బహుమతి

                                                      - తమిరిశ జానకి

 

నా బంగారు కొండ..చిన్నారి కృష్ణుడు..మురిసిపోతూ అమ్మ తమ్ముడిని ముద్దు చేస్తుంటే సంతోషంగా అటే చూస్తున్నాడు రంగడు అన్నం తింటూ.

అమ్మా! తమ్ముడు బావుంటాడు కదమ్మా.. అడిగాడు ఓ నిమిషం పోయాక. తమ్ముడంటే వాడికీ ముద్దే.
ఎందుకు బాగుండదూ.. నా చిన్ని కృష్ణుడు వీడు..బంగారం..అయ్యో అదేమిట్రా సరిగ్గా కలుపుకోలేదన్నం..నేను కలుపుతానుండు’ అంటూనే బుజ్జిగాడిని చాపమీద కూచో పెట్టొచ్చి అన్నం మెత్తగా కలిపింది.

అమ్మ కలిపితే ఎంతో రుచిగా అనిపించింది రంగడికి. ప్రతి రోజూ అంతే. అమ్మ చేత కలిపించుకుని తినడం వాడికిష్టం.

అడగకుండానే కలిపెడ్తుందమ్మ.
అమ్మంటే ఆకాశమంత ఇష్టం వాడికి.
తమ్ముడంటే మరీ మరీ ఇష్టం.

* * *
స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు దోవలో గోపీ చెప్పిన సమాచారం చాలా కుతూహలం కలిగించింది రంగడికి.
మా ఇంటి పక్కన మహిళా సంఘం ఉంది కదా. అందులో రేపు బేబీ షో జరుగుతుందిట.
అంటే..? వెంటనే అడిగాడు.
రెండు సంవత్సరాలు గానీ అంతకంటే తక్కువ వయసు గానీ ఉన్న పిల్లల్ని తీసికెళ్తే చూడటానికి బావున్న పిల్లలకి బహుమతులిస్తారట.
నిజంగానా? కళ్ళింత చేసుకుని మరీ అడిగాడు ఆశ్చర్యంగా.
నిజంగానే..!
రంగడి చిన్నారి మనసు ఏవేవో ఊహల్లో తేలిపోతోంది అప్పుడే.
తమ్ముడిని తీసుకెళ్తే,
కానీ అమ్మ ఒప్పుకోవద్దూ?
మనలాంటి వాళ్ళక్కాదురా అవన్నీ.. గొప్ప గొప్ప వాళ్ళ కోసం అంటుందేమో!
గొప్పేవిటి, బీదేవిటీ దీనికి?
తమ్ముడు తనకెంత ముద్దొస్తాడు?
చిన్ని కృష్ణుడు..బంగారు తండ్రి అంటూ అమ్మ కూడా రోజుకెన్నిసార్లో అంటుంది.
ఔను. తప్పకుండా తమ్ముడిని తీసుకెళ్ళాలి.
బహుమతీ వొస్తుంది తమ్ముడికి. కానీ ఎలాగైనా అమ్మవొద్దనే అంటుందేమో!
పోన్లే! ఆ పోటీకి తీసుకెళ్తున్నట్టుగా అమ్మకి చెప్పకూడదంతే.. ఇంటికొచ్చాక బహుమతి చూపించాలి. అప్పుడెంత సంతోషపడుతుందమ్మా..చాలా మంచి పని చేశావురా... అని మెచ్చుకుంటుంది కూడా. ఈ ఆలోచనలతో ఒక నిర్ణయానికొచ్చేశాడు రంగడు.

* * *
అయ్యా! బాబుకన్నం పెట్టేసెయ్యి. తీసికెళ్ళూ’ చంద్రావతి పిలుపుతో అయా లోపల్నించి పరుగెత్తుకొచ్చింది.
అయా దగ్గరకెళ్ళనని మారాం చేస్తూ అమ్మనే అన్నం పెట్టమని చీర పట్టుకు లాగుతున్నాడు బాబు.
ఒళ్ళు మండింది చంద్రావతికి.
కోపంతో ఒక్కటేసింది బాబుని.
దాంతో వాడి ఏడుపు మరింత ఎక్కువైంది.
పోన్లే.. నువ్వు పెట్టరాదూ పాపం.. అసలెలాగో రోజూ ఆయా పెడితే సరిగ్గా తినటం లేదువాడు. నువ్వు పెడితే సరిగ్గా తింటాడేమో చూడరాదూ!
భర్త మాటలకి మరింత చిరాకుపడింది చంద్రావతి.
నాకు టైమెక్కడుంది చెప్పండి. వాడికి అన్నం పెట్టడం ఒక నిమిషంలో అయ్యే పని కాదు.
కబుర్లు చెప్తూ నెమ్మదిగా తినిపించాలి.
అంత తీరుబడి నాకు లేదు. సాయంత్రం మా మహిళా సంఘంలో ‘బేబీ షో’ ఉందని చెప్పాను కదా. దానికి మనబాబుని తీసుకెళ్తాను. తప్పకుండా బహుమతి రావాలి వాడికి. అప్పుడే నాకు గర్వంగా ఉంటుంది మిగిలిన వాళ్ళముందు.
అయితే సాయంత్రం అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు వీడికి అన్నం పెట్టడానికి సంబంధం ఏముంది చెప్పు?
ఎందుకు లేదూ? నాల్గింటికల్లా వాడిని తయారుచేసి నేను తయారై వెళ్ళాలి. కొత్త రకం హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నాను. అదిప్పుడొకసారి వేసి చూసుకోవాలి. ఏ చీర కట్టుకెళ్ళాలో సెలక్టు చేసి పెట్టుకోవాలి. దానికి సంబంధించిన మ్యాచింగులన్నీ రెడీగా ఉన్నాయో లేదో చూసుకోవాలి...అబ్బో! చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి నాకు..తీరుబడిగా వాడికి తినిపించడానికి కుదరదు నాకు..నిక్కచ్చిగా చెప్పేసింది చంద్రావతి.

* * *
అమ్మా! సాయంత్రం కాసేపు గోపీ వాళ్ళింటికెళ్తానమ్మా.. మెల్లిగా అడిగాడు రంగడు.
అలాగే, వెళ్దువుగానీలే..
తమ్ముడిని కూడా నాతో తీసుకెళ్తానమ్మా
వాడెందుకురా?
తమ్ముడిని షికారు తీసుకెళ్లడం నాకిష్టం. తీసుకెళ్తానమ్మా.. బతిమాలుతున్నట్టుగా అమ్మ చెయ్యి పుచ్చుకున్నాడు.
తమ్ముడంటే నీకెంత ప్రేమరా.. కానీ నువ్వు ఆటల ధ్యాసలో పడిపోతే వాడినెవరు చూస్తారు? అటూ ఇటూ వెళ్ళిపోడూ?
అహ...నేనాడను. తమ్ముడిని నాపక్కనే కూచో బెట్టుకుని నేనూ కూచునే ఉంటాను. నేను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా.
సరే..జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలి.
అమ్మ అనుమతి దొరకడంతో కొండెక్కినంత సంబరమైంది రంగడికి.
గోడవారగా ఉన్న రేకు పెట్టి తెరిచాడు.
తమ్ముడికున్న నాలుగు జతల బట్టల్లోంచీ గులాబీ రంగు చొక్కా నీలిరంగు లాగూ బయటకి తీశాడు.
అమ్మా ఈ బట్టలు వెయ్యమ్మా సాయంత్రం తమ్ముడికి. ఇవి బావున్నాయి కదూ?
ఇప్పట్నించే హడావడిపడిపోతున్నావే?
చెప్పమ్మా? ఈ బట్టలు బాగున్నాయి కదా.. వాడి ఆరాటం వాడిది..
బావున్నాయి లేరా?
తమ్ముడుకీ బట్టలు తొడిగితే ఇంకా ముద్దొస్తాడు. ఈ గులాబి రంగు చొక్కా ఎంత బావుందో!
రంగడి చిన్నారి మనసు సంబరపడిపోయింది.
తమ్ముడి నెత్తుకుని మహిళా సంఘం ఆవరణలో అడుగు పెట్టాడు రంగడు.
ఒక్క నిమిషం తడబడ్డాడు అక్కడంత మందిని చూసి.
అంతా ఆడవాళ్ళే...చిన్న పిల్లలూ ఉన్నారు.
రంగు రంగుల చీరలూ..
రకరకాల చీరలూ..
రకరకాల అలంకరణలూ..
కొందరు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.
కొందరు ఇక్కడా అక్కడా గుంపులుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఎత్తుకున్న తల్లులు కొందరు ఓ పక్కగా నిలబడి ఉన్నారు.
ఏయ్! ఎవరబ్బాయ్ నువ్వు? ఎవరు కావాలి?
గదమాయించిందొకావిడ రంగడిని.
భయం భయంగా చూశాడు.
కొండలా ఇంతెత్తు ముడి తలమీద..ఇంత లావు పెద్ద పెద్ద పూసల దండ, మెళ్ళో వాటినే చూస్తున్నాడు రంగడు.
ఏయ్! నిన్నే..ఎవరు కావాలంటే మాట్లాడవేం?
ఎవరూ అక్కర్లేదండీ.. ఇక్కడ ఏదో పోటీ ఉందిట కదండీ..బావున్న పిల్లలకి బహుమతులిస్తారట...
ఔను చూడటానికొచ్చావా?
చూడటానికి కాదండీ!.. మా తమ్ముడుని పోటీకి తీసుకొచ్చానండీ..తమ్ముడు వంక చూసుకున్నాడు ప్రేమగా.
ఒక్కక్షణం తెల్లబోయిందావిడ.
మరుక్షణం నోతికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వడం మొదలుపెట్టింది.
అలా నవ్వుతూనే..పక్కన గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్న ఓ పది మంది దగ్గర కెళ్ళి ఏదో చెప్పింది. వాళ్ళంతా బిలబిల్లాడుతూ వొచ్చి రంగడి చుట్టూ మూగారు. వాళ్ళకి నవ్వాగట్లేదు.
రంగడినీ వాడి తమ్ముడినీ వింత జంతువుల్ని చూసినట్టు చూస్తూ వాళ్ళలో వాళ్ళు గుసగుసలు చెప్పుకున్నట్లు మాట్లాడుకుంటూ తెగ నవ్వేసుకుంటున్నారు.
రంగడి చిన్నారి మనసు విలవిల్లాడింది.
అమ్మకీ తనకీ ఎంతో ముద్దొస్తాడు తమ్ముడు.
వీళ్ళకి ముద్దు రావట్లేదా?
ఎందుకలా నవ్వుతారు?
ఇంక ఒక్క క్షణం అక్కడ నిలబడాలనిపించలేదు వాడికి.
ఆ గుంపులోంచి బయటపడ్డాడు.
కాకిపిల్ల కాకికి ముద్దు.. వెనకనించి ఒకావిడ ఆ మాట అనడం. తక్కిన వాళ్ళంతా పగలబడి నవ్వడం వినిపించింది వాదికి. వెంటనే తమ్ముడి వంక చూశాడు. అమాయకంగా నవ్వులు చిందిస్తున్నాడు వాడు.
నీకేదన్నా బహుమతి వొస్తుందేమోనని తీసుకొచ్చానురా నిన్నిక్క డికి..కానీ మనం..ఇప్పుడింటికెళ్ళిపోతున్నాం.
వాడినవ్వు చూస్తుంటే మరీ ముద్దొచ్చింది రంగడికి.
బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు ఎంతో ప్రేమగా.
అంతకంటే విలువైన గొప్ప బహుమతి ఇంకేం కావాలి ఆ తమ్ముడుకి.
* * *

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech