కథా భారతి  
      పండగ పాకేజ్
 - రచన: ఆర్.దమయంతి
 


 

 

సంక్రాంతి పండగ వస్తోందంటె ఎంత సంబరంగా వుండేదనీ, మా చిన్నప్పుడు!
ఇప్పుడొ? సంక్రాంతి హాలిడే లాంగ్ ట్రిప్ కోసం ప్లాన్ చేయడం బాధాకరమే. మొదట్లో బాధగా అనిపించేది కానీ, క్రమేణా అలవాటై రిది.
"సంక్రాంతి కి ఇంట్లో వుండి మాత్రం చేసేదెముంది" అంటారు. ఆయనా, పిల్లలూ కూడ.
నిజమే. సంక్రాంతి సంబరాలు, సాంస్కృతీ సాంప్రదాయాలు పిల్లలకి చూపిద్దామన్నా, ఈ మహానగరంలో అది సాధ్యమయ్యే పని కాదు.
కనీసం వాయిట్లో ముగ్గేసి, గొబ్బెమలు కొలువు తీర్చే అవకాశం కూడా ఇక్కడ లేదు.
ఈ అపార్ట్ మెంట్స్ లో కొన్ని షరతులుంటాయి. ఇతరులకు అభ్యతరకరమైన రీతిలో వ్యవహిరించరాదు. ముగ్గు బదులు ఇంకేదైన వేసుకోవచ్చు అన్నారు.
ముగ్గుకి బదులు ఇంకోటి ఎముంటుంది? ముగ్గుకి ముగ్గు తప్ప.
సరె, గొబ్బెమ్మలకి కావల్సిన ముడిపదార్థం కనుచూపు మేరలో వుండదు.
భొగిపళ్ళు పోసుకునే చిన్నపిల్లలు కారు మా పిల్లలు.
బొమ్మల కొలువు పెడదామంటె, కాంపెటిటివ్ ఎగ్జాంస్ అంటుంది అమ్మాయి.
లడ్డులు కడదామంటె, తినే వాళ్ళెవరంటారు ఆయన. మా ఇద్దరికి ఈ మధ్యే సుగరొచ్చింది. ఆఫిస్ లో 'లే ఆఫ్' సమస్య తలెత్తడంతో.
అబ్బాయేమో, అమెరికాకెళ్ళి ఎమ్మెస్స్ చేస్తానంటున్నాడు. వాడి హడావుడి వాడిది.
ఇలా మా అందరికీ ఎవరి పరిధిలో వారికి ఒత్తిళ్ళుండటం వల్ల అందరం కలసి ఈ సంక్రాంతి పండగ పుణ్యమా అని, పక్కరాష్ట్రానికెళ్ళి, చల్లని గాలి పీల్చుకొద్దామని డిసైడ్ అయ్యాం.
నలుగురం, నాల్గువైపులా చేరి, ప్రయాణానికి కావలసినవి సర్దుకునే హడావుడిలో వున్నాం.

పండగ పూటా, ఇల్లు తాళం వేసి, ఆనందం కోసం వూరు కాని వూరెళ్ళడం నాకూ ఇష్టం వుండదు. కాని, ఒకప్పుడు రంగరంగ వైభవంగా నేను జరుపుకున్న సంక్రాంతి ఇప్పుడు కనీసం ఆ చాయలైన లేకుండా..మిగలనీ కుండా కాలం జరిగిపోడం,. కాదు-జారిపోడం గురుంచే నా బాధంతా!
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీశా..
ఎదురుగా. పార్వతీ పరమేశ్వరుల్లా -.దంపతులు. నవ్వుతూ కని పించారు.
అది .కాదు, వింత. వీళ్ళని నేనింతకుముందెప్పుడూ చూడలేదు. ఇలా ఎందుకొచ్చినట్టో..
"ఎవరండి?" అడిగాను.
ఇద్దరూ చేతులు జోడించారు.
"నమస్తె" అన్నాను. నేను చేతులు జోదిస్తూ..
"మేము ఆంధ్ర ప్రదేశ్ వారి 'మన సాంప్రదాయం' అనే శాఖ వారు నిర్వహిస్తున్న పండగ స్పెషల్ పాకేజ్ గురుంచి మీకు స్వయంగా వివరించడం కోసం వొచ్చాం" అన్నరు పరమేస్వరం గారు. తమని తాము పరిచయం చేసుకుంటు..
నాకర్ధం కాలేదు. "అంటే?" అని అడిగా.
వాళ్ళిద్దరు ముఖాలు చూసుకున్నారు. "ఐదు నిమిషాలు టైమిస్తే, మీకంతా వివరిస్తాం" మర్యాదగా పర్మిషన్ అడిగాడాయన- ఇంగ్లీష్ లో. ఆవిడ తలూపింది. అదే అన్నట్టు.
అప్పటివరకు, వాళ్ళని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నా ననే సంగతి గుర్తొచ్చి, "లోపలకి రండి. ప్లీజ్." అంటూ లోనికి ఆహ్వానించి వెంఠనే తలుపులు మూశా..
తలుపులు తీసి వుంచడం మా అపార్ట్ మెంట్ కల్చర్ కాదు కదా!..అందుకు.
"ఎవరూ వొచ్చింది" అడుగుతున్నారు ఆయానా, పిల్లలూ.
"నాకూ తెలీదు, పండగ పాకేజ్ గురుంచి కాన్వాసింగ్ అనుకుంటా.." చెప్పాను.
"ఎప్పుడు విన్లేదే. క్వైట్ ఇంట్రెస్టింగ్" అంటూ వొచ్చి కూర్చున్నారు నాతో బాటు.
అందరం సొఫాలో ఆశీనులం అయ్యాక, స్థిమిత పడుతూ.. అడిగాను-.
"ఇప్పుడు చెప్పండి"
ఆయన చెప్పడం మొదలెట్టారు.
"అమ్మాయి. కొత్త సంవత్సరంలో తొలిసారిగా, ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగని శ్రమ లేకుండా మీకన్నీ అందుబాట్లో సమకుర్చిపెట్టడం కోసం
ఈ పండగ పాకేజ్ ని ప్రవేశపెట్టారు 'మన సాంప్రదాయం' శాఖ వారు."
"నేనెప్పుడూ విన్లేదే. ఎప్పట్నుంచి వుందీ ఈ డిపార్ట్ మెంట్?"
"ఈ ఏడాది నుంచే ప్రారంభించారు.. ఇక ఈ పాకేజ్ గురుంచి చెప్పమంటారా?"
"ఊ..ఊ..చెప్పండి ..చెప్పండి" ఉత్సాహంగా వినటానికి తయారయాం- అందరం.
"అమ్మాయి!..సంక్రాంతి నిలబెట్టిన రోజునుంచి కనుము, ముక్కనుము నాడు వేసే రథం ముగ్గు, గుమ్మడి ముగ్గు దాక, మా వాళ్ళే వొచ్చి, మీ ముంగిట్లో ముగ్గులేసి వెళ్తారు. నుంబెర్ వన్.." పాయింట్స్ గా చెబుతున్నాడాయన.
"అవునా!" ఆశ్చర్య పోయా.
"అవును.
ఆ దరిమలా, గొబ్బెమ్మలు తయారు చేసి, తీసుకొస్తారు. గుమ్మడిపూలులు మీ కందిస్తారు. మనసు తీరా- మీరు, అదిగో..మీ అమ్మాయియి వాట్ని అలంకరించి, పూజలు చేసి ముగ్గులో నిలబెట్టుకోడమొకటే మీరు చేయాల్సిన పని.. మీకు తీరిక లేదంటే, చెప్పండి. ఆ పనీ వాళ్ళే పూర్తి చేసి వెళ్తారు."
"అన్ని రోజులూనా.."
"అంటె, మీరు తీసుకునే పాకేజ్ ని బట్టి" పార్వతీ దేవి చెప్పింది..
"దరిమిలా." ఆయన కంటిన్యూ చేస్తున్నారు."గడపలకి రంగులు వేసి, బొట్లు పెట్టే కార్యక్రమం కూడా వుంతుం ది.. గుమ్మాలకి మామిడాకుల తోరణాలు చుట్టి, ద్వారాలకు బంతి పూదండలు కట్టి ఇంటిని శోభాయమానంగా అలంకరణ చేస్తారు.
మా వంట వాళ్ళొచ్చి, మీ వంటింట్లో చేరి, పాకం పట్టి అరిసెలు చేస్తారు. బూంది దూసి, లడ్డూ కడతారు. మీక్కావాలంటె, కజ్జికాయలు, జంతికలు, పాలకోవలు కూడా చుట్టి పోతారు. ఇల్లంతా పండగ పిండివంటల ఘుమఘుమలతో నిండిపోతుంది. వెళ్తూ.. వెళ్తూ..వంటిల్లంతా అద్దంలా తుడిచి మీకప్పగిస్తారు. మీకు ఎక్స్ట్రా పని లేకుండా.."
"నిజం!?"
" అవును. మీ పాకేజ్ ని బట్టి వుంటుంది" పార్వతి దేవి గుర్తుచేసింది.
" దరిమలా..." ఆయనకు 'దరిమలా' అనే పదం చాల అలవాటనుకుంటా. ఎప్పుడో తెలుగు వార్తల్లో విన్న గుర్తు. తమాషాగా వుంది ఆయన అలా అంటున్నప్పుడల్లా..
"సందె గొబ్బెమ్మల పేరంటానికి అన్ని ఏర్పాట్లూ చేస్తాం. అరడజను మంది ఆడవాళ్ళు వొస్తారు. అందరూ కలసి -గొంతెత్తి గొబ్బెమ్మ పాటలు పాడతారు. ఇవిగో ఆ పాటల లిస్ట్. మీకు నచ్చినవి, మీరు సెలెక్ట్ చేసుకోవొచ్చు." కొన్ని బ్రోచర్స్ నాకు అందించారు.
అవి అందుకుని చూసా. ఆంధ్ర లో వివిధ ప్రాంతాల వారు పాడుకునే గొబ్బి పాటలు అన్నీ ఆల్ఫాబెటికల్ గా ప్రింట్ అయి వున్నయి. ముచ్చటగా..

.మళ్ళి చెప్పారు పరమేశ్వర్ గారు. "గొబ్బియల్లో అంటూ.. చప్పట్లు చరుస్తూ, గొబ్బి కూడా వాళ్ళే ఆడతారు." అంటూ పూర్తి చేసారు.
" హ వు నా.." ఆనందమేసింది నాకు.
"అవును. మీ పాకేజ్ ని బట్టి " అందుకుంది పార్వతి..
"దరిమలా..బొమ్మల కొలువుని కూడా మా వాళ్ళె వొచ్చి తీర్చి దిద్దుతారు. మీ టేస్ట్ ని బట్టి, మీకెలా కావాలంటే అలా. పాతవి లేకున్నా, కొత్తవి కాకున్నా మీరు చింతించాల్సిన పనే లేదు. అంతా మాదే పూచి.."
"హ వు..నా...".
"అవును. మీ పేకెజ్ ని బట్టి" పాటగా అంది ఆవిడ.
"దరిమలా అమ్మాయి, గాలి పటాలు అందజేస్తాం. తలకొకటి చొప్పున చాటంత వెడల్పైన, రంగురంగు గాలిపటాలు ఇస్తాం. మీకు ఎగరేయడం రాకపోతె, మా వాళ్ళే వొచ్చి ఎగరేస్తారు."
"అవును. ఆ పాకేజ్ కూడా వుంది." అంది ఆవిడ.
"దరిమలా...పండగ మూడ్రోజులూ మీ వాయిట్లోకి డుడూబసవన్నలు, బులబుక్కలోళ్ళు, హరిదాసులు, విచిత్ర వేషగాళ్ళూ వొచ్చి కనువిందు చేస్తారు.
ఒక కొత్త ఎడ్లబండి, ధాన్య బస్తాలేసుకుని, మీ మెయిన్ బిల్డింగ్ ముందు నిలబెడ్తాం. పొలం నుంచి తరలివచ్చిన పంట అన్న ఒక పిక్చర్నిస్తూ..".

"హబ్బ. అవునా.." ఆనందం పట్టలేకపోతున్నా.
"మీ పేకేజ్ ని బట్టి" ఆవిడ గుర్తు చేసింది.
"ధనుర్మాసం స్నాన, దీప, దాన ఫలం గురుంచి మా పండితులొచ్చి వివరిస్తారు. తిరుప్పవైని శ్రావ్యంగా పఠించి, భావార్థాలని విశదీకరిస్తారు. ఈ మాసం హరి కి ప్రీతికరమైనది కాబట్టి, ఈ పదిహేనురోజుల్లో మీ ఇంట్లొ విష్ణు సహస్రనామాన్ని పఠనం చేయించాలనే సంకల్పం గనక మీకుంటె, దానికీ మేము వసతిని కల్పించాం."
"నిజంగానా.."
"అవును. ఆ పాకేజ్ కూడా వుంది" ఆవిడ అందుకుంది.
"దరిమలా, అమ్మాయీ, పండగ భోజనం ఎలా వుంటుందో మనకూ తెలీదు. ఏదో, అన్నం, పప్పు, పాయసం, వడలు తప్ప. అవునా? కానీ, కొత్త నువ్వులేసి, కొత్త బెల్లంతో చేసుకునే వంటలు బహు పసందుగా వుంటాయి తెలుసా..ముఖ్యంగా గుమ్మడి పండు ముక్కల పులుసు ఎంత బాగుంతుందో తెలుసా అమ్మాయి?ఇలా సంక్రాంతి సంప్రాదాయ వంటలు చేయించి, వేడివేడిగా ఏ రోజు కారోజు మీకు అందచేస్తాం. ఇంట్లో వంట పని లేకుండా.."
నేను ఆనందాశ్చర్యాల్లోంచి తేరుకోలేకపోతున్నా.. ఎంత శుభవార్త! ఎంత మోదమైన మాటలు చెబుతున్నారు వీళ్ళు! మరెంత వీనుల విందుగా వుంది వింటూంటే!
నా వాయిట్లోకి, నాకోసం, నా ఆనందం కోసం నాకై నడుచుకుంటూ వస్తోందా నా సంక్రాంతి.
నా పండంగ. నిండైన పండగ. తెలుగు పండగ. వెన్నెలంత వెలుగైన పండగ.
పట్టలేని సంతోషంతో హృదయం సముద్రంలా పొంగింది కామోసు! ..కంట్లో కన్నీటి కెరటం ఎగసి పడుతోంది. మెరుస్తూ..
నా ఉద్వేగంలో నేనిలా మునిగి తేలుతున్న తరుణంలో..
మా వారు, అందరికీ కాఫీ కలుపుకొచ్చారు. కప్పుల్లొంచి కాఫీ ఘుమఘుమలాడుతూ పొగలు జిమ్ముతోంది.నోరూరిస్తూ..
కాఫీ తాగే మంచి సమయయం అంటే ఇదే మరి. ఆనందం వంటి కాఫీ..
నాకు నవ్వొస్తోంది.
"ఏమిటోయి...ఆ నవ్వేమిటి?, కళ్ళల్లో ఆ నీళ్ళేమిటి? ఏమైన కలొచ్చిందా?" తట్టి లేపుతున్నారు ఆయన.
ఒక్కసారిగా, మెలకువొచ్చినట్టైంది. కళ్ళిప్పి చూశా..
పార్వతీ పరమెశ్వర్లు ఏరి? వెదుకుతూన్నాయి చూపులు.
నావైపు వింతగా చుస్తున్నారు మా వాళ్ళు
క్రమంగా అర్థమైంది. నేను కన్నది కల అని..
వచ్చింది కలే కావొచ్చు. కాని, అది నా మనసుకెంత నిజంలా హత్తుకుపోయిందీ అంటే- అచ్చు కలలో పార్వతీ పరమేశ్వర్లు వర్ణిం చినట్టుగా.. సంక్రాంతి జరుపుకోవాలని క్షణాలలో నిశ్చయించేసుకున్నా.
"ఏమిటి అలా చూస్తున్నావ్?" అడుగుతున్నారు.
"ఏం లేదు. సెలవులకి మనం టూర్ కి వెళ్ళడం లేదు. ఈ సంక్రాంతి పండగని మనం వైభవంగా చేసుకుంటున్నాం." నా నిర్ణయాన్ని స్థిరంగా చెప్పాను..
ఇంట్లో అరిసెలు, లడ్డూలు చేసుకుని..
బొమ్మలు పెట్టి పేరంటం చేసి..
మేడమీదకెళ్ళి గాలిపటాలేగరేద్దాం మనమందరం కలిసి.
ఏమండీ! మీకే రంగు గాలిపటం కావాలో చెప్పండి." ముందుగా ఆయన్ని అడిగా.
"నాకా.!?.ఏం రంగంటె.." ఆలోచిస్తున్నారు.
పిల్లలు ఫక్కుమని నవ్వారు.
ఇది పండగ ఆరంభమె..
సంబరమంతా ముందుంది మరి!.
పండగ పాకేజ్..తల్చుకుంటుంటే ఎంత హాయిగా వుందో! సంక్రాంతిలా..

   

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech