తెలుగు రైతుకు ఇవాళ దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటాడు? మా చంద్రబాబు చల్లగుండేట్టు చూడు; నాలుగు కాలాలపాటు ఆ బాబును ఉన్నచోటే ఉంచు - అంటాడు. చల్లగా ఎందుకుండాలంటే... రైతన్నకు ఇప్పుడు నాయుడుగారే పెద్ద అండ కనుక! ఉన్న చోటే ఎందుకు ఉంచాలంటే - చోటు మారితే ఆయన ప్లేటు మార్చేయవచ్చు కనుక!
అధికారం అందిన బాబు, అధికారం అందని బాబు అని చంద్రబాబులు రెండు రకాలు. గద్దెమీది బాబుకు వ్యవసాయం శుద్ధదండుగ; ఒక పనికిమాలిన వ్యాపకం అనిపిస్తుంది. పొలం పనులు మానేసి కంప్యూటర్లు నేర్చుకోమని రైతుబిడ్డలకు ఉచిత సలహా ఇవ్వబుద్ధేస్తుంది. రైతులకు కరంటు ఉచితంగా ఇస్తే కరంటు తీగలు బట్టలు ఆరేసుకోవటానికి మాత్రమే పనికొస్తాయని బుద్ధి తక్కువ జనానికి ఉపదేశించాలనిపిస్తుంది. పొలం పండక, ఇల్లు గడవక, అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న నిరుపేద రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే, దాని ఆశకు ఇంకా చాలామంది ప్రాణాలు తీసుకుంటారు అని అల్లాడే జనానికి క్లాసులు పీకాలనిపిస్తుంది.
అదే - గద్దెకింది బాబుకు గుండె కొట్టుకునేది రైతుకోసమే. ఎల్లవేళలా ఆయన కోరుకునేది రైతు క్షేమమే. పవరు పోయాక ఆయనకి అర్జంటుగాప్రియాతి ప్రియమయ్యేది వ్యవసాయం. దానికోసం సర్కారు ఎంత చేసినా చాలదు; ఇంకా ఎంతో చెయ్యాలనే ఆయనకి అడగాలనిపిస్తుంది. నడమంత్రంగా తనకు గుర్తుకొచ్చిన కర్షకుడి కోసం ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది. అదిగో ఆ ఆవేశంతోటే, ఆ త్యాగశీలంతోటే మొన్న రైతులకోసం పట్టుబట్టి, కష్టపడి అరెస్టు అయ్యాడు. పోలీసువాళ్లు పొమ్మన్నా ఇంటికి పోకుండా రాత్రంతా గోషామహల్ పోలీసుస్టేషనులో చలిలో ముడుచుకు పడుకున్నాడు. అవసరం ఉన్నా లేకున్నా రైతులకోసం ఆత్మార్పణకు సిద్ధమైతే ఒక పని అయిపోతుందన్న ఆరాటంతో ఆ మహానుభావుడు రాష్ట్ర చరిత్రలో ఏ మాజీ ముఖ్యమంత్రి చెయ్యని అద్భుత కార్యాన్ని ఇప్పుడు తలపెట్టాడు. మిత్ర మీడియా దుందుభులు దిక్కులదరగొడుతుండగా... కులశ్రేష్ఠులు, రాజగురువులు నీరాజనాలిస్తుండగా... ఏకంగా ఆమరణ నిరాహారదీక్షనే లోకోత్తరంగా మొదలెట్టాడు.
పాత్రకు తగ్గట్టు వేషం వేయటం, పాత్రోచితంగా మాట్లాడటం నాటకాల్లోనే కాదు; రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తాను ధరించిన ప్రతిపక్ష నాయక పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసి బాబుగారు ఆస్కార్ లెవెల్లో రక్తికట్టిస్తుంటే మెచ్చుకోవలసింది పోయి కొంతమంది దేశ’ద్రోహులు ఎకసెక్కాలాడటం దుర్మార్గం. సింహాసనం మీద ఉన్నప్పుడు బాబుగారు విద్యుత్ చార్జిలు పెంచితే పెంచి ఉండవచ్చు. పెంచిన చార్జిలు తగ్గించమని ఆందోళన చేస్తే బషీర్‌బాగ్ సెంటర్లో కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టన పెట్టుకునీ ఉండవచ్చు. అయితే ఏమిటట? ఇప్పుడే అదే బషీర్‌బాగు సెంటరుకు కేవలం కొన్ని వందల గజాల దూరంలో రైతులకోసం ఆ మహానుభావుడు ఆమరణ నిరాహార దీక్షకు కూచుంటే కళ్లారా చూసి, నోరారా పొగిడి తరించాలి గాని, దిక్కుమాలిన ఫ్లాష్‌బ్యాకులను గుర్తు చెయ్యడమెందుకు? ప్రపంచ బ్యాంకు హెడ్మాస్టరు బెత్తానికి భయపడి, చెప్పినట్టల్లా నడచుకున్న పాత రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన అన్న వాటిని, చేసిన వాటిని పట్టుకుని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పాత్రలో ఆయన తలపెట్టిన రైతు లోక కల్యాణాన్ని యద్దేవా చేయటం ఏమైనా బాగుందా? తన చల్లని పాలనలో ఏడేళ్లు కరువు కాటకాల్లో నలిగి రైతులు విలవిలలాడినంతకాలమూ చిటికెనవేలును కదపకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటేనేమి... తనకు గిట్టని పాలనలో ఈ ఏడు ఒక మోస్తరు భారీ వర్షం దెబ్బకే బొబ్బలు పెట్టి కర్షకుల పేరిట ఆ మహనీయుడు దివ్యమైన దీక్షకు దిగాడు - చాలదా? రైతులకు ఎరువులు, విత్తనాల అవసరాలుంటాయని పవర్లో ఉన్నప్పుడు తమరికి ఎందుకు గుర్తుకురాలేదని ఆయనంతటి మహా పురుషుడిని పట్టుకుని అడిగెయ్యటం భావ్యమా? ఆ పుణ్యాత్ముడి పరిపాలనలో అసలు వర్షాలే పడనప్పుడు, ఎరువులతో, విత్తనాలతో ఏమిటి అవసరం?
ప్రతి పుణ్యకార్యానికీ ఒక ప్రేరణ అనేది ఉంటుంది. చినబాబు 48 గంటల దీక్ష బెజవాడలో చేస్తాననేసరికి అతడికంటే ముందే, అంతకంటే పెద్ద హైదరాబాద్‌లో తాను ఏకంగా ఆమరణదీక్ష మొదలెట్టేసి క్రెడిట్ కొట్టెయ్యాలన్న మంచిబుద్ధి పెదబాబుకు కలిగింది. తప్పా? ఉద్యోగం వేటలో ఉన్న కుర్రాడిలా బిడియపడుతూ సిగ్గులొలికే జగనబ్బాయకే అంత సీను ఉన్నప్పుడు... ఆటుపోట్ల ధీరుడు, వెన్నుపోట్ల వీరుడు, బిల్‌క్లింటన్ మిత్రుడు, తొమ్మిదేళ్లు చక్రం తిప్పిన ఘనుడు అయన బాబయ్యగారు ఆ చిరంజీవిని అనుగ్రహించి అతడి ఐడియాను కొంచెం కొట్టేసి, ఇంకొంచెం సానపడితే తప్పొచ్చిందా? తన శిష్యుడులాంటి కెసిఆరే ఆమరణ దీక్షకు కూచుని, అంత పబ్లిసిటీ కొట్టేసి, అంతంత పేరు మోగించుకున్నప్పుడు తానూ అదే విన్యాసాన్ని అతడికంటే గొప్పగా లాగించి, శిష్యుడిని మించిన గురువు అనిపించుకోవాలని ఆయన ఆశపడటం పేరాశ ఎలా అవుతుంది?
కాదు గాక కాదు. గొప్పవాళ్ల లీలల్లో తప్పులు వెతకటం శుద్ధ తప్పు. ప్రతి రైతు లోగిలిలో పాడి ఉంటుంది. అదే పాడితో బాబు ఫామిలీ పెద్ద పరిశ్రమే పెట్టింది. కాబట్టి రైతుకూ బాబుకూ మధ్య విడదీయలేని అనుబంధం ఎప్పటినుంచో ఉంది. ఆ సంగతి మనం చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలాగే ఇడుపులపాయ ఎస్టేటులో అడపాదడపా గట్లవెంట, చెట్లవెంట తిరిగిన అద్భుత అనుభవం చి.జగన్‌కి పుష్కలంగా ఉంది. ఆ సమయాల్లో అతడి చొక్కాకో, లాగూకో ఎంతోకొంత మట్టి అంటుకునే ఉండాలి. పైగా ఈ మధ్య పార్టీ పెట్టబట్టాక రైతు పరామర్శకు పొలాలకెళ్లి సాక్షి టీవీ సాక్షిగా వరి కంకులు పట్టి, బురద అంటించుకున్న విశేషానుభవమూ ఆ అబ్బాయకి ఉంది. అలాంటప్పుడు అతడికి రైతుల బాధలు తెలియవని, మట్టివాసన ఎరుగడని ఎవడూ అనలేడు. ‘లాటానుప్రాసం, ఛేకానుప్రాసం భూటానులో ప్రారంభించాయ గలాటాను’ అని అప్పుడెప్పుడో మహాకవి అన్నట్టు హైటెక్‌ల పెదబాబు, ఇండస్ట్రీల చినబాబు రైతన్నల పేరు మీద మారథాన్ దీక్షలకు పోటీలుపడి దిగటమే మనకు కన్నులపండువ. కాణీ ఖర్చులేని మహావినోదం కూడా.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech