 |
 |

సత్యమేవ జయతే -
అమెరికాలమ్ - 1
కథ లేని కథ
-
సత్యం
మందపాటి
|
|
"రండి. కథ మీద కూర్చుందాం" అన్నాడు
దర్శక చంద్రుడు, కుర్చీ మీద కూర్చుంటూ.
ఆ సినిమాకి డబ్బులు పెడుతున్న నిర్మాత ధనంజయం అక్కడే నుంచుని
వుండటం చూసి, 'కూర్చో బాబాయ్' అన్నాడు దర్శక చంద్రుడు, ఒక పెగ్గు
బిగించి.
"ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరంటారు?" అడిగాడు నిర్మాత ధనంజయం రెండో
పెగ్గు బిగిస్తూ.
చంద్రుడు చిన్నగా నవ్వి 'ఇంకెవరు.. మా అబ్బాయే... ఇక మీరు కథ మొదలు
పెట్టండి?" అడిగాడు జంట రచయితలు తాపేశ్వరం తమ్ముళ్ళని.
ప్రముఖ సినిమా రచయితలు తాపేశ్వరం తమ్ముళ్ళు కథ మొదలుపెట్టారు.
(టైపు చేసే అక్షరాలు ఆదా చేయటం కోసం ఇక్కడ్నించీ తా.త. అందాం).
ఇద్దరూ జంట రచయితలు కనుక ఎవరు ఎలా చెప్పారు అన్నది కాదు ముఖ్యం, ఏం
చెబుతున్నారు అని.
"మేమిప్పటికి నాలువందల తొంభై తొమ్మిది సినిమాలకి కథలు వ్రాశామని
మీకు తెలుసు. అంటే ఇది మా 500వ చిత్రం. అందుకని ఈసారి ఎంతో కష్టపడి
ఈ కథ తయారు చేశాం"
"మా అబ్బాయికి ఇదే మొదటి చిత్రం. అందుకని ఈ కథ కొత్తగా వుండాలని
ముందే చెప్పాను... ఇక కథ మొదలు పెట్టండి" అన్నాడు దర్శక చంద్రుడు
ఇంకొకసారి ఔపోసన పడుతూ.
తా.త. కథ మొదలు పెట్టారు. 'అనగా అనగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఆ
కాలేజీలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి విచిత్రమైన పరిస్థితుల్లో
కలుస్తారు. రెండు గ్రూప్ డాన్సులు చేసుకున్నాక, ఇద్దరూ బాగా
దగ్గరవుతారు. అప్పుడు ఆ అమ్మాయి బొడ్డు మీద పూజ చేస్తూ, అతను ఇంకొక
పాట పాడతాడు. ఈలోగా ఆ అమ్మాయి సంక్రాంతి శెలవులూ, కాలేజ్ బందూ
రెండూ కలుపుకుని మొత్తం నెల రోజులకి, వాళ్ళ పల్లెటూరుకి వెడుతుంది.
ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయితో వాళ్ళ ఊరు వెడతాడు. అక్కడ ఆ అమ్మాయికి
అమ్మా, నాన్నా, అమ్మమ్మా, బామ్మా, తాతయ్య, అన్నయ్యలూ, వదినెలూ,
అక్కయ్యలూ, బావలూ, మేనకోడళ్ళూ, మేన కాని అల్లుళ్ళూ.. ఇలా పిచ్చ
స్టారింగ్ వుంటుందన్నమాట. మన హీరో అక్కడ అందరికీ నచ్చుతాడు.
ఎందుకంటే అతనికి తెలియనిదేదీ లేదు ఈ భూప్రపంచంలో. పాటలు పాడతాడు.
డాన్సులు చేస్తాడు. అంతే కాదు అతనే ఒక పాట వ్రాసి, దానికి
కొరియోగ్రాఫ్ చేసి అందరితో కలిసి డాన్స్ కూడా చేస్తాడు. హీరోయిన్
బామ్మ అతన్ని అడుగుతుంది, మీ అమ్మానాన్నల పేరేమిటి బాబూ అని. అతను
ఫలానా వూరిలో ఫలానా వాళ్ళు అని చెబుతాడు. ఆవిడ ఒక్కసారిగా లేచి
నుంచుని, ఆ దుర్మార్గుడి కొడుకువా నువ్వు, పో.. బయటికి పో అని
అరుస్తుంది. అప్పుడు అప్పటి దాకా కలిసి పాట పాడుతూ డాన్స్ చేసిన 36
మంది చుట్టాలకీ, మిగతా 38 మంది జూ ఆర్టిస్టులకీ అర్థమవుతుంది, ఇతను
వాళ్ళ గూఢ శత్రువు కొడుకని. అక్కడినించీ సినిమా చకచకా
పరుగెడుతుంది. ఇంటి ముందు తలకాయలు నరికెయ్యటాలూ, యాసిడ్ ముఖం మీద
పొయ్యటం లాంటివి… కాలేజీలో బొడ్డు పూజలూ, వానలో సరిగంగ స్నానాలూ...
"
నిర్మాత ధనంజయంకి కొంచెం అసహనంగా వుంది. "ఈ కథని చాలా సినిమాల్లో
చూశాం కదూ... తెలుగులో కనీసం వందసార్లు ఇదే కథతో సినిమా తీశారు"
అన్నాడు.
తా.త. తడుముకోకుండా అన్నారు. “పోదురూ బడాయి! వందేమిటి. మేం వ్రాసిన
499 సినిమాల్లోనూ 499 సినిమాలకి అదే కథ. బాగా హిట్టయిన కథ. మన
ప్రేక్షకులకి నచ్చిన కథ. మీ డబ్బులకి ఢోకా వుండదు. పాటలూ డాన్సులూ
సెక్సూ వయొలెన్సూ ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఈ కథలో వున్న
గొప్పతనమే అది. కథని మారిస్తే మీ అభిమానులకీ నచ్చదు"
"మరి దర్శక చంద్రుడు గారు కొత్త కథ కావాలన్నారు కదా... " అడిగాడు
ధనంజయం.
"కథలో కొత్తదనం మనం తీసే విధానం బట్టి వుంటుంది. బంటుమిల్లి
ఇంజనీరింగ్ కాలేజీ బదులు, హీరో హీరోయిన్లు బెర్లిన్ కాలేజీలో
కలిసినట్టు చూపిద్దాం. బొడ్డు మీద పూలు పోసే పాట, పబ్లిక్
గార్డెన్సులో కాకుండా పోలెండులో తీద్దాం. ఫైటింగులు బాంబే ఖాన్
బదులు జాకీ ఛాన్ చేత చేయిద్దాం. హిందీ హీరోయిన్ దొరక్కపోతే
హాలీవుడ్ నించీ తెప్పిద్దాం... ఈ కొత్తదనం చాలా... ఇంకా కావాలా?"
అన్నారు తా.త.
"కథ బాగుంది. మంచి కొత్తదనం కూడా వుంది. ఇది మీకు 500 చిత్రం. మాకు
శతదినోత్సవ చిత్రం. శుభం అలాగే కానిద్దాం" అన్నాడు దర్శక చంద్రుడు,
బల్ల మీది సీసాని ఖాళీ చేసి.
* * *
ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, సినిమాలు తీసే ప్రతి భాషలోనూ,
ప్రతి దేశంలోనూ ఎన్నో కొత్త రకం కథలు వస్తుండగా, మన తెలుగులోనే ఈ
దౌర్భాగ్యం ఎందుకని?
పూర్వం ఇలా వుండేది కాదు. ఎన్నో సినిమాలు ప్రచురింపబడ్డ నవలల, కథల
ఆధారంగా నిర్మించ బడ్డాయి. దేవదాసు, బాటసారి, అర్థాంగి, మాంగల్యబలం
లాటి సినిమాలు బెంగాలీ నవలల ఆధారంగా తీస్తే, జీవన తరంగాలు,
సెక్రటరీ, ప్రేమనగర్, కన్యాశుల్కం, ఏకవీర, అందాల రాముడు లాటి ఎన్నో
చిత్రాలు తెలుగు నవలల, నాటకాల, కథల ఆధారంగా తీశారు. బాపు-రమణల
సాక్షి, బాలరాజు కథ, వంశవృక్షం, విశ్వనాథ్ శంకరాభరణం నించీ
స్వాతికిరణం వరకూ, సింగీతం శ్రీనివాసరావు తీసిన పుష్పకవిమానం… ఇలా
ఎన్నో వైవిధ్యమైన కథలతో సినిమాలు వచ్చాయి. పైన చెప్పినవి బహు
కొద్ది ఉదాహరణలు మాత్రమే. మరిప్పుడు మన సినిమా తమ్ముళ్ళ కథలు ఇలా
తయారయాయి ఎందుకు? సంగీతకారుల కథల్లో కూడా మరదళ్ళతో డ్యూయెట్లు
పాడించే దుస్థితికి దిగజారింది తెలుగు సినిమా కథ.
దొంగరాముడు, వెలుగునీడలు, గుండమ్మ కథ, మిస్సమ్మ, మాయాబజార్,
రాముడు-భీముడు, గోరంతదీపం, మూగమనసులు వంటి ఎన్నో కథలు సినిమా
రచయితలు తయారచేసినవే అయినా, కథా కథనాల్లో దేని తరహా దానిదే.
దుక్కిపాటి మధుసూధనరావు, ఆదుర్తి సుబ్బారావు, బి.ఎన్. రెడ్డి,
విజయా నాగిరెడ్డి-చక్రపాణి మొదలైన నిర్మాతా దర్శకులు, వివిధ
రచయితలకి ఎంతో విలువనిచ్చి కథ వ్రాయించేవారు. స్క్రిప్ట్
పూర్తిచేయటానికే కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు తీసే సినిమాలకి కథ
వుండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు, డబ్బు పెడుతున్న హీరో నాన్నో,
బాబాయో, మామయ్యో, అమాయకుడైన ఒక రైతు బిడ్డో చేతిలో వున్నది
వదులకొట్టుకునే దాకా కథ అలా ఎక్కడెక్కడికో పోతూ వుంటుంది.
పాడుకుంటూ ఆడుకుంటూ కుప్పిగంతులు వేసే హీరో భవిష్యత్తు కోసం
బలవంతాన ఆ సినిమాని కుంటుకుంటూ నడిపిస్తారు. అలా నడపకపోతే, ఆ
నిర్మాతని హీరో ఒక్క కంటి చూపుతోనే కాల్చి పారేసే సంఘటనలూ
వున్నాయి.
హాలీవుడ్ సినిమాలు పరిశీలిస్తే - సీక్రెట్ లైఫ్ ఆఫ్ బీస్, టెంపుల్
గ్రాడిన్, గ్రాన్ టొరీనో, టాయ్ స్టోరీ, జురాసిక్ పార్క్,
టెర్మినల్, సిక్త్ సెన్స్, బ్లైండ్ సైడ్.. ప్రతి కథలోనూ ఎంతో
వైవిధ్యం.
ఎన్నో నవలల ఆధారంగా నిర్మిచబడ్డ సినిమాలు. డాన్ బ్రౌన్, మైకేల్
క్రిక్టన్, జోసెఫ్ కాండ్రాడ్, రాన్ కోవిక్, కార్ల్ సేగన్, థామస్
కాబ్, జుంపా లహిరి, స్టీఫెన్ కింగ్, జేన్ ఆస్టెన్, టాం క్లాన్సీ,
జాన్ గ్రిషం... మొదలైన రచయితల నవలలు.. ఎన్నో.. ఎన్నెన్నో... వీటికి
అంతులేదు. అంతే కాదు నవలలకి చాల దగ్గరగా వుంటాయి ఈ సినిమాలు.
కొన్ని నిజ జీవితాల ఆధారంగా అల్లబడ్డ కథలు.
మన తెలుగులో చక్కటి నవలలకి కొరత లేదు. రాచకొండ అల్పజీవి,
బుచ్చిబాబు చివరకు మిగి లేది, గోపీచంద్ చీకటిగదులు, రంగనాయకమ్మ
స్వీట్ హోం లేకాక, కొవ్వలి నవలలు, కొమ్మూరి సాంబశివరావు నవలలు,
కొమ్మూరి వేణుగోపాలరావు నవలలు... గణపతి, కంఠాభరణం, మాలపల్లి, వేయి
పడగలు లాటి క్లాసిక్స్, కొన్ని వేల మంచి కథ లున్నాయి తెలుగులో.
మరి వాటి జోలికి ఎందుకో మన నిర్మాతా దర్శకులు వెళ్ళరు.
బహుశా ఆ కథలన్నీ కంచికి వెళ్ళిపోయాయేమో!
* * * |
|
|

సత్యం మందపాటి |
పుట్టింది
తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్
డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్
మేనేజర్ గా ఉద్యోగం.ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా
అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక
చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు,
నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల
ద్వారా ప్రయత్నం. |
|
|
నా
రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల
కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.
చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ
కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ
ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్
అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం,
అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా
బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా,
పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక,
ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి,
రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని
తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి,
తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా
రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి.
ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో
ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు
పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో
ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు,
ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను.
1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి
రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం |
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|
 |
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|