శీర్షికలు  
     'దేవుడున్నాడా?' ఓ చర్చా వేదిక - ముత్తేవి రవీంద్రనాథ్,  

అసలు భగవంతుడనేవాడు ఉన్నాడా? ఉంటే ఆయన కార్యకలాపాలేమిటి? మనల్ని సృష్టించింది ఆయనేనా? మన రోజువారీ కార్య కలాపాలన్నీ ఆయన అనుక్షణం పరిశీలిస్తూ ఉంటాడా? ఇలాంటి ప్రశ్నలన్నీ నేను చిన్ననాటి నుంచే ఆలోచించేవాడిని. క్రమంలో భగవంతుడున్నాడని నమ్మే భావవాదుల సాహిత్యం, లేడని నమ్మే భౌతికవాద సాహిత్యమూ నా  శక్తిమేరకు అధ్యయనం చేసాను.నేటికీ భగవంతుడి ఉనికికి శాస్త్రీయమైన ఆధారం నాకు లభించలేదు. మరోవైపు నానాటికీ  విస్తరిస్తున్న  మానవుని శాస్త్ర, సాంకేతిక ప్రగతి భౌతికవాదం సశాస్త్రీయమైన సిద్ధాంతమని తిరుగులేని విధంగా రుజువు చేస్తూ పోతున్నది..మనకు తలెత్తే ప్రతి ప్రశ్నకూ శాస్త్రీయమైన సమాధానం భౌతికవాదం లో లభిస్తున్నది.అందుకే నాలోని భౌతికవాది క్రమంగా మరింత రాటుదేలాడు.హేతుబద్ధంగా ఆలోచించే వారందరికీ యుగయుగాలుగా 'దేవుడున్నాడా?' అనే  తత్త్వశాస్త్రపు మౌలిక ప్రశ్నఆసక్తిని రేకేత్తిస్తూనే వుంది. ఆధునిక యుగపు మానవులు  మరింత హేతుతత్త్వం , శాస్త్రీయ ఆలోచన కలిగినవారైనందున వారికి ప్రశ్న మరింత ఆసక్తిదాయకం అవుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందుకే  విషయమై నా మదిలోని భావనలను చదువరులతో పంచుకొనడం,వారిలోనూ    విషయంపై ఆసక్తిని పెంచి, తద్వారా ఆరోగ్యకరమైన చర్చకు తెరదీయడం లక్ష్యంగా దీనితో మొదలుపెట్టి  వరుసగా కొన్ని వ్యాసాలు చదువరుల ముందుంచదలచాను

భౌతిక వాదినైన నేను భగవంతుడొకడు ఉన్నాడని నమ్మను.అంచేత నాది జిజ్ఞాసువు మార్గం. విశ్వానికి సృష్టి కర్త ఒకరున్నారని భావిస్తే మరి ఆయనని ఎవరు సృజించారు? అనేది ప్రశ్న. భగవంతుడి అనాదిత్వం విషయంలో రాజీపడి,' ఆయన స్వయంభూ  అయితే ఆయనకొక సృష్టికర్త ఉండడమేమిటి?'అని ప్రశ్నించే ఆధ్యాత్మికవాదులు పదార్ధం అనాది అనీ, అనశ్వరమనీ,దాన్ని ఎవరూ సృష్టించలేదనీ, 'స్వయంభూ అయిన పదార్థానికి ఒక సృష్టికర్త ఉండడమేమిటి?' అని  అంటే మాత్రం ఒప్పుకోరెందుకు?పదార్ధం తనకు తానుగా అనుకూలమైన స్థితిగతులలో పరిణామం చెందుతూ ఉండడం సత్యమని తెలిసికూడా భగవంతుడే వీటన్నిటి వెనకా ఉన్నాడు అంటారెందుకు?కొత్త కొత్త వంగడాలూ, వృక్ష,పక్షి,జంతు జాతులు మానవులచే ప్రయోగశాలల్లో సృష్టింప బడడం  చూస్తూ కూడా ఇంకా మొండిగా భగవంతుడనే  సృష్టికర్త ఒకడున్నాడని వారు వాదిస్తారెందుకు? సింహం (Lion) కీ పులికీ (Tiger)కీ సంకరంచేసి టైగాన్(Tigon)నీ , తిరిగి దానికీ సింహానికీ సంకరం చేసి  లిటిగాన్(Litigon) నీ మానవుడు సృష్టించాడు.అలాగే బంగాళా దుంప (Potato), టొమాటోలను సంకరం చేసి కండగల పిండి టొమాటో(Pomato)  ను సృష్టించాడు. కొత్త జాతుల సృష్టికి తనకు తానుగా ఇలా  ప్రకృతి పరిణామం చెందడానికైతే  వేల,లక్షల సంవత్సరాలు పట్టి ఉండేదేమో? పరిణామ రహస్యం తెలుసుకున్న శాస్త్రజ్ఞులు ప్రయోగ శాలల్లో త్వరితగతిన కొత్త వంగడాలను సృష్టిస్తున్నారు.

జీవ   పదార్థాన్నీ నిర్జీవ పదార్థాన్నీ వేర్వేరుగా దైవం సృష్టించాడని భావవాదులు  ఒక సిద్ధాంతం చెప్పేవారు.ఉదాహరణకు ఒకప్పుడు  కుళ్ళిన జీవ వ్యర్థాల నుంచీ,మానవ, జంతు మూత్రాన్నుంచి మాత్రమే యూరియా లభిస్తుందని మాత్రమే వారెరుగుదురు.జీవ రసాయన శాస్త్ర(Organic Chemistry) పితామహుడు వోలర్ పరిశోధనల ఫలితంగా నిర్జీవ (inorganic) రసాయనిక పదార్థాల సమ్మేళనంతో  ప్రయోగశాలలో యూరియా తయారవడం ఒక మేలి మలుపు .(కృత్రిమ రబ్బరూ ,కృత్రిమ పంచదారా కూడా  తయారు కావడం మనమెరిగినదే.)ఇక అక్కడినుంచీ జీవ నిర్జీవ పదార్థాల విశ్లేషణ జరిగి వీటి  అన్నిట్లో ఒకే రసాయనిక మూలకాలున్నాయనీ,నిర్జీవ పదార్థపు ఒక పరిణామ దశలో దాన్నుంచి జీవపదార్థం ఏర్పడిందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.జీవానికి మూలమైన ప్రోటోప్లాజంలో ఉన్నదీ నిర్జీవ పదార్థాలలో ఉండే కార్బన్,ఆక్సిజన్ ,హైడ్రోజన్ మొదలగు మూలకాలేనని కనుగొన్నారు.కాబట్టి నిర్జీవ పదార్థాన్నుంచి ఒకానొక పరిణామ దశలో ప్రోటోప్లాజం ఏర్పడి ఏక కణజీవులైన వృక్ష,జంతు జాతులూ,వాటి క్రమ పరిణామం కారణంగా అనంతరం బహుకణ జీవులైన వృక్ష జంతు జాతులు అభివృద్ధి చెందాయనే నిర్ధారణకు వచ్చారు. నీరు అనే పదార్ధం ఉష్ణోగ్రతను బట్టి మంచుగానూ,నీటి ఆవిరిగానూ మారుతున్నట్లే అనుకూల పరిస్థితులలో ఏదో ఒక ప్రత్యేక స్థితిగతులలో నిర్జీవ పదార్ధం నుంచి జీవావిర్భావం జరిగి ఉంటుందనేది శాస్త్రీయ అవగాహన.   మన కళ్ళ ముందు ప్రకృతి యొక్క క్రమ పరిణామం స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పే ' భగవంతుడు శూన్యాన్నుంచి ప్రకృతిని సృష్టించాడు, అలిసిపోయి ఒకరోజు  విశ్రాంతి తీసుకున్నాడు 'అనే అశాస్త్రీయ సిద్ధాంతాలు వల్లె వేస్తున్నారు కొందరు.

పదార్ధం నుంచి భావం అభివృద్ధి చెందిందా? లేక భావమే పదార్థాన్ని సృష్టించిందా? అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం విస్పష్టం.భావం ఎక్కడా పదార్థాన్ని సృష్టించలేదు. ఒక పదార్థమే మరొక పదార్థంగా పరిణామం చెందుతుంది.సూన్యాన్నుంచి పదార్థాలను సృష్టిస్తున్నామంటూ బాబాలు చేసిన, చేస్తున్న పచ్చి మోసాలు,గారడీ విద్యలూ మనకు తెలియనివికాదు. తమ అరచేతుల నుంచీ బూడిదనూ, అంగీల చాటు నుంచీ చిన్న చిన్న విభూతి పళ్ళను, శివ లింగాలనూ సన్నని బంగారు గొలుసులనూ సృష్టించిన బురిడీ బాబాలు  విభూతి పండును కాదు;కనీసం బూడిదగుమ్మడి పండునో  లేక ఒక ఏనుగునో సృష్టించ మంటే  నోరు వెళ్ళబెట్టడం  మనకు తెలియంది కాదు.సూన్యం నుంచి పదార్ధం ఎక్కడా, ఎప్పుడూ సృష్టి కాదు.పదార్ధం  యొక్క ఒక క్రమ పరిణామ దశలో జీవం పుట్టి, దానినుంచి భావం ఏర్పడిందే కానీ జీవం, పదార్థాలకు సంబంధం లేని భావం ఒకటి ఉందనేది అశాస్త్రీయం.అది సాధ్యమూ కాదు.ఆకాశం(Empty Space) లో భగవంతుడిని చూపెడతానని అందరినీ ఎయిర్ పోర్ట్ కి రమ్మన్న బాబా వాతావరణం అనుకూలంగా లేని కారణంగా తన ప్రదర్శన వాయిదా వేసుకున్నాడు. ఇంతకాలం  నీవే  భగవాన్ అని ప్రచారం చేసుకున్నావు.ఇప్పుడు వేరే భగవాన్ ని చూపెట్టడం ఏమిటని గానీ వాతావరణ అనుకూల ప్రతికూలతలు భగవంతుడి కి ఏమిటనిగానీ ప్రశ్నించే పరమ భాగవతోత్తములే కరవయ్యారు.ఇదీ భక్తుల తీరూ-తెన్నూ.

పదార్ధం తన అస్తిత్వం కోసం భావంపైన ఆధారపడి ఉందా? లేక భావమే పదార్థంపై ఆధారపడి ఉందా? అనే ప్రశ్న వేసుకున్నా సమాధానం సుస్పష్టం.శరీరమనే ఒక పదార్ధం యొక్క క్రమ పరిణామం లో మనస్సు , దానినుంచి భావం ఏర్పడ్డాయి.భావం అన్నివిధాలుగా శరీరం అనే పదార్ధం మీద  ఆధారపడి ఉన్నది.       

నమ్మితేగానీ దైవ స్వరూపం అర్థం కాదంటారు ఆధ్యాత్మికవాదులు.'ముందు నమ్ము; తరువాత అర్చించు;   తరువాతే ఆరా తియ్యి' అంటారు వారు.ఒకసారి నమ్మిన తరువాత నమ్మకం తాలూకు భావనలనుంచి బయటపడడం అంత  తేలిక కాదు. ఆరాలు తీసినా ,ఎంత విచారణలు చేసినా నమ్మకం  ఏర్పరచుకోక  ముందే చెయ్యాలంటారు భౌతికవాదులు.ఉదాహరణకు 'రజ్జు సర్ప భ్రాంతి' నే తీసుకుందాం.తాడును చూసి పాము అనుకుని భ్రాంతి  చెందేది ఎవరు?అంతకు ముందు పాము ఇలా ఉంటుంది అని తెలిసినవాడు చీకట్లో పామువంటి తాడుముక్క నొకదాన్ని  చూసి పామేమోనని భ్రమిస్తాడు. అతడిలో పామును గురించి అంతకుముందు ఏర్పడిన భావనే భ్రాంతికి కారణం.అంతకుముందు పాము గురించి తెలియనివాడికి భ్రాంతి కలగదు. ఫలానా ఇంట్లో భూతాలున్నాయని పుకార్లు విన్నవాడుమాత్రమే   రాత్రి చీకట్లో ఇంట్లో  బూజును చూసినా  భూతమేనని భ్రమిస్తాడు.కాబట్టి ముందే నమ్మి, తరువాత ఆలోచిండం అంటే సమ్యక్ జ్ఞానసముపార్జనకు  వినియోగించాల్సిన పంచేంద్రియాలకూ,మనస్సుకూ ఎలాంటి పనీ పెట్టకుండా, మనస్సులో ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొనడం వంటిది.చెప్పుడు మాటలు విని ముందే వ్యక్తుల గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకొనడం వంటిది.ఇలాంటి ముందుగా నమ్మే  సందర్భాలలో మంచివాళ్ళని అపార్థం చేసుకునే అవకాశం ఎంత ఉందో, చెడ్డవాళ్ల చేతిలో మోసపోయే అవకాశమూ అంతే ఉంది.ఇది గుర్రానికి ముందు బండిని కట్టడం వంటిది.ఆకలైతే అన్నం తినాలిగానీ,ముందుగానే అన్నం తిన్నాం అనుకుంటే కడుపు నిండుతుందా? కాబట్టి దేన్నీ ముందుగా నమ్మేసెయ్యకూడదు.అలా చేసినప్పుడు కనీసం కొన్ని సందర్భాలలోనైనా మనం నష్టపోయే ప్రమాదం ఉంది.అంచేతనే 'దేవుడున్నాడు' అనే ఆప్తవాక్యాన్ని కూడా వెంటనే నమ్మేయ్యకుండా మనం మన ఇంగితంతో సృష్టికర్త అని మనం భావిస్తున్న ఒక దేవుడు అసలు ఉండే అవకాశం ఉందా -లేదా? అని యోచించాలి.

భగవంతుడు కర్మఫల దాత-అంటే మనం చేసిన మంచి పనులకు పుణ్యాన్నీ,చెడ్డ పనులకు పాపాన్నీకర్మ ఫలంగా  మనకు లెక్కకట్టి మరీ సంక్రమింప చేసేవాడు -అని మన ఆధ్యాత్మికవాదులు నమ్ముతారు.ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి.ఒకటి విధి లిఖితం ప్రకారమే  అంతా జరిగేటప్పుడు ఇంకా మనం చేసే పనులలో మంచిచెడుల బాధ్యత మనకెందుకు ఉంటుంది?అనేది ఒక ప్రశ్న.'శివుడి ఆజ్ఞ  లేనిదే చీమైనా కుట్టదు'అంటే ఇక్కడి ప్రతి చిన్న పనీ కూడా భగవంతుడి ఆనతి మేరకే జరుగుతున్నట్లే కదా!'అంతా విధిలిఖితం.మనం నిమిత్త మాత్రులం'అంటే మనకుగా మనం పనీ చేయడానికి స్వేచ్చ లేదనే కదా అర్థం?ఇక అలాంటప్పుడు మనం చేసే పనులను మంచివీ చెడ్డవని విభజించి మంచి పనులకు పుణ్య పురస్కారాలూ,చెడ్డ పనులకు పాప దండనలూ ప్రసాదించడం భగవంతుడికి ఎక్కడి న్యాయం?   ముందుగా బ్రహ్మ మనం పనులు చేయాలో మన తల రాత రాసేటప్పుడే నిర్ణయించి రాసేసిన తరువాత మనం తప్పనిసరిగా తలరాత ప్రకారమే నడుచుకోక తప్పదు కదా?మరి అలాంటప్పుడు మన నడతలోని మంచి చెడులను ఎంచడం సబబేనా?వాటికి పురస్కారాలూ , శిక్షలూ మేరకు సబబు?

ఇక రెండవ అంశం.భగవంతుడు అపార కరుణా సముద్రుడనీ, భక్తితో ఆయన్ని సేవిస్తే ఆయన ఉదారంగా పాపాన్ని పరిహారం చేసి పుణ్య సంపదలను ప్రసాదిస్తాడనీ తద్వారా మోక్షం కలుగుతుందనీ  మనవారి విశ్వాసం . అందుకే అసలు భక్తి, పూజ వగైరాలు మొదలయ్యాయి.తమ జీవితకాలం లో లెక్కకు మించిన ఘోర పాపాలు చేసిన 'పాండురంగ మాహాత్మ్యము'కావ్యం లోని  నిగమశర్మ వంటి క్రూరాత్ములను సైతం చివరి దశలో పుణ్య క్షేత్రాల సందర్శన చేశాడనో, పుణ్య తీర్థాలలో మునిగాడనో  భగవంతుడు కరుణించి మోక్షం ప్రసాదించిన ఉదాహరణలు మన పురాణ సాహిత్యంలో కోకొల్లలు.ఆయన పత్రాన్నో,పుష్పాన్నో,ఫలాన్నో లేక కేవలం నీటినో లంచంగా తీసుకుని వారి పాపాలను మాఫీ చేసి ఉంటాడా లేక ఊరికే పరిహరించాడా? అన్నది  వేరే విషయం.మన పురాణేతిహాసాలు అన్నిటిలో 'నన్నే పూజించేవారికి మోక్షం తప్పక లభిస్తుంది' అని భగవంతుడు పదే పదే  ఆభయమిస్తున్న కారణంగానే ఎంతటి ఘోరపాపాలు చేసిన వారు కూడా పరమ భాగవతోత్తముల వలె భక్తి నటిస్తూ దైవ కృపకోసం అడ్డదారులు వెదుకుతున్నారు.ఇలాంటి పాపిష్టి వాళ్ళనుకూడా కరుణించి ముక్తి ప్రసాదిస్తే  దేవుడి చర్యలో నైతికత లోపిస్తుంది.అతడసలు దేవుడు అనే పదానికే అర్హుడు కాదు.తనను పూజించి కీర్తించే దుర్మార్గులకు కూడా మోక్షం ప్రసాదిస్తే దేవుడు పొగడ్తలకు లొంగిపోయే బలహీనుడని భావించాల్సి వస్తుంది.వారిచ్చేవి స్వీకరించి పాపిష్టి వాళ్లకు కూడా స్వర్గ ప్రవేశం కల్పిస్తే దేవుడిని లంచగొండి అని భావించాలి.ఇక చివరిగా' దేవుడు చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు; ఎవ్వరి పాపాలనీ పరిహారం చెయ్యడు;  ఉత్తినే ఎవరికీ పుణ్య ప్రదానం చెయ్యడు; విదిననుసరించి ఎవరికి చెందాల్సిన పుణ్య-పాపాలను ఖచ్చితంగా వారికే సంక్రమింప చేసే నిజాయతీ పరుడు' అంటారా? అలాగైతే  విధి అనే ఒక 'సూపర్ పవర్' కి లోబడి లెక్కలు,పద్దులు రాసుకునే ఒక గుమాస్తా కంటే ఘనుడేమీ కాదు మన దేవుడు.అలా తాను  మరో శక్తికి లోబడి స్వయం నిర్ణయాధికారం లేకుండా వేరొకరి తరఫున  కర్తవ్య నిర్వహణ చేస్తుంటే ఆయన్ని పూజించి మాత్రం ఎవరికేమి ప్రయోజనం? అవసరం మాత్రం ఇక ఎవరికి ఉంటుంది?

భగవంతుడంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం భారతీయ షడ్ ఆస్తిక  దర్శనాల లోనిదైన'యోగ దర్శనం' పేర్కొన్నది. యోగ సూత్రాల కర్త పతంజలి భగవంతుడిని ఇలా భావించాడు-- క్లేశ  కర్మ  విపాకాశయైరపరామ్రుష్టా ( క్లేశ-కర్మ-విపాక-ఆశయై:- అపరామ్రుష్టా).God is the perfect immortal spirit who ever remains untouched by afflictions and actions and their effects and impressions.God is the Supreme Person who is above all individual selves and is free from all defects.He is the perfect being who is eternal and all-pervading, omnipotent and omniscient.

                      

ప్రత్యగాత్మలన్నీ అవిద్యా(Ignorance),అస్మితా(Egoism),రాగ(Desire),ద్వేష(Aversion) మరియు అభినివేశ (Dread of  Death ) అనే పంచ క్లేశాలకు లోనవుతాయి.ప్రతివారూ మంచి,చెడు,తటస్థ- అనే  మూడు తరహాలకు చెందిన క్రియలు చేస్తారు. క్రియల ఫలితంగా వాటి విపాకాన్నీ అనుభవిస్తారు.ప్రత్యగాత్మలకు (Individual Selves) వారి వారి గత అనుభవాల ,అనుభూతుల  స్మృతులు అంతర్లీనంగా ఉంటాయి.వీటినే' ఆశయ' అని పేర్కొంటారు.పరమాత్మకు మాత్రం ఇవేవీ అంటవు.అతడు వీటన్నిటికీ అతీతుడు, అపరామ్రుష్టుడూ నన్నమాట.మనం భక్తితో పూజించే వివిధ దేవీ దేవతలలో ఒక్కరన్నా నిర్వచనం పరిధిలోకి వస్తారేమో ఆలోచించండి.

వారందరూ పంచ క్లేశాలు అనుభవించారు.త్రివిధ కర్మలు చేశారు.వాటి విపాకాన్నీ చవి చూశారు.అవతార పురుషులని భావించే రామక్రిష్ణులలో రాముడు భార్యా వియోగ దుఃఖంతో తనువు చాలిస్తే కృష్ణుడు వేటగాడి బాణం దెబ్బకి మరణించాడు.శివుడూ విష్ణువూ కూడా రాగ ద్వేషాలకు అతీతులేం కాదు.ముందసలు అవతారాలూ,గత జన్మలూ ఉన్నాయని అంగీకరిస్తే దేవుళ్లలో వారి పూర్వ అనుభవాల, అనుభూతుల స్మృతులు అంతర్లీనంగా ఉండడమూ మనం గమనించవచ్చు.అంటే వారెవరూ ఆశయం అంటబడని వారు కాదన్నమాట.వాల్మీకి రామాయణం లో సుందరకాండలో ఒక సన్నివేశం లో సీత కోసం వెదికిస్తానని తనకుచేసిన వాగ్దానాన్ని మరచి,వినోదాలలో మునిగితేలుతున్న సుగ్రీవుడికి లక్ష్మణుడి ద్వారా ఇలా బెదిరింపు సందేశం పంపుతాడు రాముడు -" నరసింహునిగా హిరణ్య కశిపుని వక్షాన్ని చీల్చిన గోళ్ళలో, వేళ్ళలో ఇంకా మునుపటి పటుత్వం తగ్గలేదని సుగ్రీవుడికి నా హెచ్చరికగా చెప్పు.వాగ్దాన భంగం జరిగితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి."  తన పూర్వ అనుభవాల ,అనుభూతుల స్మృతులు కలిగుంటే రాముడు,కృష్ణుడే కాదు త్రిమూర్తులు సైతం భగవంతుడు అనే నిర్వచనానికి చాలరు. వాస్తవమేమంటే వారందరూ ఒకప్పుడు మానవులే .సాటి మానవులకు ఆదర్శప్రాయమైన కొన్ని మంచి లక్షణాలు వారిలో ఉండొచ్చు .వారిని పురుషోత్తములని గౌరవించవచ్చు.కీర్తించ వచ్చు.కాని వారికి 

లేనిపోని అతీత శక్తుల్ని ఆపాదించి,భక్తితో తమప్రయోజనాలను ఆశించి పూజించడం, కారణంగా తమ ప్రయోజనాలు నెరవేరతాయని నమ్మడం కూడా చూస్తున్నాం.ఇది అశాస్త్రీయం.

భగవంతుడే కానివాడికి భక్తితో చేసే పూజల ఫలితం ఎలా ఉంటుందో ,అవి ఏమేరకు సమంజసమో, మేరకు సమర్థనీయమో,ఏమేరకు శాస్త్రీయమో మీరే ఆలోచించండి.

భగవంతుడి గురించీ,భక్తి యొక్క ప్రయోజన లేమిని  గురించీ మున్ముందు మరిన్ని విషయాలు ముచ్చటించుకుందాం.ఇప్పటికి సెలవు.  (సశేషం)

 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech