సారస్వతం  
     పుస్తక పరిచయం - పరిచయకర్త: సత్యం మందపాటి   
ఎస్. గణపతిరావు రచించిన “మరిగే తారు సరోవరం”

కొన్ని నెలలయిందేమో సైబర్ హైవే మీద వెడుతున్నప్పుడు ముఖపుస్తకం ద్వారా మిత్రులయారు గణపతిరావు గారు. తర్వాత కొన్నాళ్ళకు తను వ్రాసిన కథలు కొన్నిటిని ఒక పుస్తకంలాగా ప్రచురించామనీ, నాకు ఒక కాపీ పంపిస్తాననీ చెప్పి అమెరికాలో నా అడ్రస్ అడిగారు. ఆయనకి అంత ఖర్చు ఎందుకు అనుకుని, నేను ఇండియాకి వచ్చినప్పుడు కొనుక్కుంటాను వద్దులెండి అని, ఆ పుస్తకం పేరు అడిగాను. ఆయన “మరిగే తారు సరోవరం” అని చెప్పగానే ఆ మకుటం నన్ను వెంటనే ఆకట్టుకుంది. ఆమధ్యనే చెన్నైలో లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ్ ఆవిష్కరించారని కూడా వినగానే, నా అడ్రస్ ఇచ్చి వెంటనే పంపించమన్నాను.

 మామూలుగా రోజూ రాత్రి పూట ఒక గంటసేపు తెలుగు పుస్తకాలు చదువుకునేవాడిని, ఈ నూట డెభై పేజీల పుస్తకాన్నీ ఆత్రంగా గబగబా చదివేశాను. కొన్ని కథలయితే మళ్ళీ మళ్ళీ చదివాను. కథలు అంత బాగున్నాయి కనుక నా స్పందన గురించి మీకూ చెప్పాలని, ఈ పుస్తక పరిచయం వ్రాస్తున్నాను.

ఈ కథల సంపుటిలో పది కథలున్నాయి. కథలు కాదు ఎన్నో జీవిత సత్యాలున్నాయి. కొన్ని కథ పేర్లు చెబితే ఈ  కథల్లో ఏముందో మీకు అర్ధమవుతుంది. “మరిగే తారు సరోవరం”, “సన్నజాజులు ఎగదోసిన నిప్పు”, “క్రిమినల్ గారి పిల్లనగ్రోవి”, “లోభుల్లో కర్ణుడు”...
ఈ కథలు గణపతిరావుగారి మాటల్లో “సామాజిక విప్లవం కోసం వ్రాసిన కొత్తరకం కథలు”.
ఈ పుస్తకం ‘అన్యాయాల్ని దశాబ్దాలుగా మౌనంగా భరిస్తూ ప్రతిఘటించని నొరులేని పేద, అమాయక, బలహీన తరతరాల జాతి జనులకు’ అంకితమిచ్చారు.

ఈ పది కథల్లో వున్న కథా వస్తువునీ, రచయిత మనసులోని మాటనీ చెప్పేసి, మీరీ కథలు చదివేటప్పుడు పొందే ఉత్సాహాన్నీ ఉత్సుకతనీ పోగొట్టటం నాకు ఇష్టంలేదు. అందుకే పుస్తకంలోని కొన్ని పరిచయ వాక్యాల ద్వారా నా మనసు లోని మాట మాత్రమే చెబుతాను.

“నీ పోలిస్ స్టేషన్లో మహాత్మా గాంధి, మదర్ థెరెస్సా ఫోటోలు ఎందుకున్నాయ్? వీడు పేదవాడే.. అయినా మనలాంటి మనిషే.. వాడ్ని కూడా ప్రేమించు... ప్రేమలో దేవుడు కనపడతాడు”

“ఇద్దరు తినే తిండి ఒక్కరం తినలేం, కానీ లక్షలాది మంది కడుపుని కొట్టే డబ్బుని ఒక్కరం దాచిపెట్టుకుని ఏం సాధిస్తాం”  
“నా జేబునుంచి తీయను. తప్పదనుకుంటే పక్కనున్నవాడి జేబు నుంచి తీసి దానం చేస్తాను. నేను తెలుగోణ్ణి”
“నిప్పులాంటి ప్రజాప్రతినిధులు లేనప్పుడు, నిప్పులాంటి అధికారులుంటారా?”
“కటకటాల వెనుక ఉండాల్సిన నేరప్రవృత్తి అన్ని వృత్తుల్లోనూ, మొత్తం వ్యవస్థలోనూ ఆకాశం వైపు వేళ్ళూనుకుని వుంది”
“మనలో, మన సమాజంలో దుష్టభావాల బురద గుంటలు, ఎంత అడుగు వేస్తే అంత లోపలికి ఎందుకు వెడుతున్నాయి?”
ఈ పది కథల్లో ఏ కథ అయినా సరే, చదువుతున్నప్పుడు మన సమాజం మీదే కాక మన మీద కూడా మనకి, ఎందుకిలా జరుగుతున్నది అని కోపం వస్తుంది. మన సమాజం మీదే కాక మన మీద కూడా, ఏమీ చేయలేకపోతున్నామే అని జాలి వేస్తుంది. మన సమాజం మీదే కాక మన మీద కూడా మనకి, ఎందుకిలా ఏమీ పట్టనట్టు మనం నిద్ర పోతున్నాం అని అసహ్యం వేస్తుంది. ఈనాటి చెత్త సినిమాల్లోలా ఎవరో హీరోలు వచ్చి మనల్ని రక్షిస్తారని, ఎన్నాళ్ళని ఇలా పని దొంగల్లా ఎదురుచూడటం? “నేను సైతం” అనే మాట అంత త్వరగా మరిచిపోయామా? “నాకు మాత్రం” అనుకునే అధోగతికి దిగాజారామా??  

“ఒక అవినీతి ప్రభుత్వం పోయి, మరో అవినీతి ఉచ్చు బిగిసికుంటోంది. ఒక అధినేత పోయి మరొక అవినీతి బకాసురుడు గద్దెనెక్కుతున్నాడు. అవినీతి పరుల కబంధ హస్తాల్లో మన దేశం యిరుక్కుపోయి వుంది. వ్యవస్థలో నిరంతరం జరుగుతున్న దోపిడీ, దుర్మార్గాలు తెలిసి కూడా మేధావులు ఆలోచనాపరులు, విప్లవవీరులు కాలేకపోతున్నారు. రాజకీయ పార్టీలు, చౌకబారు వినోద సాధనాలతో కలిసి తరతరాలుగా 'కరప్ట్ తరాల్ని’ సృష్టిస్తూనే వున్నారు, అవమానాలు, పోరాటాలు, త్యాగాలతో మహాత్ములు సాధించిన స్వాతంత్ర్యం విలువ ఇంతేనా" అని ఎంతో ఆవేదన పడతారు గణపతిరావుగారు.

మంచి ధర వస్తే భారతదేశాన్ని ఏ పాకిస్తానుకో, చైనాకో అమ్మటానికి ఎంతోమంది రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్న పరిస్థితిలో వుంది మన దేశం. సినిమా పిచ్చిలోనూ క్రికెట్ పిచ్చిలోనూ పడి నిద్రపోతున్నది, మెళుకువగా వుండవలసిన మన యువత. ఎంతో మంది అన్నా హజారేలు వచ్చి నిద్ర లేపినా లేవని సమాజం ఎక్కడికి పోతుంది? ఎటు పోతుంది?

ఇలాటి ప్రశ్నలకి జవాబుల కోసం మీరు వెదుకుతుంటే ఈ పుస్తకం చదవకండి. దీన్లోనే కాదు, ఇలాటి ప్రశ్నలకి జవాబులు ఏ పుస్తకంలోనూ వుండవు. ఈ ప్రశ్నలకి జవాబులు ఏమిటో మనందరికి తెలుసు. మనకెందుకులే అని మనం నిద్ర నటిస్తున్న మన మనసుకి తెలుసు అవేమిటో!


గణపతిరావుగారు చేసిన చిన్న ప్రయత్నం ఏమిటంటే, మనకి మన చుట్టూతా జరుగుతున్నది జరిగినట్టు చూపించటం. నిద్ర లేపుదామని మన చెవి దగ్గర అలారం పెట్టటం. నిజంగా నిద్రపోతున్నవాడిని ఈ అలారంతో నిద్రలేపటం సులభం. కానీ తనకేమీ పట్టనట్టు అన్నీ విస్మరించి, నిద్రపోతున్నట్టు నటించే వారిని నిద్ర లేపటం చాల కష్టం!

నేను వ్రాస్తున్న ఈ పరిచయ వాక్యాల్లో నాలో ఏదన్నా ఉద్రేకం కనిపిస్తే, అది గణపతిరావుగారి రచనాపాటవమే! అయన ఈ కథలు వ్రాస్తున్నప్పుడు అనుభవించిన వేదన, ఆవేదన, ఈ పుస్తకం చదివినప్పుడల్లా నాకూ కలగటమే కారణం కావచ్చు.
ఇలాటి చక్కటి కథల పుస్తకం చదవటం మీ బాధ్యత అని నా ఉద్దేశ్యం. కాపీలు కావలసిన వారు ఈ క్రింద ఇస్తున్న సమాచారంతో పుస్తకం కొని, తెప్పించుకోవటమే కాక, చదివి మీ అభిప్రాయం రచయితకి తెలిపితే ఆయనకి, ఇంకా ఎన్నో మంచి కథలు వ్రాయటానికి స్పందన, ప్రోత్సాహం వస్తుంది
 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech