కథా భారతి  
      కథా విహారం - రచన :  విహారి  
  పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసే వీరాజీ  
 

తెలుగు సాహితి చేసుకున్న అదృష్టాల్లో ఒకటి బహుముఖీనమైన ప్రతిభావ్యుత్పత్తులు కలిగిన అనేకమంది ప్రజ్ఞానిధులు కథా రచయితలు కూడా కావటం. వేలూరి వారితో మొదలెట్తే ఒక్కొక్కరు దీపధారిగా పెక్కురు కనిపిస్తారు. తెలుగు కథా మార్గంలో అలాంటి వారిలో ఒకరు వీరాజీ.

వీరాజీ అతి పిన్న వయసులో తన 12వ ఏటనే కలంపట్టి కవిగా, కాలమిస్టుగా కథారచయితగా, నవలాకర్తగా, ఆంధ్రపత్రిక సంపాదకునిగా ఎదిగి పాఠకులకు గణనీయమైన సాహితీ సేవ చేస్తున్నారు. వీరాజీకి మధ్య తరగతి మనుష్యుల హృదయాలు తెలుసు. వారి మనస్తత్వాల్లోని వైచిత్రి, వైరుధ్యాలు తెలుసు. కుటుంబాల్లోని వ్యక్తులు మధ్య ఉండే అనురాగ విరాగాలు, ఆప్యాయతా అసూయలు.. ఇలా అనేక సమస్యల చిక్కుముళ్ళు తెలుసు. ఈ తెలివితనం వల్ల వీరాజీ కథలు పాఠకుల గుండెకు హత్తుకునేలా తయారైనాయి.

వీరాజీ కథల్లో పలువురి ప్రశంసల్ని పొందిన కొన్ని గొప్ప కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ‘కరివేపాకు’, ‘లక్ష’, ‘సావిత్రి గ్రహించిన సత్యం’ మొదలైనవి. ఇంటివాళ్ళకి, అద్దెకున్నవాళ్ళకి మధ్య - వానకి, గాలికి, ఉప్పెనకి కారణమైనది కరివేపాకు చెట్టు. అసలు గోరింటాకు దగ్గర మొదలవుతుంది తగవు. పిల్లా పీచులేని ఇంటావిడ ఆ గోరింటాకుని కూడా 15 పైసలకు అమ్ముకునే రంగాజమ్మ మరి. ఇంక కరివేపాకేం ముట్టుకోనిస్తుంది. చివరికి దొంగవెధవ కరివేపాకంతా దూసేసి (నానిగాడి మాటల్లో చెట్టుని క్షవరం చేసేశాడు). మూటకట్టుకుని సైకిల్ మీద ఉడాయించాడు. రంగాజమ్మ గారు చిందులు వేస్తోంది. అద్దెవాళ్ళు లోపల చాలా ఆనందపడి పోతున్నారు. కథలో వీరాజీ వ్యంగ్యం ద్వారా, విభిన్న మానవ మనస్తత్వాల్ని చిత్రించిన తీరు విలక్షణంగా ఉంటుంది.

ఇలాగే, ‘లక్ష’ కథ. చక్రపాణి ఒక ప్రైవేత్ కంపెనీలో ఎకౌంటెంట్. ఈతి బాధలు, ఆశలు ఫుల్. జేబులో పైసలు నిల్. షరా మామూలే. లాటరీ టిక్కెట్ కుర్రాడు తగులుకున్నాడు. తప్పలేదు. కిళ్ళీకొట్టు నాగయ్య రూపాయిచ్చాడు. అప్పారావ్ టిక్కెట్ చించాడు. ఇది ఒకటో భాగం. ఇక రెండో భాగమంతా చక్రపాణి కలలు. లక్ష వచ్చేసినట్టు.. సీరియల్ కలలు! మనోద్విగ్యత. ఆలోచనలు ఉత్థాన పతనాలు, తన మీద తనకే మోజు. అంతలో అసహ్యం ఉన్న దౌర్భాగ్యాలకి కసి, నిస్సహాయత! ఇదొక చైతన్య స్రవంతి. ఇక ముగింపు. లాటరీ టిక్కెట్ గయా! గల్లంతు! పోయింది! విరక్తి. విషాదం, ప్రపంచం మీద ఏకమొత్తంగా కోపం! కడకు బాధ దుఃఖంగా, కోపంగా, జాలిగా, కాళ్ళీడ్చుకుంటూ ఇంటిమొహం పట్టాడు. టికెట్ ఎందుకైనా మంచిదని మననం చేసుకుంటూ! ఆశ చెడ్డది కదా!

ఉత్తమ సాహిత్యానికి ఎల్లలను చెరపేసి గాలిలా, నీరులా, వెలుతురులా వ్యాప్తి చెందే శక్తి ఉంటుందంటారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఒకచోట. లక్ష కథలో చక్రపాణి బెజవాడ వాడే కానక్కర్లేదు. దేశంలో ఏ ఊరివాడైనా అయి ఉండవచ్చు. మధ్య తరగతి మనిషి అంతే. మనస్తత్వం, స్వభావం, ఊహపోహలు, బహిరంతర ప్రవర్తన అన్నీ సాధారణీకరణం చెంది చక్రపాణి అయ్యి సమాజంలో ఒక మధ్యతరగతి మనిషి నమూనా కథకెక్కింది.

‘సావిత్రి గ్రహించిన సత్యం’ కథలో సావిత్రి బి.ఏ పాసైన పట్నవాసం పిల్ల. పెళ్ళి కావాలి. అత్తా మామ వాళ్ళ పల్లెటూరు వచ్చింది. బియ్యే తప్పిన బావ సత్యం. కథ చివరికి సత్యం సంస్కారం, మనస్సు సావిత్రి ఆదరణ పొందాయి. పల్లె గురించి, వారి గురించి ఆమెకున్న భావనలో మార్పు వచ్చింది. సావిత్రి సత్యాన్ని గ్రహించింది. శ్లేష కూడా అన్వయిస్తుంది. మరి కథా వస్తువుల్ని ఇలా పరిచయం చేస్తుంటే కధౌన్యత్యం ని పూర్తిగా ఇలాంటి వ్యాసాల్లో ఆవిష్కరించలేం. కథలో ఏది చెప్పడం, ఎలా చెప్పడం అనే వాటిలో నేను ఎలా చెప్పడం మీద అంటే శిల్పం మీద మొగ్గు చూపెడతాను అని తానే చెప్పుకున్నారు వీరాజీ. ‘కథకుడిగానే కాకుండా జర్నలిస్ట్ గా అనుభవజ్ఞుడు కనుక వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తూ సంభాషణలు రాయడంలో సహజత్వాన్ని, నేర్పుని ప్రదర్శించారు. అన్నారు అబ్బూరి ఛాయాదేవి ఒక సమీక్షలో.. శైలీ శిల్పాల ఐక్యతా శృతి వీరాజీ కథల్లని ప్రత్యేక రాగం!

వీరాజీ కథల్లో అత్యంత విలువైన గొప్ప కథ - నా దృష్టిలో ‘కోతి-భీతి’ అనేది. కొండపల్లి అడవుల్లోకి పోయి కోతుల్ని పట్టుకొచ్చి బెజవాడలో ఎగుమతి వ్యాపార దళారీలకు అమ్ముకుని బతుకు సాగిస్తున ఖుద్దూస్ అనే బడుగు జీవి కథ ఇది.

ఖుద్దూస్ తన కళ్ళ ఎదుటే కోతుల్ని పట్టే ఎరుకుల పెంటయ్యకి పిచ్చెత్తి పోవడం చూశాడు. మనసులో గాలం పడింది. ఛోటాబాషా అనే తన బంధువు ఒకడు హఠాత్తుగా ప్రాణం వదిలేశాడు. ఇది ఖుద్దూస్ ని బాగా కదిలించింది. అసలా వృత్తి గురించే పదుగురాడు మాటల్ని విని ఆలోచనలో పడ్డాడు. పిల్లలంటే మమకారం. తనకేమైనా అయితే..! ఆ జీవికని వదిలేద్దామని ఆలోచించాడు. భార్య ఒప్పుకోలేదు. మిత్రులు కోతిరేటు పెంచుతున్నారు. సేఠ్ ఆదాయం వదిలేయొద్దన్నారు. మూడు రోజులు ఆలోచించాడు. ఈ లోగా ఒకరోజు కూతురికి జ్వరం వచ్చింది. ఖుద్దూస్ గుండెల్లో రాయి పడింది. ఇల్లు వదిలిపోయి మూడురోజుఅ తర్వాత తిరిగి వచ్చాడు. రిక్షాతోనూ, రిక్షా లైసెన్స్ తోనూ! అతని మనసు నిండుగా ఉంది. పాప భీతి తొలగిపోయింది అంటూ ముగుస్తుంది కథ!

హేతువు, కార్యకారణ సంబంధాలు పక్కనపెట్టి చూస్తే ఒక అద్భుతమైన మానవతా గోపురం కనిపిస్తుంది కథలో. ఉత్తమమైన విలువలకి పట్టం కట్టిన కథగా అర్ధమౌతుంది. జంతుహింస గురించి ఆలోచనల్ని రేపుతోంది. 1960లో నాలుగున్నర పేజీల్లో రాయబడిన కోతి-భీతి కథకుల శిక్షణ శిబిరానికొక పెద్ద బాలశిక్షగా స్వీకరించదగిన ఉత్తమ కథానిక!
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech