కవితా స్రవంతి  
     మనిషిని పోల్చుకోవడం ఎలా?  - రచన : శైలజామిత్ర  
 
 

కనులు మూసినా తెరచినా రాత్రి కన్న కలలే..
నిదిరిస్తున్న, మేల్కొని ఉన్నా పగటి ఆవేదనలే..
ఆకాశాన్ని... అవనినీ వేరుచేస్తూన్న 
మనో కాలుష్యపు పొగ కారుచీకటై కాలాన్ని కమ్ముకుంటుంటే 
పచ్చని పైరగాలి కూడా మాడి  మసై
బీటలు వారిన భూమిపై కన్నీళ్లు కురిపిస్తున్నాయి..
ఆస్థుల ఆరాటాల మధ్య పేదరికం పీలికలై పోయి 
ఆత్మీయతలన్నీ  ఆకాశ హర్మ్యాల పై కదలికలేని గోడలా  
స్వార్థపు సిమెంటుతో కాంక్రీటు భవనాల మధ్య ఒక ఇటుకలా  
మారిన మనిషిని పోల్చుకోవడం ఎలా?

ఉరికవతల నీకున్న దారిని నీకే వదిలి 
నవ్వు  నడకల్ని మరచి..నాదనే నీ వైఖరిని విడిచి 
చదువును చెదలకొదిలిన ఆ చిట్టి చేతులు 
బండ పనుల్లో పడి బాల్యం ఒకవైపు మట్టి కొట్టుకు పోతుంటే  .,.
ఆత్మ విశ్వాసం కోల్పోయి ఆత్మ వంచన చేసుకుంటూ
ఆత్మ హత్యల్ని ఆశ్రయిస్తున్నయువత అంతరంగం 
ఆధునిక ముసుగులో అత్యాదునిక జీవితంకోసం పరుగులు తీస్తుంటే
దేశ పరువుకు దిశలెరుగక దిన దిన గండమవుతుంటే 
డబ్బునే లబ్ డబ్ మనే గుండె శబ్దంగా మార్చుకుంటుంటే  
ని మనసును  వేదికేదేలా?.

రంగుల తళ తళల మధ్య తలలుంచి మురిసిపోతూ 
వెండితెర విన్యాసమే విధి రాతనుకుంటూ 
తరం తరం అంతరాలు లేక  వెర్రితలలు వేస్తూ విర్రవీగిపోతుంటే 
పలుకుబడులు, ధనకాంక్షలు, కీర్తి దాసోహాలతో పాటు  
పదవీ పైరవీల గాలుల తాకిడికి కొట్టుకుపొతూ, 
పచ్చనోట్ల పాములై ఏదో ఒక వుడ్డును బెడ్డుగా మార్చుకుని 
చిందులు వేస్తూ దానికి నాగరికతని కొత్త కథలు వినిపిస్తుంటే 
మచ్చలు లేని మానవత్వాన్ని చూసేదెలా ?

తెర బుల్లిదైనా స్త్రీ జీతి మొత్తం సిగ్గుపడేలా 
అసహజపు ఆనవాళ్ళను ఎత్తి చూపుతూ 
రంకుబొంకుల రణరంగంపై రాణివాసం చేస్తుంటే 
తిండిలేక, తర్వాత బతుకులేక.. ఏమి మిగలక 
గతుకుల జలతారు రోడ్లపై ఎవరు ఎవరో గుర్తుపట్టని స్తితిలో 
కనిపించే ప్రతి ప్రాణిని మాటలతో కలిపి వండుకుంటూ 
నిందల నీడలా చాటున దాక్కుని ఉంటే 
వాస్తవమేదో తెలుసుకునేదేలా? 

ఇప్పుడు సెలవియ్యండి 
ఏ మనిషిని చూసి నవ్వాలి? 
ఏ సంతోషాన్ని మీకు మాలగా వేసి అలంకరించాలి?
ఏ స్వార్థాన్ని మీకు నవ్వుతూ అందివ్వాలి?
ఏ కవితలో ఆత్మవిస్వాశాన్ని చూపాలి?
నవ్వడానికి.. ఆనందంతో ఆడడానికి 
కవిత్వం ఏమి ఒక కాలక్షేప౦ కాదు..
మండుతున్న ఒక అగ్ని స్వరూపం ..
క్షణక్షణం అక్షరీకరించే వాస్తవ నిదర్శనం..!

   

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech