కవితా స్రవంతి  
      శ్రీ శివామృతలహరి
 - రచన: డా. ఏల్చూరి మురళీధరరావు
 
 

 

 

1  శ్రీనాదాంతవిభావనీయపరమశ్రేయోనిధానా ! త్రివే
దానుస్వారవిధాన ! వైదికలతాంతారూఢతత్త్వైకవి
ద్యానన్యాదృశకేళిరమ్య ! ప్రణవధ్యానైకగమ్యా ! స్వస
ర్గానూనస్థితిసంహృతిత్రితయముక్తాకార ! విశ్వేశ్వరా ! 

2 కలరూ పేర్పడరాని వైద్యుతలతాకల్పంబవై పొల్చి, పెన్
వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళాభిజ్ఞాస్పదభ్రూయుగీ
విలసన్మధ్యతలావతార ! కరుణావిస్తార ! నాలోన ని
న్నెలమిం దాపము తీఱఁ జూచుటెపుడోయీ, స్వామి విశ్వేశ్వరా !  

3 నీవై యుంచెదు మంటినేల మొలకన్; నీర్వోసి పేరాదటం
జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృత్సీమన్ వెలుంగై మము
న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్ నీలాభ్రధూర్జాటజూ
టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య ! విశ్వేశ్వరా ! 

4 ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
లంకర్మీణ ! భవార్తభక్తజనకల్యాణైకపారీణ ! భా
వాంకూరశ్లథనైకదక్ష ! దురితవ్యాఘ్రౌఘహర్యక్ష ! య
స్తంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము విశ్వేశ్వరా !  

5 సేవింతున్ నిగమాగమాంకితశుభశ్రీనామధేయున్, నినున్
భావింతున్ జతురాస్యకేశవనిలింపాదృష్టచూడాపదుం,
గావింతున్ భవదీయదాసజనకైంకర్యంబు, నీ పాదరా
జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్ జీవింతు విశ్వేశ్వరా !  

6 చిరమై శారదచంద్రికారుచిరమై శీర్యణ్యగంగాశుభా
కరమై శాంతజితేంద్రియప్రకరమై కైవల్యమందారసుం
దరమై విద్రుతభక్తలోకదరమై ధర్మానుసంధానసు
స్థిరమై పొల్చెడు వెల్గు నొకఁడే సేవింతు విశ్వేశ్వరా !  

7 నతభక్తార్ణవచంద్రమండలఘృణీ ! నైజాత్మయోగారణీ !
స్తుతకల్యాణమణీ ! జటాటదమరస్రోతస్వినీధోరణీ !
శ్రితలోకైకశిరోమణీ ! శ్రుతిశిరస్సీమంతముక్తామణీ !
ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ ! ప్రార్థింతు విశ్వేశ్వరా !  

8 గాలింతున్ నిను గాలిలోఁ, బృథివి, నాకాశంబులో, నీటిలో,
లీలామేయ ! వెలుంగులోన; నిజకేళీకల్పవిశ్వా ! జగ
జ్జాలంబున్ మథియింతుఁ గాని, భవనిస్తారైకకేళీధృతిన్
నాలో నున్నది నీవు నేనని మదిన్ భావింప విశ్వేశ్వరా !  

9 కల్యాణావహధర్మనిర్మలగుణౌకస్ఫూర్తి నీ జీవసా
కల్యంబుం బరమానురాగమయవీక్షాదీక్ష రక్షించి కై
వల్యానందమరందమత్తమధుపవ్రాతంబుగాఁ దీర్చు వై
పుల్యప్రోజ్జ్వలభక్తిభావమహితాంభోజాక్ష ! విశ్వేశ్వరా !   

10  శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ ! నీ
నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె తండ్రీ ! నను
న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి ! విశ్వేశ్వరా ! 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech