కథా విహారం

అతివ అంతరంగ మథనానికి అద్భుత చిత్రణ - అబ్బూరి ఛాయాదేవి గారి కథలు
                                                                                                 - విహారి

 

మంచి కథ మనల్ని మరోలోకంలోకి తీసుకువెళ్తుంది. అది కావ్యలోకం.రమణీయం. కానీ అది మనకు తెలియని లోకం కాదు.
మన మానవలోకానికి వెలుగు నీడల ప్రతిరూపమే రంగస్థలం లాంటిది. అందులోని పాత్ర్తల్ని మనం పోల్చుకునీ, పోల్చుకోలేని స్థితిలో
ఉంటాం. ఆ కావ్యలోకంలోకి ప్రయాణించడం ఒక విలువైన అనుభవం. ఆ అనుభవం ఏదో హాయినీ, ఏదో ఆనందాన్నీ ఇస్తుంది అంటారు హితశ్రీ.

ఒక కథ చదివి అలాంటి ఆనందాన్ని పొందడం అనుభవైక వేద్యమైన సంఘటన. ఒక రచయిత రాసిన కథల్లో ఎక్కువ శాతం పఠితకి అలాంటి
ఆనందాన్ని అందిస్తే ఇక చెప్పేదేముంది. అదొక అదృష్టం. ఆ అదృష్టాన్ని అందుకున్న వారిలో నేనొకణ్ణి. ఆ రచయిత్రి అబ్బూరి చాయాదేవిగారు.

ఛాయాదేవి గారు సాహిత్య సంప్రదాయాల విజ్ఞత, సర్వమూ ఆకళించుకున్న స్థితప్రజ్ఞ మూర్తీభవించిన విధుషీమణిగా తెలుగు సాహితీ లోకానికి
సుపరిచితురాలు. ఏభై ఏళ్ళ క్రితమే ఆమె సంపాదకత్వంలో ‘కవిత’ అని రెండు సంచికలు వెలువడ్డాయి. అలాగే ‘మోడర్న్ ఇండియన్ పొయిట్రీ’ తీసుకువచ్చారు.
వరదస్మృతి రాస్తూ నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇచ్చి, నా చేత లైబ్రరీ సైన్స్ చదివించి, నేను ఉద్యోగంలో చేరేలాగా ప్రోత్స హించారు’
అన్నారు ఛాయాదేవిగారు. ఆ క్రెడిట్ అంతా ఆమె భర్త ప్రఖ్యాత సాహితీవేత్త వరదరాజేశ్వరరావు గారికిస్తూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డెప్యుటీ లైబ్రేరియన్ గా పనిచేశారామె.

ఛాయాదేవిగారి కథలు హిందీ, మరాఠీ, తమిళ, ఆంగ్ల స్పానిష్ భాషల్లో అనువదింపబడ్డాయి. వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక అవార్డు, సుశీలా
నారాయణరెడ్డి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు వంటి అనేక గౌరవ పురస్కారాలతో పాటు దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డ్ నీ
పొందారు.

ఛాయాదేవిగారు చాలా మంచి కథల్లో గొప్పకథ ‘సుఖాంతం’. రాతలో పదిపేజీల్లోపు కథ. అయితే, ఇంత చిన్న కథల్లోనే ఒక స్త్రీ పుట్టినప్పటి
నుంచీ గడిపిన తన జీవితాన్ని మొత్తం సమీక్ష చేసుకుంటుంది. గోపీచంద్ ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ అని కొన్ని సిరీస్ రాశారు. ఆ విధంగా ఈ కథలోనూ...

ఆమెకి ఈ రోజు నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోతే తిన్నది అరగదు. అరక్కపోతే మళ్ళీ అదేబాథ. దానికి మందుపుచ్చుకోవడం ఎలాగూ
తప్పదు. నిద్రమాత్ర పుచ్చుకుంది. అయినా నిద్రరావటం లేదు. నిద్ర వచ్చే సూచనలున్నా, నిద్రపోనీరు మనుషులు. భౌతికంగా ‘పోస్ట్ మాన్’ లాంటి వాళ్ళు మానసికంగా భర్త సహా సంతానం - మననధారలో.
నిద్ర పట్టే రోజుల్లో ఇంటిల్లిపాదీ తిన్నగా నిద్ర పొనిచ్చారు కాదు. ఆమె జీవితంలో ఏ ఒక్కరోజన్నా హాయిగా, మనసుకి తృప్తిగా నిద్రపోయింది లేదు. ఇవ్వాళా అంతే.

ఒక్కసారి హాయిగా ఒళ్ళు మరిచి నిద్రపోవాలని ఉంది. వెధవ కోడి కునుకులు నాకొద్దు. మనిషికి నిద్ర కావాలి. ఆ అనుభవాన్ని పుట్టినప్పటి నుండీ నేనెరుగను. ఇవాళ అలాంటి అనుభవాన్ని పొందితే? పొందగల్గితే? నిద్రకి మించిన సుఖం
ప్రపంచంలో మరేదీ లేదు. ఇంతవరకూ నాకు లభ్యం కాని సుఖం అదే. ఒక్కసారి తనివి తీరా నిద్రపోవాలి.

సీసాలో ఉన్న నిద్రమాత్రలన్నీ తీసుకుంది. కాగితం తీసుకుని పెన్సిల్ తో నాలుగు ముక్కలు ఒణుకుతున్న చేత్తో రాసింది.
‘ఏవండీ కంగారు పడకండి. నిద్రపోతున్నానంతే.ఆత్మహత్య చేసుకున్నానని అపార్ధం చేసుకోకండి. కేవలం నిద్ర కోసం నిద్రపోతున్నాను.
ఇదీ కథ!

కథ పేరు ‘సుఖాంతం’ పాఠకుడికి గుండె పట్టేసినట్టవుతుంది. సంసార లంపటంలో చిక్కుకున్న స్త్రీ నిజానికి ఎన్నివిధాల, ఎంతగా, ఎన్నెన్ని సుఖాల్ని త్యాగం చేస్తూ వున్నా, అసలైన దయనీయమైన త్యాగం ఈ నిద్ర కాదూ? అనే ఆలోచనలో పడతాడు చదువరి.
మనసుని కలచి వేస్తుంది ఆ స్త్రీ స్వగతం. కథలోని ఉత్తమ పురుషకథనం Narration లో ఉన్న రచయిత్రి వ్యక్తీకరణ శతబల వలన స్త్రీ ఆర్తీ, సంవేదనా, (నిజానికి వీటిని విశ్వనాథ వారి ‘జీవుని వేదన’ అనాలి)
చదువరుల బుర్రని గిరికీలు కొట్టిస్తాయి.

కథలో క్లుప్తతకి పట్టం కట్ట్ రచయితలంటే నాకు అమిత గౌరవం. వీరికి మాత్రమే కథ చెప్పడం చాతనవుననే ప్రగాఢ విశ్వాసం.
తెలుగులో సాగదీసిన చిన్న నవలలే కథలుగా ప్రచారం చేయబడినాయనే ధర్మాగ్రహం నాకు. బుచ్చిబాబు లాంటి రచయితలే కథలో ఈ గుణం ఆవశ్యకతని చెప్పారు కదా! ఇక్కడ మథురాంతకం వారిని ఉదహరించక తప్పదు.
ఆయనంటారు. కథకునికి జీవితాన్ని గురించి నగకు పొందిక ఎలాగైతే అవసరమో కథకు క్లుప్తత అలా అవసరం. కథలో కథకుడు ఒకే ఒక్క విషయాన్ని
ఘాటుగా, సూటిగా చెబుతాడు. ‘సుఖాంతం’ లో ఛాయాదేవి గారి కలం చూపిన బలం ఇదే! ఒక జీవన పార్శ్వాన్ని చూపుతూ, పారదర్శకమైన జీవితం పట్ల కొన్ని సత్యాల్ని దర్శింపచేయగలగాలి కథలో. ఈ కథ ఆ
గుణౌన్నత్యంలో మణిపూస. గుండెలో హోరు, రెప్పల క్రింది ఉప్పెన, అవ్యక్త ఘోష - ఇవన్నీ కథ చదువుతున్న పఠితకు అందుతూ ఉంటాయి.
కథని చదవటం పూర్తి చేసి ‘అనిర్వచనీయత’తో మోయలేని భారాన్ని గుండెకత్తకుంటాడు. కథా దర్పణంలో తన ప్రతిబింబం కూడా ఎక్కడున్నా ఉందేమోనని కళవళ పడుతూనైనా
ఆత్మపరిశీలనకి దిగుతాడు. ఇదే కథా ప్రయోజనం కదా మరి!

గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో! నీటిని మూటకట్టడం, ఎంత కష్టమో మనసులో వచ్చే మార్పుల్ని రికార్డు చేయడమున్నూ అంతకష్టమే!
లోకజ్ఞులు, ధీమంతులు, ప్రతిభావంతులు అయిన రచయితలు మాత్రమే ఆ పనిని సముచితంగా నిర్వర్తించగలరు’ అనీ మధురాంతకం గారే అన్నారు.
ఛాయాదేవిగారు అలాంతి రచయిత్రి. ‘సుఖాంతం’ కథ అలాంటి ‘మనసు’ని చిత్రించిన రచన. భౌతికమైన జీవితానుభవాల శకలాన్ని పేర్చుతూ,
గొప్ప కథలు రాయడం ఒక యెత్తు. మనిషి అంతరంగిక వ్యథకి కథాస్వరూపం ఇచ్చి అక్షరభాస్వరం చేయటం మరొక యెత్తు.

ఛాయాదేవి గారి గొప్ప కథలు ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’ బోన్ సాయి బ్రతుకు’ ‘ఉడ్ రోజ్’ వంటి కథలకు చాలామంది విశ్లేషకులూ, విమర్శకులూ
విపులమైన, విశేషమైన ప్రశంసల్ని అందించే ఉన్నారు. కానీ, ఛాయాదేవి గారి ‘సుఖాంతం’ ‘తన మార్గం’ వంతి కథలు - స్త్గ్రీ గుండె అరల్లోని లో వెలుగు
- నీడల్ని అపూర్వమైన భావోద్విగ్నతతోబ్నూ, అద్భుతమైన సాహిత్య సంయమనంతనూ చిత్రించిన కథలు. అందునా మళ్ళీ ‘సుఖాంతం’ కే ప్రథమ తాంబూలం.
స్త్రీలు తమని తాము తెలుసుకోవడానికీ, పురుషులు స్త్రీలని అర్ధం చేసుకోవడానికీ విధిగా చదవలసిన కథ - ‘సుఖాంతం’.

మనిషి జీవిక, మనుగడ కల్పిస్తున్న ఈనాటి సంక్లిష్ట సమాజ సమస్యల్ని గురించీ, బాధల్ని గురించి, వ్యక్తిని పీల్చిపిప్పి చేస్తున్న బతుకు పాళ్ళ చక్ర్పు
వాడి మొనల్ని గురించీ - సహస్రాధికంగా కథలు వస్తున్నాయి. రావాలి. వాటి ఇతివృత్తాల ఆవశ్యకత వాటికి ఉంది. అయితే ‘సుఖాంతం’ వంటి కథానికల్ని మరుగుపరుచుకోకూడదు. విశ్వ సాహిత్య స్థాయి కలిగిన కొన్ని గొప్ప తెలుగు కథల్ని ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఛాయాదేవిగారి ‘సుఖాంతం’
ని తప్పకుండా ప్రథమ శ్రేణిలో నిలుపుకోవలసిందే! నిక్కమైన తెలుగు కథానీలంగా దాని ఘనస్త దానిదే. ఎందువలన? స్త్రీ చిత్తమే ఇతివృత్తం. కథానాయికి స్వగతమే కథన శిల్పం.
అతి చిన్న కథలో ఒక స్త్రీ అనంత జీవిత విస్తృతిని చిత్రించగలగటమూ, చిత్రించి భావస్ఫోరకమైన శీర్షికగా ‘సుఖాంతం’ అనటమూ ఛాయాదేవిగారు ఛేసిన గడుసు పని!
క్షమించాలి! ‘కాలమ్’ పరిమితి వలన ఛాయాదేవి గారి సాహిత్య విశ్వరూపంలోని ఒక చిన్న కథని మాత్రమే పరిచయం చేయగలిగాను! ‘సుఖాంతం’ చదవండి!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech