సారస్వతం  
     గోవిందం భజ మూఢమతే - 7 - రచన : యర్రమిల్లి హేమారత్నం  
భజగోవింద శ్లోకాల అర్ధాలు:

రథ్యాకర్పట విరచిత కన్దః
పుణ్యాపుణ్య విసర్జిత పన్ధ:
యోగీ యోగ నియోజిత చిత్తో
రమతో చాలోన్మత్తవ దేవ


నిజమైన యోగి దొరికిన వస్త్రాల పీలికలతో బొంతను తయారుచేసుకుని, అది మాత్రమే ఉపయోగిస్తాడు.
పుణ్యాపుణ్యాలను అధిగమించి మనసును పరిపూర్ణ యోగంలో నియమిస్తాడు. బ్రహ్మములో లీనం అయిన మహాత్ముని చిత్తం పసిపిల్లవాని, పిచ్చివాని మనసు వంటిది.

సర్వసంగ పరిత్యాగి అయిన యోగి నిత్యసంతోషి. ఏ విధమైన సుఖానుభూతులను యోగి మనసు కోరదు. తినటానికి తిండి కట్టుకునే బట్ట, తలదాసుకొను గూడు అందరికి అవసరమే. వీటికోసం మనిషి చాలా శ్రమిస్తాడు. కానీ యోగి ఏది దొరికితే అది, ఏది అందుబాటులో ఉంటే అదే అందుకొని తృప్తిపడతాడు. ఎందుకు? యోగి మనస్సు పాప పుణ్యాలను అధిగమించి ఉంటుంది. కారణం, మనస్సుని నియమించి, చిత్తాన్ని పరమాత్మపై ఉంచుతాడు.

‘దృష్టిం జ్ఞానమయం కృత్వా - పశ్యేద్ర్భహ్మమయం జగత్’ అని శృతి వాక్యం. అంటే దృష్టిని జ్ఞానమయం చేసుకటే  సకల సృష్టి బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఆ స్థితి పసిబాలుని స్థితి. దివ్యజ్యోతి స్వరూపమైన విశ్వాత్మ ప్రకాశం దర్శించగలిగినప్పుడు అంతా ఆర్ణవమైన ఆనందమే. అహం శబ్దవాచ్యుడైన పరమాత్మే మనలోని ఆత్మ అని తెలిసి నిర్వికల్పానందం అనుభవించవచ్చు.

కస్త్వం కోహం కుత ఆయాతః
కామే జననీ కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వంత్యక్త్యా స్వప్నవిచారమ్


నీవెవరు? నేనువరు? నేనెక్కడి నుండి వచ్చాను? నా తల్లిదండ్రులెవరు? బాహ్యేంద్రియాలకు అనుభవమయ్యే ఈ సకల ప్రపంచం కలలాంటిది కదా? అందుకే దీనిని నర్జించాలి.

నిజానికి ఈ ప్రపంచం ఒక ఇంద్రజాలం. కొన్నికొన్ని ప్రశ్నలకు సమాధనాలు దొరకవు. కొన్ని పరిస్థితుల్లో మనసులో అసాధారణమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో జన్మల విషయవాసనలు మనస్సును, జన్మాంతరాల వరకు అంటిపెట్టుకునే ఉంటాయి. దేహం వశించినా వాసనలు నశించవు. అందుకే విషయ చింతనలు తగ్గించి విశ్వేశ్వర చింతన పెంచాలి. మనసు తత్త్వాన్ని అవగాహన చేసుకుంటే, అదుపు చేయడం సులభం. మనదైన శరీరం అశాశ్వతమవుతే జగత్తు మాత్రం అశాశ్వతం కాదా! కలకాదా! నిస్సారమైన కలలాంటి జగత్తుపై, శరీరంపై మమకారం పెంచుకోటం మూర్ఖత్వం. ‘ఆత్మవెళ్లిన దేహమగ్నిహోత్రుని పాలు - కఠిచ శల్యములన్ని గంగపాలు’ అన్నారు పెద్దలు. అందుకే మనలోకి మనమే పయనించి, పరమాత్ముని దర్శించి ధన్యత చెందాలి.

త్యయిమయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్ధం కుష్యసి మయ్య సహిష్ణుః
భవ సమచిత్రః సర్వత్రత్వం
వఛస్య చిరాద్యది విష్ణుత్వమ్


నీలో, నాలో, అంతటా ఉన్నది ఒక్కడే పరమాత్మ. నీ కోపతాపాలు ఎవరి మీద? నిజంగా నీవు పరమాత్మ దర్శనానికై తపించేట్లయితే సమభావన అలవరుచుకోవాలి.

మోక్షప్రాప్తికి సాధకుడు ఇంద్రియ నిగ్రహం తరువాత సాధించవలసింది సమభావన. స్థిరచిత్తులై, ఇష్ఠానిష్టాలకు, ఆగ్రహాగ్రవేశాలకు లొంగకూడదు. కోపంవల్ల మోహం, మోహంవల్ల లోభం, లోభం వల్ల బుద్ధినాశనం, ఆపై సర్వం నాశనమవుతుంది. ‘ఎన్ని సంవత్సరాల నుంచో పరమాత్మని సేవిస్తున్నానే, అయినా ముముక్షత్వం సిద్ధించట్లేదు’. అని ఆవేదన పడే ముందు, అనన్య చింతనతో పరమాత్మని సేవించానా? అన్యధా శరణం నాస్తి అని సర్వస్య శరణాగతి చేశానా? అని ఆలోచించాలి. చింతలలో రగులుతున్న మనస్సును ప్రశాంతపరచి, ఏకాగ్రం చేసి అప్పుడు శరణంటే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. జన్మజన్మల పుణ్యఫలంగా పరమాత్మ పాదాల చెంత స్థిరమైన భక్తి ఏర్పడుతుంది. సర్వత్ర సమచిత్తం సాధించి ముక్తిపొందవచ్చు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech