aaa

 


నాన్నా నువ్వు ఎప్పటికీ నా గుండెలోనే వుంటావు - 2వ భాగం

     
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


నాన్న జీవితంలో పెద్ద దెబ్బ 10 ఏళ్ళ మా తమ్ముడి అకాల మరణం. 1978 లో సంక్రాంతి పండగకి మా తమ్ముడు తనకి ఎలాంటి గాలిపటాలు కావాలో తను ఎంత పైకి ఎగరేస్తాడో చెబుతుండేవాడు, వాడికి జ్వరం వచ్చింది, మొదలు మాములు జ్వరమే అనుకున్నారు, కాని తగ్గటం లేదని అందరికి మనసులో ఎందుకో బెంగలాగా అనిపించసాగింది. మరో రెండు రోజుల్లో ఫిట్స్ రావడం ఉస్మానియా ఎమెర్జెన్సీ కి తీసుకెళ్ళడం మర్నాటికి (భోగి రోజు) ప్రాణం లేని మా బంగారు తండ్రిని, ముద్దుల తమ్ముడిని తీసుకొచ్చేసారు. కారణం "మెదడువాపు వ్యాది," అప్పుడే దాని గురించి తెలుసుకున్నారు కాని జబ్బునుండి కాపడడానికింకా వాక్సినేషన్లు లేవు. వాడికి ఎలా దాపురించిందో కాని మా దగ్గరనుండి మా సంతోషాన్ని తీసుకెళ్లిపోయింది.

 

అందరికి ఎంతో ధైర్యం చెబుతూ వుండే నాన్న చాలా డీలా పడిపోయాడు. నాన్న ఎన్నడూ సిక్ లీవ్ పెట్టి ఎరగడు, అలాంటిది మనోవ్యాధితో కన్న కొడుకు అందులో చిన్నవాడు, తండ్రి పేరు పెట్టుకున్నాడు, వాడు ఎప్పుడు నాన్న వెంటే వుండేవాడు. నాన్న తోట పని చేస్తే సాయం చెసేవాడు, వాడి మాటలు, ఆటలు, పాటలు, అల్లరి లేక ఇల్లంతా నిశ్శబ్ధంగా అయిపోయింది. నాన్న ఆఫిస్ కి సైకిల్ పై వెళ్ళేవాడు, స్కూల్ కి వెళ్ళకమునుపు సైకిల్ తీసి బయట పెట్టేవాడు చిన్నోడు. శరీరానికి దెబ్బతగిలితే వెంటనే తెలుస్తుంది వైద్యం చెస్తారు కాని మనసు కి ఎన్నడూ లేనంత పెద్ద దెబ్బ తగిలితే ఎవ్వరేం చేయగలరు? ఆర్నెల్లు అయ్యాక ఇక తప్పక ఆఫిస్ కి బస్ లో వెళ్ళడం మొదలు పెట్టారు సైకిల్ మూలకి పడేసి. సైకిల్ పట్టుకుంటే, చూస్తే చిన్నొడే గుర్తుకొచ్చేవాడు ఆయనకి. అమ్మా నాన్న ఇద్దరూ మానసికంగా చాలా బాధ పడ్డారు. ఆ బాధతో ఎప్పుడు ఎవ్వరికి ఏమవుతుందో అనే భయంతో అన్నయ్యకి ఇంకా అప్పటికి జాబ్ రాలేదు అయినా పెళ్ళి చేసేసారు, ఆ తరవాత సంవత్సరం మా అక్కయ్య పెళ్ళి చేసేసారు. ఇంట్లో కొంచెం మార్పు వచ్చి నాన్న మళ్ళీ మాములు మనిషిలా తిరగసాగాడు, ముఖ్యంగా మా అన్నయ్యకి ఒక పాప, మా అక్కయ్యకి ఒక బాబు పుట్టాక ఆయన ముఖంలో సంతోషం కనపడింది. అక్కయ్య కొడుకు నాన్న కి బాగా మక్కువయ్యాడు అదీ కాక వాడు పుట్టడం భోగి, జనవరి 13 న కావడంతో మా తమ్ముడే మళ్ళీ పుట్టాడని మురిసిపొయాడు. వాడు నాన్న దగ్గరే పడుకునేవాడు, ఎప్పుడు తాత తాత అని వెంట వెంట తిరిగేవాడు. వాడు అమెరికా వచ్చి ఎం.ఎస్ చేసి, ఉద్యోగం చేయడం చూసాడు. వాడి పెళ్ళి చూడాలని చాలా కోరికగా వుండేది నాన్నకి.

ఎవరికైనా తల్లి తండ్రులతో అపార్ధాలు యుక్తవయసులో కి అడుగుపెట్టినప్పుడు తలెత్తుతాయి. కాని నేను నాన్న తను యువకుడిగా వున్నప్పుడు వాళ్ళింట్లో పెద్ద సంఘ సంస్కర్త కాబట్టి నా మనసుని కూడా అర్ధం చేసుకుంటాడనుకున్నాను. నాన్న అప్పటికే రిటైర్ అయ్యారు. నా పెళ్ళి భాధ్యత ఒకటి అయిపోతే ప్రశాంతంగా వుండొచ్చని ఆయన ఆలోచన. సంబంధాలు చూసేప్పుడు నేను కట్నం తీసుకునే వాడయితే చేసుకోన్నన్నాను. దాంతో నాన్నకి చాలా కోపం వచ్చేది. మా ఇద్దరికీ వాగ్విదాలు జరిగేవి. ఒకోసారి కోపంతో తినకుండా కాలేజి కి వెళితే నేను వచ్చేవరకు ఎదురు చూసి రాగానే, 'నా మీద కోపంతో తినకుండా వెళ్ళితే ఎట్లాగమ్మా? మధ్యలో కళ్ళు తిరిగితే అస్సలే బక్కప్రాణం తట్టుకోలేవు!' అనే వాడు. శ్రీనివాస్ కట్నం వద్దు అనగానే అందరికి సంతోషమయ్యింది. అదే నేను అంటే తప్పు. కాని చిన్ని కి తగట్టు కట్నం తీసుకోని వాడు దొరికాడు నాకదే సంతోషం అన్నాడు, మా బంగారు నాన్న.

రిటైర్ అయ్యిన తరవాత కొన్ని చోట్ల పని చేయడానికి ప్రయత్నం చేసారు కాని చిన్న చిన్న పనులు చేయలేకపోయారు అందులో వాళ్ళు సరిగ్గా మాట్లడకపోయినా నచ్చేది కాదు వొదిలేసి వచ్చేసాడు. ఆ తరవాత ఆ ఫ్యాక్టరి ఓనర్ వచ్చి క్షమార్పణలు చెప్పుకుని మళ్ళీ వచ్చి అకౌంట్స్ చూడమని ఎంతో బ్రతిమిలాడారు కాని నాన్న వెళ్ళలేదు. ఆత్మాభిమానం వున్న మనిషి మా నాన్న. నాన్న రిటైర్ అయిన కొన్ని సంవత్సరాల తరవాత, ''నిజాయితిగా, కష్టపడి పనిచేసిన వ్యక్తిగా,'' సన్మానం చేసారు సెంట్రల్ బ్యాంక్ వారు. నా ఆనందానికి అంతు లేదు. ఆయన నమ్మిన కష్టపడి పనిచేయడం, నీతి, నిజాయితికి కట్టుబడి వుండడం వల్ల ఎంత గౌరవం లబించిందో, హి టోటల్లి డిజర్వ్స్ సచ్ గ్రేట్ హనర్ అని గట్టిగా అరవాలనిపించింది. నాన్నకి కంగ్రాఅచ్యులేషంస్ అని ఫోన్లో చేప్పాను అనందంగా. అప్పటికి మేము ఇక్కడికి వచ్చేసాము. నాన్నకి జరిగే అంత గొప్ప సన్మానానికి నేను లేనని చాలా బాధ పడ్డాను. నాన్న ఏం చేసినా మంచి మనసుతో చేసేవారు కాబట్టి ఆయనని అందరూ గౌరవించేవారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చేసినదానిలో సగం చేసినా చాలు అనిపిస్తుంది మనం మంచి జీవితం గడుపుతున్నాము అనుకోవడానికి.

శ్రీనివాస్, చైతన్య, స్ఫూర్తి రావడం లేదే అనిపిస్తుందమ్మా,' అంటుంటే గొంతు పూడుకు పోయేది నాన్నకు, నాకు ఏడుపొచ్చెసేది.
నాఅక్కడ ఎవ్వరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, నేను ఫోన్ చేసి మాట్లాడితే మా నాన్న, 'అమ్మ నువ్వు అంత దూరంలో వున్నావు, ఇక్కడ పొద్దుటి నుండి ఎంతో మంది వస్తున్నారు, కాని ఆ గుమ్మం లో నుండి నువ్వు, కు '94 లో 'పాంక్రియటైటిస్,' అనే జబ్బు చేసింది, మనిషిని పీల్చి పిప్పిని చేసి వదిలి పెట్టింది. ఆప్పుడు చైతన్యకి 3 ఏళ్ళు. డా. నాగేశ్వర్ రెడ్డి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. '95 లో ఇక్కడికి వచ్చాము. '98 లో మా అత్తగారు అనుకోకుండా హార్ట్ ఫేల్ అయ్యి పోయారు. 3 ఏళ్ళల్లో అమెరికాలో బాగా కోలుకున్నాను కాని ఇండియాకెళ్ళగానే జబ్బు తిరగబెట్టింది. అక్కడ 3 నెలలు వుండి ఇక్కడికొచ్చాము, శ్రీనివాస్ కి కొన్ని నెలల పనే వుంది, అప్పటికి చైతన్య స్కూల్ కూడా అయిపోతుంది ఇండియాకి వెళ్ళిపోవాలనుకున్నాము. కాని జీవితంలో అన్ని మనం అనుకున్నట్టుగా జరిగితే ఇక అందులో వింతేమి వుంది? స్ఫూర్తి తో ప్రెగ్నంట్ గా వున్నప్పుడు జబ్బు తిరిగి వచ్చింది '99 లో, ఇక కదలలేకపోయాము అప్పటినుండి ఇప్పటిదాకా నన్ను పీడిస్తూనే వుంది. ఆ పరిస్థితుల్లో మెడికల్ ఇన్స్యురెన్స్ చాలా అవసరం కాబట్టి జాబ్ ఆఫర్ వస్తే తీసుకున్నారు శ్రీనివాస్. చాలా కఠినమైన ప్రెగ్నెన్సీ అయినా కానుపు చాలా సులువుగా అయ్యి స్ఫూర్తి ఆరోగ్యంగా పుట్టింది, జనవరి, 2000 సంవత్సరంలో. కానుపు తరవాత భయంకరమైన నరకం అనుభవించాను. మృత్యువు దరిదాపుల్లోకి వెళ్ళి పిల్లలకోసం వెన్నక్కి వచ్చాను. ప్రాణాన్ని కాపాడారు కాని నొప్పిని తీసేయలేకపోయారు.

నాకు 13 ఏళ్ళప్పుడు అపెండిసైటిస్ సర్జరి జరిగి ఉస్మానియా ఇంటెన్సివ్ కేర్ లో వున్నాను, అప్పుడు లోపలికి ఎవ్వరినీ రానిచ్చేవారు కాదు. నాన్న నన్ను వదలి పోలేను అన్నారు, అప్పుడు దాశరథి మామయ్య హాస్పిటల్ సుపరింటెండెంట్ కి ఫోన్ చేసి చెబితే నాన్నని లోపలికి రానిచ్చారు. 3 రోజులు నిల్చునే వున్నాడు. నేను కళ్ళు తెరిచినప్పుడల్లా నా ముందరే వుండే వాడు, 'ఏం భయం లేదమ్మా, అంతా తగ్గిపోతుంది, నువ్వు రెస్ట్ తీసుకో, నేనిక్కడే వుంటాను,' అని శ్లోకాలు చదువుతూ ప్రార్ధిస్తూ వున్నాడు అలా మా పిచ్చి నాన్న! అమెరికాలో 2001 లో మేజర్ సర్జరి 9 గంటలపాటు చేసిన తరవాత నన్ను ఇంటేన్సీవ్ కేర్లో సర్జన్ అనెస్థిషియా నుండి లేపి పలకరించడానికి చూస్తున్నారు, నాకు లీలగా గుర్తుంది, 'నాన్న, నాన్న కావాలి, నాన్న ఇక్కడే కూర్చో,' లాంటి మాటలు అన్నాను. ఇంటికొచ్చిన తరవాత నాన్నకి ఫోన్ చేసి చెబితే తను అక్కడ ఇక్కడ నేను ఏడుస్తూ ఇద్దరం ధైర్యం చెప్పుకున్నాము. అమ్మ 2000 సంవత్సరం లో వచ్చి ఆర్నెల్లు వుండి వెళ్ళింది. మేమెప్పుడు వెళ్ళతామో తెలియక 2005 లో అమ్మా, నాన్న, మా మామగారిని ఇక్కడికి పిలిపించుకున్నాము. ఆర్నెల్లు వున్నారు. నన్ను చూస్తానో లేదో అని భయపడేవాడు 84 ఏళ్ళ నాన్న, నేనూ అదే అనుకునేదాన్ని నాకేదైనా అయితే కాని ఆ మాట నాన్నతో అనే దాన్ని కాదు. వచ్చి స్వయంగా అసలు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయారు నాన్న, మామగారు ముఖ్యంగా భొజనాల సమయంలో, 'దాని బాధ చూస్తుంటే నా కడుపు తరుక్కుపొతుంది భగవంతుడు దానికి ఇంత బాధనెందుకు ఇచ్చాడో?' అని కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాడు నాన్న.
 

పిల్లలు ఇక్కడ సాకర్(ఫుట్బాల్) అడుతుంటే చూడడానికి తీసుకెళ్ళాము. చాలా సంతోషించాడు. ఆ రోజు ఇంటికి వచ్చాక, 'ఇక్కడ మీకు వైధ్యానికి, పిల్లలకి అన్ని సౌకర్యంగా వున్నాయి. మనసు ధైర్యం చేసుకుని వుండండి. మీరు సంతోషంగా వుండడమే మాకు కావాలి మీరు ఎక్కడ వున్నా.' అన్నాడు. అదీ తల్లి తండ్రుల ప్రేమ అంటే. పిల్లలు ఎక్కడ వారికి ఇబ్బందులు లేకుండా వుండగలరో అక్కడే వుండమంటారు. దాన్నే నిస్వార్ధ ప్రేమ అంటారనుకుంటాను. వాళ్ళకి తెలుసు మేము ఇక్కడ వుంటే అన్ని ఏళ్ళు చూడకుండా వుండడం చాలా కష్టం కాని మా సంతోషం కోసం వారి బాధని పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ మా ప్రెండ్స్ వాళ్ళకి వీలయినప్పుడు వచ్చి మాకు ఏదన్న సాయం కావాలంటే చేసి వెళ్ళేవారు. వాళ్ళందరిని చూసి, 'అమ్మ నీకు 100 మంది పైన ఫ్రెండ్స్ వుంటారా?' అన్నాడు. నేను, 'ఎందుకలా అడుగుతున్నావు నాన్న?' అంటే, 'మనవాళ్ళు మనకి సాయం చేయడం వేరు, అమెరికన్స్ అందరూ నీతో ఎంత ప్రేమగా వున్నరో! నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందట! నీ మనసు మంచిది కాబట్టి నీకు మంచి స్నేహితుల్లున్నారు.' అన్నాడు. నాన్న నోటి నుండి నన్ను మెచ్చుకోవడం ఆహా, నా అనందానికి అంతే లేదు. అక్క ఎక్కువ ఏమి వాదించదని, నేను అన్నిటికి వాదిస్తానని నాకు కొంచెం చెడ్డ రెప్యుటేషన్ వుండేది, అది కాస్తా నాన్న మెచ్చుకోవడంతో పోయింది.

ఆర్నెల్లు సంతోషంగా వారితో అన్ని పండగలు, పుట్టినరోజులు చేసుకున్నాము, పిల్లలు ఇద్దరు తాతలతో, అమ్మమతో అనందంగా గడిపారు. కాకపోతే చలికాలంలో ఇంట్లోనే వుండాలంటే నాన్నకి చాలా విసుగొచ్చేది. నాకు ఆ ఙ్ఞాపకాలే చాలు జీవితాంతం గుర్తుండిపోవడానికి, ఇక్కడ వున్నన్నాళ్ళు నేను నాన్నని బాగా చూసుకున్నాను అనే తృప్తి నాకు మిగిలాయి.
ఎప్పుడు ఫోన్ చేసినా, 'అన్నం తింటున్నావామ్మా?'అని అడిగేవాడు ఒకోసారి కొద్దిగా అని చెప్పేదాన్ని, ఎప్పుడూ తినటం లేదని చెబితే బాధ పడ్తాడని అలా చెప్పేదాన్ని. వెంటనే, 'తింటున్నావామ్మ చాలా సంతోషం,' అనేవాడు. మేము '07 లో 9 ఏళ్ళ తరవాత ఇండియాకి ఒక నెల వెళ్ళొచ్చాము. పెద్ద గెస్ట్ హౌజ్ తీసుకుని వున్నాము అమ్మ, నాన్న, భద్రాచలం పిన్ని మాతోనే వున్నారు నెల రోజులు. అన్నేళ్ళ తరవాత వెళ్ళామేమో అందరూ బంధువులు, స్నేహితులు వచ్చి కలిసారు. తిరిగి వచ్చేప్పుడు, నాన్న 'మళ్ళీ ఎప్పుడొస్తారమ్మా?' అన్నాడు. 'ఈ సారి త్వరగానే 2 ఏళ్ళ తరవాత వస్తాం నాన్న? చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోతాయి నువ్వు ఎక్కువ బాధ పడకు నేను బాగానే వుంటాను.' అని చెప్పాను కాని నాకూ, పిల్లలకి దుఖం ఆగలేదు. స్ఫూర్తి, 'అమ్మ ఇక్కడే వుందామమ్మా?' అని ఏడుపు ఏయిర్ పోర్ట్ లోనే. చైతన్య కూడా, 'వెళ్ళాలనిపించడం లేదమ్మా?' అనడం బాధ గా.

ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు ఎప్రిల్ 24న స్కైప్ ద్వారా దాదాపు రెండు గంటలు మాట్లాడామేమో. నాన్నకి 89 ఏళ్ళ పుట్టినరోజు, వాళ్ళిద్దరి పెళ్ళి అయ్యి 60 ఏళ్ళు పూర్తయ్యాయి అట. అదే అఖరి పుట్టినరోజవుతుందని నేనస్సలు అనుకోలేదు. నేను డిసెంబర్ లో వస్తున్నాని అంటే అందరం కలిసి తిరుపతి వెళ్దమమ్మా అన్నాడు నేను తప్పకుండా నాన్న అని చెప్పాను. నేను డిసెంబర్ లో వెళ్ళినప్పుడు 60వ యానివర్సరి సర్ప్రైజింగ్ గా మొత్తం బంధువులు, స్నేహితులని పిలిచి సెలబ్రేట్ చేద్దామనుకున్నాము. అమ్మకి చెప్పాను కాని నాన్నని ఆశ్చర్యంలో ముంచెత్తాలని చెప్పలేదు. కొన్ని నెలలు ఆగితే అంతా కలిసే వాళ్ళం! కాని నాకు ప్రాప్తం లేదు అనుకోవాలి అంతే.
నేను కొంచం బరువు పెరిగాను నరాల ద్వారా ఇచ్చే న్యూట్రీషన్ తో త్వరగా పెరుగుతుంది బరువు. స్కైప్ లో నన్ను చూసి చాలా సంతోషించాడు, నేను పూర్తిగా కోలుకుంటానని మురిసిపోయాడు. నేనొస్తున్నానని అందరికీ చెబుతూ, రోజులు లెక్కపెడుతూ, గడ్డం పెంచుకుంటున్నాడు తిరుపతిలో మొక్కు తీర్చుకోవడానికి. మా అక్కయ్య కూతురికి పాప పుట్టినప్పుడు అక్కడే వున్నాడు, హాస్పిటల్ కి వెళ్ళి పాపని ఎత్తుకున్నాడు ఎంతో మురిపంగా. మారేడ్ పల్లిలో అపార్ట్మెంట్ లో వుంటున్నారు అమ్మ, నాన్న. ఇద్దరూ వొంట్లో శక్తి వున్నంతవరకూ ఎవ్వరికీ భారం కాకుడదనుకున్నారు అలాగే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండానే మధ్యహ్నం కునుకులోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు మా నాన్న, జులై, 16న . అమ్మ లేచి కాఫీ కలిపి స్వీట్స్ పట్టుకొచ్చి లేపుతుంటే ఎంతకీ లేవడం లేదని పక్కింటి అమ్మాయిని పిలిస్తే వచ్చి చూసి డాక్టర్ ని తీసుకొచ్చేవరకు అమ్మ నాన్నని రక రకలుగా పిలుస్తూ లేపడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరవాత విషయం చెప్పగానే షాక్లోకి వెళ్ళిపోయింది అమ్మ. చాలా సేపటికి గాని ఈ లోకం లోకి రాలేదు అమ్మ!
నాన్న పరిపూర్ణ జీవితాన్ని గడిపాడు.
నాన్న ఎవ్వరికీ ఏమి తక్కువ చేయలేదు,
మా నాన్న మంచితనం, ప్రేమాభిమానాలు కలిగి, తనకి వీలయినంతవరకు ఎవరికి సాయం కావాలన్నా కాదు, లేదు అనకుండా చేసాడు.

ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగితే చాలు. ఆయన తనకి ఎంత చేతనయిందో అంత పిల్లలకు దాచాడు కాని అది ఇద్దరి తదనంతరమే ఎవరికైనా. నాన్నకు ఎవ్వరు ఏమిచ్చారు? ఆయన తన జీవితాన్ని ఎంత చక్కగా తీర్చి దిద్దుకున్నాడు. ఆయన మాకు చదువులు చెప్పించాడు, పెళ్ళిళయ్యక కూడా ఏదైనా సాయం కావల్సి వస్తే చేసాడు! మా అత్తగారు పోయాకా మా మామగారు ఒక్కరే వుంటే కష్టమవుతుందని బాధ పడుతుంటే అప్పుడు అమ్మ, నాన్న ముందుకు వచ్చి మీరు ఏమి బెంగ పెట్టుకోకండి. మీరు వచ్చేవరకు మేము మీ ఇంట్లో వుండి అన్నీ చూసుకుంటాము ఆయన ఒంటరిగా వుండక్కరలేదు. అక్కడ మీ పనులన్నీ నిదానంగా చేసుకుని రండి అన్నారు, మేము కొన్ని నెలల్లో వచ్చేస్తున్నామనుకున్నాము!
మా అక్కయ పెళ్ళి అయినప్పుడు అల్లుడు కాస్త నిలదొక్కు కునేదాక వాళ్ళకి అండగా వున్నాడు. మా అన్నయ్యకి కూడా అలాగే చేసాడు.
ఆఖరి చూపు దక్కక తోబుట్టువులపై మనసు విరిగిపోయింది. నాన్న కి ఫోన్ చేసి స్ఫూర్తి నీకిష్టమైన హాకీ, సంగీతం, వయొలిన్ నేర్చుకుంటుంది అని చెప్పాలనిపిస్తుంది. డిసెంబర్ దగ్గరకొస్తుంటే బాధ ఇంకా ఎక్కువవుతుంది, ఇప్పటికి ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేవారము, నాన్న మా కోసం ఎదురు చూసేవాడు, ఇలా రోజు ఎదో ఒకటి గుర్తుకు రావడం మనసు కలత పడడం జరుగుతూనే వుంటుంది. దీపావళి కి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళితే అక్కడ పిల్లలు కాకరపూవొత్తులు కాలుస్తుంటే నాన్న తెనాలిలో అరచేతిలో చిచ్చుబుడ్డి వెలిగించాడు కాని అది సరిగ్గా లేక చేతిలో పేలింది. చెయ్యి కాలింది. ఇలా ప్రతి విషయంలో నాన్నే గుర్తొస్తున్నాడు!

మా నాన్న మంచితనం, ప్రేమాభిమానాలు, తనకి వీలయినంతవరకు ఎవరికి సాయం కావాలన్నా కాదు, లేదు అనకుండా చేసాడు,
నాన్నకి మెటిరియలిస్టిక్ వాటి మీద మోజు లేదు.
తన భాద్యతలను సక్రమంగా నిర్వర్తించాడు,
నాన్న ఎవ్వరికీ ఏమి తక్కువ చేయలేదు,
ఎవ్వరికీ అన్యాయం చేయలేదు,
నాన్న మనసులో కల్మషం లేదు, ప్రేమాభిమానాలు తప్ప. నాన్నకి కుట్రలు, కుతంత్రాలు తెలియవు.
జీవితం లో ఎంత డబ్బు, దస్కం సంపాదించాం - ఇవి కాదు ముఖ్యమైనవి. ఎంతమందికి సాయం చేయగలిగాము, ఎందరి హృదయాలల్లో మంచి స్థానం సంపాదించాం అన్నది ముఖ్యం.
నాన్న పోయాడని తెలియగానే ఆయనతో సాయం పొందిన వారు, ఆయన మంచి మనసు తెలిసినవారు అందరూ వచ్చి నివాళ్ళులర్పించుకున్నారు.
నాన్న పోయాడని చాలా బాధగా వున్నా నాకే ఈ విషయం లో చాయిసే వుంటే నాన్నని ఎప్పటికీ నా దగ్గరే వుంచుకునేదాన్ని. అది అసాధ్యమని నాకూ తెలుసూ.
నాన్నకి ఏ అనారోగ్యాలూ లేవు, ఏ జబ్బులతో బాధ పడలేదు, ఎంతో సునాయసంగా ఈ లోకాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోయారు.
అందరూ ఆయన మంచితనం, ఆయన చేసిన మంచి పనులవల్లే అంత సులువైన మృత్యువు వచ్చింది ఆయనకి అందుకు నువ్వు సంతోషించాలి అంటారు. నాన్నని వదులుకోవడానికి ఏ
సమయం లోనైనా నేను సిద్దంగా వుండేదాన్ని కాదేమో! అందుకే నాన్నకి అనాయస మృత్యువు వచ్చినందుకు సంతోషిస్తాను, ఆయన ఆత్మకి శాంతి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న్నాను l
నాన్న జీవితం మాకు, మా పిల్లలకే కాదు ఎంతమందికో తప్పకుండా ఆదర్శప్రాయమవుతుంది.
ఎవరేమన్నా సరే నాన్నా నువ్వు ఎప్పటికీ నా గుండెలోనే వుంటావు.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech