పాఠకుల సమర్పణ  
     మా మామయ్యకు జేజేలు - రచన : భానుమతి (బాపు గారి కుమార్తె)  
ముళ్ళపూడి గారు మాకు " మామ"

 నా పేరు భానుమతి. నేను బాపు గారి అమ్మాయిని.
అందరూ ముళ్ళపూడి రమణ గారి గురించి రాస్తున్నారు అది చూసి నాకే అనిపించింది, అమ్మ గానీ, నాన్న గానీ, నేనూ, మా ఇద్దరు తమ్ముళ్ళూ - ఎవరం ఏదీ రాయలేదని. రమణ గారి గురించి మాలో మేము చెప్పుకోవడమే గానీ, ఎవరితోనూ పంచుకోలేదని.
ఇది చదివేవారికి రమణ గారితో మాకున్న అనుబంధం అర్ధం కాకపోవచ్చు. రమణ గారంటే - మాకు - అంటే నాకు, మా తమ్ముళ్ళు వేణు, చిన్నబాబులకు, " మామా." మా నాన్న అంటే రమణ గారి పిల్లలు వరా, అనూలకి మామ. మా అయిదుగురికీ తప్ప " నాన్న - మామ," అంటే ఎవరికీ తెలియదు. అర్ధం కాదు.
నాన్న-మామ మాకు కూర్చోబెట్టి ఏ బోధలూ చేయలేదు. కానీ మాకు తెలియకుండానే, వాళ్ళ ప్రభావం మా మీద ఎంతో పడిపోయింది.
తమాషా ఏమిటంటే - వాళ్ళిద్దరూ ఎంతో టాలెంటెడ్ పీపుల్, లెజెండ్స్. But it didn"t make any difference for any of us. మాకు - they were always
"నాన్న - మామ" - two of the sweetest and most lovable people on earth.

నన్ను చాలా మంది అడిగారు, " ఆ ఇంట్లో పుట్టిన పిల్లగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారూ?" అని. నా జవాబు ఎప్పుడూ ఒక్కటే - "అందరి నాన్నల్లాగే నాకూనూ," అని.
మమ్మల్ని మామూలుగానే పెంచారు. But we were always surrounded by music, books, రామాయణం, భారతం కథలు.
మామ ఇంట్లో నాకు దొరికిన రెండు గొప్ప కానుకలు శ్రీరాముడు, గోదావరి. చిన్నప్పటి నించి వాటి గురించి వినీ, వినీ _ నా రక్తంలో ఇంకిపోయాయి. కొత్తనీరుతో గోదావరి - కార్తీక మాసంలో దీపాలతో వెలిగే గోదావరి - వెన్నెల్లో గోదావరి రామనామం సరే సరి.
వాళ్ళ అమ్మగారు, అక్కగారు, తమ్ముడు - వాళ్ళ కుటుంబం, చుట్టాలూ, పక్కాలూ - ఇల్లంటే ఇలాగే ఉంటుంది అని మా ఉద్దేశ్యం. ఏది చేసినా ఇప్పటికీ కలిసే చేస్తాం, కష్టం, సుఖం, ఏడుపు, నవ్వు - అన్నీ కలిసే పంచుకుంటాం. అలానే ఉండాలి అని నేర్పించారు మాకు.
ఎమోషనల్ గా అయిపోకుండా, నన్ను ప్రభావితం చేసిన మామ డైలాగ్స్ కొన్ని - మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మామ సినిమాలు ఎన్ని సార్లు చూశానో! నేను పెద్దవుతున్న కొద్దీ - కొన్ని కొన్ని డైలాగ్స్ హఠాత్తుగా అర్ధం అయిపోయి, " కదా?" అనిపిస్తాయి.
మచ్చుకి కొన్ని:
4 మురగ పెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్ - పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్.
4  జీవితంలో దొరికిన బొమ్మలు నచ్చవు. నచ్చిన బొమ్మలు దొరకవు.
4 ఒక్కొక్కప్పుడు, పుట్టెడు డబ్బు పట్టెడు అన్నం కూడా పెట్టదు.
4  వర్షపు బొట్టు - నీటిలో పడితే కలిసిపోతుంది. ఇసుకలో పడితే ఇంకిపోతుంది. అదే ముత్యపు చిప్పలో పడ్తే, ముత్యమై ప్రకాశిస్తుంది.
4 ఇంకొల్లు నిన్ను చూసి కన్నుకుట్టే లాగా ఉండాలి కానీ అయ్యో అని అనిపించుకోకు.
4 సిఫార్సులతో కాపురాలు చక్కపడవు.
4  అందరిలోనూ గోరంత దీపం ఉంటుంది. దాని పేరే ఆశ. కష్టాలు కారు చీకట్లలాగా ముసురుతూంటే, ఆ గోరంత దీపమే కొండంత వెలుగౌతుంది.


ఈ సినిమాలు చూసి నా ఆలోచనల్నీ నా perception నీ మార్చుకున్నాను. ఈ డైలాగులు కేవలం సినిమా కోసం రాసినవి కావు. ఆయన నమ్మిన జీవిత సత్యాలు.
నాన్న - మామలది "never say die" తత్వం. నాకు ఊహ తెలిసినప్పటి నించీ - నాన్న అంటే - కొన్నేళ్ళు కుర్చీలో కూర్చుని - దాని చేతుల మీద డ్రాయింగ్ బోర్డ్ పెట్టుకుని - 100% ఏకాగ్రతతో బొమ్మలు వేసే రూపం. మధ్యమధ్యలో - నేల మీదే - చేతినే దిండుగా పెట్టుకుని పది నిమిషాలు పడుకునే రూపం, ఇవే మెదులుతాయి.
మామకి - తన మీదా, తన రాముడి మీదా ఎంత నమ్మకమంటే - మొన్న - ఈ మధ్యనే, " ఎందుకు మామా - "కోతి కొమ్మచ్చి," ఆపేశావు? ఏదో అన్నం పెడుతోంది కదా?" అన్నాను. దానికి ఆయన, " జనం ఆపేయి మొర్రో అని అనుకునే దాకా తెచ్చుకోకుండా - ఎందుకు ఆపేశావు? అని అనుకున్నప్పుడే ఆపేయడం మంచిది. ఇది వస్తుంది అని అనుకున్నానా? వచ్చింది. అలాగే ఆ రాముడు ఇంకోటి ఇస్తాడు నాకు పని వస్తుంది." అన్నారు.
చిన్నప్పటినించీ ఇదే attitude. ఆయన 80వ ఏట కూడా అంత నమ్మకంతోనూ, ధైర్యంతోనూ అన్న మాటలు - నన్ను ఆశ్చర్యపరుస్తాయి.
" ఎవరైనా తాతగారు అని పిలిస్తే - నేనూ, మీ నాన్న వెనక్కి తిరిగి చూస్తాము - ఎవర్ని పిలిచారా - ఇక్కడ తాతగారు ఎవరా అని ." అని హాయిగా నవ్వేసే మామ - miss you. Miss you very very much.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech