aaa

అప్పగింతల పాటల్లో కౌన్సిలింగ్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


పాతికేళ్ళ క్రితం జరిగిన పెళ్లిళ్లకూ, ఈ రోజుల్లో పెళ్లిళ్లకూ తేడా చూస్తే, అనేక ఆశ్చర్యకర, అనూహ్యమైన, ఆందోళన కలిగించే విషయాలు తెలుస్తాయి. పూర్వం ఉమ్మడి కుటుంబాలలో పెళ్ళికి ముందు మేనమామలూ, బాబాయిలూ,మేనల్లుడికీ, మేనత్తా,ఇతర ముత్తయిదువలూ మేనకోడలికీ, ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చేసేవారు.

అప్పగింతల పాటల్లో అనేక సజెషన్లున్నాయి. అవి పదేపదే పాడి, వాళ్ల మనసు మీద రిజిస్టరు చేస్తుంటారు.
"హాయిగా ఆలుమగలై కాలం గడపాలి/వెయ్యేళ్లు మీరు అనుకూలంగా ఒకటై బతకాలి/ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు/ ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి/ సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి/ శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి/ సుఖమైన, కష్టమైనా సహనంతో మెలగాలి/ పతి ఇంట్లో బంధుజనాల అభిమానం అభిమానం పొందాలి/ తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవొద్దూ/ చీరలు నగలిమ్మని భర్తని చీటికీమాటికీ అడగొద్దు/అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు."
ఇలాంటి అప్పగింతల పాటలు ఇంటా, బయటా, సినిమాల్లో కూడా వుండడంతో పెళ్లికూతురు, తాను అత్తవారింట్లో అడ్జస్ట్ అయితీరాలనే నిర్ణయంతో తనను తాను నియంత్రించుకుంటుంది. దానివల్ల చీటికీమాటికీ అలిగి పుట్టింటికి పోవడం వుండదు. ఆ పాటలోనే మరోచోట ఇలా అన్నారు - "అత్తామామల అనుమతితోనే అమ్మ అమ్మమ్మలను చూడాలి/ అది కూడా అల్లుడితోనే ఆనందంగా ఆడుతూపాడుతూ కలిసిరావాలి."
ఇటువంటి సజెషన్ వల్ల పదేపదే పుట్టింటికి పరుగెత్తడం తగ్గుతుంది. ఒకవేళ అలా వెళ్లినా, తల్లిదండ్రులు నచ్చజెప్పి తిరిగి అత్తవారింట్లో దింపేవారు. అయితే ఇప్పటి రోజుల్లో చిన్నతగాదాలకు కూడా అలా అమ్మాయి ఇంటికి రాగానే సపోర్టు చేయటంతో, ఆ అమ్మాయికి సానుభూతి లభించి, తన సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం లేదు. నిజానికి అమ్మాయికి ఆ సమయంలో ధైర్యం చెప్పి, సమస్యను పరిష్కరించుకునే సజెషన్లు ఇస్తూ, "నీ ఇంటిని నువ్వే చక్కబెట్టుకోవాలి. మేము నిన్ను దూరం నుంచే సపోర్టు చేయగలం" అని నచ్చజెప్పగలిగెతే, పరిస్థితి మరో విధంగా వుంటుంది.
కొత్తకోడళ్లను అత్తలు ఆరళ్లు పెట్టినా భరించిపడివుండమనీ, ఒంటి మీద కిరోసిన్ పోసి తగలబెట్టినా నోరు మూసుకునుండమనీ కాదు. అలాంటి అత్తలను ఎదిరించవచ్చు, శిక్షించవచ్చు, పోలీసులకు పట్టించవచ్చు. అమ్మాయి కట్నం తేలేదనీ, పెళ్లిలో మర్యాదలు చెయ్యలేదనీ ఆడిపోసుకునే అత్తలను ఎవ్వరూ సమర్ధించరు. కానీ చిన్నచిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక భర్తతో పోట్లాడి, విడాకులు తీసుకోడానికి సిద్ధపడుతున్న వారున్నారు. భార్యాభర్తల కలహాలను పెద్దవారికి తెలియకుండా వారిలోనే సర్దుకుపోవాలంటే, ఇరుపక్షాల పెద్దలూ, తమ జోక్యం తగ్గించుకోవటం మంచిది.
అత్తాకోడళ్ల మధ్య కలహాలు రావడానికి ఏకారణం, అబ్బాయి మీద గల అపారానురాగమే. ఆ పొసెసివ్ నెస్ వల్ల తన భర్త తనకే సొంతం అని కోడలూ, తన కొడుకుని తల్లీ గొడవలు పడుతుంటారు.
భార్యాభర్తల కాపురం ఓ బండిలాంటిది. ఇద్దరూ చక్రాల్లా సమవేగంతో సాగాలి. భాద్యతలనే బరువులనూ, ప్రయాణికుల్లాంటి తల్లిదండ్రులనూ కొంతకాలం మోయవలసివస్తుంది. దానికి భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ నిరాకరించినా, బండి ముందుకు సాగదు.
ఇటీవలి కాలంలో అమెరికన్ సైకాలజిస్టులు మేరేజికౌన్సిలింగ్ కు వచ్చిన భార్యాభర్తలను కలిసి డాన్సు నేర్చుకోమనీ, టెన్నిస్ ఆడమనీ సలహా ఇస్తున్నారు. డాన్సు చేసినప్పుడు, స్టెప్స్ వేసినప్పుడు, ఒకే పద్ధతిలో కలిసివెయ్యడం, చెయ్యి అందించినప్పుడు అందుకోవడం, పడిపోతుంటే పట్టుకోవడం వంటివి వుంటాయి. టెన్నిస్ ఆటలోనూ ప్రత్యర్ధుల మీద విజయం సాధించడానికి పరస్పరసహకారం చాలా అవసరం. వీటి వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన, ఒకరిపై ఒకరు ఆధారపడడం జరుగుతాయని ప్రయోగాల్లో తేలింది.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech