సారస్వతం  
     తెలుగు పరిశోధనలు - రచన : డా. రావి రంగారావు  
- భాషాబోధన

 

సాధారణంగా తెలుగు పరిశోధన లనగానే మనకు గుర్తుకు వచ్చేది సాహిత్య పరిశోధనలే. అవి కవిత్వానికి, కథలకు, నవలలకు, నాటికలకు, నాటకాలకు ...ఇంకా ఇలాంటి ప్రక్రియలకు సంబంధించినవే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. భాషకు సంబంధించిన పరిశోధనలు కూడా మనకు బాగానే గుర్తుకు వస్తాయి. భాషల పుట్టుక, లిపి పరిణామం, వ్యాకరణ చరిత్ర...మొదలైన అంశాలు కూడా గుర్తుకు వస్తాయి. మన మాతృభాష బోధించటానికి సంబంధించి, బోధనా పద్ధతులగురించి పరిశోధనలు గుర్తుకు రావు. అందుకు ముఖ్య కారణం తెలుగు భాషా బోధనకు సంబంధించి ఎక్కువగా పరిశోధనలు రాకపోవటం.
తెలుగు భాషను బతికించేవి తెలుగు బోధనా పద్ధతులు
మన తెలుగు మృత భాష కాబోతోందని దిగులు పడేవాళ్ళు కూడా తెలుగును కాపాడే ప్రాణశక్తి "బోధనాశాస్త్రం" అని గుర్తు పెట్టుకోవాలి. బోధన బాగుంటేనే విద్యార్థులు ఆ భాష నేర్చుకుంటారు. ఆ భాష వినియోగంలో బతుకుతుంది.
మన విశ్వవిద్యాలయాలలో "తెలుగు" విభాగంలో పరిశోధన "భాషాబోధన"కు సంబంధించిన అంశాలపై జరగటం లేదు. ఈ విధానం సరైనది కాదు. భాష, సాహిత్యం అంశాలతో పాటు భాషాబోధనకు సంబంధించిన వివిధ అంశాలమీద కూడా పరిశోధనలు జరగటం తక్షణ అవసరం.
విశ్వవిద్యాలయాల"ఎడుకేషన్" విభాగాలలో తెలుగు భాషాబోధనకు అన్యాయం
ప్రస్తుతం భాషాబోధన అంశాలపై కొంత పరిశోధన జరుగుతున్నది విశ్వవిద్యాల లోని "ఎడుకేషన్" విభాగాలలోనే. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలలో కూడా భాషాబోధనమీద జరుగుతున్నది ఒక్క శాతం మాత్రమే. అది కూడా మొక్కుబడిగా జరుగుతున్నదే. ఇక్కడ ఎం.ఎడ్. , ఎం.ఫిల్. పిహెచ్ డి., చేసే విద్యార్థులు తెలుగు బోధనా పద్ధతులకు సంబంధం లేని ఇతర విద్యాంశాలపై మాత్రమే పరిశోధనలు చేస్తున్నారు. తెలుగును బి.ఏ., ఎం.ఏ., లలో ప్రత్యేక విషయంగా చదివిన విద్యార్థులు కూడా "ఎడుకేషన్" విభాగంలోకి చేరేసరికి వారికి తెలుగు బోధనా పద్ధతులపై పరిశోధన చేయాలని ఉన్నా ఇక్కడి ఆచార్యులు అందుకు ప్రోత్సహించకుండా ఇతర అంశాలపై పరిశోధన చేయాలని సూచించటంతో తెలుగు భాషకు, తెలుగు భాషా బోధనకు, తెలుగు అధ్యాపకులకు, తెలుగు నేర్చుకొనే విద్యార్థులకు… మహా భయంకరమైన అన్యాయం జరుగుతోంది. ఒకవేళ - బాగా తెలుగును అభిమానించే పరిశోధకుడు తెలుగు భాషాబోధనకు సంబంధించిన అంశాలపైనే పరిశోధన చేస్తానని పట్టు పడితే ...ఒక పెద్ద అవరోధం సృష్టించి అక్కడ పెట్టారు. తెలుగు భాషాబోధనకు సంబంధించిన ఏ అంశమ్మీద పరిశోధన చేసినా ఆ పరిశోధకుడు దానిని ఆంగ్లభాషలోనే సమర్పించాలి. ఈ నిబంధన అంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలలోను ఇప్పటికీ ఉంది. దీన్ని పట్టించుకున్న మాతృభాషా ఉద్యమకారులు లేరు.
ఎం. ఎడ్. డిగ్రీ విద్యార్థులు కొందరు తెలుగు భాషాబోధనకు సంబంధించిన అంశాలపై కొన్ని వ్యాసాలు తెలుగులో రాసి సమర్పించటం జరుగుతోంది కాని అవి అంతగా పనికి వచ్చేవి కావు. ఏదో డిగ్రీ తెచ్చుకోటానికి అవి అవసరం కాబట్టి మొక్కుబడిగా రాస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇలా ఎం.ఎడ్. విద్యార్థులకు మాత్రం వెసులుబాటు కల్పించటం జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం "ఎడుకేషన్" విభాగంలో తెలుగు భాషాబోధనకు సంబంధించిన పరిశోధనలు తెలుగులో రాయటానికి అనుమతిద్దా మని ఈ వ్యాసకర్త "ఎడుకేషన్" విభాగానికి "బోర్డ్ ఆఫ్ స్టడీస్ " అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రతిపాదిస్తే ద్రావిడ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆచార్యులు రామకృష్ణయ్య సమర్ధించారు కాని మిగిలిన సభ్యు లందరూ మొండిగా వ్యతిరేకించారు అని చెప్పటానికి నేను సిగ్గుపడుతున్నాను.
ఒక దశాబ్దం కింద కొంత పోరాటం జరిపిన మీదట ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని "ఎడుకేషన్" విభాగంలో తెలుగు భాషాబోధన గురించి రాసిన అంశాలమీద తెలుగు భాషలోనే రాసి తెలుగు భాషలోనే సమర్పించిన పిహెచ్ డి. సిద్ధాంథ గ్రంథాలు కొన్ని వచ్చాయి. అందుకు అప్పట్లో విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా పని చేసిన రావెల సాంబశివరావు కృషి మరువలేనిది. అప్పుడు తెలుగులో రాసి తెలుగులోనే సమర్పించిన కొన్ని అంశాలు ఇవి. పిల్లలతో కవిత్వం రాయించే సంవిధానాలు (రావి రంగారావు ), బాల సాహిత్యంలోని కథలు - విద్యా విలువలు (గుడివాడ ప్రభావతి) తెలుగులోనే తమ పరిశోధనలు సమర్పించి పిహెచ్ డి. డిగ్రీలు పొందారు.అలాగే ఎం. ఇందిరాదేవి, సత్యవతీమూర్తి, శాయి లీల మొదలైన వారు కూడా తెలుగులొనే తెలుగు బోధనా పద్ధతుల గురించి రాసి తమ పిహెచ్.డి. డిగ్రీలు పొందారు.
ఇక తెలుగు భాషాబోధనకు సంబంధించి అద్భుతమైన పరిశోధనలు వస్తాయని, తెలుగు భాష బోధన ప్రమాణాలు పెరుగుతాయని ఆశిస్తూ సంతోషిస్తున్న తరుణంలో రావెల సాంబశివరావు పదవీ విరమణ చేయటంతో విశ్వవిద్యాలయం "ఎడుకేషన్" విభాగం వారు మళ్ళీ పాత నిబంధన అమలు కావల్సిందేనని తీర్మానం చేశారు. తెలుగు బోధనకు సంబంధించిన అంశాలపై చేసే పరిశోధనలైనా సరే అన్నీ ఆంగ్లభాషలోనే రాసి సమర్పించాలనే నిబంధన తిరిగి తీసుకువచ్చి తెలుగు భాషాబోధన పరిశోధనకు తీవ్ర అన్యాయం చేసి తాము అసలు సిసలు తెలుగు వారమని నిరూపించుకున్నారు.
తెలుగు భాషోద్యమకారులు పోరాటం చేయాల్సిన విషయాలు
తెలుగు భాషోద్యమ కారులు ఇప్పటికైనా 3 సంగతులపై దృష్టి సారించి పోరాడాలి.
1. విశ్వవిద్యాలయాలలోని "తెలుగు" విభాగాలలో "తెలుగు భాషాబోధన"కు సంబంధించిన అంశాలపై పరిశోధనలు విరివిగా వచ్చేలా చర్యలు ప్రారంభం కావాలి.
2. విశ్వవిద్యాలయాలలోని "ఎడుకేషన్" విభాగాలలో తెలుగు భాషాభోధనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు తెలుగులోనే రాసి తెలుగులోనే సమర్పించేలా అవకాశాలు సత్వరం కల్పించాలి.
3. ప్రభుత్వం "తెలుగు భాషాబోధన"కు ప్రత్యేకించి ఒక పరిశోధన పీఠం నెలకొల్ఫాలి. ఇందువల్ల మంచి ప్రమాణా లున్న తెలుగు భాషా బోధన పరిశోధనలు వచ్చి తెలుగు భాషా బోధన మెరుగు పడుతుంది.
ప్రాథమిక దశ తెలుగు బోధన గురించి పరిశోధనలు
ప్రాథమిక దశలో ముఖ్యంగా ఈ క్రింది భాషా నైపుణ్యాల మీద పరిశోధనలు విరివిగా జరగాలి.
1. భాషణం.2. పఠనం .3. లేఖనం.
ప్రాథమిక దశలో భాషణం లక్షణాలు అన్నిటి మీద నిర్దుష్ట మైన పరిశోధనలు జరగాలి. అలాగే పఠనం లక్షణాలు అన్నిటిమీద, లేఖనం లక్షణాలు అన్నిటిమీద పరిశోధనలు జరగాలి. ప్రాథమిక దశ విద్యార్థులకు ఈ భాషా నైపుణ్యాలు బోధించటానికి ఏయే పద్ధతులు బాగా ఉపకరిస్తాయో నిరూపణలు జరగాలి. మన రాష్ట్రప్రభుత్వం ఇంగ్లండ్ మొదలైన దేశాలకు మన జిల్లా విద్యా శిక్షణ సంస్థల అధ్యాపకుల్ని పంపి అక్కడ అంగ్ల భాషా నైపుణ్యాల బోధనా పద్ధతులను అధ్యయనం చేయించి ఇక్కడ అమలుచేయాలని గత దశాబ్దం పైగా రకరకాల పథకాల పేరులతో డబ్బు ఖర్చు చేస్తున్నది.
అంగ్ల భాషా నైపుణ్య బోధనా పద్ధతులను నేరుగా తెలుగు భాషా నైపుణ్యాల బోధనకు పూర్తిగా వినియోగించుకొనటం కుదరదు. ఆంగ్ల భాషా నైపుణ్యాల బోధనకు అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధథి, కథా పద్ధతి... వారు ఇంగ్లండ్ లో అమలు చేస్తున్నారు. ఈ పద్ధతులలో కూడా వారు కథా పద్ధతి/వాక్య పద్ధతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవే మిగిలిన పద పద్ధతి కన్న, అక్షర పద్ధతికన్న పిల్లలకు బాగా పనికి వస్తాయని వాళ్ళూ తేల్చి చెప్పారు. ఈ కథా/వాక్య పద్ధతులే తెలుగు భాషా నైపుణ్యాల బోధనకు బాగుంటాయని చెప్పటానికి కుదరదు. ఆంగ్ల భాషలో 26 అక్షరాలే ఉన్నాయి. కాని తెలుగులో అంతకు రెట్టింపు అక్షరాలు ఉన్నాయి. పైగా గుణింతాలు, ఒత్తులు, ద్విత్వ్వాలు, సం యుక్తాలుతో కూడిన వందలాది రూపాలు విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి. ఆంగ్ల భాషలో ఒక వాక్యం ఇచ్చినపుడు అందులో ఉండే అయిదారు అక్షరాలు గుర్తు పెట్తుకొంటే చాలు. కాని తెలుగు వాక్యంతో తెలుగు భాషా నైపుణ్యాల బోధన ప్రారంభిస్తే ఆ వాక్యంలో అనేక అక్షరాలు ఉంటాయి, అందులో అనేక గుణింతాలు ఉంటాయి, ద్విత్వాలు, సం యుక్తాలు కూడా ఉండవచ్చు. కొత్తగా తెలుగు భాషా నైపుణ్యాలు నేర్చుకొనే వారు ఇన్ని ఆకారాలు గుర్తు పెట్తుకోవటం సాధ్యపడదు. అక్షరాలతో బోధన ప్రారంభించటం అర్థ రహితం... విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండదనేది నిజమే కాని అలా అని చెప్పి విద్యార్థులకు సాధ్యం కాని కథా/వాక్య పద్ధతిలో నైపుణ్యాల బోధన ప్రారంభించా లనటం వల్ల ప్రయోజనం ఉండదు. పద పద్ధతి అయితే అందులో అక్షరాలు పరిమితం కాబట్టి , పదాలకు అర్థాలు కూడా ఉంటాయి కాబట్టి తెలుగు భాషా బోధనా నైపుణ్యాలు ప్రాథమిక దశ విద్యార్థులకు బోధించేటప్పుడు పద పద్ధతితో ప్రారంభించటం మంచిది. ఇలా మాటలు చెబితే కుదరదు. ఈ సంగతు లన్నీ ప్రయోగాత్మకంగా నిరూపించాలి, అనేక పరిశోధనలు జరగాలి. కేవలం ఆంగ్ల భాషా నైపుణ్య బోధనా పద్ధతులు తెలుగు భాషా నైపుణ్యాల బోధనలో గుడ్డిగా అమలు చేయకూడదు.
మాధ్యమిక దశ తెలుగు బోధన గురించి పరిశోధనలు
మాధ్యమిక దశలో తెలుగు బోధించటంలో ఈ క్రింది ప్రయోజనాలు ఉన్నాయి.
1. విషయ జ్ఞానం, విషయ అవగాహన
2. ఆనందానుభూతి.
3. భాషా, సాహిత్య, సాంస్కృతిక అభిరుచులు
4. దయ, ప్రేమ, సహకారం, నిజాయితీ, దేశభక్తి, ప్రపంచ శాంతి, ఆత్మాభిమానం మొదలైన వైఖరులు.
5. పరిపూర్ణ మానసిక శక్తుల వికాసం...
ఈ ప్రయోజనాలు సాధించా లంటే తెలుగు సాహిత్యం బోధించాలి. తెలుగు సాహిత్యం అంటే తెలుగు కథలు, కావ్యాలు, ఆధునిక సాహిత్య ప్రక్రియలు మొదలైన వన్నీ బోధించాలి. మాధ్యమిక , ఉన్నత దశలలో విద్యార్థుల వాచకాలలో అన్ని రకాల సాహిత్య ప్రక్రియల బోధన ఉండాలి. ఇప్పు డున్న వాచకాలలో పద్యం, గద్యం తప్ప ఇతర సాహిత్య ప్రక్రియలకు స్థానం చాలా స్వల్పం. ప్రతి సాహిత్య ప్రక్రియ ఎందు కుండాలో, ఉంటే కలిగే ప్రయోజనా లేంటో విపుల మైన పరిశోధనలు జరగాలి. ఇలాంటి పరిశోధనలు ప్రయోగాత్మకంగా జరగాలి. ఇలా జరిగిన ప్రయోగాలు మనకు కనిపించవు.
పద్య బోధన

మాధ్యమిక, ఉన్నత దశలలో ఎప్పటినుంచో కనిపించేది పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన మాత్రమే. స్వతంత్రం వచ్చినపుడొ రాక పూర్వమో ఇవి మొదలు పెట్టారు. ఆంగ్ల భాషా బోధనలో పద్య బోధనలో వాళ్ళు పూర్ణ పద్ధతి అని, ఖండ పద్ధతి అని చెప్పారు. ఇప్పటికీ మన ఉపాధ్యాయ శిక్షణలో పద్య బోధన అనగానే అవే చిలక పలుకులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. పూర్ణ పద్ధతి మంచి పద్ధతి అని, ఖండ పద్ధతి మంచి పద్ధతి కాదని ఆంగ్లేయుల్ని నమ్మి ఇప్పటికీ ఉపాధ్యాయ విద్యలో నేటికీ చెబుతున్నారు. అసలు ఈ రెండు పద్ధతులలలో ఏది మంచి పద్ధతో ప్రయోగాత్మకంగా తేల్చి చెప్పిన వాడు లేడు. అంగ్ల పద్య బోధనా పద్ధతు లన్నీ తెలుగు పద్య బోధనకు పనికి వస్తాయని గుడ్దిగా నమ్మటం ఇప్పటికీ మనం మానసిక దాస్యంలో ఉన్నా మనటానికి నిదర్శనం. వాళ్ళ పద్యం వేరు, మన పద్యం వేరు...పూర్తిగా తేడా లున్నయని చెప్పటం లేదు... చాలా తేడా లున్నాయి అనేది మనం గమనించాలని నా భావన. విశ్లేషణ పద్ధతి, చర్చా పద్ధతి… మొదలైన పద్ధతుల ద్వారా పద్య బోధన చేయవచ్చు అన్నారు కాని అవి మంచి ఫలితాలు ఇస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనలు జరగలేదు.
గద్య బోధన
ఇక గద్య బోధన విషయానికి వస్తే గద్య బోధనలో కూడా పూర్ణ పద్ధతి ద్వారా బోధన చేయవచ్చు అని పద్య బోధన పద్ధతిని గ్రహించారు కాని గద్యానికి ఏవైనా కొత్త పద్ధతులు ఆలోచిద్దామని ఎంచి వాటిపై పరిశోధనలు జరగలేదు. పద్య బోధనలో వ్యాకరణ బోధన అవసరం లేదని కొందరు పుస్తకాలు వ్రాసారు కాని అది సబబుగా లేదు. విద్యార్థుల పరీక్షలలో పద్య పాఠాలలోంచి సాంవత్సరిక పరీక్షలో వ్యాకరణ ప్రశ్నలు ఇస్తూనే ఉన్నారు. గద్య బోధనలో వ్యాకరణ చేయవచ్చు అని చెప్పిన వారు కూడా ఆ వ్యాకరణం ఎలా బోధించాలో స్పష్టంగా చెప్పిన వారు కాని పరిశోధించి నిరూపించిన వారు కాని లేరు. మరి కొందరు గద్య బోధనలో వ్యాకరణ బోధన చేయవచ్చు అని చెప్పి వ్యాకరణ బోధనా పద్ధతులు చెప్పేటప్పుడు వ్యాకరణం ప్రత్యేకించి విడిగా బోధించే పద్ధతులు ప్రస్తావించటం బాధ్యతారాహిత్యం.
వ్యాకరణ బోధన
వ్యాకరణం ప్రత్యేకంగా విడిగానే బోధించాలని భావించి చెప్పిన పద్ధతులు రెండు.
1. ఆగమన పద్ధతి. 2. నిగమన పద్ధతి. ఈ రెండు పద్ధతులు కూడా ఆంగ్ల వ్యాకరణ బోధన పద్ధతుల నుండి గ్రహించినవే. అంత మాత్రాన అవి గ్రహించకూడదని కాదు కాని మన వ్యాకరణానికి, ఆంగ్ల వ్యాకరణానికి తేడాలు ఉన్నాయని మరచిపోకూడదు. ఈ రెండు పద్ధతులలో కూడా ఆగమన పద్ధతి ద్వారా వ్యాకరణ బోధన మంచిదని ఆంగ్ల పండితులు అన్నారు కాబట్టి మన తెలుగు బోధనా పద్ధతులు రాసిన పండితులు కూడా మన వ్యాకరణ బోధనకు ఆగమన పద్ధతి మంచిదని తేల్చి చెబుతున్నారు కాని అది ఎంతవరకు మన వ్యాకరణ బోధనకు పనికి వస్తుందని పరిశోధనలు చేసి చెప్పలేదు.ముందు ఆగమన పద్ధతితో ప్రరంభించి నిగమన పద్ధతితో తెలుగు వ్యాకరణ బోధన ముగించవచ్చు అని చెప్పిన విశేషాలపై కూడా విశేషమైన పరిశోధనలు జరగాల్సి ఉంది.
ఇక మన చందస్సు, అలంకారాలు మొదలైనవి కూడా ఎలా చెప్తే బాగుంటుందో పరిశోధనలు జరగలేదు.
వాచకాలు, ఉపవాచకాలు
విద్యార్థులలో మాతృ భాష బోధన ప్రయోజనాలు సాధించటానికి వాచకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒకనాటి వాచకాలే చాలా బాగున్నాయని చాలా మంది పండితుల అభిప్రాయం. ఇపుడు వస్తున్న వాచకాలలో సంపుర్ణ విద్యా విలువలు లేవనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఒకనాటి వాచకాలలో కరుణశ్రీ పద్యాలు, జాషువా పద్యాలు, నీతి పద్యాలు, గొప్ప వ్యక్తుల గురించి గొప్ప కవులు రాసిన గొప్ప పద్యాలు... ఎన్నో ఉండేవి. ఇపుడు వస్తున్న వాచకాలలో పద్య పాఠాలు, గద్య పాఠాలు కూడా విద్యార్థుల మూర్తిమత్వ వికాసానికి ఉపకరించటం లేదనేది పెద్దల అభిప్రాయం. ఎం.ఎడ్. విద్యార్థులు కొందరు మాత్రం తెలుగు వాచకాలలో విద్యావిలువల గురించి చిరు పరిశోధనా వ్యాసాలు రాస్తున్నారు. ఇవి ఆ వాచకాల గురించి ప్రశంసిస్తూ వచ్చేవే ఎక్కువ. వీటిల్లో విశ్లేషణతో విమర్శిస్తూ వస్తున్న వ్యాసాలు చాలా తక్కువ.
ఉపవాచకాల గురించి పెద్దగా ఆలోచిస్తున్న వారే లేరని చెప్పవచ్చు. విస్తార పఠన నైపుణ్యం పెంపొందించటానికి ఉపవాచకాలు పెట్టారనే సంగతిని చాలామంది ఉపాధ్యాయులు కూడా మరచిపోయారు. ఉపవాచకం విద్యార్థులు సొంతంగా చదివి అర్థం చేసుకొని ఆనందించే స్థితికి అధ్యాపకుడు దోహదం చేయాలి. అలా చేస్తే రేపు విద్యార్థులు భావి జీవితంలో మంచి పుస్తకాలను ఎంపిక చేసుకొని సొంతంగా చదువుకొంటూ ఇంకా మూర్తిమత్వాన్ని పదును పెట్టుకోగలుగుతారు.అసలీ ప్రయోజనం అధ్యాపకులే మరచిపోయా రంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.అందుకే ఉపవాచకంలో పరీక్షలలో వస్తా యనుకొన్న ప్రశ్నల్ని ముందుగానే విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్నారు.
వాచకాలు, ఉపవాచకాలు సాధిస్తున్న ప్రయోజనాల గురించి విస్తార మైన పరిశోధనలు జరగాల్సి ఉంది. వాచకాలు, ఉపవాచకాలలో ఉంటున్న పాఠ్యాంశాల గురించి కూడా పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వంతో పాటు వివిధ ప్రాచీన సాహిత్య ప్రక్రియలతో పాటు ఆధునిక సాహిత్య ప్రక్రియల అవసరం గురించి కూడా పరిశోధనలు జరగాలి. వాచకాలు, ఉపవాచకాల భాష గురించి కూడా పరిశోధనలు జరగాలి. సరళ గ్రాంథిక భాష, ప్రామాణిక వ్యావహారిక భాష, మాండలిక భాషలను ప్రవేశపెట్టటం గురించి కూడా గట్టి ఆలోచనలు జరగాలి.
ఇతర దేశాలలో బోధనా పద్ధతులపై విశేష మైన పరిశోధనలు జరుగుతున్నాయి. వారి వారి మాతృ భాష బోధన పద్ధతులపై కూడా మంచి పరిశోధనలు జరుగుతున్నాయి… మన తెలుగు భాషా బోధనపై నిర్దుష్ట మైన పరిశోధనలు రావటం లేదు. ఈ విషయం మనం గుర్తించి తెలుగు భాషా బోధన పద్ధతులకోసం విస్తారమైన పరిశోధనలకు అవకాశం కల్పించాలి.
1978లో జరిగిన ఒక పరిశోధనలో తెలుగు బోధిస్తున్న తెలుగు అధ్యాపకులకు ఆధునిక కవిత్వం గురించి అవగాహన లేదని తేలింది. ఆధునిక కవిత్వం తెలుగు పాఠ్యాంశాలుగా పెడితే వారు సరిగా న్యాయం చేయలేరని నిరూపించబడింది.
ఇపుడు వస్తున్న తెలుగు అధ్యాపకులకు ఎక్కువ మందికి తెలుగు భాషమీద కూడా సంపూర్ణ అధికారం లేదని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి అరోపణల మీద కూడా విపుల మైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

తెలుగు అధ్యాపకుల ఎంపిక పరీక్ష "బహుళైచ్చిక ప్రశ్నలు"గా ఉండరాదు
గత పదేళ్ళనుండి నిర్వహిస్తున్న తెలుగు అధ్యాపకుల ఎంపిక పరీక్షలు కూడా ఉపయోగకరమైనవి కావని విమర్శలు వస్తున్నాయి. తెలుగు అధ్యాపకుడికి కావలసిన భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలు ఏమాత్రం పరీక్షింప బడటం లేదు. ఇతర సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కన్న తెలుగు బోధించే అధ్యాపకులకు విశిష్ట లక్షణాలు అవసరం అని ప్రభుత్వానికి సూచించే వారే కరువైనారు. ఎవరైనా చెప్పినా వినే స్థితిలో ప్రభుత్వం లేదు. ఏదో పరీక్ష పెట్టాలి, ఠక్కున కంప్యూటరు దిద్దాలి, పని అయిపోవాలి. అదీ స్థితి.
ఇపు డున్న తెల్ల సున్నాలను నల్ల సున్నాలుగా పెన్సిలుతో రుద్దటం అనే పని చదువు రాని వాడు కూడా చేయగలడు. తోచినట్లు నల్ల సున్నాలుగా చేసినా అందులొ కొన్ని కాకతాళీయంగా ఒప్పు సమాధానా లవుతాయి. వాడికి ఇన్ని మార్కులు వచ్చా యంటారు. వాడు ఇపుడు తెలుగు అధ్యాపకుడు. తెలుగు అధ్యాపకుడనే వాడికి ఇపుడు వ్యక్తీకరణ నైపుణ్యం అవసరం లేదు. పద్యానికి, గేయానికి తేడా తెలియవలసిన పని లేదు. పద్యంలోని విశేషాంశాలు తెలియాల్సిన పని లేదు. వాడు అవి బోధించాల్సిన పని లేదు. ఏ తెలుగు అధ్యాపకుడి నైనా "నీవు ఏ పద్ధతిలో బోధిస్తున్నావు అంటే నా పద్ధతిలో బోధిస్తున్నాను " అని సమాధానం వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
తెలుగు ఉపాధ్యాయ శిక్షకుల కొరత, ప్రమాణాల దారిద్ర్యం
ఇంకో భయంకర మైన స్థితి ఇపుడు మన రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో దాదాపు సగం కళాశాలల్లో తెలుగు బోధనా పద్ధతులు బోధించే ఉపాధ్యాయ శిక్షకులు లేరు. అయినా తెలుగు బోధనా పద్ధతుల పరీక్షలలో తెలుగు విద్యార్థులు ఉత్తీర్ణు లవుతున్నారు. సమాచార హక్కు చట్టం క్రింద విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులు రాసిన తెలుగు బోధనా పద్ధతుల పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు తీయిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. చాలా మంది విద్యార్థులు గాలి రాసినా ఉత్తీర్ణులవుతున్నారు. ఇందుకు కారణం దిద్దుతున్న ఉపాధ్యాయ శిక్షకులలో చాల మందికి అంకిత భావం లేకపోవటం … "పాపం పిల్లలు పాస్ చేద్దాములే" అనే అజ్ఞానం…వారిలోనే కొందరికి తెలుగు బోధనా పద్ధతు లేవో తెలియక పోవటం.... ఇలా అనేక కారణాల వల్ల తెలుగు భాషా బోధన అంధ్ర ప్రదెశ్ లో దయనీయ స్థితిలో ఉంది.
తెలుగు బోధనా పద్ధతుల గురించి విశేష కృషి చేసిన వారిలో కొందరు... గొడవర్తి సూర్యనారాయణ (అభినవాచార్యకం), రామచంద్రుని వేంకట శేషయ్య ( ఆంధ్ర భాషా బోధన సర్వస్వం), చింతా దీక్షితులు (తెలుగు బోధనా పద్ధతులు), కొంపల్లి ఆంజనేయ శాస్త్రి (భాషా నైపుణ్యాలు), వై.కె.బ్రహ్మానందం (భాషా బోధన), ఇలపావులూరి కామెశ్వరరావు (తెలుగు బోధన పద్ధతులు)... రాసిన పుస్తకాలను ఇప్పటి తరం తెలుగు అధ్యాపకులే కాదు, తెలుగు ఉపాధ్యాయ శిక్షకులు కూడా చూడటం లేదు. ఈ పుస్తకాలను ఇప్పటి తరం ఉపాధ్యాయ శిక్షకులు చదివితే విద్యార్థులతో భాషా బోధనకు సంబంధించి ఎలాంటి పరిశోధనాంశాల మీద కృషి చేయించవచ్చో తెలుస్తుంది. ఎం. ఎడ్., ఎం.ఫిల్., పిహెచ్ డి. డిగ్రీల కోసం విశ్వవిద్యాలయాలు తెలుగు బోధనా పద్ధతులగురించి పరిశోధనలు చేయించవచ్చు.
ఒక మంచి ముందడుగు
విశ్వవిద్యాలయాలలోని "తెలుగు" విభాగాలలో "తెలుగు బోధనా పద్ధతులు" ఒక ముఖ్య మైన పేపర్ గా పెట్టినందుకు కృష్ణా విశ్వవిద్యాలయాన్ని అభినందించాలి. ఇది మన రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగం చేయని గొప్ప పని. ఈ దారిలో మిగిలిన విశ్వవిద్యాలయాల "తెలుగు" విభాగాల వారు కూడా పయనించాలి. అపుడే తెలుగు బోధన సమగ్ర మవుతుంది. అలాగే తెలుగు బోధనా పద్ధతుల గురించి, విధానాల గురించి కూడా పరిశోధనలు చేయించాలి. ముఖ్యంగా మాధ్యమిక, ఉన్నత దశలలో తెలుగు భాష బోధనలొ ప్రమాణాలు పెంచే పరిశోధనల మీద విశ్వవిద్యాలయాల "తెలుగు" విభాగాలు దృష్టి పెట్టాలి.
సూక్ష్మాంశ బోధన నైపుణ్యాలు

అంతర్జాతీయ స్థాయిలో "బోధనలో సూక్ష్మాంశ బోధన నైపుణ్యాలు" ఎలెన్ ప్రభృతులు వ్యాప్తిలోకి తెచ్చారు. బోధించటం ఒక పెద్ద నైపుణ్యంగా భావించి అందులో ఉపనైపుణ్యా లెన్నో ఉన్నాయని గుర్తించారు. మచ్చుకు కొన్ని వారు గమనించిన సూక్ష్మాంశ బోధన నైపుణ్యాలు...
1. ప్రేరణ. ( దీనినే అంగ్లభాషలో " మోటివేషన్" అంటారు.) 2.వరుసగా ప్రశ్న లడగటం.
3. వివరించటం. 4. నల్లబల్లపై రాయటం. 5. బోధనోపకరణాలు ఉపయోగించుకొనటం.
6. మూల్యంకనం చేయటం...
ఈ విధంగా ఉపాధ్యాయుడు చేసే బోధనను విద్యార్థులకు జాగ్రత్తగా తెలియజెప్పటానికి వీలుగా అందులోని కృత్యాలను విడిగా విడిగా గుర్తింపజేసి ఒక్కొక్క కృత్యాన్ని విద్యార్థులకు బోధిస్తా రన్న మాట. ఇలా చిన్న కృత్యాన్ని విద్యార్థి తేలికగా నేర్చుకుంటా డన్నమాట. ఇలా నేర్చుకున్న చిన్న కృత్యాలు అన్నీ కలుపుకొని తరువాత పాఠం తేలికగా చెప్పగలుగుతా డని ఆలోచన.
ఈ ఆలోచన నిజంగా మంచిదే. కాని ఈ సూక్ష్మాంశ బోధన నైపుణ్యాలు ఏ సబ్జెక్టు బోధించటానికైనా సామాన్యంగా ఉపయోగపడేవి తప్ప తెలుగు భాష బోధనలో అత్యవసర మైన విశిష్ట మైన ప్రత్యేక మైన ఉప నైపుణ్యాలు అందులో లేవు. మనం మన తెలుగు భాషా బోధనకు అవసర మైన సూక్ష్మాంశ బోధనా నైపుణ్యాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ వ్యాస రచయిత అలాంటి కొన్ని సూక్ష్మాంశ బోధనా నైపుణ్యాలు ప్రతిపాదించటం జరిగింది. అవి కొన్ని..
1.పద్యాన్ని లయబద్ధంగా చదవటం.
2. పద్యాన్ని భావానుగుణంగా చదవటం
3. కఠిన పదాలకు అర్థాలు రాబట్టటం.
4. సుదీర్ఘ పదాలకు అర్థాలు రాబట్టటం.
5. పద్యంలోని విశేషాంశాల్ని,సౌందర్యాన్ని... విద్యార్థులే గ్రహించేలా చెయటం.
6. పద్యంలోని ఒక ఉపాంశాన్ని స్వీకరించి ప్రశ్నోత్తర సంవిధానం ద్వారా బోధించటం.
7. ప్రకృతి వికృతులు , నానార్థాలు, పర్యాయ పదాలు... బోధించటం...
ఇలా తెలుగు బోధనకు కావలసిన సూక్ష్మాంశ బోధన నైపుణ్యాలను ప్రతిపాదించి ప్రతి సూక్ష్మాంశానికి అందులోని అంతర్గత కృత్యాల్ని కూడా గుర్తించి వాటిని బట్టి మూల్యాంకనం స్కేళ్ళు రూపొందించటం కూడా జరిగింది. వీటి ఫలితాలను ప్రయోగాత్మకంగా నిరూపించవలసిన అవసరం ఉంది. తెలుగుకు బోధనకు ప్రత్యేకించి పనికి వచ్చే ఈ సుక్ష్మాంశ బోధన నైపుణ్యాల మీద ఇంకా విపుల మైన పరిశోధనలు జరగాలి. తెలుగు భాషా బోధన విశిష్ట ప్రమాణాలు పొంది విద్యార్థులు తెలుగు భాషమీద తెలుగు సాహిత్యం మీద తెలుగు సంస్కృతిమీద అనంత మైన ఆసక్తి పెంపొందించుకుంటారు. అప్పుడు మాతృ భాష కనుమరుగు కావటం అనే భయాందోళనలకు తావుండదు.
(సెప్టెంబర్ 23న కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో "తెలుగు పరిశోధనలు" గురించి జరిగిన జాతీయ సదస్సులో సమర్పించిన ప్రసంగ వ్యాసం)
డా. రావి రంగారావు
రిటైర్డ్ రీడర్ & ప్రిన్సిపల్, ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కళాశాల, మచిలీపట్నం- 521001


పరిశీలన గ్రంథాలు
1. తెలుగు బోధన పద్ధతులు - చింతా దీక్షితులు
2. ఆంధ్ర భాషా బోధనా సర్వస్వం - రామచంద్రుని వేంకట శేషయ్య
3. అభినవాచార్యకం - గొడవర్తి సూర్యనారాయణ
4. తెలుగు బోధన పద్ధతులు - ఇలపావులూరి కామేశ్వరరావు
5. భాషా బోధన - వై. కె. బ్రహ్మానందం
6. సాహిత్య బోధనా పద్ధతులు _ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి & బ్రహ్మానంద
7. తెలుగు బోధనా ప్రదీపిక - రావి రంగారావు
8. Teaching Mother Tongue - W.M.Rhyburn
9. The Teaching of Mother Tongue in secondary schools - Gurrey
10. The Teaching of Mother Tongue – P.B.Ballard
11. Micro-Teaching - Allen & Ryan...
12. Manuals and other material of NCERT, A. P.Govt. and many other books and material…


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech