పాఠకుల సమర్పణ  
     మా నాన్నకు జేజేలు - నిర్వహణ : దుర్గ డింగరి  

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి. 


 

మా నాన్నకు జేజేలు

రచన : సత్తిరాజు శంకర్

నోట్ : రచయిత శంకర్, బాపుగారు శ్రీ సత్తిరాజు వేణుగోపాలరావు గారి కుమారులు.

 

శ్రీ సత్తిరాజు వేణుగోపాలరావు

మా నాన్నగారు శ్రీ సత్తిరాజు వేణుగోపాలరావు 1905లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు.

అయితే కన్నతండ్రిని కళ్ళారా చూసుకునే భాగ్యం ఆయనకు లేకపోయింది. పుట్టక ముందే వారు గతించారు. కష్టాలు తాను పడుతూ, కొడుకుకి అవి తెలియనివ్వకుండా వారి తల్లి ఆయనను పెంచారు. ఆ అనుబంధం వల్ల, మా నాన్నగారికి, తన తల్లి అంటే బోల్డు ప్రేమాభిమానాలు.. ఇంకా చాలా గౌరవం. కష్టపడి పైకొచ్చి తనంటే ఆవిడ గర్వపడేలా చేశారు.

కొన్నేళ్ళ తర్వాత మా నాన్నగారు తన తల్లి, భార్య, అయిదుగురు పిల్లలతో- (అంటే నలుగురు కొడుకులు, ఒక కూతురు) మద్రాస్ మైలాపూర్ లో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడే లా కాలేజ్ లో చేరి, డిగ్రీ పూర్తి చేసి మద్రాస్ హైకోర్టు లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ పెట్టారు.

మా నాన్నగారు ఎంత ముక్కుసూటిగా పోయే మనిషో, అంత మృదుస్వభావి కూడా. ఇంటికి వచ్చిన వాళ్ళకి అది ఎవరైనా కానీ కాదనకుండా ఎంతో సాయం చేసేవారు. మా ఇల్లు ఒక సత్రం లాగా ఉండేది. చుట్టాలూ, స్నేహితులూ, ఊళ్ళనుంచీ వచ్చిపోయే లాయర్లు, క్లయింట్లతో. మా నాన్నగారి చలవ వల్ల , అందరికీ మా ఇంట్లోనే బస, భోజన ఏర్పాట్లూ... వాళ్ళ పని అయిపోగానే తిరుగు ప్రయాణానికి రిజర్వుడు టిక్కెట్లు.

నాకు బాగా గుర్తు. 6-7గురు స్టూడెంట్లు, మా నాన్నగారి గైడెన్స్ తో మా ఇంట్లో ఉండి చదువుకుని డిస్ట్రిక్ట్ మున్సిఫ్ పరీక్షలు పాసయ్యారు. దానివల్ల మా ఇంటి వాసి/రాశి - మా నాన్నగారి హస్తవాసి చాలా గొప్పవని అందరూ నమ్మేవారు. దీనివల్ల ఇంట్లో ట్రాఫిక్ పెరిగింది.

మా నాన్నగారికి కోపం ఎక్కువ. దానికి కారణం ఆయన అనారోగ్యం. ఆయనకి ఆస్త్మా ఉండేది. దానివల్ల ఒక పక్క చాలా బాధపడుతున్నప్పటికీ ఆయన నమ్మే జీవన సూత్రాలు మర్చిపోలేదు. వాటిని ప్రతి నిమిషమూ పాటించేవారు. ఆయన ఏ పని చేసినా, చాలా sincere గా, meticulous గా చేసేవారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే అబద్ధాలు చెప్పకూడదని చెప్పేవారు. అవే లక్షణాలు / అలవాట్లు తన పిల్లలకి కూడా అబ్బాలనీ కోరుకునేవారు personal and professional life లో కూడా.

ఒకసారి ఇంటి ఓనరుకు అద్దె ఇచ్చి రమ్మని నన్నుపంపారు. నేను వెళ్ళే టైంకి ఆయన లేరు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వచ్చాను. అది తెలిసి నాన్నగారు పేము బెత్తంతో నాలుగు వాయించారు. ఓనరు నీ కాదు, వాళ్ళ అబ్బాయినీ కాదు - ఆ సంగతి చెప్పని నన్ను. కానీ, వెంటనే ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఎప్పుడూ నిజమే చెప్పాలనీ అర్ధమయ్యేలా మళ్ళీ చెప్పారు.

మా అన్నయ్య బాపుకి చిన్నప్పటినుంచే బొమ్మలు వెయ్యడం అంటే ప్రాణం. నాన్నగారు మాత్రం అది ఇష్టపడే వారు కాదు. ముందు చదువు అది పూర్తయ్యాక బొమ్మలు అని చెప్పారు. బాపు మాత్రం నాన్నగారికి తెలియకుండా బొమ్మలు వేసేవాడు. అవి చూసి, ముందు తిట్టినా secret గా మురిసిపోయేవారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి వాటిని గర్వంగా చూపించేవారు బాపు ఇంట్లో లేనప్పుడు.

తర్వాత బాపు బొంబాయికి వెళ్ళీ drawingలో course చేస్తానని చెప్పాడు. నాన్నగారు ఒప్పుకోలేదు. ఆర్ధిక పరిస్థితుల వల్ల. లా చదివి తనలాగే అడ్వకేట్ అవ్వమన్నారు. ఆయన ఇష్టప్రకారం బాపు లా లో డిగ్రీ పూర్తి చేశాడు. Advocate గా Madras Barలో Enroll అయ్యారు.

మా నాన్నగారు బాపు స్నేహితుడైన (late) ముళ్ళపూడి వెంకటరమణని, మా బావగారు, మా పెద్దన్నయ్యలతో బాటు, తన సొంత కొడుకులాగా చూసుకునేవారు. చదువు మీద ధ్యాస పెట్టమనీ, రమణ తల్లి ఒంటరిగా పడే కష్టాలని మర్చిపోవద్దనీ చెపుతూ ఉండేవారు. రమణది మా కుంటుంబంలో పెద్ద కొడుకు స్థానం.

          

మా నాన్నగారు, అమ్మగారు వాళ్ళకు ఉన్నంతలో చాలా simple జీవితం గడిపేవారు. నాకు తెలిసి, మద్రాస్ లో సొంత ఇల్లు లేని తెలుగు advocate బహుశా ఈయనేమో! ఆయనకి తన ఆగోగ్యం క్షీణిస్తోందని తెలుసు. అందుకే, మా అమ్మతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆర్ధిక పరిస్థితులు అడ్డం వచ్చినా సరే, మా చదువులు ఆగకూడదని.

1953 ఆయన 49 సంవత్సరాల చిన్న వయసులోనే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన కోరికలు, ఆశయాలు, ఆదేశాలు నిజం చేయడానికి మా అమ్మగారు చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఆశీర్వాదాలు, మా అమ్మ మా కోసం పడ్డ కష్టాలు - చేసిన త్యాగాలు - ఇవే మమ్మల్ని ఇవాళ మేమున్న స్థానాల్లో నిలబెట్టినవి.

వాళ్ళిద్దరికీ మా జేజేలు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.br>    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, సAgnatech