కథా భారతి  
      అయ్యా! మమ్మల్నీ బ్రతకనియ్యండి!
 - రచన: ప్రతాప వెంకట సుబ్బారాయుడు.
 
 


 

 

అయ్యా.. మీరంతా చదువుకున్నోళ్ళు నేను చెప్పేది కొద్దిగా ఓపిక చేసుకుని వినండి.
ఈ కులం... మతం లాంటి అడ్డుగోడలు తొలగించేస్తే.. మనం మానవులం. అంటే అన్నదమ్ములమన్నమాట.

మనకున్న ఇజ్ఞానంతోటి...ఇవేకం తోటి ఆలోచిస్తే మనమంతా కలసిమెలసి కమ్మగా బ్రతకాల...కాని జరుగుతున్నదేమిటి?
మనిషిని నడిపిస్తున్నది... కాదు కాదు ఆడిస్తున్నది డబ్బు. ఎప్పుడైనా.. ఏ పరిస్థితుల్లోనైనా డబ్బులేనివాడు ఎందుకూ కొరగాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇది కాదు నేను మీకు చెప్పదలచుకుంది. మీరు డబ్బుతో ఏమైనా చెయ్యగలరనేది సత్యం.

ఈరోజు కాలుష్యం తన విషపు కోరలు అన్ని వైపుల నుండీ ఎలా సాచిందో మీకు తెలుసు. పరిశ్రమలు ఉద్యోగాలిస్తున్నాయి... బ్రతుకునిస్తున్నాయి కాని గాలిలో... నీటిలో వ్యర్ధ పదార్ధాలని వదలుతూ కలుషితం చెస్తుంటే మనిషెట్టా మనుగడ సాధించగలడు? మీకేం...మీరు సుభ్రమైన నీరు తాగుతారు. పరిశుభ్రమైన గాలి పీలుస్తారు కానీ మేము మురికివాడల్లో జీవఛ్ఛవాళ్ళా పడిఉంటున్నాం. మీ కార్లు, మోటర్లు విడిచే గాలి మాకు గాలి ఆడనియ్యం లేదు. మీ ఆఫీసులకీ ఇళ్ళకీ బిగించిన ఏసీలు, వాతావరణాన్ని ఏడెక్కించి మాకు చలికాలం సైతం చెమట్లు పుట్టిస్తున్నాయి. ఎండాకాలం సరేసరి. నరకంలో సలసలా కాగుతున్న నూనెలో ఉంటున్నట్టు ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటూ చెట్లని నరుక్కుంటూ వెళ్ళి భూమిని ముక్కలు ముక్కలుగా చేసి కోట్లు గడించేశారు. మరి ఈనాడు ఆరు కాలాలు మారిపోయి.. సమయానికి వర్షాలు కురవట్లేదనీ.. ఎండలు మండుపోతున్నాయనీ.. వాపోవడమెందుకు? మీరు తెలిసి చేసిన తప్పుకి మమ్మల్నందరినీ బలిచేయడం భావ్యమా? సెల్ టవర్ల వల్ల నష్టమని తెలుసు. వాటిని అధికంగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనీ తెలుసు. అయినా తామర తంపరగా వినియోగంలోకి తీసుకు వస్తున్నారు. పిచ్చుకలాంటి పక్షులూ నామరూపాల్లేకుండా పోయాయి. మా ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. పేరు తెలియని రోగాల బారిన పడి మేము కృంగి కృశించి పోతున్నా మీకేం పట్టదు.. అవునులే..‘తనది కాకపోతే’ అన్న సామెత ఉండనే ఉందిగా. ప్రభుత్వాలు ఎందుకుంటాయో ఎవరికేం మేలు చేస్తున్నాయో దేవుడికెరుక. మేము తాగితే ప్రభుత్వ బొక్కసాలు కళ కళ్ళాడతాయిట. అందుకని మేము కడుపు నిండా తాగాలి. తాగి తందనాలాడాలి. ఆ మైకంలో తప్పుచేస్తే సిక్షించాలి. అవును మరి పోలీసోల్లకీ, కోర్టోల్లకీ కూడా పనుండాలకదా! మేమేమయిపోతే ఆల్లకేం? గెలవడానికీ..ప్రభుత్వాలు పెట్టడానికీ మేము కావాలి. అవి సవ్యంగా నడవడానికీ మేము కావాల.. కానీ మాకు మాత్రం మంచి బ్రతుకివ్వరు.

అయ్యా! మీరు సల్లగా బ్రతుకుతున్నారని మాకు బాదలేదు. మీరు సుఖపడుతున్నారని మేము ఏడ్వడం లేదు. గాలి.. తాగే నీరు..కల్తీ అయిపోతున్నాయి. గొట్టపు బావులేసి మోటర్లు పెట్టి నీరు తోడేస్తుంటే.. నేల తల్లి గుండే ఎండి పోతోంది. గొట్టపు బావుల్లోంచి చుక్క నీరు రావడం లేదు.. బూగర్భ జలాలు ఎండిపోతున్నాయంట. వర్షాల్లేక..భూమిలో నుండి నీరు రాక బక్క రైతు పంట ఎలా పండిస్తాడు?
ఇల్లల్లోనూ..ఆఫీసుల్లోనూ ఎంత కాలం ఉంటారు? అప్పుడప్పుడైన బైటకొస్తారు కదా.. వాతావరణం కలుషితమైతే మీకు ప్రమాదమే కదా.. పేరు తెలియని.. నోరు తిరగని రోగాలొస్తే మీకూ బ్రతుకు నరకమే కదా.. ఇయ్యన్నీ వూహించరా?

ఇప్పటికే మన తల్లిలాంటి ప్రకృతిని చేతులారా నాశనం చేసుకున్నాం. తల్లి కాబట్టి ఇంకా క్షమిస్తోంది. మనదే చివరి తరం కాదు మన పిల్లా పాపలు కూడా సుకంగా ఉండాల. ఆళ్ళకి కమ్మటి గాలి... చల్లటి తియ్యటి నీళ్ళు ఇయ్యగలగాలి. సిన్న సిన్న రోగాలు రావాల గాని డబ్బూ..పానాలు తోడేసే రోగాలుండకూడదు. గాలీ నీరు కొనుక్కునే దౌర్భాగ్యం మనకొద్దు. ఇంగితం ఉన్న మనుసులుగా పుట్టాం..అట్టాగే జీవించాల. ఈడి ముఖం ఈడు చెప్పేదేమిటని పెడసెవిన పెట్టమాకండి. పేదోన్నయినా పెద్దోన్ని.. సుబుతున్నా హాయిగా... సల్లగా బతకడం కన్నా ఇంకేం కావాల? పరాయి దేశంలో మీరు సాదించేదేమిటి? ఆప్యాయత.. అనుబంధాలకి అర్ధం తెలుసా? ఒకరి కోసం ఒకరు.. అనుకోవడం లో ఉండే తృప్తి అనుబవించండి.. పిల్లలు పద్దాకా ఆ కంపూటర్ ముందు కూసోకుండా చూడండి. లేకపోతే ఆల్ల ఆలోచనా శక్తి మందగించిపోతోంది. ఆళ్ళే పెరుగుతారు... సక్కంగా ఎదుగుతారు.. ఓ పైసలెక్కువిచ్చి పెద్ద పెద్ద బడులల్ల ఏస్తున్నారుగానీ... ఆల్లని బందిస్తున్నారని అర్ధమైతల్లేదా? మెదడెదగాల అంతేగాని మొండిదవగూడదు.

మితిమిరిన సతంత్రం చెరుపు చేస్తుంది. ఆడ మగ ఎవరైనా క్రమసిక్షనల ఉండాల. అప్పుడే కుటుంబ గౌరవం. అమ్మా నాయన ముసలోల్లు అయితే వట్టిపోయిన ఆవుల్ని కబేలాకి తోసినట్టు. అనాద శరణాలయ్యాల్లో చేర్చమాకండి. మనం మనుసులం. రాక్షసుల్లా ఉండకూడదు. ఆల్లే లేకపోతే మనం లేం. ఆల్ల మనసు కష్ట పెడితే ఇంక మనమేడ పైకొస్తాం? మనకున్న దాంట్లో ఆళ్ళకింత పెట్టిసూడండి. తిరుపతికెల్లి ఎంకన్న బాబుని సూసినంత పున్నెం. నా మాట నమ్మండి.

సెప్పేటోడు లేక సెడిపోయాడంటారు. నేను నా కున్న లోక జ్ఞానంతో (మిడి మిడి జ్ఞానం మాత్రం కాదు) సుబుతున్నా.. ప్రకృతిని ప్రేమించండి. వాతావరణాన్ని పాడుచేయకండి. మనం కల్సి మెల్సి మన భూమిని.. గాలిని.. నీటిని కాపాడుకుందాం! తప్పు ఎవరు చేసినా సిక్ష అందరికి పడుతుంది. అందుకుని తప్పు చేసేవాడిని మందలించండి. పంచభూతాలు అందరివీ.. వాటిని పదిలంగా చూసుకోవాల... ఏదో నాలుగురోజుల కోసం ఈ భూమ్మీదకొచ్చాం. మంచిగా జీవించి మరణించాల. అంతేగాని దీన్ని పాడుచేసే హక్కు మనకు లేదు. ఈ భూమ్మీది వచ్చే వాళ్ళకోసం మంచి ప్రకృతితో నవ్వుత ఎదురుచూస్తుండాల. పోయినోల్లని నవ్వుతా సాగనంపాల. అంతేగాని మన స్వార్ధం కోసం అంతా నాశనం చెయ్యకూడదు. మీరు బ్రతకండి మమ్మల్నీ బ్రతకనీయండి.. మీకు దండం పెడతా..

   

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech