కబుర్లు  
     వీక్ పాయింట్ - రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి  
గీత’కు వాతా?!
 

ఏడు గొప్ప రాజ్యాలను దేవుడు మీ అధికారం కింద ఉంచుతాడు... మీరు అక్కడి వాళ్లను సర్వనాశనం చేయాలి... వారి బలిపీఠాలను విరగగొట్టాలి... వాళ్ల దేవుళ్ల విగ్రహాలను కాల్చివేయాలి... మీ దేవుడు అసహ్యించుకునే ఆ విగ్రహాల్లో ఒక్కటైనా మీ ఇంటికి తీసుకెళితే ఆ విగ్రహాల్లాగే మీరు కూడా నాశనం చేయబడతారు... ఇతర దేవుళ్లను పూజిద్దామని నీ సొంత తమ్ముడు చెప్పినా, కన్నబిడ్డ చెప్పినా, నీ ఆప్తమిత్రుడు చెప్పినా వినవద్దు.

అతడిమీద జాలిపడవద్దు... మీరు అతణ్ని చంపాల్సిందే... ముందు మీరు రాళ్లతో కొట్టిన తర్వాత ప్రజలందరూ రాళ్లు విసిరి అతణ్ని చంపాలి... మీకు ఇస్తున్న దేశంలోని పట్టణాలను మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని మీరు చంపేయాలి. మొత్తం ప్రజలందరినీ సర్వనాశనం చేయాలి. ఇది మీ దేవుడి ఆజ్ఞ...
-అని ఒక పవిత్ర మతగ్రంథం ఉద్బోధిస్తుంది.
ఇంకో పవిత్రగ్రంథంలో ఇంకో మతం దేవుడేమో-
‘‘సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంలో ననే్న చూసేవాడు, సర్వప్రాణులను తనతో సమానంగా భావించేవాడు శ్రేష్ఠుడు. నాకు అప్రియుడుగాని ప్రియుడుగాని ఎవడూ లేడు. ఏ ప్రాణియందు ఏమాత్రం వైరభావం లేనివాడు మాత్రమే నన్ను పొందగలడు. లోకంలో ఎవరికీ క్షోభ కలిగించనివాడు, ఎవరి వల్లా క్షోభపడనివాడు నాకు ప్రీతిపాత్రుడు’’ అని చెబుతాడు.
మతమనేది విశ్వాసానికి సంబంధించిన విషయం. అది పూర్తిగా వ్యక్తిగతం. కాబట్టి ఫలానా మతంలో ఫలానా అంశం ఈ కాలంలో మన దృష్టికి మంచిదా చెడ్డదా అని తర్కించడం దండగ. ఒప్పుకుందాం.
కాని ఒకవేళ ఆక్షేపించాల్సే వస్తే... పైన ఉదహరించిన రెండు మతగ్రంథాల బోధల్లో దేన్ని ఈ కాలానికి అభ్యంతరకరంగా పరిగణించాలి? తీవ్రవాదాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించడమనే కారణంతో నిషేధంమంటూ పెట్టాల్సి వస్తే ఈ రెండు మతగ్రంథాల్లో దేన్ని నిషేధించాలి?
దేశాల మీదపడు, అక్కడి మనుషుల్ని ఒక్కర్నీ వదలకుండా చంపెయ్, వాళ్ల దేవుళ్ల విగ్రహాలు నాశనం చేసెయ్, వాళ్లదారిన పోదామని నీ కన్నబిడ్డ చెప్పినా, కట్టుకున్న భార్య చెప్పినా వినకు. ఆ మాట అన్నవాళ్లను రాళ్లతో కొట్టి ప్రాణం తియ్- అని చెప్పడం కన్నా దౌర్జన్యం, దానికి మించిన బీభత్సం, అంతకంటే తీవ్రవాదం ఇంకొకటి ఉంటుందా?
ఉండదు. కాని గమ్మత్తేమిటంటే... విచ్చలవిడి హింసను, దారుణ దౌర్జన్యాన్ని కల్తీలేని తీవ్రవాదాన్ని ప్రబోధించిన మతగ్రంథాన్ని అక్షరసత్యంగా, అనుల్లంఘనీయంగా, సాక్షాత్తూ భగవంతుని అమోఘ ఉపదేశంగా నెత్తిన పెట్టుకుని పూజించేవారే...
‘‘అందరితోనూ సమదృష్టితో ఉండు. అందరిలోనూ, అన్నిటిలోనూ ననే్న చూడు. ఎవరినీ క్షోభపెట్టకు. ఎవరిపట్లా ద్వేషం, దేనిమీద వ్యామోహం లేకుండా, ఏ ప్రాణినీ బాధించకుండా, అన్నీ నాకే వదిలేసి, నిరంతరం ననే్న ధ్యానించు’’ అన్న భగవానుడి సార్వకాలిక, సార్వజనీన, శాంతి వచనాన్ని వినిపించే మతగ్రంథాన్ని అర్జంటుగా నిషేధించాలంటూ గగ్గోలుపెడుతున్నారు!
ఎందుకు నిషేధించాలంటే... అది సాంఘిక వైషమ్యాలను పెంచే తీవ్రవాద సాహిత్యమట! భలే!!
ఇందాక చెప్పిన మతగ్రంథాల్లో మొదటిది హోలీ బైబిల్.
రెండోది భగవద్గీత.
మొదట్లో ఉటంకించిన అమోఘ వాక్యాలు ఓల్డ్ టెస్టామెంట్‌లో ద్వితీయోపదేశకాండ (ళఖఆళ్యూశ్యౄక) లోని 7, 13, 20 అధ్యాయాలలోనివి.
ఆధునిక ప్రమాణాల ప్రకారం అభ్యంతరకరమైన అంశాలు అన్ని మతాల పవిత్ర గ్రంథాల్లోనూ ఉన్నాయి. తీరికూర్చుని వాటిని ఇప్పుడు కెలకటం మతిలేని పని. పైగా - తన కంట్లో దూలాలుంచుకుని పరులకంట్లో నలుసులెంచినట్టు పక్కా బీభత్స వాదాన్ని ప్రేరేపించిన మతబోధలోని ప్రతి అక్షరం నేటికీ శిరోధార్యమంటూ జంకులేకుండా వాదించే రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి... సర్వమానవ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన భగవద్గీత తీవ్రవాద సాహిత్యమంటూ కోర్టుకెక్కటం తెంపరితనానికి పరాకాష్ఠ!
రష్యాలోని సైబీరియాలో ఎక్కడో తోమస్క్ సిటీలో ఎవరో ఆకతాయిలు భగవద్గీత రష్యన్ అనువాదాన్ని నిషేధించాలని కేసుపెడితే మనమెందుకు జుట్టుపీక్కోవాలి? ఏదో భాషలో ఏదో అనువాదం మీద దావావేస్తే ఏకంగా భగవద్గీతనే నిషేధించాలన్నట్టు కాదు కదా? అయినా కేసు పడ్డంతమాత్రాన ఏమైంది? ఇంకా తీర్పురానే లేదు కదా? పైగా మన గురించీ, మన మత గ్రంథాల గురించీ క్షుణ్ణంగా ఎరిగిన ఇండియాలోని రష్యన్ రాయబారే- ‘‘గీతను నిషేధించాలనటం పిచ్చిపని; అలాంటి ఆగడాలను ఎంతమాత్రం సాగనివ్వం’’- అని హామీ ఇచ్చాడుకదా? తీర్పురాకుండానే, కేసు నిలుస్తుందో లేదో తేలకుండానే ఆవేశపడటం అవసరమా - అని మన హిందూ వ్యతిరేక సెక్యులర్ మహానుభావులు పెదవి విరవవవచ్చు గాక!
కాని - ఈ వ్యవహారంలో పైకి కనపడని కోణాలు అనేకం ఉన్నాయి. ఇండియాలోని రష్యన్ రాయబారి మన శ్రేయోభిలాషి; విషయం తెలిసినవాడు కావచ్చు. అలాగని రష్యాలో రాజ్యమేలుతున్న శక్తులు, వాటి వెనక ప్రభావాలు మనకు మహా అనుకూలమని భ్రమపడనక్కర్లేదు. రష్యాలో ఆర్థోడాక్స్ చర్చిదే ప్రాబల్యం. ఆ చర్చికి ‘ఇస్కాన్’ అనే హరేకృష్ణ ఉద్యమమంటే చాలాకాలంగా మంట. మామూలు హిందూ మతసంస్థల్లా, హైందవ ధర్మాచార్యుల్లా కాకుండా పట్టుబట్టి పథకం ప్రకారం పాశ్చాత్య ప్రపంచమంతటా చొచ్చుకువెళ్లి తమకు దీటుగా హైందవాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తున్నదని అక్కడి చర్చికి కనె్నర్ర. ఇస్కాన్‌ని, తద్వారా హిందూ మతాన్ని సతాయించాలన్న కుయత్నాలు రష్యాలో చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. మాస్కోలో ఇస్కాన్ ఆలయం ప్రాజెక్టును స్థానిక ప్రభుత్వం అడ్డం కొట్టటం వెనకా మతశక్తుల ప్రమేయం ఉంది. తోమస్క్ ప్రాంతంలో కమ్యూనిటీ విలేజి కట్టాలన్న ఇస్కాన్ ప్రయత్నం. ఈ సంవత్సరంలోనే నడమంత్రపు నిషేధం కారణంగా ఆగిపోయింది. ఇస్కాన్ సంస్థాపకుడి గీతానువాదాన్ని నిషేధించాలంటూ ఇప్పుడు పెట్టిన కేసు అనామకుల ఆకతాయి చేష్టకాదు. రష్యన్ ఫెడరల్ సర్వీసు (ఎఫ్.ఎస్.బి.) వాళ్లు పనిగట్టుకుని క్రైస్తవ చర్చితో సన్నిహిత సంబంధాలున్న అవినెసోవ్ అనే తోమస్క్ యూనివర్సిటీ ఆచార్యుడిని ‘గీత’లో తప్పులు వెదికే పనికి నిరుడు పురమాయించారు. కృష్ణుడు పాపాత్ముడు... అతడు చెప్పింది క్రైస్తవ విశ్వాసాలకు సరిపోదు; సాంఘిక వైషమ్యాలను ప్రేరేపిస్తుంది కూడా అని అతగాడు అడ్డగోలు రిపోర్టు ఇచ్చాడు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసు వాళ్లు దాన్ని పట్టుకుని పోయి చర్చికి బాగా అనుకూలుడైన పబ్లిక్ ప్రాసిక్యూటరు చేతిలో పెట్టి నిషేధం కేసు వేయించారు.
సాక్ష్యాలు లేక, అభియోగంలో పసలేనందువల్ల ప్రస్తుతానికి కోర్టులో బ్రేకుపడ్డా - వచ్చేవారం తీర్పు ఎంత లక్షణంగా వస్తుందో తెలియదు. ‘గీత’ గీత బాగుండి ఈ కేసు వీగిపోయినా, రేపు ఇంకోచోట ఇంకో కేసు, ఇంకో రూపంలో ఇంకో ఉచ్చు ఇస్కాన్‌నూ, హిందూ ధర్మాన్నీ వెంటాడదన్న గ్యారంటీ లేదు.
మతాలతో, విశ్వాసాలతో నిమిత్తం లేకుండా నిఖిల మానవాళికి శాశ్వత మణిదీపం, జ్ఞానామృత సారం అయిన భగవద్గీతనే తీవ్రవాద సాహిత్యమని పేరుపెట్టి నిషేధించే పక్షంలో అవశ్యం నిషేధయోగ్యంకాని మతగ్రంథం ప్రపంచంలో ఒక్కటైనా మిగులుతుందా?
 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech