|
ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో
అత్యవసర సహాయ సేవలందించే 108 అంబులెన్సులను, నడపకుండా నిలుపుదల
చేస్తామని, గత ఐదేళ్లుగా వాటిని నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ
మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ)
ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. వ్యక్తిగత
పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి
సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం?
ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ
కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా! 108 అంబులెన్సుల ద్వారా
అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల
క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా
సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. ప్రభుత్వ-ప్రయివేట్
భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు
భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలా జరక్కుండా,
కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడం కొరకు
కమిటీలను వేయడమంటే 108-అత్యవసర సహాయ సేవలు పౌరులకు గతంలో మాదిరి
నాణ్యమైన సేవలు లభ్యం కాకుండా చేయడమే! అంబులెన్సుల సేవలు ఆగిపోతే
నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు.
ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి
"ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది
108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు
ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి
సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. "లాభాపేక్ష లేకుండా"
ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడానికి భాగస్వామ్య
పక్షాలైన ఇరువురిలో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి
"విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి
కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.
పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే
ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే
ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా,
సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి
బాధ్యులైన వారందరూ నేరస్తులే.
ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల
నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్
భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు
కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు
తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం
చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ
ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు
ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని
రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ
పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో
పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం
మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా
అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక
సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని
స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా
భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ
కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు
పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం,
భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా
ఒప్పందం".
"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా,
ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు
సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు అత్యవసర యాజమాన్య
నిర్వహణా పరిశోధనా సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ఆవిర్భావం జరిగింది. తొలుత
ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ
విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ
లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ
అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. 95%
ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం
కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు
తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక
అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో)
హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక
వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన
వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ
జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు
అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు.
అలాంటప్పుడు ఇ.ఎం.ఆర్.ఐ ఎందుకు అల్టిమేటం ఇవ్వాల్సి వచ్చింది?
ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న
రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో
పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? జీ. వి.
కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకు
ముందు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం"
పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది
సంస్థ. గతంలో నాలుగు పర్యాయాలు కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఏ
విధమైన అభ్యంతరాలను చెప్పని ప్రభుత్వం, ఈ సారి రకరకాల ఆక్షేపణలు
తెలియచేయడానికి కారణాలే వై వుండొచ్చు? అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్
భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి
ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే
ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి
నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల
సాంప్రదాయానికి" తెరలేపింది ప్రభుత్వమైనా అవకాశం ఇచ్చింది మాత్రం
ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యమే అనాలి. ఇలా జరగకుండా వుండాల్సింది.
నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రత్యక్ష నిర్వహణ వ్యయం కింద
రు. 1, 12, 499 చొప్పున ఇ.ఎం.ఆర్.ఐ కి ఇస్తామని 502
అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ప్రభుత్వం, అంబులెన్సుల సంఖ్య
652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ,
"విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తుంది.
జీ.వీ.కె యాజమాన్యం 95% నిర్వహణ వ్యయాన్ని 100% పెంచమని, అదనంగా
మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది.
సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!)
వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ
యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే
ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత
భారాన్ని పరోక్షంగా సూచించింది యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని
వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా
కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో
ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు.
అధికారిక లెక్కల పుస్తకాలలో నెలనెలా నిర్వహణ వ్యయం ఒక్కో
అంబులెన్సుకు సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ
దృష్టికొచ్చింది.
"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా
2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ
అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల
నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు
అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ
సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ "నమ్మకం-విశ్వాసం" తో
తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ
సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది
? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది. అయితే అప్పటి కుటుంబ
సంక్షేమ శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, (దివంగత)
ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ
నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న. 502
అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు
పెరిగినప్పుడు, దగ్గుతోందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ,
బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో
ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక
సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !
లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు
ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక
స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ
సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు
వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు
తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన
ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను
ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను
సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర
రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం
"ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా
చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ
చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి?
అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి
రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు
అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం,
ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను
మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది.
సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వాన్సుగా
నిధులను విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఆర్థిక పరిస్థితుల
దృష్ట్యా "అవసరార్థం" అలా విడుదలైన నిధులను ఉపయోగించే
సాంప్రదాయానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ తెర లేపింది. అలా చేయడం
"దుర్వినియోగం" కిందకు రాదని, "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా
నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. అదే క్రమేపీ రు. 120
కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు
అప్పు కూడా వుంది!
ఇ.ఎం.ఆర్.ఐ వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి
గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ
వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని,
ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు
నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో యాజమాన్యం వివరణ
ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి
మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు"
కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా
వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు
ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని
నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి
కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని
చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ
పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం
జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని,
అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల
భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ
కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన
ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం
ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల
అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.
సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ
మేనేజ్మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి
హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల
నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో,
సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల
నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? అలా "సంబంధం లేని"
వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని
ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!
జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్
గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి
వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండొచ్చు. కుటుంబ సభ్యులకు
పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి
వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం
కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్
కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత
జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు.
అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం,
ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు
నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు
నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం,
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్
సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన
కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది
ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్.....
...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే,
సుమారు నలభై ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా రాజు గారి సారధ్యంలో
రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి", "సంఘ స్థాపన పత్రం"
లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, సులభంగా
సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు
గారు. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి
విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ
జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.
ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ
సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక
చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం
ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో
వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా?
భవిష్యత్ లో ఏం జరుగబోతోంది? |
|