శీర్షికలు  
      సంగీత సౌరభాలు
 - రచన: సంగీతాచార్య డా|| వైజర్సు బాలసుబ్రహ్మణ్యం
 
 

త్యాగరాజస్వామివారిని దర్శించిన సమకాలీన సంగీతజ్ఞులు

 

రామనామ రసికాగ్రణ్యులైన త్యాగరాజ స్వామివారు గొప్ప సంగీత విద్వాంసునిగా, వాగ్గేయకారునిగా, మహాకవిగా, గేయనాటక మార్గదర్శిగా చిరస్మరణీయులు. ఇటువంటి మహనీయుల జీవిత విశేషములు సంగీత ప్రగతికి మార్గదర్శకములు.

రామభక్తునిగా, సంగీత జగద్గురువుగా వెలుగొందిన త్యాగరాజస్వామి వారి కీర్తి దేశ వ్యాప్తముగా విస్తరించగా, వీరిని సందర్శించి తమ జీవితాలను ధన్యము చేసుకొని తరించిన సమకాలీన సంగీతజ్ఞులు, వాగ్గేయకారులు ఎందరో కలరు. వీరు త్యాగరాజ స్వామివారిని కలుసుకొన్న సందర్భములలో జరిగిన విశేషములు, ఆ సందర్భమున చేయబడిన వివిధ రచనల వివరములు మనకు ఎంతో స్ఫూర్తిదాయకముగా ఉండగలవు.

శ్యామశాస్త్రి:
త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి ఇరువురూ మంచి స్నేహితులు. సంగీతపరమైన సంభాషణలు కావించడానికి శ్యామశాస్త్రుల వారు తరచూ త్యాగరాజస్వామి వారి ఇంటికి వస్తూ ఉండేవారట. ఈ సంభాషణలలో, వీరు తాము చేసిన రచనలను పరస్పరము వినిపించుకొని వారి వారి అభిప్రాయములను పంచుకొనేవారని తెలుస్తోంది. ఇటువంటి విషయములను కొన్నింటిని ప్రొ.సాంబముర్తి గారు ‘గ్రేట్ కంపోజర్స్’ అనే గ్రంథములో వివరించియున్నారు. శ్యామశాస్త్గ్రుల వారు ఎప్పుడైనా త్యాగరాజు గారి శిష్యులలోని పిన్నలు - ‘ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలు దాటితేనే కానీ మనకు భోజనప్రాప్తి కలుగదు’ అని అనుకొనేవారట. దీనిని బట్టి వీరి చర్చలు ఎంత సుదీర్ఘంగా సాగేవో మనకు అర్ధమవుతుంది. అయితే,త్యాగరాజు గారి శిష్యులలో విద్య బాగా నేర్చుకున్న వారికి మాత్రం వీరి సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా, జ్ఞానదాయకంగా ఉండేవని తెలుస్తోంది.

ముత్తుస్వామి దీక్షితులు :
ఇక ముత్తుస్వామి దీక్షితుల వారి విషయానికి వస్తే, వీరిరువురూ పరస్పరం కలుసుకొన్నారని చెప్పడానికి ఎక్కువగా ఆధారాలు లభించనప్పటికీ, టి.ఎల్. వెంకట్రామయ్యర్ గారి ‘ముత్తుస్వామి దీక్షితులు’ అను గ్రంథములో వీరిరువురూ కలుసుకొన్న సందర్భమొకదానిని గురించి వివరించారు. ఒకానొక సందర్భములో త్యాగరాజ స్వామి వారి ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకము జరుగుతున్న సందర్భములో దీక్షితుల వారు వీరింటికి వేంచేశారు. ఆ సందర్భంలో త్యాగరాజస్వామి వారు ‘కొలువై యున్నాడే’ అనే భైరవి రాగ కృతిని రచించి, గానం చేసి, దీక్షితులవారిని కూడా ‘మా రామునిపై ఏదైనా కృతిని ఆలపించండని’ అడుగగా, దీక్షితులవారు మణిరంగు రాగంలో ‘మామవ పట్టాభిరామ’ అను కృతిని ఆలపించారని తెలియవస్తోంది. ఈ సంఘటన ఆధారంగా వీరివురూ కలుసుకున్నారని మనకు తెలుస్తోంది.

త్రిభువనం స్వామినాథయ్యర్:
త్యాగరాజ స్వామివారి కాలానికి చెందిన ప్రసిద్ధ గాయకుడు, నటుడు అయిన త్రిభువనం స్వామినాథయ్యర్ ‘ఆనందభైరవి’ రాగాన్ని పాడుటలో ప్రసిద్ధి చెందినవారని తెలుస్తోంది. వీరు బొమ్మలాటలలో నేపథ్య గానము చేసేవారట. ఒక సందర్భంలో త్యాగరాజు గారు వీరి గానం విని ఎంతో సంతసించి, వారిని మెచ్చుకొన్నారట. అప్పుడు స్వామినాథయ్యరు ఈ ఆనందభైరవి రాగం వలననే తనకు పేరు వచ్చిందని, కావున ఈ రాగమును త్యాగరాజు గారు తనకై త్యాగము చేసి ఇకపై ఈ రాగములో రచనలు చేయకుండా ఉండాలని కోరారట. అప్పటికే త్యాగరాజస్వామి వారు ఈ రాగములో ‘రామ రామ నీవారము’, ‘క్షీర సాగర విహార’, ‘నీకే తెలియక’ అను కృతులు చేసి యుండగా వారి కోరిక మేరకు అటు తరువాత యే రచనా చేయలేదని తెలియవస్తోంది.

శ్రీ తూము నరసింహదాసు:
ఆంధ్రదేశానికి చెందిన గుంటూరు నివాసి అయిన శ్రీ తూము నరసింహదాసు భద్రాద్రి రాముని స్తుతిస్తూ కీర్తనలు చేసిన మహా భక్తాగ్రేసరుడు. ఒకప్పుడు వీరు సుమారు 1821 ప్రాంతములో దక్షిణాన యాత్ర చేయుచుండగా, తిరువత్తియూర్ లో వీణ కుప్పయ్యర్ గారి గృహమున శ్రీ త్యాగరాజ స్వామివారు బస చేసి ఉన్నారని తెలుసుకుని, వారింటికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వారి గానానికి పామానందభరితులై, ఆశువుగా రెండు పద్యములను పాడి స్వామివారిని కొనియాడతారని తెలుస్తోంది. కొంతమంది పండితుల అభిప్రాయము ప్రకారం నరసింహదాసు గారు తిరువత్తియూరులో కాక, తిరువయ్యూరులోనే స్వామివారి గృహమందే వీరిని సందర్శించారని కూడా తెలియవస్తోంది.

గోపీనాథ భట్టాచార్య:
కాశీకి చెందిన ఈయన హిందుస్థానీ సంగీతమందు ప్రావీణ్యుడు. త్యాగరాజస్వామి రచించిన కృతులు దక్షిణ భారతదేశములోనే కాక, భారతదేశమంతా ప్రాచుర్యము పొందినవి. ఒకానొక సమయంలో శ్రీ గోపీనాథ భట్టాచార్యులవారు రామేశ్వరం యాత్రకు వెళ్ళి, అక్కడి నుండి తిరువయ్యారులోనున్న శ్రీ త్యాగరాజ స్వామి వారిని సందర్శించారు. వారిని దర్శించుకుని ‘అయ్యా, మీరు చేసిన రచనలు మా ఉత్తర హిందుస్థానములో కూడా ప్రాచుర్యము పొందాయి. అట్టి గొప్ప రచనలు చేసిన మిమ్మల్ని దర్శించుకునే భాగ్యము నాకు ఈనాడు కలిగినది. అని అన్నారట. అంతట శ్రీ త్యాగరాజ స్వామి వారు చాలా సంతోషించి తనకు ఇంతతి భాగ్యము కలుగజేసిన శ్రీ రామచంద్రునికి కృతజ్ఞతాపూర్వకముగా ‘దాశరథే నీ ఋణము దీర్చ నా తరమా’ అని తోడి రాగములో ఒక కృతిని రచించి పాడారట. త్యాగయ్య గారి గానము విని గోపీనాథ భట్టాచార్యులవారు ఎంతో సంతోషించి వారి దర్శన భాగ్యము కలిగినందుకు చాలా ఆనందపడితిరి.

గోపాలకృష్ణ భారతి:

వీరు తమిళ వాగ్గేయకారులలో ప్రఖ్యాతి గాంచినవారు. వీరు నందనార్ చరిత్ర, నయనార్ చరిత్ర, తిరునీలకంఠనాయక చరితము అనే మూడు గ్రంథాలను వ్రాసినారు. అద్భుతమైన రచనా శైలితో పాటు పలు క్రొత్త రాగములలో కూడా రచనలు గావించిన మహనీయుడు. ఇంతతి గొప్ప వాగ్గేయకారుడు త్యాగయ్య గారి కీర్తి ప్రతిష్ఠలను విని వారి దర్శనము చేసుకోవలెనని ఆకాంక్షించిరి. వీరు తన 35వ ఏట అనగా సుమారు 1845 ప్రాంతములలో త్యాగరాజస్వామి వారిని దర్శించిరని తెలియవస్తోంది. త్యాగరాజస్వామి దర్శనార్ధము వారి ఇంటికి వెళ్ళిన గోపాలకృష్ణ భారతిని స్వామివారు సాదరముగా ఆహ్వానించి, వారు ఎచ్చటి నుండి వచ్చారో అడిగి తెలుసుకొన్నారట. అందుకు, ‘మాయవరం నుండి’ అని గోపాలకృష్ణ భారతి సమాధానము చెప్పిరట.
అంతట త్యాగరాజస్వామి వారు మాయవరం నివాసి అయిన గోపాలకృష్ణ భారతి అను విద్వాంసులు తమిళములో చక్కటి రచనలు చేయుచున్నారని విన్నాను. వారు మీకు తెలుసా? అని అడిగినారట. త్యాగరాయస్వామి లాంటి మహా వాగ్గేయకారుని వద్ద తనకు ఇంత గుర్తింపు లభించినందుకు గోపాలకృష్ణ భారతి ఎంతగానో ఆనందంపడి, తానే ఆ గోపాలకృష్ణ భారతినని సవినయముగా మనవి చేసుకున్నారట. త్యాగరాజస్వామి వారు కూడా వీరిని కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారట. ఈ సందర్భంలో త్యాగరాజస్వామి వారి శిష్యులు ‘నన్నుబ్రోవ నీకిమ్త తామసమా’ అను అభోగి రాగ కృతిని గానం చేస్తున్నారట. వారి గానము పూర్తి అయిన తర్వాత త్యాగరాజ స్వామివారు అభోగి రాగంలో ఏవైనా కృతులు చేశారా అని అడిగినారట.
ఆ ప్రశ్న విని గోపాలకృష్ణ భారతి మౌనము వహించి రాత్రికి రాత్రి అభోగి రాగములో ‘సభాపతిక్కు వేరు దైవం’ అనే కృతిని రచించి ఆ మరునాడు త్యాగరాజ స్వామి వారికి వినిపించినారట. త్యాగరాజు గారు ఒక్క రాత్రిలోనే వీరు ఆ కృతిని చేశారని తెలుసుకుని పలు విధముల కీర్తించినారట.

వడివేలు :
తిరువాన్కూరు సంస్థానాధీశులు శ్రీ స్వాతి తిరునాళ్ మహారాజా వారు మంచి వాగ్గేయకారులుగా కూడా ప్రఖ్యాతినొందారు. కర్ణాటక సంగీత రచనలే కాక, హిందుస్థానీ సంగీత విద్వాంసులను తన ఆస్థానమునందు గౌరవించేవారు. అటువంటి రాజాస్థానామందు వడివేలు గారు వయొలిన్ విద్వాంసులుగా నుండేవారు. త్యాగరాజస్వామి వారి శిష్యులను కుప్పయ్య భాగవతార్ అను విద్వాంసుని ద్వారా స్వామివారి రచనలను విన్న రాజుగారు మిక్కిలి ఆనందముతో తన ఆస్థాన విద్వాంసుడగు వడివేలును పంపి తన సభకు ఆహ్వానించారట. అప్పుడు వడివేలు గారు త్యాగరాజ స్వామివారిని సందర్శించి రాజుగారి కోరికను ప్రస్తావించగా, త్యాగరాజు గారు ‘ఇహమున కాదు, పరమున రాజును కలుసుకొందునని’ సమాధానము చెప్పి పంపెరట.

షట్కాల గోవింద మరార్:
వీరు కూడా తిరవాన్కూర్ రాజాస్థానములో విలసిల్లిన సంగీత విద్వాంసులు. వీరు రామమంగళం అను గ్రామానికి చెందినవారు. వీరు ఆరు కాలములలో పల్లవులు పాడుటలో దిట్ట అయినందువలన, వీరికి షట్కాల గోవింద మరార్ అనే బిరుదు కలిగెను.

వీరు 1842 సంవస్తరంలో త్యాగరాజస్వామి వారిని కలుసుకొన్న సందర్భములో ఒక పల్లవిని షట్కాలములలో పాడి తన సామర్ధ్యమును ప్రకటించుకొనిరట. ఇది విని త్యాగరాజస్వామివారు గోవింద మరార్ గారి ప్రతిభను మెచ్చుకుని, తాను రచించిన ‘ఎందరో మహానుభావులు’ అను కృతిని తమ శిష్యులచేత పాడించారని తెలుస్తోంది.

వీరే కాక అనేక మంది విద్వాంసులు వీరిని సందర్శించి యుండవచ్చును కానీ సంగీత చరిత్రలో లిఖిత ఆధారముల ద్వారా మనకు లభించిన కొద్దిపాటి సమాచారము వలన పైన చెప్పిన కొద్ది మంది విద్వాంసుల వివరములు మాత్రమే తెలియుచున్నవి. ఈ విధంగా త్యాగరాజస్వామి వారు తమను కలుసుకొన్న సంగీత విద్వాంసులను ఎంతో సాదరంగా ఆహ్వానించి, వారి ప్రతిభా విశేషాలను ఆస్వాదించి, నిగర్వియై, సంగీత గాన రసాపానముతో తమ జీవనము సాగించిరి.
 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech