
 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech