శీర్షికలు  
     పద్యం - హృద్యం - నిర్వహణ : రావు తల్లాప్రగడ  
 
"సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com) ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు జనవరి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ మాసం సమస్యలు 
ఆ.వె.|| రచ్చ గెలిచె ఇంట రచ్చరచ్చగ చేసి
కం|| తారసితారల భేదము

 

క్రితమాసం సమస్యలు ( గండికోట విశ్వనాధం గారు ఇచ్చినవి)
తే.గీ.||దాత విలపించె వేరొక దారి లేక
కం.||దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ - చింతా రామ కృష్ణా రావు, హైదరాబాదు

తే.గీ.|| మృత్యు యోగము నీకుండె మేలు దున్న
దాన మిచ్చిన కాచును తప్పదనగ
దాన మెవ్వరు నొల్లమిఁ బ్రాణ భీతి
దాత విలపించె వేరొక దారి లేక.

కం.|| వరలించు నీతి బోధన
స్థిరముగ లేకునికి, నీతి చేకొనమి, ప్రజన్
వరలింప వలయు ప్రతినిధి
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

రెండవ పూరణ - గండికోట విశ్వనాధం, హైదరాబాద్ ,
గీ.|| ఎండలకు,వరదలకు, కరెంటు కోత
లకు, పెరిగిన ధరలకు, పాలకుల వైఖ
రులకు, బడుగు బ్రతుకులకు రోసి, అన్న
దాత విలపించె వేరొక దారి లేక.

కం.|| పరులను దోచెడి నీచులు
నిరతము భోగము మరిగిన నేతలు ప్రభులై
విరివిగ నీతులు వదరిన
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్.

మూడవ పూరణ- వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం
తే.గీ.|| అన్నదానము చేయంగ అతిథులంత
తిన్న ఇంటికి చేటును తెచ్చినారు
ఉన్న డబ్బు అంతయును కోల్పోయి అన్న
దాత విలపించె వేరొక దారి లేక

కం.|| దొరల వలే వేషము వే
సిరి దొంగలు సంఘమందు చేర్చుకొనంగన్
సరియగు సమయమునను ఆ
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

నాల్గవ పూరణ - గన్నవరపు నరసింహ మూర్తి, ఉత్తర అమెరికా
కం.|| వరపుత్రులు సిరిమంతులు
ఒరపంతయు జూపి కొనిరి ఒడుపుగ పదవుల్
పరువింత లేక భువిలో
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

ఐదవ పూరణ - నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
తే .గీ.|| దాన మీయగ నాతని ధనము కరిగి
రిక్త హస్తము నెవరికి భుక్తి నియక
మరలి పొమ్మని చెప్పగ మాట రాక
దాత విలపించె వేరొక దారి లేక .!

కం.|| కరువులు పెరిగిన బ్రతుకుల
బరువును భరియించ లేక బాధలు పడుతున్ !
దొర తన మేటికి మనకని
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్ !

ఆరవ పూరణ- యం.వి.సి. రావు, బెంగళూరు
తే.గీ.|| మరణ శయ్యను వున్నట్టి మనుజుగావ
రక్తదానంబు సేయంగ శక్తిమీర
ధనము నాశించి యమ్మిరి దయనుమరచి
దాత విలపించె వేరొక దారి లేక

కం.|| గురువుల పేరిట కొందరు
పరసేవన ముసుగులోన పలువురు నేతల్
పరిపరి రీతులు వెదకుచు
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

ఏడవ పూరణ - గోలి హనుమత్ శాస్త్రి
కం|| దొరకెడు వరకును యందరు
దొరలే, దొంగలుగ మారి దోచిరి ధనముల్
దొరలిరి దేశమునేలే
దొరలే యవినీతి యందు దొంగాటలతో .

ఎనిమిదవ పూరణ - జగన్నాథ రావ్ కె. ఎల్., బెంగళూరు
తే. గీ. || రెప్పలార్పక రైతు ఆల్చిప్ప యగుచు,
నింగి ముత్యపు చినుకును నేల రాల్చు
తరుణమున లేక వరుణుని కరుణ, అన్న
దాత విలపించె వేరొక దారి లేక

తొమ్మిదవ పూరణ - టేకుమల్ల వేంకటప్పయ్య
తే.గీ.|| ఎవరు అధికార పీఠాన్ని ఎక్కి ఉన్న!
ధనము ఇచ్చుట మామూలె ధరణి సాక్షి!
కొత్త పుంతల సంపద కోర్టు కెక్కె!
దాత విలపించె వేరొక దారి లేక!

పదవ పూరణ - ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
తే.గీ.|| చేతి ధనమును రుణము వెచ్చి౦చి, ఫలము
చేతి క౦దునని ఎదురు చూడ, కలను
జెరిచె కు౦భ వాన, పొలము జూచి అన్న
దాత విలపి౦చె వేరొక దారి లేక!

క౦|| ధర్మము విడిచియు పాలక
దొరలే దొ౦గలుగ మారి దోచిరి ధనముల్!
దరిలో నున్నది కాలము,
దరువులు చెల్లవిక ధర్మము గెలుచు నెపుడున్!

పదకొండవ పూరణ - నిరంజన్ అవధూత, బోస్టన్
తే.గీ.|| "ధనము, కనకము మితిమీరి దాన మీయ
చివరి కీ రీతిన బతుకు చీకటాయె!"
అనుచు, మదిలోన వగచుచు, అదుపు లేక
దాత విలపించె వేరొక దారి లేక.

తే.గీ.|| దాతృ గుణమును కలిగిన తరుణి యొకతి
చేరి తిరుపమునకు కోట్ల సిరిని యొసగ
వాడు ఒక్క మాటున గుండె పగిలి చచ్చె
దాత విలపించె వేరొక దారి లేక.

కం.|| పరి పరి విధముల స్కాములు
పరికింపగ విశిదమగును పాలక ప్రజ్ఞల్
అరెరే! ఏమని చెప్పుదు
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

 పన్నెండవ పూరణ - రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా
తే.గీ.|| మంచి గోరుతు సృష్టించ మానవులను,
మంచి నంతయు వారంత తెంచు కొనగ,
ఇట్టి జనులను పుట్టించి నట్టి యా వి
దాత విలపించె వేరొక దారి లేక!

కం.||స్థిరమగు పదవులు దక్కిన
తరుణము లైసెన్సగునట, వరమగునటరా!
పరువు పెరుగ దోచుకొలది,
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

పదమూడవ పూరణ - జ్ఞాన ప్రసూన మురుకుట్ల
కవిత|| ఎండ కన్నెరుగని అపరంజి బొమ్మని 
ఏడు మల్లెలెత్తు బంగారు తల్లిని 
సారేలెన్నో బెట్టి సాగనంపే వేళ
గుండె చెరువై పోయే కనుల నీరే పొంగే
చిన్నారి బ్రతుకింక ఎటులుండ బోవునో 
కష్ట సుఖమ్ములనింక ఎట్లు సహియించునో
ఊహ మాత్రమ్మునే నీరు కన్నుల చింద 
దాత విలపించే ! కన్యాదాత విలపించే వేరొక దారి లేక !

కవిత|| తన రక్తమ్మునే స్వేదముగా చిందించి 
రేయనక పగలనక కాయ కష్టము చేసి 
పండుగలు పబ్బాలు తనకు కావని ఎంచి 
అర్ధాకళ్ళతో రోజులను వెళ్లమార్చి
కాసు కాసూ కూర్చి "  దొర "  కడ దాచుంచి 
వళ్ళు గుల్లే అయి ఆస్పత్రి పాలై 
విధి లేక ధనము కై దొర కడకరుగగా
మొండి చేయి చూపి దొర తరిమివేసే 
ఘోర కలి కాదా ఇది ? దొరలే దొంగలైన వేళ  


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech