సారస్వతం  
     గగనతలము-26  రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు  

 

మతాంతరాలు - పాఠాంతరాలు

          విజ్ఞానం అనేక రూపాలలో కాకుండా సాధారణంగా ఒకే రూపంలో ఉండాలి. అలా కాకుండ ఒకే విషయం పది రకములుగా కనిపిస్తే, దానిలో మనకు అనుమానాలు కలిగితే, ఆ అనుమానములు తొలగకపోతే మనము దానిని విజ్ఞానముగా అభివర్ణంచడానికి కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. ప్రస్తుతము జ్యోతిషము యొక్క పరిస్థితీ అదే.  ఈ సందర్భములో ప్రస్తుతము మనము హేతువాదులు మరియు సంప్రదాయబద్ధుల మధ్య జరుగుతున్న వాగ్యుద్ధాలను మూగ ప్రేక్షకులుగా వీక్షిస్తున్నామే గాని మనకంటూ ఒక అభిప్రాయమున్నదని చెప్పలేకపోతున్నాము. దానికి ముఖ్యకారణము మన దగ్గర ఆధారాలు లేకపోవడమయినా  కావాలి లేక మన సిద్ధాంతాలను విజ్ఞానయుతములుగ నిరూపించలేని మన చేతకానితనమూ కారణము కావచ్చు.  ఈ నేపథ్యములో మనము నిజానిజాలను చర్చించుకోవడము సందర్భోచితము ఆవశ్యకము కూడ.

అసలు సమస్య ఏమిటి

          అనేక మంది మహర్షులు , అనేక గ్రంధములు, అనేక ప్రకారములైన యోగములు జ్యోతిషం మీద అభిరుచి ఉన్నవారికి పెద్ద సమస్యగా మారుతుంటాయి. జైమిని పద్ధతి, కృష్ణమూర్తి పద్ధతి, పరాశర పద్ధతి, పాశ్చాత్య పద్ధతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకములైన సిద్ధాంతములు మనను సందేహముల ఊబిలో తోయడానికి సిద్ధముగా ఉంటాయి. వింశోత్తరిదశ ప్రకారము మనకు నడిచేది ఒక గ్రహ దశ అయితే యోగినలో మరోక దశ, అష్టోత్తరీలో మరొక దశ. చివరకి మనము దేని ప్రకారము భవిష్యత్తుని నిర్ణయించుకోవాలి. ఇది సాధారణముగ ఆలోచిస్తే ఎవరినైనా అయోమయంలో పడేస్తుంది.  మరి అసాధారణంగా ఆలోచించడమంటే ఎలా?

లోతుగా ఆలోచిస్తే

          మనము ఇంతవరకు చాలా విషయాలను అర్థము చేసుకోవడానికి ప్రయత్నించాము. కానీ మనము రకరకముల అభిప్రాయములు లేక సిద్ధాంతములు లేక మతములు (ఇక్కడ మతాంతరము అనేది అభిప్రాయభేదమనే కానీ శుద్ధ తెలుగులో మనము అనుకనేటట్లు సమాజములో ప్రచలనములోనున్న మతములగూర్చి కాదు) గూర్చిఎక్కడా చర్చించుకోలేదు. ఉదాహరణకు గ్రహముల దృష్టిని తీసుకుందాము. అన్ని గ్రహములు తను ఉన్న స్థానము నుండి ఏడవ స్థానమును చూస్తాయని, గురు శని కుజులు ఏడుతోబాటు క్రమముగ 5-9, 3-10, 4-8 స్థానములు చూస్తాయని మనకు తెలుసు. కానీ మనము ఒకసారి జైమిని సూత్రములు చదవడము ప్రారంభస్తే మనము మరల జ్యోతిషమును వర్ణమాలనుండి ప్రారంభించామని అర్థమవుతుంది. జైమిని మతము ప్రకారము రాశులు చూస్తాయి. రాశులకు ఒక నిర్థిష్టమైన దృష్టి ఉంటుంది.  ఆ యా రాశులలో ఉన్న గ్రహములకు రాశులకు ఉన్న దృష్టే ఉంటుంది కానీ వానికి స్వతంత్రముగ ఎటువంటి దృష్టి ఉండదు.

          అన్ని రాశులు ఒకేలా చూడవు. చరరాశులు, స్థిరరాశులు మరియు ద్విస్వభావరాశులు వానివాని దృష్టిని కలిగి ఉంటాయి. పరాశరపద్ధతిలో అయితే గ్రహము ఏ రాశిలో ఉన్నా దానికి నిర్ణయించబడిన దృష్టితో మాత్రమే చూస్తుంది. కానీ ఇక్కడ రాశిని బట్టి గ్రహముయొక్క దృష్టి మారుతుంది. ఇది జీర్ణించుకోవడానికి కొంచము ఇబ్బందికరముగ ఉండే విషయమే.  ఇది తప్పు ఇది ఒప్పు అని గానీ, ఇది విజ్ఞానము ఇది మూఢనమ్మకము అని గానీ నిర్ణయించడం ఎంతవరకు సాధ్యమన్నది పెద్ద ప్రశ్న. ఇది మనకే ప్రశ్నా లేక దీనిని ఎవరైతే సిద్ధాంతములుగ మార్చారో వారికి కూడ ఇది ప్రశ్నేనా ఆన్నది కూడ మనము నిర్ణయించే పరిస్థితిలో లేమని మనమందరము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఒక పక్క దీనిన సిద్ధాంతమంటూ మరోపక్క మనము దీనిని అనుమానిస్తున్నామంటే మనకు దీనిపై ఒక అవగాహన లేదని భావించక తప్పట్లేదు.

          సిద్ధాంతమనేదానికి ఒక స్పష్ట అర్థమున్నది. 'అంతే సిద్ధః సిద్ధాంతః' అని దీనికి ఒక నిర్వచనము కనబడుతోంది. ఏదైతే పరిశోధన చివరిలో సిద్ధించినదో దానికే సిద్ధాంతమని పేరని వాడుకలో ఉంది. కాబట్టి వీటిని సిద్ధాంతములు అంటూ మనము శంకింస్తున్నామంటే అది ఇబ్బందికరమైన విషయమే.

ఇది అంతం కాదు. ఒక కుజదోషం గురించి మాట్లాడుకుందామన్నా, పితృభావము గురించి చర్చిద్దామనుకున్నా, పంచమములో ఉన్న గురిని ఆలోచిద్దామన్నా, ఇలా అడుగడుగునా మనకు ఒకటి కన్నా అభిప్రాయములు ఎక్కవ కనబడడమూ, మనము వాని విషయంలో నిరుత్తరులుగా ఉండిపోవడము చాలా సాధారణమైపోయింది. మరి దీనికి పరిష్కారమేది?  
ఈ ప్రశ్నలకు జవాబు నిష్ఠతో వెదికితే ఈ శాస్త్రము యొక్క వైజ్ఞానికత తేటతెల్లమవక తప్పదు. ఆ విజ్ఞానయాత్రను సరికొత్త పంథాలో వచ్చే మాసమునుండి కొనసాగిద్దాం. కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు లేక నిర్లప్తముగా పడి ఉన్న మన విజ్ఞానమును సరికొత్త పంథాలో పరిశోధించడానికి ప్రయత్నిద్దాం. అంతుపట్టనిలోతులు విజ్ఞానం లక్షణమైతే, అలుపెరగని అధ్యయనం మనమార్గం, మన లక్ష్యం, మన లక్షణం కావాలి.
సశేషము..........

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech