సారస్వతం  
     పుస్తక పరిచయం-2 - పరిచయకర్త: శైలజామిత్ర  

ఆసాంతం చదివించగలిగే కధలు తమిరశ జానకి " ఎంతో చిన్నది జీవితం"


కధలు ఎన్ని వచ్చినా ఇంకా కదల లోటు ఉంటూనే ఉంటుంది. ఒక్కో కధ చదువుతుంటే కధ కే మరో మలుపు ఉంటే బావుంటుంది కదా. లేదా కధ ప్రారంభం మరోలా ఉంటే ఇంకా రక్తి కట్టించేది కదాని రచయితలకే కాదు. పాటకులకు కూడా అనిపిస్తుంది. కాని కధ ఆంటే ఇలా ఉండాలి. కధకుడు లేదా కధకురాలు ఎంత చక్కని ప్రారంభం ఇచ్చారు అనిపించేలా రాయడం, ఒక్కసారి చదివితే జీవితాంతం గుర్తుండిపోయేలా రాయడం  మాత్రం కొందరికే సాధ్యం.   పెద్దిబొట్ల సుబ్బరామయ్య, వేదగిరి రాంబాబు, విహారి, మునిపల్లి రాజు, పోరంకి దక్షణా మూర్తి  లాంటి గొప్ప కధకులున్న సాహిత్యంలో తమిరశ జానకి ఒకరు అని ఒప్పుకోవాల్సిందే! 1964 సంవత్సరంలో వీరి కధ "యువ" లో ప్రచురితమయినది మొదలు నేటి వరకు కధకు ప్రాణం పోస్తున్న అరుదైన కధకుల్లో తమిరశ జానకి గారు ఒకరు.  మహిళా రచయిత్రులు ఎందరో ఉన్నా, అద్భుతమయిన కధలు వెలువడుతున్నా కూడా జానకి గారి కధలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. వీరి కధల్లో గుండెను తట్టి పలకరించే గుణం ఉంది . ఆర్ద్రత ఉంది. ఆసాంతం చదివించగలిగే సత్తా ఉంది. నిర్దిష్టత, అన్నిటిని మించి వాస్తవికత చోటుచేసుకుంటాయి

          మనుషులు రోజుల్లో డబ్బులేక పేదవారు కాదు. ఆత్మీయత లేని పేదవారు. అలాకాదని మనం అందించడానికి ప్రయత్నించామో అందుకోవడానికి కూడా పనికిరాని సన్నాసులు.  ప్రేమించలేకపోవడం అపజయం కాదు. ప్రేమించినా అందుకోలేకపోవడం నిజమయిన అపజయం.  అలాగే సత్యమూర్తి  ఎంతో  ప్రేమతో తన ఆస్తిని తన కుమారుని గురించి కూడా ఆలోచించకుండా తమ్మునికి రాసి ఇద్దామని అనుకుంటాడు.  అందుకు బాబాయికి ఎందుకు ఇస్తున్నావని కొడుకు అడగడు. కొడుకు కు ఇవ్వకుండా నాకెందుకు ఇస్తున్నావని సదరు తమ్ముడు అడగడు. ఆంటే నాన్న మాటను గౌరవించే తనయుడు ఉంటే, ఉచితంగా వచ్చే డబ్బు ఎందుకు వద్దనుకోవదమనే ధోరణిలో తమ్ముడు మధ్య ఆత్మీయతకు విలువనిచ్చే అన్నగా సత్యమూర్తి ఇక్కడ ఎంతో గౌరవనీయులు.   తర్వాత  ఆస్తిని అందివ్వడానికి పల్లెటూల్లొ ఉన్న బాబాయి దగ్గరకు వెళ్ళిన అన్నకొడుకు శ్రీధర్  అమెరికా వాసుడైనా అక్కడ పెరిగిన వాతావరణం, అక్కడి జ్ఞాపకాలు, పరిచయాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అనడంతో పాటు కొన్ని అభాగ్యుల జీవితాలు కలత పరుస్తాయి. విద్యా లేని వారికి విద్యను, నా అనుకునే అభాగ్యులకు ఆసరా ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో శ్రీధర్ ను గమనించని బాబాయి రాఘవ, పిన్ని సత్యమూర్తి ఇచ్చే ఆస్తిని తన రాజకీయ పలుకుబడికి ఉపయోగించుకోవాలని మాట్లాడుకుంటుంటే విని తండ్రిని ఆస్తిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలని, పేదలకు పాటశాలను  కట్టించాలని, అభాగ్యులకు  నీడనివ్వాలని నిర్ణయించుకుని బాబాయికి ఇవ్వడానికి ఒప్పుకోడు.  ఆపై కొడుకు ఆలోచనను కార్యరూపం చేయాలని సత్యమూర్తి కూడా అంగీకరించడంతో కధ ముగుస్తుంది. తమ చెడు  ఆలోచనలను ఎలా తెలుసుకున్నాడా అని రాఘవ దంపతులు మౌన౦గా , తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారు.  ఇందులో ఉదాత్త స్వభావులయిన తండ్రి కొడుకుల పాత్రలు సమాజ ఉన్నతికి పనికివస్తాయి. అలాగే అయాచితంగా వచ్చే డబ్బుతో తన ఉనికిని చాటుకోవాలని అనుకునే పాత్ర ద్వారా ఎలా ఉండకూడదో సమాజానికి అవగతమవుతుంది.   రకంగా కధ ఎంతో ఉన్నతమయినది

           కధ కు  ప్రాణం వస్తువు. తర్వాత శిల్పం. పై వ్యక్తీకరణ. భాష ఇవన్నీ సమపాళ్ళలో ఉంటేనే కధ సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అలా అన్నీ సమకూరిన కధలే జానకి గారివి అనడానికి వీరి "మనిషిలో మనిషి "కధలు తరచి చూద్దాం  నేడు సమాజంలో స్త్రీ పురుష సంభంధాలు తప్ప ఇక ఏమి మిగలలేదనేది అతిశయోక్తి     కాదు.స్త్రీ సహనముర్తి అన్నంత మాత్రాన భర్త ఏమి చేసిన భరించాలని ఏమి లేదు. కధలో భర్తే దైవం అనుకునే భార్యతో  ఆఫీసులో  ఎక్కువ పని ఉంది విసిగించవద్దని చెప్పి మరో స్త్రీతో కాలక్షేపం చేస్తాడు భర్త, అంతలో మామగారు ఆంటే భర్తగారి తండ్రి కి గుండె పోతూ వచ్చి చనిపోయారని చెప్పినా ఏదో ఒక మాములు విషయం విన్నట్లు వినడం, అలాంటి   సమయంలో కూడా మరొక స్త్రీతో సరదాగా గడుపుతుంటాడు. తీరా అక్కడికి వెళ్ళి పనులన్నీ పూర్తి అయ్యాక మగవాడిని అదుపులో పెట్టుకోకపోవడం ఎంతో ప్రమాదమని, తాను అలా చేసి నేడు తన భర్తకు మరొకరితో సంభంధం ఉండేదని, తాను ఊరుకోవడం వల్లే ఇంత దాక వచ్చిందని చెబుతూ తన కొడుకును కూడా సరిదిద్దుకోవాల్సిన భాద్యత తనపైనే ఉందని ఒక అత్తగారు కోడలికి చెప్పడం కొసమెరుపు. కధలో నీతి ఉంది. పురుషుడు తన కొడుకైనా కూడా తప్పు చేస్తే దండించాల్సిన భాద్యతను కోడలికి అప్పజెప్పడం  జాగ్రత్త అని హెచ్చరించడం  ఎంతో అపురూపంగా ఉంది. కధ సమాజానికి ఎంతో అవసరం అనిపిస్తోంది

తమిరశ జానకి గారి కధల్లో ఒక సామాజిక భాద్యత ఉంది. బతికున్నా, చనిపోయినా మనిషి మనిషే.అక్కడ పనివాడు, తనవాడనే తేడా ఉండదనే ధోరణిలో సాగిపోయే కధ రంగన్న, ప్రేమకు, పెళ్ళికి అద్భుతమయిన అవగాహనను కలిగించే దిశలో సాగిపోయే కధ మౌన ప్రవాహం, కాలం అదునికంలోకి ఎంతగా పరుగులు తీస్తున్నా ఇంకా అసుయాగ్రస్త సమాజానికి బలి అయ్యే ధోరణిలో సాగిపోయిన కధ రాగిణి,  ఎక్కువైతే అమృతం కూడా విషమే అన్నట్లు అతి మంచితనం కూడా ఎక్కువైతే జీవితాలు ఎంతగా అర్థంలేనిదిగా తయారవుతాయో తెలియజేసే కధ  నిర్ణయం, ఇంకా పూలగుత్తి, నాకు కావాలి పెద్ద ప్రపంచం లాంటి కధలన్నీ ఎంతో ఆర్ద్రతతో నిండి ఉన్నాయి. కేవలం డబ్బే ధ్యేయంగా సంచరించే సమాజ స్థితికి మార్గదర్శకంగా ఉన్నాయి. స్వతహాగా మితభాషి, మానవత్వం ఉన్న రచయిత్రి కలంలో పదునైన భావాలు రావడం ఆశ్చర్యకరం కాదు..  

రచన చేయాలంటే మొదటగా సంభందిత వ్యక్తికి ఆలోచించగలిగే మెదడు ఉండాలి. అందుకు తోడు తాను ఏమి చేస్తున్నాడు, లేదా సమాజానికి తాను మంచి చేస్తున్నాడా లేక తనను తాను స్వాంతన పరచుకునే దిశగా సమాజానికి అపకారం తలపెడుతున్నడా అనే స్పష్టత అవసరం. విషయంలో రచయిత్రి లో స్పష్టత మెండుగా ఉంది. ప్రతి కధను చదవాల్సిన అవసరం సమాజానికి ఉంది.  చక్కని పుస్తకం చదివే అవకాశం వచ్చిన నేను ఇంత చక్కని కధలు మరిన్ని వీరి కలం నుండి రావాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech