సారస్వతం  
     వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు  
భీమేశ్వర పురాణంలో శ్రీనాథుని గాథాసప్తశతిలోని పద్యం !

 

ఉ.    వాలికమోము మత్తవనబర్హకిశోరకలాస్యలీలఁ బై
వాలిచి పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవిందతాం
బూలపు మోవి మోవిపయి మోఁపుచు రాధకు నిచ్చు ధూర్తగో
పాలుఁడు ప్రోచుఁ గావుత మపారకృపామతి మంత్రి యన్ననిన్.

ఇది శ్రీనాథుని భీమేశ్వర పురాణం అవతారికలోని మూడవ పద్యం. తెలుగు సాహిత్యంలో రాధాకృష్ణుల మధురశృంగారాన్ని పాఠకులకు పరిచయంచేసిన తొలిరచనగా గుర్తింపును పొందింది. అయితే ఇది ఆయన బాల్యకృతి అయిన శాలివాహన గాథాసప్తశతి ఆధారితమై, అందులోనిదే కావచ్చునని విమర్శకులు ఇంతవరకు గుర్తింపకపోవటం ఆశ్చర్యం!


        ముందుగా క్రీ.శ. 50 - 72 ప్రాంతాల ప్రాకృతంలో హాలుడు సంధానించిన గాథను చూద్దాము:
       
"ముహమారుఏణ తం కణ్హ! గోరఅం రాహిఆఏఁ అవణేన్తో,
       ఏతాణం వల్లవీణం అణ్ణాణం వి గోరఅం హరసి."

      
  అని మూలం. 1881లో ప్రాకృత గాథాసప్తశతిని సర్వపాఠాంతరసమాకలనపూర్వకంగా సప్రమాణంగా పరిష్కరించి, జర్మన్ భాషానువాదంతో సవ్యాఖ్యానంగా లీప్‌జిగ్‌లో అచ్చువేసిన మహావిద్వాంసుడు ఆల్బ్రెహ్ట్  వెబర్ దీనిని ప్రథమశతకంలో 89-వ గాథగా గ్రహించి, ఇది “పోట కవి” రచనమని పేర్కొన్నాడు. ఆధునికపరిష్కర్త లందరూ “పొట్టిస కవి” కృతమని అంటున్నారు.

        గా
థార్థం ఇది: గోధూళి వేళ రాధాకృష్ణులు ఇంటికి తిరిగివస్తున్నారు. ధూళికణం (గోరఅం = గోరజం) రాధ కంటిలో పడింది. ఆమె కన్నులు ఎఱ్ఱబారాయి. గోపికలందరూ గొల్లున నవ్వినట్లున్నారు. దుఃఖం పెల్లుబికి రావటం సహజం. తలవంచుకొన్నది. గోపాలకృష్ణుడు ఆ దుఃస్థితిని చూసి రాధిక(రాహిఆ)ను దగ్గరకు తీసికొని, నోటితో గాలి ఊదుతూ (ముహమారుఏణ) ఆమె కంటినలుసును తొలగించివేశాడు (తం గోరఅం రాహిఆఏఁ అవణేన్తో). నలుగురిలో కృష్ణుడలా చేస్తాడని గోపిక లనుకోలేదు. రాధాకృష్ణుల భావబంధం సంగతి వారికి తెలియనిది కాదు. సిగ్గువల్లనో అపవాదభయం వల్లనో ఆమెను చూసీ చూడనట్లు ఊరుకొంటాడని వారి నమ్మకం.  కానీ అలా జరగలేదు. కృష్ణుడు వారి (గోరఆ = గౌరత) తెల్లని ముఖకాంతిని హరించివేసినట్లుగా అందరి ముఖాలు ఎఱ్ఱబడ్డాయి, ఎంతపని చేశావయ్యా, కృష్ణయ్యా! అని.

        ఇందులోని విశేషం ఏమిటి? హాలుని సప్తశతకానికి  గంగాధర టీకను వ్రాసిన మహనీయుడు రసజ్ఞమౌళి గంగాధరుడు చెప్పాడు, “రజోఽపనయనచ్ఛలేన చుంబన్” అంటూ ఈ సన్నివేశంలో ధ్వనిస్తున్న అసలు విషయాన్ని.
       రాధిక కన్నులలో ముఖమారుతాన్ని ఊదే నెపంతో శ్రీకృష్ణుడు ఆమెను దగ్గరకు తీసుకొని మోము అరవాల్చి ఆమె పెదవులను అందుకొని ముద్దుపెట్టుకొన్నాడు. రాధాకృష్ణుల ప్రేమ లోకానికి వెల్లడయింది. గోపికల ముఖగౌరతనే కాదు, వారి గర్వాన్ని కూడా హరించినట్లయింది.  ఎందుకంటే, తక్కినవారందరూ అణ్ణాసం వల్లవీణాం = పరాయి ఆడవాళ్ళు. పరకీయలు. రాధ ఒక్కతే ఆయన ప్రణయసామ్రాజ్యానికి పట్టమహిషి.


       
రచన క్రీస్తుశకం మొదటి శతాబ్దం నాటిది. కవితాద్రవ్యాలన్నీ ఆ రోజుల్లో కొత్తవి. ముఖగంధం, వదనమారుతం, నిశ్శ్వాస పరిమళం – ఇవన్నీ శృంగారవర్ణనలలో అప్పటి కవులు సాహిత్యంలో సరికొత్తగా ప్రవేశపెట్టినవి.

మనసులకు హత్తుకొనిపోయే ఈ శృంగారభావోద్దీపన పరికరాలను, ఈ గాథను మహాకవి కాళిదాసు అంతటివాడు కూడా తన అభిజ్ఞానశాకుంతలంలో వినియోగించుకొన్నాడు. తృతీయాంకంలో శకుంతల, “కణ్ణుప్పలరేణుణా కలుసీకిదా మే దిట్ఠీ” అంటుంది. అది ప్రేమికుల మధ్య చోటుచేసికొన్న చనవుకు, రాగాతిశయవ్యక్తికి తొలిమెట్టు. “చెవికమ్మగా ఉన్న పువ్వునుంచి ఎగిరి పుప్పొడి కంట్లో పడినందువల్ల దృష్టి కలుషితమైంది” అని. గాథాసప్తశతిలో గోధూళి వేళ రాధ కంటిలో పడిన ధూళికణం కాళిదాసు కథనంలో శకుంతల కన్నులలో చిందిన పుష్పరజం అయింది. అప్పుడు, “యద్యనుమన్యసే, తదాహ మేనాం వదనమారుతేన విశదాం కరిష్యే” అని దుష్యంతు డంటాడు. “సరే, నీవు అంగీకరిస్తే గాలి ఊదినంతలో విశదం చెయ్యనూ?” అని. ఆయన రతోత్సుకుడైన నాయకుడు. అందుకు, “తదో అనుకమ్మిదా భవే” అని శకుంతల అంటుంది. “అయితే, మీ దయ ఉందన్నమాటే!” అని. ఇది ఆమె ఆభిముఖ్యానికి మలిసూచన. ఈ సంభాషణాక్రమంలో ఉట్టిపడుతున్న సుకుమారమైన ప్రణయభావానికి కాళిదాసు తన కుశలకరాంగుళులతో ప్రాణంపోశాడు. నాయికానాయకులకు ప్రథమాంకంలో అంకురించిన హృదయరాగం ప్రవర్ధితమై, ద్వితీయాంకం నాటికి సువ్యక్తమైంది. సాన్నిహిత్యం పెరిగింది. ఈ సన్నివేశంలో దుష్యంతుడు రజోవిశదిమ నేపథ్యం వల్ల ఎన్నడూ లేనంతగా ఆమెకు చేరువై, ఆమె కర్ణోత్పలసాన్నిధ్యం వల్ల మరింత మైమఱచిపోతాడు. కన్నులలో పడిన పుష్పరజాన్ని వదనమారుతంతో తొలగిస్తునప్పుడు అధరచుంబనాభిలాష బలీయం అవుతుంది. ఆమె ముఖాన్ని “ఉన్నమయితుం ప్రవృత్తః” కొద్దిగా తనవైపుకు తిప్పుకోబోతాడు. ఆమె “ప్రతిషేధం రూపయన్తీ విరమతి” వద్దువద్దన్నట్లు తప్పుకొంటుంది. ముద్దుపెట్టుకోవాలన్న కోరికను అతని కన్నులలో చూసి, “భూఓ వి సహీఅణం అణుమాణఇస్సం” - చెలులు చూస్తే అనుమానిస్తారేమో! అని మృదువుగా అతనిని అపవారిస్తుంది. ప్రియాముఖదర్శనపారవశ్యంలో ఉన్న దుష్యంతుడు తేరుకొని, “సురభి ముఖం తే మయా యదాఘ్రాతమ్” అని చిరునవ్వుతో అంటాడు.
ఈ ఘట్టం ప్రముఖమైన శాకుంతల దాక్షిణాత్య ముద్రణలలో లేదు. కాళిదాసు అభిజ్ఞానశాకుంతలాన్ని క్రీస్తుశకం 1600 - 1650 నాటి చంద్రశేఖరుని ప్రామాణికమైన అద్భుతవ్యాఖ్య ఆధారితంగా 1877లో లండనులో పరిష్కరించి అచ్చువేసిన ప్రాకృతభాషామహాపండితుడు రిఛర్డ్ పిషెల్ మనోజ్ఞమైన ఈ ఘట్టాన్నంతటినీ తన మూలంలో చేర్చుకొన్నాడు. మైథిలీ, వంగదేశాల ప్రతులలోనూ; అక్కడి శంకర చంద్రశేఖర నరహరి పండితాదుల వ్యాఖ్యలలోనూ; ముఖ్యమైన ఔత్తరాహ ప్రతులలోనూ, తదాధారితాలైన ముద్రణలన్నింటిలోనూ ఈ ఘట్టం ఉన్నది.
నాయిక కన్నులలో చిందిన పుష్పరజం నాయకునికి అధరచుంబనాభిలాషను రగుల్కొలిపిన ఈ సన్నివేశం శ్రీనాథునికి ఎంతో మెచ్చుగొలిపి ఉండాలి. అది సప్తశతికి అనుబంధితమే కదా. రెండింటినీ అన్వయించాడు. ఆయన తన
చిన్నారి పొన్నారి చిఱుతకూకటివేళ చదువుకొన్న కాటయ వేమారెడ్డి రచించిన కుమారగిరిరాజీయ వ్యాఖ్య పాఠంలో లేకపోయినా, అప్పటికే దేశమంతటా అధికపాఠంతోడి అభిజ్ఞానశాకుంతలం ఔత్తరాహ ప్రతులు ప్రచారంలో ఉన్నాయి. దానికితోడు భువనపాలుడు గాథాసప్తశతికి కూర్చిన గాహాకోస టీకనూ, గంగాధర భట్టు రచించిన గంగాధర టీకనూ చూచిన శ్రీనాథునికి ఈ స్ఫురణ కలిగి మూలాతిరిక్తంగా కవిహృదయాన్ని తన గాథాసప్తశతి అనువాదంలోనూ, భీమేశ్వర పురాణంలోనూ ఆవిష్కరించాడని గ్రహింపవచ్చు.
కాటయ వేముడు పై సన్నివేశానికి పర్యాయంగా తన వ్యాఖ్యలో వేఱొక అందమైన దాక్షిణాత్యపాఠాన్ని గ్రహించాడు. “అపరిక్షతకోమలస్య యావత్ కుసుమస్యేవ నవస్య షట్పదేన, అధరస్య పిపాసతా మయా తే సదయం సున్దరి! గృహ్యతే రసోఽస్య” అని దుష్యంతుడంటాడు. అంటూ, “ఇతి సమున్నమయితు మిచ్ఛతి” - ముఖాన్ని పైకి లేవనెత్తబోతాడు. శకుంతల నాట్యభంగిమతో అపవారిస్తుంది.
ఈ “నాట్యభంగిమ” అన్న పదబంధం కూడా శ్రీనాథుని గుండెలలో నిలిచిపోయింది. దుష్యంతుడు సిగ్గుతో పరాఙ్ముఖియై ఉన్న ఆమె చిబుకాన్ని త్రిపతాకా హస్తంతో మునివ్రేళ్ళతో లీలగా స్పృశించి, మాధ్యమాతర్జన్యంగుళులతో పైకి లేవనెత్తి, అధరచుంబనాభిలాషను వ్యక్తం చేశాడు. “పరాఙ్ముఖీకృతం శీర్షం పరావృత్త ముదీరితమ్, తత్కార్యం కోపలజ్జాదికృతే వక్త్రాపసారణే. ముఖాన్తర్నిహితప్రాణశాధ్యేషు వినిగూహితః, రోషేర్ష్యయోశ్చ నారీణాం బలాచ్చుమ్బతి వల్లభే” అని శాస్త్రవచనం కదా! “వాలికమోము మత్తవనబర్హకిశోరకలాస్యలీల” అన్న దళం పై దృశ్యాభినయాన్ని కన్నులకు కట్టింది. అది శ్రీనాథుని కాళిదాస భక్తికీ, నాట్యశాస్త్ర లక్షణపరిజ్ఞానానికీ తిరుగులేని సాక్ష్యం.
“వాలిక మోము” లాస్యాంగం. రాధ కన్నులలో చిందిన గోరజాన్ని వదనమారుతంతో ఊదినప్పుడు ఆమె వాలిక మోము(వివర్తితాస్యం)తో ఉన్నది. అది అంగాభినయంలో పార్శ్వకర్మ చిత్రణం. "ముహురఙ్గులిసంవృతాధరోష్ఠం, ప్రతిషేధాక్షరవిక్లబాభిరామమ్, ముఖ మంసవివర్తి పక్ష్మలాక్ష్యాః, కథ మ ప్యున్నమితం న చుమ్బితం తు" అని శాకుంతలంలోనూ (కాటయ వేమారెడ్డి పాఠంలో తృతీయాంకం: 22-వ శ్లోకం) ఇదే అనురణించింది. శ్రీనాథుని చిత్రణలో రాధ నేత్రయుగళి ముఖరాగాన్వితమై కృష్ణునికి మరింత శోభాకరంగా కనుపించిందన్నమాట. పుష్పరజఃపాతాన్ని గౌణీకరించి, అధరకర్మను ప్రధానీకరించాడు. ఈ వివర్తితాధరాన్ని కొమరగిరిరెడ్డి తన వసంతరాజీయంలో వివరించాడట.  కాటయ వేమారెడ్డి తన వ్యాఖ్యలో చెప్పాడు. శ్రీనాథుడు దానిని ప్రాతిబోధికం చేశాడు. కాళిదాసు వర్ణించిన అధరస్పందం శ్రీనాథుని రూపణలో స్ఫురితక చుంబితంగా పరిణమించింది. “వాలికమోముపై  వాలిచి - మోవి మోవిపయి మోపుచు” అని నిమిత్తీకరించాడు. నెమలి పింఛాన్ని సిగలో తురుముకొన్న శ్రీకృష్ణుడు మహాకవి శ్రీనాథునికి మత్తిల్లిన వనమయూరకిశోరంలా కనుపించటం ఎంతో సహజంగా ఉన్నది. “సురభి ముఖం తే మయా ఆఘ్రాతం” అన్న దుష్యంతుని వచనమే తెలుగులోకి వచ్చి, “పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవింద తాంబూలపు మోవి” తోడి అధరపానమై, రాధికకు శృంగారోద్దీపన మంత్రమై కళలను కరగించింది. “మోవిపయి మోపుచు” అన్న దృశ్యీకరణ ఆమె ఆభిముఖ్యానికీ, రాగాభివృద్ధికీ సూచకం. 

        ఇంతకీ రాధాకృష్ణుల సమావేశం గోరజఃపాతవశాన సిద్ధించింది. కృష్ణుడు దానిని అధరచుంబనావకాశంగా మలచుకొన్నాడు. అందుకే శృంగారధూర్తుడన్న (“ధూర్తగోపాలుఁడు”) బిరుదప్రదానం జరిగింది. శ్రీనాథుని ప్రయోగంలో అది విరసత్వబోధకం కాదు. సరసత్వసాధకమే. “మందరాచల కందరా మథ్యమాన, దుగ్ధపాథోధిలహరికా ధూర్త యైన, లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి” (భీమ. 1 – 4) ఆయనకు ఆరాధ్యదేవత కదా!

        గాథాసప్తశతి శ్రీనాథుడు పదహారేళ్ళ నూనూగు మీసాల నూత్నయౌవనం నాడు చెప్పిన రచన.
        “క.   జగము నుతింపఁగఁ జెప్పితి
              ప్రెగడయ్యకు నా యనుంగుఁబెద్దనకుఁ గృతుల్
              నిగమార్థసారసంగ్రహ
              మగు నా యారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్.”

        అని శృంగార నైషధంలో (1 – 14) మామిడి సింగనామాత్యు డంటాడు. “ఆరాధ్యచరిత” అంటే పండితారాధ్య చరిత్ర. పాల్కుఱికి సోమనాథుని పండితారాధ్య చరిత్రకు పద్యపరివర్తనం. “ఆదిగ” అని చెప్పిన ఆ మొదలైన పెక్కు కృతులలో శాలివాహన సప్తశతి కూడా ఉన్నది కాబోలు. “అనుంగు పెద్దన” అంటే సింగనామాత్యుని అన్నగారు మామిడి ప్రెగడయ్య. సప్తశతిని ఆయనకే అంకితం చేశాడేమో. భీమేశ్వర పురాణ రచనాసమయంలో అది జ్ఞాపకం వచ్చింది. అందుకూ కారణం లేకపోలేదు.

        భీమేశ్వర పురాణం కృత్యాదిలోని ఇష్టదేవతా ప్రార్థనంలో శ్రీనాథుడు భీమేశ్వరస్వామి కృతిపతి బెండపూడి అన్నమంత్రిని కాపాడు గాతమని మొదటి పద్యంలో చెప్పాడు. ఆ తర్వాతది వినాయక స్తుతి.

        “ఉ.  ఏనికమోముతా, ల్పెలిక నెక్కిన రావుతు రాచవారు, సే
              నాని యనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు” 

        అని వ్రాశాడు. “అనుంగు పెద్దన” అనగానే చిన్ననాటి శాలివాహన సప్తశతి స్ఫురించింది. అందులోని పద్యం చివఱ నున్న గోరజఃపాత ప్రసక్తిని తీసివేసి కృతిపతికి ఆశీర్ముఖంగా ప్రస్తుతీకరించుకొన్నాడు. తెలుగు సాహిత్యానికి అనర్ఘమైన పద్యరత్నాన్ని ప్రసాదించాడు.

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech