శీర్షికలు  
     శ్రీ శనీశ్వర శతకం-3
 
- రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ  
 

21. వ్యాకరణలు తొమ్మిదియు అర్కుని చెంత తదేక దీక్షతో
ప్రాకట రీతి నేర్చి కపివర్యుడు గణ్యుడు గాడొ దేవరా!
శ్రీ కరమౌచు ధాత్రి గురు శిష్యుల బంధములున్న నాడె, సు
శ్లోకులు నౌదు రిర్వురును సూనృతమియ్యది - శ్రీ శనీశ్వరా!

22. ‘మంద’ మహాత్మ! మేము ఘన మారుతి బోలిన శిష్యులౌదుమో?
మందుల మౌదుమో? ఒకటి మాత్రము సత్యము : మా గురుల్ శివా
నందనుడార్య పట్టి గణ నాధునిమించిన జ్ఞానసాంద్రు లై
వందితులైరి ; అందరును భాస్కరతుల్యులె - శ్రీ శనీశ్వరా!

23. చెలువగు నాటి విద్యలవి చెప్పను; చేష్టలవెల్ల మావి, కో
తుల ఎకిమీడు అహనుమతో సరితూగెడి వన్ని రీతులన్!
చెలులము మేమయో తెలిసి చేసిన చేష్టలు గావు దేవరా!
గల గల నవ్వబోకుమటు కాలుని సోదర - శ్రీ శనీశ్వరా!

24. కాకము నెక్కి నిచ్చలు సగర్వముగా విహరించు సామి! చీ
కాకులు సృష్టిజేసి నరకంబును చూపు యమాగ్రజుండ; నా
శోకము లెల్లబాపుము యశోధను జేయుము చాలు; భక్తిమై
నీకి దె మ్రొక్కెదన్ మివుల నిష్ఠనుగొల్చెద - శ్రీ శనీశ్వరా!

25. క్షితి నరయంగ మిక్కిలి విచిత్రము నీకథలన్ని చూడ; లో
హితు జనకుండు సూనృతము నెంతయు నమ్మిన సాంద్రకీర్తి; ప్ర
స్తుతులను గన్న ఆ నృపుడె దోయిలి యొగ్గగ నీదు ధాటికిన్!
అతి - గతిలేని నేనకట ఆగుదునా? యిక ;- శ్రీ శనీశ్వరా!

26. సలిలత మూర్తి, వాక్పటిమ చాలగ గల్గు యశోధనుండు; ఆ
‘నల’ శుభ నాము సర్వ సుర నందిత వర్తను మేరు ధూరునిన్
వలవలలాడజేసి పనిబట్టితివన్ కథనెల్ల వింటి, దు
ర్బలుడను నేనదెంత? మదిబాపుము తాపము శ్ర్తీ శనీశ్వరా!

27. “భీముడు - నాంజనేయుడును” వీర వరేణ్యులు అన్నదమ్ములౌ
ఆ మొనగాండ్ర మీదకు రయంబున దూకగలేక జంకుతో
మోమును త్రిప్పికొంటివట; పోరును సల్పగ చేతగాక నీ
ధామము జేరి నా వట గదా; నిజమా ఇది?- శ్రీ శనీశ్వరా!

28. ఇయ్యదె సత్యమైన నిక నేనదె గొల్చెద వారలిర్వురన్;
కయ్య మొనర్చి ధైర్యమున గర్వమడంపగ లేకపోతి వీ
వయ్యరొ ; అట్టి నీకు వినయాంజలు లింతగ వంగివంగి, నే
నియ్యగనేల? నీ బల మదేమిటొ తేలేను - శ్రీ శనీశ్వరా!

29. ఎవ్వరు నీకు దీటు? పరమేశుని సాక్షిగ లేరు లేరు; నిన్
నువ్వుల నూనె ముంచగనె నూత్నపు తృప్తి వెలార్చు వాడ, వే
రెవ్వరొసంగజాలని అభీప్సిత సిద్ధి నొసంగువాడ; నే
నెవ్వడ నిన్ను దూర? చనవించుక పల్కితి నంతె గాని; నే
చివ్వకు కాలు ద్రవ్వను- అజేయుడ వౌటను - శ్రీ శనీశ్వరా!

30. నల్లని పూల నీగలను, నల్లని వల్వలు పెక్కు తేగలన్!
నల్లని పూల నీగలను, నల్లని వస్తువులెన్నొ తేగలన్!
నల్లని పండ్లు తేగలను; నాకది శక్యము కాదు ధాత్రిపై
నల్లని పాలనీయ రవినందన! సైపర! శ్రీ శనీశ్వరా!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech