సారస్వతం  
     సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (8వ భాగం)
 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil

 
 

13. “జలాక్షర ,శిలాక్షర న్యాయం.” ఇవి రెండు న్యాయాలు. కాని ఒక్కటిగా వివరిస్తాను. జలాక్షరం అంటే = నీటిమీద వ్రాతలు. శిలాక్షరం అంటే= శిలపై వ్రాసే వ్రాతలుఅని అర్ధం. నీటిమీద ఎంత వ్రాసినా,ఎన్నిపర్యాయాలు వ్రాసినా అవి కనబడవు, నిలబడవు. అదే శిలపై వ్రాస్తే శాశ్వతంగా ఉంటాయి.అని ఈన్యాయానికి అర్ధం. అనగా మనం ఏపని చేసినా,ఎదిచేప్పినా నిలకడగా,శాశ్వతంగా ఉండాలి.కాని జలాక్షరాలలా అప్పటికప్పుడు నశించేదిగా ఉండకూడదు.

దీనిని ఓ చక్కని కథద్వారా వివరిస్తాను. మనకి దానానికి “కర్ణుడు” త్యాగానికి “రంతిదేవుడు, శిభి చక్రవర్తి” వంటి వారి గాధలు తెలుసు,కాని పరోపకారానికి తన శరీరాన్నే త్యాగం చేయదలచిన “జీముతవాహనుడు”అనే విద్యాధరుని కథ కొద్దిమందికి మాత్రమె తెలుసు. దానిని తెలుసుకొందాం. ఈకథ “శ్రీహర్ష దేవుడు రచించిన నాగానందం” అనేనాటకం లోనిది. (నైషధం వ్రాసిన హర్షుడు కాదు.)

“జీమూతకేతువు అనే విద్యాధరచక్రవర్తి కుమారుడు “జీమూతవాహనడు” అతడు రాజ్య సుఖాలను విడచి, వృద్ధులైన తన తల్లి దండ్రుల సేవచేసుకొంటు, మలయ పర్వత ప్రాంతంలో నివశిస్తూ ఉంటాడు. అతని మంచి స్వభావాన్ని,గుణ గణాలను తెలుసుకొన్న ఆ ప్రాంతాన్ని పాలించే రాజు తన కుమార్తె అయిన “మలయవతి”ని అతనికిచ్చి వివాహం చేస్తాడు. మలయవతి పార్వతి దేవి భక్తు రాలు.

వివాహ వేడుకలు జరుగుతుండగా, ఒక రోజు జీమూతవాహనడు తన బావమరిది అయిన “విశ్వావసువు”తో కలసి సముద్ర విహారానికి వెళ్తాడు. అప్పుడు కొంచం దూరం లో ఉన్న తెల్లని కొండలాంటి గుట్టని చూసి “అదేమిటి” అని అడుగుతాడు. “అవి పాముల ఎముకల గుట్ట.”అనిచేపుతాడు.”అయ్యో అన్ని పాములు ఎలాచనిపోయాయి, ఏమా కథా” అని జీమూతవాహనుడు ప్రశ్నించగా? విశ్వావసువు ఇలా చెపుతాడు. “పాములకి విరోధి అయిన గరుత్మంతుడు ప్రతిరోజు సముద్రం లోంచి నాగలోకానికి వెళ్లి అధిక సంఖ్యలో, పాముల్ని పట్టితెచ్చి ఆ కనబడే గుట్టపై పెట్టి తినేవాడు.వాటి ఎముకలే తెల్లగా కొండలా కనబడుతున్నాయి. గరుత్మంతుని వలన సర్పజాతి మొత్తం నశిస్తుందని గ్రహించిన సర్ప రాజు వాసుకి, గరుడునితో “ ఇలా చేస్తే కొద్ది కాలంలోనే సర్ప జాతి మొత్తం నశిస్తుంది,అపుడు నీకు ఆహారం ఉండదు కావున,రోజుకో సర్పాన్ని నేనే నీవద్దకు పంపుతాను,నీవు ఇక్కడికి రానవసరం లేదు నీవు రోజు భుజించే వధ్యశిల వద్దకి నీకు ఆహారం అయిన సర్పం ఎర్రని వస్త్రాలు ధరించి మానవ రూపంలో వస్తుంది.నీవు శ్రమ లేకుండా భుజించ వచ్చు” అని ఒప్పందం చేసుకొంటాడు.అప్పటినుండి, ఇప్పటివరకు
రోజుకో సర్పం గరుడునికి ఆహారంగా వస్తున్నది. వాటి ఎముకలే ఆ తెల్లని గుట్టలు”అని సవివరంగా వివరిస్తాడు.


అదే సమయంలో ఒక భటుడు వచ్చి ఎర్రని పట్టు వస్త్రాలు వివాహ సందర్భంగా మామగారు పంపేరు అని చెప్పి,జీమూతవాహనునికి ఇచ్చి,మిత్రా వసువును తండ్రిగారు పిలుస్తున్నారు. అనిచెప్పి వెళ్ళిపోతాడు. జీమూతవాహనుడు తాను ఇంకా సముద్ర తీరంలో విహరిస్తాను అని తెలపగా,సరే అని తెల్పి మిత్రావసువు వెళ్ళిపోతాడు.నాగులకు కలిగిన కష్టాన్ని తలచుకొని బాధపడుతూ, పరోపకార పరాయణుడైన జీమూతవాహనుడు“ఒక్కనాగునైన తాను రక్షించ గలిగితే, తన జన్మ ధన్యం”అని అనుకొంటాడు.

అదే సమయంలో ఒక తల్లి తనకుమారుని పట్టుకొని,ఏడుస్తూ సముద్రంలోంచి ఒడ్డుకి రావడం చూసిన, జీమూతవాహనుడు వారివద్దకు వెళ్లి “ఎందుకు ఏడుస్తున్నావు”అని తల్లిని అడుగుతాడు.”తాము నాగులమని,తన ఒక్కగానొక్క కుమారుడైన శంఖచూడుడు వాసుకి ఆజ్ఞానుసారం ఈరోజు గరుడునికి ఆహారంగా పంప బడ్డాడని మరణించ బోయే తన కుమారుని చూసి రోదిస్తున్నాను.” అని చెప్తుంది.” అప్పుడు జీమూతవాహనుడు “తల్లీ నీకుమారుని బదులు నేను గరుడునికి ఆహారంగా వెళ్తాను.నీవు సంతోషంగా ఉండు”అని అంటాడు. అపుడు శంఖచూడుడు “మహానుభావా!( “జాయంతే చ మిర్యంతే చ మాద్రుశాః క్షుద్ర జన్తవః”) నావంటి క్షుద్రులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు,కాని మీవంటి మహాను భావులు అరుదుగా జన్మిస్తారు. మీరు జీవించి ఉండాలి.”అనిపలికి తల్లితో “అమ్మా గరుడుడు వచ్చే వేళ అయింది.నీవు ఇంటికి వెళ్ళు, నేను దగ్గరలో నున్న గోకర్ణ క్షేత్రంలో ఉన్న అమ్మవారిని దర్శించి,వధ్య శిలకు వెళ్తాను”.అని చెప్పి ఇద్దరు నిష్క్రమిస్తారు. జీమూతవాహనుడు తానే ముందుగా వధ్య శిలవద్దకు వెళ్లి, తాను కనపడకుండా, మామగారు పంపిన ఎర్రని వస్త్రాలు కప్పుకొని సిద్దంగా ఉంటాడు. అప్పుడు గరుడుడు వచ్చి, తన ఆహారం సిద్దంగా ఉందనుకొని ముక్కుతో పొడుస్తూ, తినడం ప్రారంభిస్తాడు.”పరోపకారార్థమిదం శరీరం.”అన్నట్లు తనశారీరం ఉపయోగ పడుతోందని జీమూతవాహనుడు ఆనందిస్తూ బాధని భరిస్తూ కదలకుండా ఉంటాడు. రొజూ తను భుజిస్తూ ఉంటె ఆహాకారాలు చేసే నాగుడు ఈరోజు కదలక,మెదలక బాధని భరిస్తూ ఉండడం చూసి గరుడుడు ఆశ్చర్యపడి, తినడం ఆపి “ఎవరు నీవు? సర్ప జాతి వాడవు మాత్రం కావు,ఎందుకు నాకు ఆహారంగా వచ్చావు.”అని అడుగుతాడు. అదే సమయంలో దూరం నుంచి శంఖచూడుడు “అగు గరుడా! ఆగు,నీఆహారాన్ని నేను, అతడు విద్యధరచక్రవర్తి కుమారుడు,జీమూతవాహనుడు ,నాకోసం తన ప్రాణాలని అర్పిస్తున్నాడు,అతనిని భుజింప వలదు”.అని గట్టిగా చెప్తూ దగ్గరకి వస్తాడు, తన తప్పు తెలుసుకొన్న గరుడుడు జీమూతవాహనుని త్యాగ శీలతని మెచ్చుకొని వరం కోరుకోమంటాడు.ఇకపై నాగులను భక్షింప వలదని, ఇంకా అమృతం తెచ్చి నీవల్ల మరణించిన నాగులను బ్రతికించ మంటాడు. వరాన్ని కుడా ఇతరులకోసమే ఉపయోగించిన జీమూతవాహనుని గొప్ప గుణానికి సంతసించిన గరుడుడు వెంటనే స్వర్గానికి వెళ్లి,అమృతాన్ని తెచ్చి ఆఎముకల గుట్టపై మరియు జీమూతవాహనునిపై చిలకరించి అందరిని బతికిస్తాడు. నాగులందరు జీమూతవాహనుని కీర్తిస్తూ ఆనందంగా తమనివాసాలకి వెళ్ళిపోతారు.” ఇది జీమూతవాహనుని కథ.నాగులకి అనందం కలిగింది కనుక దీనికి “నగానందం”అని హర్ష దేవుడు పేరుపెట్టాడు. కొన్ని వందల సంవత్సరాలకి ముందు రచించిన ఈకథ ఇప్పటికి,”శిలాక్షర న్యాయం”లా శాశ్వతంగా ఉంది.


ఆధునిక సాహిత్యంలో “భావకవిత్వం, అభ్యుదయకవిత్వం, విప్లవ,దిగంబర, కథ, గేయ, వచన, ఇలా ఎన్నో, ఎన్నెన్నోవివిధ సాహిత్య ప్రక్రియలు వచ్చి, మార్పులు చెందుతున్నాయి కాని “ప్రాచీన సాహిత్యం” అలాగే శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది.అని తెల్పేదే “శిలాక్షరన్యాయం.”

ఆధునిక కాలంలో వచ్చే కొన్ని సాహిత్య ప్రక్రియలు కొంత కాలం ప్రభావాన్ని చూపి నశించిపోతుంటాయి.”వాటిని జలాక్షర న్యాయంతో “పోల్చవచ్చు.నీటిమీద వ్రాతల్లా అవి కనపడకుండా పోతాయి.అట్టి వాటిని వివరించనవసరం లేదు. కనుక ఈ న్యాయాలని ఇంతటితో ముగిస్తున్నాను.(వచ్చేనెల మరికొన్ని.)

(సశేషం.)
 

 
 

                      


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech