శీర్షికలు  
     ఎందరో మహానుభావులు  - రచన : తనికెళ్ళ భరణి  

 మనసు చిలుకకు - మంచి నేర్పిన మనుసారి వెంకటలక్ష్మమ్మ                                                     

ఆడాళ్ళు వంటింటి కుందేళ్ళు!
ఆడాళ్ళు మొగుడికి ఉత్తరం ముక్క, చాకలి పద్దు రాసుకోగలిగితే చాలు!!
ఇవన్నీ..ఒకానొక ‘జాతి’ యొక్క మూర్ఖాభిప్రాయాలు... ఇవన్నీ ఏనాడో శిథిలమైపోయూ.. మ్యూజియంలో గూడా పెట్టేశాం!!

ఈనాడు ప్రముఖ హోటళ్ళలో చెఫ్ లు (వంటవాళ్ళు) మొగుళ్ళే!!
అలాగే అమ్మాయిలీనాడు
కంప్యూటర్ని కుడిచేత్తో టకటకలాడించేస్తూ...
ఎడం చేత్తో ‘మౌస్’ ని కదలించేస్తున్నారు..
ఊరేగడాలేవిటీ.. రోదసీలోకే ఎగిరారు..
ఊళ్ళేలడవా... దేశాల్నేలారు.. (ఇంక్లూడింగ్ ఇండియా)
అంచేత ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్’
అన్న సదభిప్రాయానికి కట్టుపడితే శ్రేయస్కరం!
ఈసారి మనం తెలుసుకోబోయే సంగీత కళాకారిణి
మనుసారి నీలకంఠం... వెంకటలక్ష్మమ్మ

ఈవిడ ఆత్మకూరు సంస్థానానికి చెందిన వాగ్గేయకారిణి.
ఆత్మకూరు సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు.
వీరు మొదట బహమనీ సుల్తానులకు..
తర్వాత గోల్కొండ సుల్తానులకూ సహకరించి ఎన్నో జాగీర్లు పొందిన వారు..
స్వతహాగా సంగీత సాహిత్య ప్రియులు...
ప్రతీ ఏడాది ఫాల్గుణ శుక్లపక్షంలో కవి, గాయక, నాటక ప్రదర్శనలు నిర్వహించి అర్హతలను బట్టి.. పురస్కారాలు ఇచ్చే సంప్రదాయం కలవారు!

అలనాటి ఆత్మకూరికి సంబంధించిన వెంకటలక్ష్మమ్మ గారు భజన సంప్రదాయానికి చెందిన సంగీత రచనలను అనేకం చేసింది. ఈమె గద్వాల సంస్థానంలో రాణీ లక్ష్మీదేవమ్మ గారికి అంతరంగికురాలుగా పనిచేసిన శ్రీమతి శివమ్మ గారికి స్వయానా చెల్లెలు.. సరళమైన భాషలో ప్రజల హృదయ రంజకంగా భగవన్నుతులని కీర్తనలుగా వెలయించిన వాగ్గేయకారిణి.. కృష్టయ్య.. కటకం నాగమ్మ ఈవిడ తల్లిదండ్రులు.

భర్త పేరు ‘నీలకంఠం’ ఈమె తల్లిదండ్రులు సప్తాహాలు యాగాలు, వ్రతాలూ హరిభజన్లు నిత్యం చేస్తూ ఉండడం వల్ల ... బాల్యం నుంచీ భక్తిలో పడిపోయింది లక్ష్మమ్మ. ఈమె కుమారుడు గద్వాల మహారాణి గారి దగ్గర స్టోర్స్ ఇన్ఛార్జిగా పని చేస్తూ ఉండేవాడు.

భజనలు కీర్తనలు తత్త్వములూ అన్న పేరుతో ఈమె రాసిన కీర్తనలు ముద్రితాలు. వెంకట లక్ష్మమ్మ రాసిన కీర్తనలకు 1961లో తిరుమల శ్రీనివాస శర్మ ప్రస్తావన రాశారు. ఈవిడ రచించిన కీర్తనలలో ‘ఆత్మకూరు నిలయ శ్రీలక్ష్మాంబ వరద ప్రసన్న’ అన్న ‘ముద్ర’ ఉంటుంది.

దురదృష్టవశాత్తూ ఆవిడ జీవిత విశేషాలు పెద్దగా మనకి లభించకపోయినా.. రచనలు లభించాయ్
వాటిని పరిశీలించి..పరవశిద్దాం!

రామనామ స్మరణ మాత్రం చేత లక్ష్మమ్మ ఆత్మ అడవుల్లోకి పారిపోతుందు.
వొళ్ళంతా వొడిలిన దోస పండైపోతుంది.
తనే శబరైపోయీ.. అడివంతా పళ్ళకోసం గాలిస్తుంది..
ప్రతీ పండూ కొరికి కొంగున కట్టుకుంటుంది.
అటు ఆకాశం కేసి చూస్తే నీలంగా, రాముడి చాతిలా...
ఇటు సముద్రం కేసి చూస్తే రాముడి ఖ్యాతిలా గంభీరంగా..


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech