శీర్షికలు  
     సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 12
 
- రచన : సత్యం మందపాటి  
శరీరవాణి

 

పాతికేళ్ళయిందేమో నేను ఆస్టిన్ సిటీలో ఒక హైటెక్ కంపెనీలో పనిచేస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది. అప్పటికి మేము అమెరికా వచ్చి ఐదేళ్ళయింది. ఆ ఐదేళ్ళలోనూ అమెరికా సంస్కృతి గురించి, భాష గురించి ఎన్నో తెలుసుకున్నా, ఇంకా పూర్తిగా అమెరికనైజ్ అవలేదు మరి.
ఆ కంపెనీలో పని చేస్తున్నప్పుడు, వారం వారం ఏదో మీటింగులు వుండేవి. ఒక రోజు అలాటి మీటింగ్ ఒకటి అయిపోయిన తర్వాత, ఒక గంటకి మా డైరెక్టర్ తన గదికి రమ్మని పిలిచాడు. ఎప్పుడూ పిలవని వాడు ఎందుకు పిలిచాడా అనుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళాను.
నన్ను తనకి ఎదురుగా కూర్చోబెట్టి చెప్పటం మొదలుపెట్టాడు. "నువ్వు మీటింగుల్లో ఏమీ పట్టనట్టు కూర్చుంటావుట. అలా అయితే ఎలా? ఎందుకని అంత అంటీ అంటనట్టు వుంటావు?" అని అడిగాడు.
ఆయన ఆ మాట అనగానే ఆశ్చర్యం వేసింది.
"అదేమిటి. నేను మంచి టీం ప్లేయర్నని అందరూ అంటుంటే. అవసరమైనప్పుడల్లా నేను చెప్పవలసింది చెబుతున్నాను. ఉత్సాహంగా అన్ని ప్రాజెక్టుల్లోనూ పాల్గొంటున్నాను. ప్రాజెక్టులని మేనేజ్ చేస్తున్నాను... ఏదన్నా ఉదాహరణగా చెప్పగలరా?"
"నేనూ అలాగే అనుకుంటున్నాను కానీ వింటున్నది వేరు... "
"అలా అని ఎవరు చెప్పారు?" అడిగాను.
"జేన్" అన్నాడాయన.
"ఒకసారి జేన్ ని రమ్మనండి. అదేదో ఇక్కడే నివృత్తి చేసుకుందాం" అన్నాను.
ఆయన జేన్ని అడిగాడు ఆమె అలా అనటానికి కారణాలు ఏమిటో చెప్పమనీ, ఏవన్నా ఉదాహరణలు ఇవ్వమనీ.
జేన్ నెమ్మదిగా అంది. "అవును. ఈయన ఎప్పుడూ మీటింగుల్లో చేతులు కట్టుకుని కూర్చుంటాడు.
అంటే నన్నెవరూ ముట్టుకోకండి, నా లోకంలో నేనున్నాను, మీతో నా ఆలోచనలు పంచుకోవటం నాకిష్టం లేదు
అని కదా ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పేది... "
"అవును. నిజమే. జేన్ చెప్పిన దానికి నువ్వేమంటావ్?" అడిగాడు బాసుగాడు.
ఆ మాటలకి నాకు నవ్వొచ్చింది. "ఇండియాలో అలా చేతులు కట్టుకుంటే, నేను మంచి టీం ప్లేయర్ని అనీ, నేను మీరు చెప్పింది చేయటానికి సిద్ధంగా వున్నాను అనీ" అన్నాను.
కానీ తర్వాత అనిపించింది, నేను వున్నది ఇండియాలో కాదు. అమెరికాలో. ‘బి ఎ రోమన్ ఇన్ రోం’ అన్నారు. మరి అమెరికాలో అమెరికన్ సిద్ధాంతాలూ, అలవాట్లూ పాటించవద్దూ! అప్పటి నించీ కొంచెం జాగ్రత్తగా నా బాడీ లాంగ్వేజ్ అంటే నా శరీరవాణిని గమనిస్తూ, ఇతరుల దగ్గర ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.
 

* * *
ఆ రోజుల్లోనే భావ ప్రకటన (Communication) మీద ఎన్నో పుస్తకాలు చదివాను. ఒక సెమినారుకి కూడా వెళ్ళాను. ఇన్నేళ్ళుగా సీనియర్ + ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్లో వుండటానికి అవెంతో ఉపయోగ పడ్డాయి.
నేను తెలుసుకున్న వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పటమే ఈ వ్యాసోద్దేశం.
అవన్నీ మేమూ చదివాంలేవోయ్, నువ్వు చెప్పటమెందుకు అని మీలో కొందరు అంటారని తెలుసు. కానీ ఈరోజుల్లో జరుగుతున్నవి చూస్తుంటే, ఇవి చెప్పటం ఎంత అవసరమో తెలుస్తుంది.

ఈమధ్య ఒక పార్టీలో హైద్రాబాద్ నించీ వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే చూశాను. ముందు తెలుగులో మాట్లాడుకుంటున్నారేమోననుకున్నాను. కానీ అది తెలుగు కాదు. తర్వాత ఇంగ్లీషేమో అనుకున్నాను. అది ఇంగ్లీషూ కాదు. అందులో ఒకమ్మాయి అయితే గబగబా సంస్కృతంలో మంత్రాలు చదువుతున్నట్టు మాట్లాడుతున్నది. నెమ్మదిగా అర్ధం చేసుకుంటే, నాకు అర్ధమయింది ఇది. ఆ అమ్మాయి తెలుగు, హిందీ, ఇంగ్లీషూ మూడూ కలిపి మాట్లాడుతున్నది. వాళ్ళ అఫీసులో అమెరికన్స్ వీళ్ళ మాటలు అర్ధంకాక ఎంత తంటాలు పడుతున్నారో చెప్పుకుంటూ, అమెరికన్ ఇంగ్లీషుని ఎగతాళి చేస్తూ మాట్లాడు కుంటున్నారు. అంతేకానీ అమెరికన్స్ కి అర్ధమయేటట్లు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడలేదు.

ఆఫీసులో ఎక్కువమంది భారతీయులతో కలిసి పనిచేసేవాళ్ళు, ఆ చతురస్రంలోనించీ, అంటే ఆ కంఫర్ట్ జోన్ నించీ బయటికి రావటానికి కొంచెం వెనుకాడుతుంటారు. అది ఒక కారణమయే అవకాశం ఎంతో వుంది.

అమెరికన్సుతో పోలిస్తే మనవాళ్ళు చాల వేగంగా మాట్లాడుతారు. భారతీయుల్లో కూడా ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇంకా వేగంగా మాట్లాడుతారు. అది తగ్గించటం చాల అవసరం. ఎవరైనా మాట్లాడేటప్పుడు అడ్డు వచ్చి మాట్లాడటం కూడా సాధారణంగా చూస్తూ వుంటాం. అది అమెరికన్సుకి నచ్చదు. వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు అడ్డు రారు. పూర్తిగా చెప్పటం అయాకనే వాళ్ళు జవాబిస్తారు. అలాగే మనం కూడా చేయాలని అభిలషిస్తారు. ఇండియాలో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే అగౌరవం. అమర్యాద. ముఖ్యంగా పెద్దవాళ్ళతోనూ, బాసుగాడితోనూ. ఇక్కడ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడకపోతే, మనమేదో దాస్తున్నట్టు అర్ధం. అంతేకాదు మనమెటో చూస్తూ మాట్లాడితే అమర్యాదగానూ వుంటుంది. అందుకని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం అవసరం.

అలాగే మనకి అమెరికాలో ఎన్నాళ్ళున్నా అమెరికన్ యాస పూర్తిగా రాదు. మన పిల్లలకే మన భాష అర్ధం కాని పరిస్థితిలో మనం మాట్లాడుతుంటే, ఇక అమెరికన్సుకి ఏమర్ధమవుతుంది. వాళ్ళ చేత పదిసార్లు చెప్పించుకునే బదులు మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా సాధ్యమైనంత స్పష్టంగా, క్లుప్తంగా మాట్లాడటం అవసరం.

ఈ భావ ప్రకటన (Communication) అనేది మూడు రకాలుగా వుంటుందని చెబుతున్నారు.

ఒకటి ఆడియో టైప్. అంటే శ్రవణపరంగా చెప్పటం. మా చిన్నప్పుడు, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాధరావ్, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు అని రేడియోలో తెలుగు వార్తలు, హియర్ ఈస్ ది న్యూస్ రెడ్ బై చక్రపాణి, లేదా మెల్విన్ డిమెల్లో అని ఇంగ్లీష్ వార్తలు వస్తుండేవి. వాళ్ళు ఆ వార్తలని చక్కటి మాడ్యులేషన్లతో కళ్ళకు కట్టేటట్టుగా చెబుతుంటే, మనకి ఏదో న్యూస్ రీల్ చూస్తున్నట్టుగా వుండేవి. అలాగే రేడియోలో క్రికెట్ కామెంటరీ. ఆనందరావ్, డిక్కీ రత్నాకర్, నరోత్తం పూరి తమ మాటలతో మన కళ్ళ ముందు క్రికెట్ ఆటలాడించేవారు.

రెండవది విడియో టైప్. అంటే దృశ్య ప్రకటన. ఇది అమెరికన్సులోనూ, యూరోపియన్సులోనూ బాగా కనిపిస్తుంది. చేతులు తిప్పుతూ, కళ్ళు కదుల్చుతూ, తల విదుల్చుతూ, భుజాలు ఎగరేస్తూ మాట్లాడుతుంటారు. మాటలతో కలిపిన ఈ దృశ్య భావ ప్రకటన అన్నిటిలోకీ విశిష్టమైనది. కాకపోతే ఒక చిన్న ప్రమాదమూ వుంది. మన ఆఫీసుల్లో కొంతమంది బలవంతాన ఏదన్నా పనిని చేస్తానని నోటితో చెప్పినా, వాళ్ళ శరీర చేష్టలు అది వాళ్ళు ఇష్టపడి చేయటం లేదని చెబుతూనే వుంటాయి.
నేను పైన చెప్పిన జేన్ సంఘటన ఈ శరీరవాణిలో ఒక భాగమే. మన సంస్కృతిలో ఎక్కువగా కనపడదిది. మనకి అశరీరవాణి మీద నమ్మకం ఎక్కువవటం వల్లనేమో, శరీరవాణి వెనకపడిపోయింది! మనిషి కూర్చునే విధానం బట్టీ, చేతులు తల తిప్పే విధానం బట్టీ వారి మనసుల్ని చదివేసే వారూ వున్నారు.

ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పడమటి సంస్కృతిలో తల అడ్డంగా తిప్పితే కాదు అనీ, నిలువుగా వూపితే అవును అని. అవునా, కాదా అని అమెరికన్స్ అడిగినప్పుడు, మనవాళ్ళు తల గుండ్రంగా తిప్పుతారు. అది అవును కాదుల మధ్యనించీ గిరగిరా తిరిగి, మధ్యే మధ్యే ఆగి వాళ్ళని బిత్తరపోయేలా చేస్తుంది. అదే జపాన్ వాళ్ళయితే, లేదు కాదు అని వాళ్ళ తల చెబుతుంటే, అవును అని వాళ్ళ నోరు చెబుతుంది. వారి సంస్కృతిలో నోటితో నో చెప్పటం ఇష్టముండదు మరి!
ఇక మూడవది ఫీలింగ్ టైప్. అంటే చెబుతున్నప్పుడు చెబుతున్నది అనుభవిస్తూ చెప్పటం. వాళ్ళ ముఖంలో భావాలు మారుతూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి కానీ, మాటలు మాత్రం అంత తొందరగా బయటికి రావు. ఒక్కొక్కప్పుడు మొత్తం విషయం రాబట్టటానికి కొన్ని నిముషాలు పడుతుంది. ఎక్కువమంది భారతీయులు ఈ కోవకి చెందినవారే!
"అబ్..... బ్బ! ఎం..థ.. బావుందో... " అంటాడు ముఖమంతా సంతొషం ఓడుతుంటే మా సుబ్బారావు,
మేమంతా అమెరికన్ స్నేహితులతో లంచికి వెళ్ళి ఏ దోశో తింటున్నప్పుడు.

“వాడు మరీ... (పళ్ళు కొరికి, నోరు వికటంగా పెట్టేసి) అదో రకం" అంటాడు అప్పారావ్.
తన అసంతృప్తిని ప్రకటించటానికి "ప్చ్! ప్చ్!" అంటాడు మా వెంకట్రావ్, తల అడ్డంగా వూపుతూ.
ఏదన్నా ప్రాజెక్ట్ మీటింగుల్లో కూడా అంతే. సరిగ్గా సమయానికి వాడవలసిన మాటలు అవసరానికి బయటికి రావు.
ఒక విశాలాక్షి మీటింగులో ఇలా అంటుంది. (ఇంగ్లీషులోనే వుంటుంది సంభాషణ... నేను తెలుగులో వ్రాస్తున్నాను. అంతే!)
విశాలాక్షి: "అతను రాలేదు"
జాన్ అడుగుతాడు "ఎవరు?"
విశాలాక్షి: "మైక్"
జాన్: "మైక్ ఎక్కడికి రాలేదు?"
విశాలాక్షి: "ఆ రోజు మీటింగుకి"
జాన్: "ఏరోజు?"
విశాలాక్షి: "మంగళవారం"
జాన్: "మంగళవారం ఏ మీటింగుకి అతను రాలేదు?"
విశాలాక్షి: "ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ గురించి మాట్లాడామే, ఆ మీటింగ్"

ఆమె నోట్లోనించీ ఇన్ని మాటలు రాబట్టటం ఎంతో శ్రమతో కూడుకున్న పని.
ఆవిడ చెప్పదలుచుకున్నదంతా రెండే రెండు వాక్యాల్లో ఇలా చెప్పేస్తే, సమయం కలిసి వస్తుంది.
"పోయిన మంగళవారం ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ గురించి పెట్టిన మీటింగుకి మైక్ రాలేదు. కాబట్టి మా ప్రాజెక్ట్ ప్లాన్ పూర్తవలేదు"

బ్రిటిష్ వాడి ఇంగ్లీష్ మనవాళ్ళు వాడుతూ, నాలుగు గంటలకి ఫోర్ ఆర్స్ అంటారు. ఆర్స్ అంటే అవర్స్ అనీ, గాళ్స్ అంటే గర్ల్స్ అనీ వాళ్ళ ఉద్దేశ్యం. అమెరికాలో ఆర్ అనే అక్షరాన్ని సుభ్భరంగా పలుకుతారు. టి అనే అక్షరం చాల మాటల్లో సైలెంట్.
అలాగే కొన్ని మాటలకి అర్ధాలూ వేరు. జనవరికి జాన్ అంటారు మన దేశంనించీ కొత్తగా వచ్చిన యువతరం. జాన్ అంటే అమెరికాలో "ఇంకో" అర్ధం వస్తుంది. ఈ విషయాలు ఇంకోసారి చెప్పుకుందాం.

అమెరికాలో వున్నా, మనవాళ్ళు కొంతమంది తెలుగు డాక్టర్ దగ్గరికే వెడతారు. అక్కడ సంభాషణ కూడా గమ్మత్తుగా వుంటుంది.

"నా కడుపులో అదోలా వుంది డాక్టర్!" అంటాడు రామారావ్.
"పొట్టలో గుర్రు గుర్రు మంటున్నది" అంటాడు రంగారావ్.
"నా కాలు లాగుతున్నదండీ" అంటుంది నీలవేణి.
"తల తిరిగిపోతున్నది" అంటుంది కృష్ణవేణి.
ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే అవేమిటో మన తెలుగు డాక్టర్లకి అర్ధమయిపోతాయి!
"నాకు మోషన్లవుతున్నయ్" అంటాడు మోహన్.
ఆ మాట ఒక్క తెలుగు డాక్టర్లకి తప్ప ఇంకెవరికీ అర్ధం కాదు.
ఒక మనిషి చెప్పేది, ఇంకో మనిషి అర్ధం చేసుకోవటమే భాషకీ, భావ ప్రకటనకీ ముఖ్యోద్దేశం. నోరారా చెప్పేదయినా, మూగ భాషైనా, సంకేతాల ద్వారా చెప్పేదయినా, నటించి చెప్పేదయినా, కూచిపూడి ముద్రల ద్వారా చెప్పేదయినా...ఏదన్నా ఒకటే. మీరు చెప్పేది నాకు అర్ధం కావటం, నేను చెప్పేది మీకు అర్ధం కావటం ముఖ్యం. కాకపోతే మనం ఏం చెబుతున్నాము అన్నదానితో పాటూ, ఎదుటివారికి అర్ధమవుతున్నదా లేదా అని ఆలోచిస్తూ సంభాషించటం అవసరం.
మీరేమంటారు?

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech