s  
సారస్వతం  
     అన్నమయ్య కీర్తనలు రచన : జి.బి.శంకర్ రావు  

ఉన్నమంత్రా లిందు సరా

ఉన్నమంత్రా లిందు సరా వొగి విచారించుకొంటే
విన్నకన్నవారి కెల్ల విష్ణునామమంత్రము

పరగ బుచ్చకాయల బరసి పోదు మంత్రము
గరిమ ముట్టంబు లేని ఘనమంత్రము
వరుసనెవ్వరువిన్నా వాడిచెడని మంత్రము
అరయ నిదొక్కటే పో హరినామమంత్రము

యేజాతినోరి కైన ఎంగిలిలేని మంత్రము
వోజ దప్పితే జెడక వుండేమంత్రము
తేజాన నొకరి కిస్తే దీరిపోనిమంత్రము
సాజమైనదిదే పో సత్యమైన మంత్రము

యిహము పరము దానే యియ్యజాలిన మంత్రము
సహజమై వేదాల సారమంత్రము
బహునారదాదు లెల్ల పాటపాడిన మంత్రము
విహితమయిన శ్రీ వేంకటేశుమంత్రము

విష్ణు నామ మంత్ర విశిష్టతను ఈ సంకీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆచార్య పురుషుడు! శ్రీ మహా విష్ణు మంత్రము సాటిలేనిది, తత్త్వ విచారణతో చూస్తే దీనికి సాటికి రాగల మరొక మంత్రం లేదు. (మరొక సంకీర్తనలో కూడా అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అని అంటాడు). హరి నామ మంత్రము ముట్టు, అంటూ లేనిది. ఎవరైనా వినవచ్చు, పఠించవచ్చు! కులమత జాతి బేధములు లేక ఈ మంత్రోపాసన, మంత్రోఛ్ఛారణ చెయ్యవచ్చు. (రామానుజ సిద్ధాంతం) ఇది ఎంతమందికి పంచినా తరగని మంత్రము! సకల వేదాల సారమైన ఈ మంత్రం ఇహపరాలను అవలీలగా అందిస్తుంది. విష్ణు భక్తులైన నారదాదులు భక్తితో పాటలుగా పాడుకున్న మంత్రం! కలియుగంలో మనందరకు శ్రీ వెంకటేశ మంత్రంగా విహితమైనది! దానిని అన్నమయ్య సంకీర్తనలో పాడుకుందాం రండి!

పరగ = అతిశయము; గరిమ = గొప్పతనము; అరయ = చూడగా;
వోజ = క్రమము;
సాజము = సహజము;
విహితము = హితకరమైనది


 

ఉయ్యాల బాలునూచెదరు

ఉయ్యాల బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు

బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్దపాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు కనుదమ్ముల నవ్వులు
పమ్ముజూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లు చూపుల జవరాండ్లు రే
పల్లె బాలుని పాడేరు
బల్లిదు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు.

బాలకృష్ణుని ఉయ్యాల పాట యిది! గోపకాంతలు లీలామానుష రూపుడైన బాలకృష్ణుని ఉయ్యాలలో పడుకోబెట్టి లాలి, లాలి, లాలెమ్మ అను సొగసైన పదాల లాలిపాటతో కృష్ణుని పరవశింపజేస్తున్నారట. ఆ జవరాండ్లు ఉయ్యాలకు ఇరువైపులా ఉండి ఊపుతున్న సమయంలో వారి నోటినుండి నొయ్యనొయ్యనొయ్య అనే ధ్వని లయబద్ధంగా వెలువడి ఆహ్లాదకర శబ్దాలు ధిమ్మి ధిమ్మి ధిమ్మనగా వేంకటాద్రి కృష్ణుని అందెల రవళులు ఘల్లు ఘల్లని మారుమ్రోగాయట! ఈ పాటలో అన్నమయ్య స్వామివారి ఉయ్యాల క్రీడను అద్భుతంగా ఆవిష్కరించారు.

కనుదమ్ములు = రెండుకళ్ళు;
బల్లిదుడు = బలవంతుడు ;
పమ్ము = వ్యాపించిన;
తమ్మిరేకు = నల్లకలువపూల రేకులు;
కొమ్మలు = స్త్రీలు;
జవరాండ్లు = యవ్వనవతులు
బాలయవ్వనలు = తొలిప్రాయపు జవ్వనలు;
గునుకు = కొద్దిగా పరుగెత్తునట్లు నడచుట (బ్రౌణ్యం);
చల్లుచూపుల జవరాండ్లు = చూపులను చల్లే వయసుగత్తెలు


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech