|
శ్రీ శ్రీ శ్రీ ఓబయ్యగారు
వాషింగ్టన్లో ఒక ఉన్నతోద్యోగి. వైట్ హౌసులో కీలకమైన పదవిలో
ఉన్నారు. దీపావళి పండుగ వస్తోంది కదా.
పండుగ సెలవులు ఎక్కడ గడుపుదామా అని ఆలోచిస్తుంటే అతని సతీమణి
మైసమ్మ వచ్చి
ఏమండీ ! మనం ఈ దీపావళికి భారత దేశానికి వెళ్దామండీ అంది గోముగా.
మనం భారత దేశానికి వెళ్లి చాలా కాలమైంది కదా. అక్కడి సాంప్రదాయాలూ
ఆచారాలూ అన్నీ మర్చిపోయుంటాం ఈపాటికి అన్నాడు ఓబయ్యగారు.
దానికేమండీ ! నేను ఇంటర్నెట్టులో ఓర్నాయనోయ్ గేమ్స్ డాట్ కామ్
లోంచి డౌన్లోడు చేసుకున్న గేమ్ ఉందిగా.
దాని ప్రకారమే అక్కడి వాళ్లతో తొక్కుడు బిళ్ల ఆట ఆడుకుంటా, అప్పుడు
వాళ్లతో సులభంగా కలిసిపోవచ్చు అంది మైసమ్మ.
శ్రీ ఓబయ్యగారు సెక్రటరీని పిలిపించి ఇదుగో సెక్రటరీ ! మన భారత దేశ
పర్యటనకి అన్ని ఏర్పాట్లూ చేయించు.
అక్కడ మనం ఉపయోగించే కార్లూ విమానాలూ కూడా ఇక్కడినించే
పట్టుకెళ్లాలి తెలిసిందా? మన ప్రయాణంలో ఒక వంద కేజీలు తొక్కుడు
బిళ్లలూ,
తొక్కుడు బిళ్ల ఆటకి గీతలు గీసుకోడానికి ఒక వంద కేజీలు చాక్ పీసులూ
కూడా సర్దించు.

పెద్ద కూతురు ఇంకా ఇంటికి రాలేదేం
చెప్మా అని తల్లి ఎదురు చూపులూ చెల్లి బెదురు చూపులూ చూడసాగేరు.
అప్పుడే వాళ్ల పెద్ద కూతురు సారిక ఆలస్యంగా ఇంటికి చేరుకునేసరికి,
తల్లి మైసమ్మ కూతుర్ని కోప్పడింది. నేను క్షవరం చేయించుకోడానికి
వెళ్లేనమ్మా!
క్షవరం అయ్యేకగానీ వివరం తెలియలేదు. నేను మాడ్రన్ హేర్ స్టైల్
డెజైన్ పెట్టమంటే వాడు చిప్ప కటింగ్ పెట్టేడు.
అయినా ప్రతిదానికీ ఎందుకమ్మా నన్ను కోఫ్ఫడతావూ? అంది సారిక.
కోప్పడకపోతే నీతో కోలాటం ఆడతాననుకున్నావా? అంది తల్లి.
అమ్మా! నాకు ఎ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం అలవాటు
అంది సారిక.
నాకు ఏ విషయమైనా బుర్ర బద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం అలవాటు అంది
తల్లి.
ఆ విధంగా ముందు చీవాట్లూ తర్వాత అన్నమూ తిని పడుకుంది సారిక.
చిన్న కూతురు సముద్ర వచ్చి ‘చూడమ్మా! అక్క నా స్పైడర్ మాన్
డ్రస్సు తీసేసుకుని ఇమ్మంటే ఇవ్వడంలేదు’ అంది.
‘పోనీలేవే ! ఈ స్పైడర్ మాన్ డ్రస్సులూ సూపర్ మాన్ డ్రస్సులూ
ఎప్పుడూ వేసుకునేవేగా? ఈ సారికి వెరైటీగా ఇంద, ఈ వాచ్ మాన్ డ్రస్సు
వేసుకో సరేనా?’ అని సముదాయించింది మైసమ్మ.
సారికా సముద్రా వాళ్ల స్నేహితురాళ్లు బిలబిలమంటూ ఇంట్లోకి
ప్రవేశించేరు. ఈ కుర్చీ నాదంటే ఈ కుర్చీ నాదని దెబ్బలాడుకోవడం
మొదలుపెట్టేరు. ‘పోనీ లెండర్రా! కుర్చీ కాకపోతే ఈ బెంచీ మీద
కూర్చోండి’ చెప్పింది మైసమ్మ. కొందరు తమకి ప్రత్యేకంగా మంత్రి
కుర్చీలు కావాలనీ, కొందరు తమకి ప్రత్యేకంగా హై కోర్టు బెంచీలు
కావాలనీ దెబ్బలాడుకుంటున్నట్టు కదమ్మా అంది సముద్ర.
అప్పుడు తల్లి మైసమ్మ సముద్ర వీపు మీద ఒక్క గుద్దు గుద్దింది.
దాంతో సారిక కూడా భయపడిపోయి దూరంగా టేబిలు దగ్గరకి జరిగి, తన తరగతి
వాచకం తీసుకుని వల్లించడం మొదలెట్టింది ఇలా.
‘బుద్ధి చెప్పు వాడు గుద్దితే నేమయా విశ్వదాభిరామ వినుర వేమ’.
ఇంకోసారి పెద్ద కూతురు సారిక కోపంతో రుసరుసలాడుతోంది మూతి మూడు
వంకర్లు తిప్పి. ‘అదేంటమ్మాయ్ ! మొహం అలా పెట్టేవ్?’ తల్లి.
‘నా మొహం నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. నీకేంటీ?’ కోపమంతా
ఎందుకంటే, ఎవడో కొంటె విద్యార్ధి అమ్మాయికి SMS పంపేడట. ఐ లవ్ యూ
అని. అమ్మాయి వెంటనే రిప్లయ్ పంపింది
ప్రిన్సిపాల్ తో చెప్తా అని. అబ్బాయి మళ్ళీ SMS పంపేడు ‘
ప్రిన్సిపాలుకి ఐ లవ్ యూ చెప్పి లాభంలేదు. ఆయనకి ఎప్పుడో
పెళ్లయిపోయిందిగా.’ అది చదువుకుని ఆగమన్నా ఆగకుండా పరుగు
పెట్టింది. అమ్మాయి కాదు. అమ్మాయి బీపీ.
మొత్తానికి ఓబయ్యా కుటుంబమూ ముంబైలో దిగి తాజ్ హోటల్లో బస చేసేరు.
వాళ్ల గదిలో వార్డ్ రోబ్ తెరిచి చూస్తే అక్కడ అన్నీ ఆండర్ సన్
బ్రాండు అండర్ వేరులూ తువాళ్లూ తగిలించి ఉన్నాయి. బాత్ రూములోకి
తొంగి చూస్తే అక్కడ కసబ్బు బ్రాండు సబ్బులు పెట్టి ఉన్నాయ్.
సరేననుకుంటూ రెస్టారంటుకి వెళ్లేరు టిఫిన్ తిందామని. అక్కడ మెనూలో
హెడ్లీ బ్రాండు ఇడ్లీలు ఉన్నాయ్.
తెల్లవారుతూనే దీపావళి అమావాస్య. ఓబయ్యగారు ఒక తారాజువ్వని
వెలిగించి విసిరేరు. అది తిన్నగా తూర్పు గోదావరి జిల్లా
సామర్లకోటలోని కొత్త విద్యుత్తు ప్రాజెక్టులో పడింది. ఆ ప్రాజెక్టు
వాళ్లు వెంటనే ఓబయ్యగారికి ఫాక్సు మెసేజి పంపేరు. ‘అయ్యా! మీరు
మామీద తారాజువ్వలతో దాడి చెయ్యకండి. మీ ఇష్ట ప్రకారమే ఇక్కడి
విద్యుత్ కేంద్రానికి కావలసిన గ్యాస్ టర్బైనులూ జేనరేటర్లూ మీ
కంపెనీ నించే కొంటాం, సరేనా’.
చిన్న కూతురు సముద్ర పాత బకాయిలతో సహా రోదించడం మొదలుపెట్టింది.
అమ్మా! ఈ ఏనుగు టపాసుకు తోకా తొండం లేవే, అంటూ. తల్లి ‘ఇంకా నయం
కాదూ. ఇదేం వీరప్పన్ బ్రాండు ఏనుగు టపాసు అనుకున్నావా? ఏనుగు
దంతాలూ ఏనుగు చెవులతో సహా ఇవ్వడానికీ’
శ్రీ ఓబయ్య బృందం శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని
సందర్శించడానికి వెళ్లేరు. సరిగ్గా అప్పుడే జల్ తుఫాను శ్రీ పొట్టి
శ్రీరాములు జిల్లా మీద విలయ తాండవం చేస్తూ విరుచుకు పడుతోంది.
అందరూ దగ్గర్లో ఉన్న తుఫాను పునరావాస కేంద్రానికి పరుగులు తీసేరు.
అక్కడ ఏ విధమైన రక్షణ సౌకర్యాలూ లేవు. వెంటనే శ్రీ ఓబయ్యగారు ఇలా
లెక్చరు ఇవ్వడం మొదలెట్టేరు.
చెప్పేవాడు ఆవులింతలతో చెప్తుంటే, వినేవాళ్లు గురక పెడుతూ
వింటున్నారు.
కాకులు కోకిల పాటని పేరడీ చేస్తున్నాయ్.
మీ దేశం టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందినా మీరు మా దేశాన్ని చూసి
నేర్చుకోవలసింది చాలా ఉంది.
అందుకే మీరు ప్రపంచ ఖ్యాతి చెందిన బిజినెస్ గురూ శ్రీ డేల్ కర్ణాజీ
గారి శిష్యుడైన ప్రముఖ బిజినెస్ మంత్రా గురూ ప్రహ్లాదుడు గారు
రాసిన ఈ గ్రంధాన్ని కొని చదవండి అంటూ ‘ఆరు నెలల్లో అంబానీ అవడం
ఎలా?’ అనే పుస్తకాన్ని పరిచయం చేసేరు.
ఇక అక్కణ్ణించి ఆగ్రాకి విమానంలో బయల్దేరేరు తాజ్మహల్ అందాలు
దర్శించడానికి. వాళ్లకి ఎస్కార్టుగా వచ్చిన జెట్ విమానాలు
ముందుకు దూసుకెళ్లిపోతున్నాయ్.
ఎందుకంటే వాటికి గాల్లో ఎగిరేటప్పుడు బ్రేకులు వేసుకునే సదుపాయం
లేదు. వెంటనే శ్రీ ఓబయ్య గారు మీ దేశపు జెట్ విమానాలు సాంకేతికంగా
వెనుకపడి ఉన్నాయ్. మీరు మా దేశం నించి ఒక ఇరవై జెట్ విమానాలు
దిగుమతి చేసుకోండి అని ప్రధాన మంత్రికి లేఖ పంపేరు ఎడం చేత్తో
సంతకం చేసి….
ఇక్కడితో కంచిపట్టు చీర కట్టి , కథ కంచికి పట్టుకెళ్లి .......
|
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|