Sujanaranjani
           
  శీర్షికలు  
  దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - 13
 

 - రచన: ముత్తేవి రవీంద్రనాథ్

 
 

పలు పాశ్చాత్య దైవ సిద్ధాంతాల సవిమర్శక పరిశీలనలో భాగంగా మనమిప్పుడు జర్మన్ తత్త్వవేత్త  జి .డబ్ల్యు.ఎఫ్.హెగెల్(1770-1831) ప్రతిపాదించిన 'అఖండ భావవాదం'(Absolute Idealism) గురించి కూడా స్థూలంగా పరిశీలిద్దాం. సిద్ధాంతం ప్రకారం  ఒక అఖండాత్మ(Absolute Self) లేక శుద్ధ చైతన్యం (Pure Consciousness) మాత్రమే అంతిమ సత్యం(Ultimate Reality) .అది కాలానికి అతీతమైనదే అయినా వివిధ అభివృద్ధి  దశలలో నిరంతర పరిణామానికి లోనవుతుంది. అంతిమంగా   విశ్వాత్మ స్వస్వరూప జ్ఞానం పొందుతుంది.మానవుడి హేతు దృష్టిలోనే విషయం మనకు ద్యోతకమవుతుందిఅనంతమూ,అనాదీ,అఖండమూ అయినట్టి సకల పరిపూర్ణమైన శాశ్వతాత్మ ఒక్కటే సత్యం. విశ్వం మొత్తం  అఖండాత్మలోనే ఇమిడివుంది. దానికి వెలుపల ఏదీ లేదు. ఆత్మ, ప్రకృతి వేర్వేరు అంశాలు కావు. అవి శుద్ధ చైతన్యం యొక్క రెండు దశలు మాత్రమే.ఆత్మ లేక మనస్సు ప్రకృతిగానూ, ప్రకృతి ఆత్మగానూ ఒక దశ తరువాత మరో దశలో పరిణామం చెందుతూ ఉంటుంది. అఖండ స్వరూపం ఒక జడపదార్థం కాదు.అది అత్యంత చైతన్యవంతమైనది. ఒక దశలో అదే ప్రకృతి.   తరువాత దశలో అదే మనస్సు. విశ్వంలో అది కాని వస్తువేదీ లేదు.అన్నీ దానిలోనే ఉన్నాయి. విశ్వాత్మను 'హేతువు' (Reason)అనీ పిలవొచ్చు.అది మన మనస్సులలోనూ (Subjective) ఉంది. మనస్సుల వెలుపలా (Objective) అది సత్యమే.

                    విధంగా Reason మరియు Reality వేర్వేరు  కాదు.ఒక్కటే. విశ్వాత్మను మనం God Thinking (ఆలోచించే భగవంతుడు) అని చెప్పుకోవచ్చు.చింతనా ధోరణికి సంబంధించిన నియమాలు తెలుసుకోగలిగితేనే మనకి అంతిమ సత్యాన్ని గురించిన నియమాలు బోధపడతాయి.ప్రకృతి అని మనం పిలుస్తున్నది చింతన యొక్క బహిస్స్వరూపమే (Thought Externalised).       విశ్వాత్మ తనను తాను వ్యక్తం చేసుకునే బాహ్య  వ్యక్తీకరణ రూపమే ప్రకృతి.విశ్వాత్మకు ప్రకృతి రూపంలో వ్యక్తం కావడం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు.అది మళ్ళీ తిరిగి మానవుడి ఆత్మ చైతన్యం రూపంలో మరింత పరిపూర్ణంగా వ్యక్తీకరించబడి,కళలు,మతం, తత్త్వ శాస్త్రం మొదలైన వాటి ద్వారా మరింత పరిపూర్ణ దశకు చేరుతుంది.

              విశ్వం గతి లేక గమనం కలిగి ఉంది. విశ్వంలో జడ పదార్ధం అంటూ ఏమీ లేదు.కదలని ఒక శిలలో కూడా పరమాణువులు ; వాటిలో పరమాణు కేంద్రకం(Nucleus) చుట్టూ ఎల్లప్పుడూ పరిభ్రమించే ఎలక్ట్రాన్లూ (Electrons) ఉంటాయి. అందుకే విశ్వం మొత్తం గతి శీలం లేక గమన శీలం.  గమనానికి గమ్యం ఏమిటి? అంతకంటే ముందరి దశ కంటే అభివృద్ధి దశకు చేరుకోవడమే.అలా ప్రకృతే కాదు;మానవ సమాజం, మానవ మేధస్సు కూడా  పరిణామశీలమైనట్టివే

పరిణామం విశ్వం యొక్క సహజ లక్షణం. గతి తర్కాన్ని మనం అర్థం చేసుకోగలిగితే విశ్వంలోని అంతిమ సత్యాన్ని-విశ్వాత్మను అర్థం చేసుకోగలిగినట్లే. పరిణామ క్రమంలో అవ్యక్త, అపరిణత,అపరిపూర్ణమైన ఏకరీతి (Homogeneous) పదార్ధం అభివృద్దిచెంది,వైరుధ్యభరితమై, ఒకదానికొకటి పొసగని భిన్నరూపాలుగా విడివడి, ఒకదానితో మరొకటి ఘర్షించి,

అంతిమంగా 'భిన్నత్వంలో ఏకత్వం 'లా ఒకే వస్తువుగా రూపొందుతాయి.అలా అవ్యక్తమైన ఒక పదార్ధం(Abstract Substance)  అంతిమంగా ఒక  స్ఫుటమైన వాస్తవికత(Concrete Reality)గా రూపొందుతుంది. ఇదే ప్రకృతి రహస్యం.దీనినే గతి తర్కం(Dialectics) లేక గతితార్కికత అంటారు.

                    గతి  తార్కిక పద్ధతి (Dialectical method) లో మూడు దశలుంటాయి.అవి: Thesis-Antithesis-Synthesis.ఒకటి ఉండడం(Thesis);దానినుంచే దానికి వైరుధ్యం పుట్టుకురావడం(Antithesis); రెంటి ఘర్షణ మరో ఉన్నత రూపంగా అది పరిణతి చెందడానికి దారితీయడం(Synthesis). సంశ్లేషిత పదార్థమే(Synthesised Thing) మరొక గతితార్కిక ప్రక్రియకు నాందిగా అంటే thesis గా మారి, తదుపరి గతి లేక పరిణామం కొనసాగుతుంది. ప్రక్రియ మొత్తంలో చాలక శక్తి (Motive Force) భిన్నమైన రెండు శక్తుల మధ్యగల వైరుధ్యమే.అలా Position-Oppositio -Combination అనే మూడు దశలూ ప్రకృతి, సమాజం, మానవ మేధస్సు- మూడింటి పరిణామాన్ని నిర్దేశించే దశలు. భిన్నాభిప్రాయం(Contradiction) అనేది చర్చలో పురోగతికి మూలం. నేను  ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ఎవరన్నా ఖండించడమో, సవరణలతో దాన్ని మరింత సంపద్వంతం చేయడమో,లేక దానిలోని అసంగత ,  అశాస్త్రీయ అంశాలు తొలగించి దాన్ని మరింత పరిపుష్టం చెయ్యడమో  చేయనట్లైతే చింతనా స్రవంతిలో ప్రగతి ఉండదు.'వాది- ప్రతివాది' మధ్య భిన్నాభిప్రాయమే చర్చను ముందుకు తీసుకెళ్ళి సత్యాన్వేషణను  ఫలప్రదం చేస్తుంది.ప్రకృతి,మానవ సమాజం,

మానవ మేధస్సు-- మూడింటి అభివృద్ధి కూడా గతి తార్కిక నియమం మీదే ఆధారపడి ఉన్నది.ఒక విత్తనం విత్తనంగానే ఉండిపోతే అది మొలకెత్తదు. విత్తనం(Seed) లో దానికి విరుద్ధ లక్షణాలు బయల్దేరి ముందుగా అది వేరొక పదార్థంగా (Non-Seed) గా మారితేనేగానీ అది ఒక మొలకెత్తే విత్తనం(Sprout)గా రూపొందదు. అలా మొలకెత్తే ప్రక్రియ ముందుకు సాగుతుంది.A అనేది  A  గానే ఉన్నంతవరకూ పురోగతి ఉండదు.అది ఒక జడపదార్థమే. కాబట్టి దాని నుంచే  ముందుగా ఒక  విరుద్ధ స్వభావం కల non-A  ఉద్భవించి రెంటి వైరుధ్యం కారణంగా అంతిమంగా మరో కొత్త పదార్ధం రూపొందుతుంది. ఇదే పరిణామం యొక్క కీలక సూత్రం

            అఖండాత్మ(Absolute Self) లేక శుద్ధ చైతన్యం(Pure Consciousness) మరింతగా పరిణతి చెందుతూ స్వ-స్వరూప జ్ఞానం దిశగా ముందుకు సాగడమే ప్రగతి లేక పరిణామం యొక్క  మూల లక్షణం.మనం ఇంతకు ముందు అనుకున్నట్లే చైతన్యం కళాకారుల కళాకృతులలోనూ , తాత్త్వికుల తత్త్వ చింతనలోనూ పరిపూర్ణత సంతరించుకుని పరిమళిస్తుంది.అలా విశ్వం మొత్తం భగవంతుడు లేక శుద్ధ చైతన్యం యొక్క వ్యక్తీకరణే.భౌతిక పదార్థంగా మనం అనుకుంటున్న ప్రకృతి శుద్ధ చైతన్యం యొక్క బహిస్స్వరూపమే.అది శుద్ధ చైతన్యం యొక్క  పరిణామక్రమంలో ఒక దశ మాత్రమే.తత్త్వశాస్త్రం ద్వారా మానవుడు వివిధ గతి తార్కిక దశలలో పురోగమిస్తున్న అఖండ చైతన్యం యొక్క పరిణామ శీలతను గ్రహించగలుగుతాడు. క్రమంలో మానవుడు హేతుబద్ధతనూ,ఆత్మ చైతన్యాన్నీ సంతరించుకుంటాడు. అలాంటి  హేతుబద్ధత గల సజీవవిశ్వంలో మానవుడు తన స్థానాన్ని చూసి గర్విస్తాడు. మానవులు తమ  సాంస్కృతిక జీవనం (Cultural Life) ద్వారా   విశ్వం సైతం తన స్వ-స్వరూప జ్ఞానాన్నిపొందగలిగేటందుకు దోహదపడతారు. ఇదీ స్థూలంగా హెగెల్ దైవసిద్ధాంతం.

                       హెగెల్ దైవ సిద్ధాంతం ఆధునిక యుగంలో అత్యంత ప్రభావవంతమైన సిద్ధాంతంగా విమర్శకుల ప్రశంసలు పొందింది.భారతీయ వేదాంత దర్శనాన్ని వ్యాఖ్యానించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్,అరవింద ఘోష్   వంటి గొప్ప తాత్త్వికుల చింతనా ధోరణి పై సైతం హెగెల్ సిద్ధాంతం యొక్క ముద్ర బలీయంగా ఉంది

 హెగెల్ దైవ సిద్ధాంతం పలువురు సమకాలీన,అనంతరకాలపు తాత్త్వికుల  తీవ్ర విమర్శలకు గురైంది.

హెగెల్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అంతా ఒక క్రమ పద్ధతిలో  నియమబద్ధంగా ఉంది. దానికి ఒక హేతుబద్ధమైన అమరిక ఉంది.ఔచిత్యం కూడా ఉంది.అయితే విశ్వంలో ఉన్న హేతు రాహిత్యం,వక్రీభావనాల(Aberrations) మాటేమిటి? వాటిని వేటినీ హెగెల్ పట్టించుకోనేలేదు. కారణంగా హెగెల్ సిద్ధాంతం పలు విమర్శలపాలై Panlogism( విశ్వమంతా లోగోస్ అనే నియమ మేరకు నడుస్తున్నదనే సిద్ధాంతం) అని విమర్శించబడింది. విశ్వంలో  చాలా సందర్భాలకు గతి తార్కిక సూత్రాలను హెగెల్  బలవంతంగా అనువర్తింపజేసినట్లుగా ఉన్నదని పలువురి విమర్శ.మనస్సు యొక్క హేతుదృష్టికి హెగెల్ అమిత ప్రాదాన్యమిచ్చాడు.ఆయన భావన ప్రకారం మనస్సంటే హేతువు మాత్రమే.కాని మనస్సుకు ఒక్క హేతు దృష్టే కాదు;అనుభూతులు(Feelings) ఉంటాయి; అపరిమితమైన ఇచ్చ(Will) కూడా  ఉంటుంది.హెగెల్ వీటిని విస్మరించిన కారణంగా ఆయన సిద్ధాంతం లోపభూయిష్టమైంది.మనస్సుకున్న ఇచ్చ అనే మరో దృగంశానికి ప్రాధాన్యమిచ్చిన షోపెనార్ వంటి తత్త్వవేత్తలు ఐచ్చిక భావవాదం(Voluntaristic Idealism) అనే మరో భావవాద సిద్ధాంతానికి బీజావాపనం చేశారు.విలియం జేమ్స్ అనే తత్త్వవేత్త హెగెల్ సిద్ధాంతాన్ని ఇలా విమర్శించాడు.' సిద్ధాంతం  అంతటా ఏకత్వం, హేతుత్వం , నియమబద్దత   కలిగిన  ఒక మూస(Block)  విశ్వాన్ని మనకి  ఇస్తుంది. వాస్తవ ఉద్దేశాలు,వాస్తవ లక్ష్యాలు,వాస్తవ స్వేచ్చ,నిజమైన ఉత్తమ లక్ష్య సాధనలను  మాత్రమే కాదు;నిజమైన భగవంతుడిని కూడా అది విశ్వాన్నుంచి  లాగిపారేసింది. విశ్వంలో  ప్రతిదీ అఖండాత్మ యొక్క ప్రకర్షే అయినప్పుడు ఇంకా వ్యక్తుల స్వేచ్చకూ,వారి విజయాలకూ,ఉన్నత,ఉత్తమ లక్ష్య సాధనలకూ విలువేం ఉంటుంది?అవన్నీ అర్థరహితమైనట్టివి కావడం లేదా? '

        అపారమైన  వస్తు సంపద కలిగిన భౌతిక ప్రపంచాన్ని గురించి ఆయన సిద్ధాంతంలో పనికొచ్చే ఒక్క ముక్క కూడా లేదు. ధర్మసాధనకైనా ,తత్త్వ విచారణకైనా శరీరం, దాని భౌతిక అవసరాలు కూడా ముఖ్యమైనవే. ముందు మనం శారీరకంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే ధర్మసాధనైనా చెయ్యవచ్చు.అందుకే  'శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్ 'అనే ఆర్యోక్తి ఏర్పడింది.పేదలు,  ఆపన్నులు,అణగారిన వర్గాల బాధలకు పరిష్కారం కనుగొనడమే కదా తత్త్వచింతనకైనా లక్ష్యం? అలాంటివేవీ ఆయన సిద్ధాంతంలో మచ్చుకైనా లేకపోవడమేకాక  ఆయనసలు భౌతిక ప్రపంచం తీరుతెన్నుల్ని ఏమాత్రం అధ్యయనం చేసినట్లు లేదు. బాధ్యతను పందొమ్మిదో శతాబ్దపు తత్త్వవేత్తలు తలకెత్తుకుని తమ మహత్తర శాస్త్ర పరిశోధనలతో లోక కళ్యాణానికి పాటుపడ్డారు.

            సాధారణంగా తత్త్వవేత్తలందరూ మానవ సమాజ పురోగతికీ, వారి బాధల నివారణకూ అనువైన  కొత్త మార్గాలు, కొత్త ఆదర్శాలు అన్వేషించడమే లక్ష్యంగా కృషి చేస్తారు.కాని హెగెల్ నాటి  సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు భగవంతుడి అభీష్టమూ, అభివ్యక్తీకరణ అని భావించి,వాటిని యథాతథంగా స్వీకరించాలని ప్రబోధించాడు.సమాజంలో మన స్థానానికి తగిన విధులు మనకు  ఏవి అప్పగించబడ్డాయో వాటిని తు..తప్పకుండా నెరవేర్చడమే స్వేచ్చ యొక్క అంతస్సారమన్నాడు.మన పరిమితేచ్చల (Finite Wills) తో  సామాజిక  రుగ్మతలకూ, దుర్నీతికీ,దౌష్ట్యానికీ వ్యతిరేకంగా తిరగబడడం  కాదు--- స్వేచ్చ యొక్క అర్థమూ,పరమార్థమూ-- అని సెలవిచ్చిన హెగెల్ రకంగా చూసినా నాటి ప్రష్యన్ (జర్మన్) ప్రభుత్వానికి వంత పాడి,సామాజిక న్యాయ సాధనకూ,సమాజ పునర్నిర్మాణానికీ  ఉద్యమించే ప్రజల ఆకాంక్షలకూ, స్వాతంత్ర్యేచ్చకూ వ్యతిరేకంగా పనిచేసిన, తిరోగామి భావాలు ప్రచారం చేసిన తత్త్వ వేత్తగా చరిత్రలో మిగిలిపోయాడు.హెగెల్ దృష్టిలో చరిత్ర యొక్క అంతిమ లక్ష్యం 1830 నాటి ప్రష్యా ప్రభుత్వం వంటి ప్రభుత్వ ఏర్పాటే.ఫ్రెడరిక్ విలియం -III ను ఆయన పూర్తిగా సమర్థించి ఆకాశానికెత్తాడు.సమాజం,రాజ్యం,ఇచ్చ,పౌరుల బాధ్యతలు మొదలైనవాటిపై ఆయన ప్రవచించిన సిద్ధాంతాలు అనంతరకాలంలో నాజీయిస్టుల నియంతృత్వ భావజాలానికి బాటలు వేశాయి.

ఆయన సిద్ధాంతం ప్రభావం మరో మహత్తర సిద్ధాంత ఆవిర్భావానికి దారితీసింది.పందొమ్మిదవ శతాబ్దపు 'యువ హేగేలియన్ల' పేరిట ప్రశిద్ధులైన లుడ్విగ్ ఫ్యూర్బా ,కార్ల్ మార్క్స్,ఫ్రెడరిక్ ఎంగెల్స్ మొదలగువారు సభ్యులుగా ఉన్న బృందంపైన హెగెల్ సిద్ధాంతం తీవ్ర ప్రభావాన్ని నెరపింది.ఫ్యూర్బా భౌతికవాద సిద్ధాంతాలు,హెగెల్ అఖండ భావవాద సిద్ధాంతం లోని గతి తార్కిక పద్ధతి(Dialectical Method)--   రెంటినీ   స్వీకరించి కార్ల్ మార్క్స్,ఫ్రెడరిక్ ఎంగెల్స్  లిరువురూ' గతి తార్కిక భౌతికవాదం'(Dialectical Materialism) అనే సరికొత్త సిద్ధాంతాన్ని తయారు చేశారు. సిద్ధాంతపు వెలుగులో మానవ సామాజిక చరిత్రలోని వివిధ దశలను అధ్యయనం చేసి 'చారిత్రక భౌతికవాదం'(Historical Materialism) అనే సిద్ధాంతాన్ని కూడా తయారుచేశారు. రెండు సిద్ధాంతాలే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి మూలాదారాలయ్యాయి.

అలా హెగెల్ సిద్ధాంతం యొక్క ప్రభావాలలో కొంత మంచీ, కొంత చెడూ కలగలిసి ఉన్నాయి. ఏది ఏమైనా ఆయన ప్రవచించిన దైవ సిద్ధాంతం కూడా శాస్త్రీయంగా నిలవలేకపోయింది.

హెగెల్  సిద్ధాంతాలను అతి తీవ్రంగా విమర్శించిన మరో సమకాలీనుడైన జర్మన్ తత్త్వజ్ఞుడు ఆర్థర్ షోపెనార్ (Arthur Schopenhauer 1788-1860).హెగెల్ మనస్సుకుండే 'అపారమైన ఇచ్చ' గురించి అసలు పట్టించుకోకుండా కేవలం మనస్సు యొక్క బౌద్ధిక  దృగంశానికే అతి ప్రాధాన్యం ఇచ్చాడని ఈయన విమర్శ.హెగెల్ దృష్టిలో 'అఖండ హేతుత్వం' (Universal Reason)అంతిమ సత్యమైతే, ఈయన దృష్టిలో అంతిమ సత్యం' అఖండేచ్చ '(Universal Will). కాంట్ కూడా ఇచ్చ యొక్క ప్రాధమ్యాన్ని ముందే గుర్తించినప్పటికీ  'ఇచ్చ' అనే మానసిక దృగంశాన్ని లోతుగా తరచి అధ్యయనం చేసి దాన్ని 'ఐచ్చిక భావవాదం' (Voluntaristic Idealism) అనే ఒక పరిపూర్ణమైన సిద్ధాంతంగా  రూపొందించినవాడు మాత్రం షోపెనారే.కాంట్ చెప్పిన మిగిలిన విషయాల మాట అటుంచితే 'అంతిమ సత్యం'తెలుసుకోగలిగింది కాదనే కాంట్ భావనను షోపెనార్ ఖండించాడు.అంతిమ సత్యం జ్ఞేయమే(Knowable)నన్నాడు.

మనం అంతర్దృష్టితో చూస్తే విశ్వేచ్చే అంతిమ సత్యమని గ్రహించగలం.' ప్రపంచం నా భావనే'(The World is my Idea) అనేది ఈయన సిద్ధాంతం.మనం భావించినట్లే ప్రపంచం మనకి కనిపిస్తుంది.నా మనస్సులో అంతస్సారం అనదగినది ఇచ్చే; హేతుత్వం కాదు.అంతఃకరణా కాదు.ఆత్మ లేక మనస్సు అంటే కార్యకలాపాలు,తపించడం,మథనపడడం,వాంచించడం -- నాలుగూ.నా ఇచ్చ యొక్క బహిర్వ్యక్తీకరణే నా శరీరం. బాహ్య ప్రపంచం మొత్తం అంతే.నా హృదయంలోనే విశ్వేచ్చ ఉంది.దృశ్యమానమైన ప్రపంచం విశ్వేచ్చ యొక్క బహిర్వ్యక్తీకరణ మాత్రమే.నేను చూసేదీ, వినేదీ,అనుభూతిపొందేదీ యావత్తూ విశ్వేచ్చే.నా శారీరక కార్యకలాపాలు మొత్తం నా లోపలి ఇచ్చ యొక్క అభివ్యక్తీకరణ మాత్రమే.నేను నడుస్తున్నప్పుడు నాలోని ఇచ్చే నన్ను నడిపిస్తుంది.ఇదే ప్రపంచం లోని అన్ని విషయాలలోనూ కూడా సత్యం.నేను అంతర్దృష్టి తో విశ్వంలో అంతిమ సత్యం' ఇచ్చ' మాత్రమేనని  గ్రహించగలను.నాలోకి నేను తొంగిచూస్తే నా లోని ఇచ్చతో ముఖాముఖీ ఎదురుపడతాను.అదే నేను బయటికి చూసినప్పుడు అదే' ఇచ్చ' అవయవాలు, ప్రాణం కలిగిన ఒక సజీవ  శరీరంగా నాకు కనిపిస్తుంది.కనుక విశ్వంలోని అన్ని వస్తువులూ వాటి లోపలి' ఇచ్చ' యొక్క వ్యక్తీకరణలేనని భావించడంలో తప్పేమీ లేదు.ఒక రాయిలో ఇదే ఇచ్చ ఒక గుడ్డి శక్తి గా ఉంది.అదే ఇచ్చ  ఒక మానవునిలో  స్వస్వరూప  జ్ఞానం కలిగి ఉంది.మొక్కలలో వాటిలోపలి'ఇచ్చ' యొక్క తపనను మనం గమనించవచ్చు.వెలుతురు, నీరు లభించే దిశగా అవి పెరగడం వాటిలోని అచేతనంగా ఉన్నట్టి ఇచ్చకు సంకేతంగా మనం భావించవచ్చు. ఇచ్చ మొక్కలూ, జంతువుల పెరుగుదలను నిర్దేశిస్తూ, వాటి కార్యకలాపాలను లోపలినుంచి నియంత్రిస్తుంది.అడవిలో ఉండే ఒక క్రూర మృగం ఇతర మృగాలను వేటాడి తినడానికి అనువుగా పళ్ళూ,గోళ్ళూ, కండరాలనూ అభివృద్ధి చేసుకుంటుంది.దానిలోపలి ఇచ్చ దాని  అవసరాలకు తగిన  అనువైన అవయవాలను సృష్టిస్తుంది.ముందు ఆవశ్యకత, తరువాత కోరిక, తరువాత సృష్టి.కుమ్మాలి, పొడవాలి అనే కోరిక జనించిన తరువాతే పశువుకి కొమ్ములు మొలుచుకొస్తాయి.జీవించాలనే 'ఇచ్చ' లేక  తపన కారణంగానే మనమంతా జీవిస్తున్నాం.ఇంకా జీవించే  ఉన్నాం.

' అఖండేచ్చ'అనేది ఒక  తెలివి,చైతన్యం కలిగినట్టి  దైవం (Intelligent God)కాదనేది షోపెనార్ అభిప్రాయం.అదో అంధ, అచేతన శక్తి.హేతు దృష్టి కూడా దానికి లేదు.అస్తిత్వం కోసం తపించే ఒక అంధ, అచేతన శక్తి అది. విశ్వంలో వివిధ పదార్ధాలలో వేర్వేరు దశలలో ఇచ్చ  తనను తాను ప్రకర్షింపచేసుకుంటుంది.జంతు ప్రపంచం లో మాత్రం ఇచ్చ బతకాలనే తపనగా వ్యక్తమవుతుంది.అస్తిత్వం యొక్క దిగువ శ్రేణులలో ఇచ్చ ఒక అచేతనమైన, గుడ్డి తపనగానే ఉంటుంది.ఉన్నత స్థాయిల్లో ఇదే ఇచ్చ క్రమంగా చైతన్యవంతం అవుతూ,మానవునిలో పూర్ణ చైతన్యం సంతరించ ుకుంటుంది.అయినప్పటికీ చైతన్యం  ఎల్లప్పుడూ ఇచ్చ యొక్క సేవలోనే ఉంటుంది.ఇచ్చ యజమాని అయితే అంతఃకరణ ఒక సేవకుడు మాత్రమే.

అఖండేచ్చ అనేది షోపెనార్ దృష్టిలో మౌలికమైనది,దేశ,కాలాలకు  అతీతమైనట్టిది,కారణాతీతమైనట్టిది (అంటే తనకంటూ ఒక సృష్టికర్త లేనిది-The Un-Caused Cause)అయిన నిరంతర,అనాది మరియు  అనంత కార్యకలాపాల సముచ్చయం.అయితే అఖండేచ్చకు ఎప్పుడూ తనను తాను వ్యక్తపరచుకోవాలనే  నిరంతర తపన ఉంటుంది.

 షోపెనార్ దృష్టిలో   ప్రపంచమేమో అస్తిత్వం కోసం నిరంతరం తపనపడుతూనే ఉంటుంది. కనుకనే షోపెనార్ ది రకంగా నిరాశావాదం. ప్రపంచం లోని అంతులేని బాధలు, తపనల నుంచి తప్పించుకొనడానికి ఒకటే మార్గం--జీవించాలనే ఇచ్చను నిరాకరించడం.అన్ని కోరికలను జయించడం ద్వారానే ఇది సాధ్యం.భావోద్వేగపరమైన,భౌతికమైన మరియు కామ వాంచలు ఏవీ పూర్తిగా తీరేవి కావు. కారణంగా అసంతృప్తి , దానివలన బాధాకరమైన స్థితి దాపురిస్తుంది.కాబట్టి బుద్ధుడు ప్రబోధించినట్లుగా కోరికలను జయించడం ఒక్కటే ముక్తికి మార్గం. విషయంలో కేవలం బౌద్ధ భిక్షువులే కాక వేదాంత మతాన్ననుసరించే సన్యాసులు,బాల్యం లోనే సన్యసించే క్రైస్తవ మతగురువులు ఆదర్శప్రాయులు.ఇదీ క్లుప్తంగా షోపెనార్ ప్రతిపాదించిన 'ఐచ్చిక భావవాదం' యొక్క సారాంశం

 హెగెల్ చెప్పినట్లు అంతిమ సత్యం పూర్తిగా  హేతుబద్ధమైనది  కాదని మనం ఈవరకే గ్రహించాం.అలాగని అది షోపెనార్ చెపుతున్నట్లు  పూర్తిగా హేతురహితమైనదీ కాదు. దానిలో ఎంతో కొంత హేతుత్వం ఉంది. వాస్తవానికి రెండూ అంతిమ సత్యానికి సంబంధిన రెండు  ఏకాంత (ఏకపక్షమైన- One-sided) అభిప్రాయాలు. నిజం వీటి రెంటికీ మధ్యన ఉందని పలువురు తత్త్వవేత్తలు అభిప్రాయపడ్డారు.

హెగెల్  భావన  ప్రకారం మనస్సుయొక్క అంతస్సారం కేవలం హేతుత్వమే. షోపెనార్ అభిప్రాయం ప్రకారం మనస్సంటే సంకల్పం లేక ఇచ్చ. అయితే వాస్తవమేమిటంటే మనస్సుకి హేతుత్వమూ ఉంది.ఇచ్చా ఉంది. రెండూ మనస్సు యొక్క రెండు పరస్పరాధారిత దృగంశాలు(Interdependent aspects).

             కేవలం భావాలు మాత్రమే సత్యమంటూ ఐచ్చిక భావవాదం ప్రవచించిన షోపెనార్ ఒకచోట పప్పులో కాలేశాడు. ఇతర జంతువులను వేటాడి చంపి తినాలని భావించిన క్రూర మృగాలలోని ' ఇచ్చ' తన అవసరాలకు తగ్గట్టుగా అనువైన పళ్ళూ, గోళ్ళూ అభివృద్ధి చేసుకుంటుందని చెప్పిన షోపెనార్ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించలేదు.అసలు గోళ్ళు, పళ్ళు అంటే ఏమిటి?అవి భౌతికమైన(మానసికేతరమైనట్టి) అవయవాలేనా? లేక అవీ ఇచ్చ లాగా కేవలం భావనలేనా? అవి భౌతిక పదార్థాలనుకున్నట్లయితే షోపెనార్ చెప్పేది ఇంకెంతమాత్రం  భావవాదం కానేరదు.అది పదార్థమూ, భావమూ రెండూ అంతిమ సత్యాలని చెప్పే ద్వైతం(Dualism)అయి  కూర్చుంటుంది. దీన్ని ఆయన అంగీకరించడు.అవి కూడా భావాలే అనేటట్లయితే భావాలు ఏవిధంగా పళ్ళు, గోళ్ళుగా ఉపయోగపడ్డాయో వివరించాల్సిన చిక్కు పరిస్థితిని ఎదుర్కొంటాడు. భౌతికమైన,నశ్వరమైన పదార్ధం అనశ్వరమైన మనస్సు లేక భావం నుంచి ఎలా ఏర్పడుతుంది? అన్న ప్రశ్నకూ ఆయనవద్ద  ఎలాంటి సమాధానం లేదు.

            లీబ్నిజ్ దైవ సిద్ధాంతం అత్యంత ఆశాభరితమైనట్టిది ;మనం ఉన్న ప్రపంచం సాధ్యమైనంత ఉత్తమ ప్రపంచమని లీబ్నిజ్ పేర్కొన్నాడు.అయితే షోపెనార్ దైవ  సిద్ధాంతం పూర్తిగా నిరాశావాదం.నిత్యం తగవులు, కొట్లాటలు, ఉద్యమాలు, అసంతృప్తి,ఆందోళనలు,బాధలూ,భయాలతో నిండిన ప్రపంచం సాధ్యమైనంత 'చెడ్డ ప్రపంచం' అన్నాడు షోపెనార్.అయితే రెండు అభిప్రాయాలూ పూర్తిగా ఏకపక్షమయినట్టివేనని ,అవి రెండూ మానవ నైజాన్ని గురించిన అపరిపూర్ణమైన అవగాహన మీదే ఆధారపడ్డాయనీ పలువురు తత్త్వవేత్తలు విమర్శించారు.

షోపెనార్ అభిప్రాయం ప్రకారం కోరికలు ఏవీ పూర్తిగా తీరేవి కావు. దానివల్ల చివరికి అసంతృప్తే మిగులుతుంది.

అది బాధాకరమైన స్థితి. పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే కోరికలను జయించాలి. అప్పుడే విముక్తి. ప్రపంచం లోని అంతులేని బాధలు, తపనల నుంచి తప్పించుకొనడానికి ఒక్కటే మార్గం-అదేమిటంటే జీవించాలనే కోరికను కూడా నిరాకరించడం. అయితే షోపెనార్ బౌద్ధాన్నీ,వేదాంత దర్శనాన్నీ తప్పుగా అర్థం చేసుకుని అవికూడా  తన సిద్ధాంతంలాగా

నిరాశావాద సిద్ధాంతాలేనని అభిప్రాయపడ్డాడు.పూర్తి ఆశావాదం నిండినట్టి బౌద్ధం, వేదాంతం-- రెండూ  ఏనాడూ జీవించాలనే కోరికను కూడా నిరాకరించమని  షోపెనార్ వలె బోధించలేదు.అవి ఎన్నడూ ఐహిక జీవితం పట్ల విరక్తి కలిగించకపోగా మానవులకు    మరింత భద్రమైన ఐహిక జీవనం చేకూరడానికే సిద్ధాంతాలు కృషిచేశాయి.

అలా షోపెనార్ యొక్క అశాస్త్రీయమైన ' ఐచ్చిక భావవాద సిద్ధాంతం' కూడా పలు విమర్శలకు గురై తిరస్కరించబడింది.

సర్వాత్మవాద సిద్ధాంతం (Panpsychism) ప్రతిపాదించిన ఫెచ్నర్,పాల్సెన్ అనే తత్త్వవేత్తలు జీవులలోనే కాదు;నిర్జీవ ప్రపంచంలోనూ ఆత్మలు లేక మనస్సులు  ఉంటాయని  వాదించారు.సైకే(psyche) అంటే 'మనస్సు'; పాన్ అంటే'అంతా','సర్వం' అని అర్థం. మానవులు, జంతువులకే కాదు;అణువులు,పరమాణువులు,వృక్షాలు,నదులు, పర్వతాలు-ఇలా  విశ్వంలో ప్రతి సజీవ, నిర్జీవ పదార్థానికి కూడా మనస్సు లేక ఆత్మ ఉంటుందని వీరి వాదన.మరైతే భౌతిక, మానసిక అంశాల మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? అన్న ప్రశ్నకు వారు భౌతిక అంశాలు వాస్తవాలుగా అనిపిస్తాయేకానీ అవి వాస్తవాలు కావనీ, మానసిక విషయాలు మాత్రమే వాస్తవాలనీ పేర్కొన్నారు. విశ్వం లోని ప్రతి పరమాణువుకూ దేని ఆత్మ దానికుంది. విశ్వం మొత్తానికీ కూడా ఒక ఆత్మ ఉంది. ఆత్మే భగవంతుడు.జీవ, నిర్జీవ ప్రపంచాలు వేర్వేరు కాదు.అవి రెండూ నిరంతరం ఒకటి మరొకటిగా మారుతూ ఉంటాయి.జీవ పదార్థాలు ఏవైతే మూలకాలతో తయారయ్యాయో, నిర్జీవ పదార్థాలు కూడా అవే మూలకాలతోనే ఏర్పడ్డాయి.కాబట్టి రెంటి ఆవిర్భావం ఒకటే సూత్రం మీద ఆధారపడే జరిగి ఉంటుంది.పదార్ధం జడత్వం కలిగినదని భావించడం తప్పు.దానికి జీవం లేదనీ,చలనం లేదనీ, బయటి నుంచి ఏదైనా శక్తి దానిపై బలప్రయోగం చేస్తేనే తప్ప దానిలో కదలిక ఉండదనీ భావించడం పొరపాటు.ప్రతి అణువు, పరమాణువు లోపల కూడా చలనం ఉంది.చాలమేరకు ఆమోదయోగ్యంగా కనిపించే సిద్ధాంతం కూడా వస్తువుల మానసిక (Psychic) మరియు భౌతిక (Physical) దృగంశాల  నడుమ ఉన్న సంబంధం ఎలాంటిదో వివరించడంలో విఫలమైంది.'ఆత్మలు నిజం.భౌతిక   వస్తువులు నిజమనిపిస్తాయి.' అని వాదించే వీరు పదార్ధం విషయంలో  'అనిపించడానికీ',' నిజానికీ'గల తేడాని   వివరించడంలో విఫలమయ్యారు.

                     ఇలా పలువురు పాశ్చాత్య భావవాద  తత్త్వవేత్తలు చైతన్యవంతుడైన ఒక భగవంతుడు విశ్వాన్ని సృష్టించి కాపాడుతూ నిర్వహిస్తున్నాడనీ, ఆయన విశ్వానికి నైతిక పాలకుడనీ,ఆయనే పుణ్యకార్యాలకు పురస్కారంగా స్వర్గాన్నీ,పాపకార్యాలకు శిక్షగా నరకాన్నీ మనకు ఇచ్చే కర్మఫలదాత అనే భావన దగ్గరనుంచీ ప్రారంభించి క్రమంగా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నకొద్దీ తమ భావాలను కాలానుగుణంగా మార్చుకుంటూ చివరికి భగవంతుడికి ప్రత్యేకించి చైతన్యమేమీ లేదనీ, మానవుడి హేతుత్వంలోనే అది ప్రతిఫలిస్తుందనీ సిద్ధాంతీకరించారు.

                       షోపెనార్ చెప్పిందే చూడండి.The Absolute Will is not an intelligent God.It is a blind and unconscious force and is essentially irrational.It is a blind unconscious urge to existence.

                          "It manifests itself in various stages in the world of nature as physical,chemical, magnetic and vital force,pre-eminently, however, in the animal kingdom in the form of the will to live."(James Mark Baldwin: A Dictionary of Philosophy and Psychology-Vol.II P.808)

                              శాస్త్ర  విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ భావవాద తాత్త్వికులు దైవాన్ని గురించిన భావనలు క్రమంగా  మార్చుకుంటూ వచ్చారు.ఒక తెలివైన, దయాళువైన, సకల పరిపూర్ణుడయిన భగవంతుడు విశ్వం యొక్క  సృష్టి,స్థితి,లయముల వెనుక ఉన్నాడని, ఆయనే విశ్వానికి నైతిక పాలకుడనీ భావించడం తాత్త్వికంగా పలు చిక్కులతో కూడినదనీ; తాము అశాస్త్రీయంగా నమ్ముతున్న దైవభావనను ఇతరులకు శాస్త్రీయంగా రుజువుచెయ్యడం అయితే అసలు తమకు  సాధ్యపడే పని కాదనీ వారు అనుభవ పూర్వకంగా గ్రహించారు.అందుకే షోపెనార్ వంటి వారు 'Irrational, Un-intelligent Absolute Will' అనడం: భగవంతుడున్నాడని రుజువు పరచడం సాధ్యం కాదని గ్రహించిన  ఆజ్ఞేయ వాదులైన  కాంట్ వంటి వారు లోక కళ్యాణం కోసం  సమాజంలో నైతిక జీవనం  అవసరమనీ అందుకోసం విశ్వానికి  నైతిక పాలకుడైన భగవంతుడు ఒకడున్నాడని  నమ్మడం మినహా వేరే మార్గం లేదని సెలవివ్వడం కూడా అందుకే.ఇంకొందరైతే '  దేవుడు లేకపోతే తక్షణం ఒక దేవుడిని సృష్టించండి.సమాజంలో  నైతిక జీవనానికి దైవభావన  ఎంతైనా అవసరం,'అని హితోపదేశం చెయ్యడం కూడా కారణంచేతనే.అయితే దైవ భావన అనేది ఆచరణలో నమ్మిన వారిని మారు మాటాడకుండా కట్టి పడేయ్యడానికే ఉపయోగపడింది.పాలకవర్గాలకు,ధనికులకు, దోపిడీదారులకు  దైవభావన మేలు చేకూర్చింది.దాని వలన తమకుచేకూరే ప్రయోజనాన్ని గుర్తించారు కనుకనే పాలక, దోపిడీ వర్గాలవారు  ఎప్పుడూ దైవ భావనను పెంచి పోషిస్తూ ఉంటారు.నైతి జీవనం కోసమే దైవ భావన అనుకుంటే యా వర్గాలవారు ఎంతమేరకు నైతికతకు కట్టుబడి ఉంటున్నారో మనకు తెలియనిదేమీ కాదు.అలా దైవ భావన అనాదిగా జనం మనస్సులో ప్రవేశపెట్టబడిందే ; వర్గాలచేత పెంచి పోషించబడుతున్నదే.

భావవాద తత్త్వవేత్తలపై వారి వారి సామాజిక, వ్యక్తిగత ప్రయోజనాల ప్రభావం కూడా గణనీయంగా ఉంది.తమ కాలంనాటి సమాజాల్లోని ప్రజలలో ఆడంబరం, విషయ వాంచల పట్ల  ఆసక్తి, భౌతిక ప్రపంచంపై మితిమీరిన మోజు కొంతమేరకైనా తగ్గించి, వారిని ఉదాత్తమైన విలువల వైపుకు మళ్ళించే సదుద్దేశంతోనే ప్లేటో,బర్కిలీ వంటివారు భౌతిక వస్తువులు నశ్వరాలనీ, అనశ్వరమైన శక్తి భగవంతుడేననీ తమ భావవాద సిద్ధాంతాలను ప్రబోధించారు. తరహా బోధనలవల్ల, అలాగే కాంట్ వంటివారు బోధించిన నైతిక భావనలవల్ల  నాటి  సమాజానికి అప్పట్లో కొంతవరకు మేలే జరిగింది.

కాని,ప్రపంచంలో దైవభావన ఎప్పుడూ పాలకులు, దోపిడీ వర్గాల చేతిలో ఒక పనిముట్టుగానే ఉపయోగపడింది.నాడూ నేడూ కూడా ప్రభుత తన పాలనకు ఎప్పుడూ మతాన్నీ, దైవ భావననూ ఆధారం చేసుకుంటుంది, అడ్డు పెట్టుకుంటుంది. దాని విలువ, ప్రయోజనం వారికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదు.కొత్త దేవుళ్ళనీ, కొత్త మతాల్నీ ఎప్పుడు సృష్టించాలో ; ప్రజలలో తగ్గి పోతున్న దైవ భావనను ఎలా కాపాడుకోవాలో, పెంచి పోషించుకోవాలో వారికి వెన్నతోపెట్టిన విద్య.1830 నాటి ప్రష్యా (జర్మనీ)లో ఫ్రెడరిక్ విలియం -III యొక్క  నియంతృత్వ ప్రభుత్వాన్ని కాపాడి,ప్రజా నిరసననూ, తిరుగుబాటునూ అణచి వెయ్యడానికి హెగెల్ యొక్క అఖండ భావవాద (Absolute Idealism) సిద్ధాంతం ఎంతగా ఉపయోగపడిందో మనకి తెలియంది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న  నిరసనను అణచివేసి, నియంతృత్వ ప్రభుత్వాన్ని కాపాడడమే హెగెల్ దైవ సిద్ధాంతం  పరమోద్దేశం.అందుకే ఆయన సామాజిక అసమానతలు కూడా భగవదేచ్చ అనీ , అవి అలాగే కొనసాగాలనీ , మన పరిమితేచ్చ తో మనం సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడడం అంటే భగవదేచ్చకు వ్యతిరేకంగా పోరాడడమేననీ ప్రచారం చేసాడు.స్వేచ్చ యొక్క అంతరార్థం సమాజంలో మన స్థానానికి తగిన విధులు నేరవేర్చడమేనని గుర్తించడం అన్నాడు.సమాజంలో అలా యథాతథ స్థితి కొనసాగాలని కోరుకున్నాడు.

" Hegel's whole effort had been to show that truth is to be found in the actuals.Substantial freedom consists in accepting the duties of our station in society as we find it (because it is an expression of God's mind),not in setting our finite wills in rebellion against the social evils."

                                                   --   A.K.Rogers 'A Student's History of Philosophy.'

ప్రాక్పశ్చిమ భావవాద సిద్ధాంతాలలో  తత్త్వవేత్తలు ఇలా ప్రభువర్గాలకు కొమ్ముకాసిన ఉదాహరణలు కోకొల్లలు.


ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech