ప్రతిఫలం

                                                            - కుంతి

  ఏమిటో ఈ జనాలు? ప్రతి పండక్కి ఇంతలా షాపింగ్ లు చేస్తుంటారు. ఇంతలా డబ్బులు ఎక్కడివో? అనుకుంటూ అంతకు ముందు కస్టమర్లు సెలెక్ట్ చేసుకున్న చీరల తాలూకు బిల్లు చేయించి, వాటిని ప్యాకింగ్ సెక్షన్ కి పంపిస్తూ అనుకున్నది సేల్స్ వుమెన్ రాజేశ్వరి. సెక్షన్ లో ఒక్కొక్కరూ లంచ్ కు వెళుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా లంచ్ అవర్ ఉండదు. వీలు చూసుకుని భోంచేసి వచ్చేయడమే. రాజేశ్వరి కొద్ది దూరములో క్యాష్ కౌంటర్ దగ్గర ఏకాగ్రతగా పని చేసుకుంటున్న భర్త సాయి వైపు చూసింది. కాసేపటికి అతడు చూశాడు. నాకు పనుంది. నీవు వెళ్ళి భోం చేయి అన్నట్టుగా సైగ చేశాడు. రష్ కూడా పలచబడింది. లంచ్ కై పక్కన ఉన్న గదిలోకి వెళ్ళింది.

 

సాయి, రాజేశ్వరి తో ఒక పుష్కరం క్రితం మహానగరానికి వచ్చాడు. అతి కష్టం మీద ఈ మాల్ లో చిరుద్యోగం సంపాదించాడు. నిజాయితీగా కష్టపడి క్యాషియర్ అయ్యాడు. తన ఒక్కడి సంపాదనతొ ఇల్లు గడవక పోవడంతో ఎన్నో రోజులుగా బతిమాలగా మాల్ ఓనర్ దినేష్ భాయి, రాజేశ్వరికి ఈ మధ్యనే సేల్స్ ఉమెన్ గా ఉద్యోగం ఇచ్చాడు. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళుగా తనకు, తన భార్య జీతం తోడుగా ఉంటుందని సంతోషించాడు సాయి. పూర్తిగా జనాలు పలుచబడటంతో మరొకతనికి క్యాష్ కౌంటర్ అప్పజెప్పి తానూ లంచ్ కు వెళ్ళాడు సాయి.

రాజేశ్వరి లంచ్ ముగించుకుని వచ్చింది. ఇంతలో షాప్ ఓనర్ దినేష్ భాయి ఎదురుపడ్డాడు. నమస్తే సార్! అంది రాజేశ్వరి. అతడు తలాడిస్తూ ముందుకు పోయాడు. సారీ సెక్షన్ ఖాళీగా ఉంది. తనతోపాటు పనిచేసే శమిమ్ కూడా భోజనానికి వెళ్ళినట్లుంది.

పిల్లవాడి ఆరోగ్యం బాగాలేదు. పర్మిషన్ అడిగితే ఏమంటాడో? అనుకుంటూ ముందుకు నడిచింది. తన సెక్షన్ లో నున్న టేబుల్ కు ఆనుకుని ఉన్న కుర్చీల దగ్గర కూర్చోబోతుండగా కాలికి ఏదో తగిలినట్టు అనిపించి, అటుకేసి చూసింది రాజేశ్వరి. నోట్లకట్ట. కళ్ళకు అద్దుకుని చూసింది. పదివేల కట్ట. చుట్టూ చూసింది. ఎవరూలేరు. ఎవరూ చూడలేదు. అంత డబ్బు చూడగానే సంతోషం, భయం వేసింది. ‘పాపం ఎవరు పారేసుకున్నారో’ తెలుసుకుని ఎంత కంగారు పడుతున్నారో? అనుకుంది. ఎవరిదయి ఉండవచ్చు. అంటూ ఆలోచించసాగింది. ఉదయం నుండి దాదాపు వంద మంది కన్నా ఎక్కువే ఈ కౌంటర్ కి వచ్చారు. వాళ్ళలో ఎవరిదైనా అయి ఉండవచ్చు. ఇక్కడ పనిచేసే వాళ్ళది మాత్రం అయ్యే అవకాశం లేదనుకుంది. ఏమి చేయాలి? అనుకుంటుంటుండగా శమిమ్ వచ్చింది. దాచకుండా డబ్బు దొరికిన విధం చెప్పింది. ఓనర్ వచ్చాడన్నావు. ఆయనది అయి ఉంటుందేమో! అన్నది శమీమ్. ఆయన ఇక్కడిదాకా రాలేదు. బిల్లింగ్ సెక్షన్ కు వచ్చి, అటు నుండి అటే వెళ్ళాడు అన్నది రాజేశ్వరి. పండక్కి డబ్బులు చేతిలో పడ్డాయి. ఎంజాయ్ చెయ్యి. మీ ఇంట్లో కలర్ టీవీ లేదన్నావుగా. కొనుక్కో. నీవు దొంగతనం చేయలేదుగా. సలహా ఇచ్చింది శమీమ్.

ఇట్లా వచ్చే డబ్బు నాకొద్దు. మనది కానిది మనకెప్పుడూ ఆనందాన్నీయదు. అయినా శ్రమలో ఉన్న ఆనందం, నిజాయితీగా బ్రతకడంలో ఉన్న గౌరవం దేనిలో ఉంది చెప్పు అన్నది.

నీకంటే ముందు ఇదే సెక్షన్ లో మున్నాలాల్ పనిచేసేవాడు. మన ఓనర్ కు చుట్టం కూడా. ఆయనకు ఒకసారి వెయ్యి రూపాయలు దొరికాయి. ఓనర్ కు అప్పజెప్పాడు. ఆయన నిజాయితీకి మెచ్చి ప్రతిఫలంగా 500 ఇంక్రిమెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బొంబాయిలో ఇంకేదో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడు. అని చెప్పింది శమీమ్.

ఇది నా డబ్బు కాదు. ఓనర్ కు అప్పచెబితే సరిపోతుంది. ఎవరైనా వచ్చి అడిగితే ఓనర్ కు ఇచ్చేసాను అని చెప్పవచ్చు. ఇక శమిమ్ చెప్పినట్టుగా,ఈ సంఘటనతో సంతోషించి ఓనర్ తనకూ కొంత ఇంక్రిమెంట్ ఇస్తే అది మంచిదే. ఇది కూడా నిజాయితీకి విలువ కట్టడం వంటిదే. అది తనకు ఇష్టము లేనిదే అయినప్పటికీ, బడుగు సంసారాన్ని ఈదడంలో కొంత సహాయంగా ఉంటుంది. కాబట్టి అలా జరిగితే జరుగనీ, అనుకుంటూ సరాసరి ఓనర్ దగ్గరకెళ్ళింది. ఆ డబ్బులు అతడి చేతికిచ్చింది. నాకు డబ్బు దొరికింది. ఎవరో పోగొట్టుకున్నారు. కష్టమర్లవో, ఎవరివో నాకైతే తెలియదు. అన్నది. ఆయన రాజేశ్వరి వైపు అభావంగా చూశాడు. ఏ ప్రశ్నలు వేయకుండా డబ్బులు జేబులో పెట్టుకున్నారు. రాజేశ్వరి అక్కడి నుండి నిశ్శబ్దంగా వచ్చేసింది.

మళ్ళీ మాల్ లో రద్దీ పెరిగింది.అదే రోజు జీతాలు. ఓనర్ ఒక్కొక్కరినే పిలిచి జీతలు ఇవ్వసాగాడు. రాజేశ్వరి వంతు వచ్చింది. ఓనర్ రాజేశ్వరి సెలవు పెట్టిన రోజులకు జీతం కోసి, మిగిలిన డబ్బులు చేతిలో పెట్టాడు. రాజేశ్వరి బాబు ఆరోగ్యం బాగాలేదు. పక్క వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చాను. త్వరగా వెళతాను. అని అనుమతి పూర్వకంగా అడగగానే వెళ్ళు అన్నట్టుగా చూశాడు.

ఓనర్ ఏదైనా పిలిచి చెబుతాడేమోనని సహజమైన, మధ్యతరగతి మనస్త్తత్వంతో, కొత్తగా మదిలో మెరిసిన ఆశలో ఎదురు చూసింది. అతడు ఏమీ మాట్లాడలేదు. వెళుతున్నాను. అన్నట్లుగా సంజ్ఞ చేస్తూ ఇంటికి వెళ్ళింది.

రాత్రి పది గంటలయ్యింది. సాయి మాల్ నుండి ఇంటికి వచ్చాడు. సీరియస్ గా ఉన్నాడు. కాళ్ళు కడుక్కుని కిచెన్ లోకి వచ్చాడు. ఆమె పెట్టింది మౌనంగా తిన్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద నడుం వాల్చాడు. సాయి అలా ఉండటం చూసి రాజేశ్వరి కలత చెందింది. జీతాలు వచ్చిన రోజు తన భర్త ఎంతో ఆనందంగా ఉంటాడు. ప్రతి ఫస్ట్ తారీఖు నాడు పిల్లలకి స్వీట్లు పట్టుకొస్తాడు. పిల్లాడి పని, ఇంటి పని త్వరత్వరగా ముగించుకొని భర్త దగ్గరకి వచ్చింది. అతడిపై ఆప్యాయంగా చేయివేసి, ఏమిటీ, అదోలా ఉన్నారు అంది.

ఈ రోజు క్యాష్ సెటిల్ చేస్తుండగా అందులోనుండి ఐదువేల రూపాయలు తగ్గింది. దానితో ఓనర్ బాగా కోపించాడు. పనిలో ఇంత అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరాదన్నాడు. నా నిజాయితీని కూడా శంకించాడు. రేపటి నుండి పనిలోకి రావద్దన్నాడు. పేద వాడిని కనికరించండి. తప్పైపోయింది. జాలిచూపండి. అని బతిమాలితే చివరకు ఎలాగో ఒప్పుకున్నాడు. కానీ..ఆ...కానీ...
ఐదు వేల రూపాయలు క్యాష్ లో తగ్గినందుకు పనిష్మెంట్ గా నెల జీతంలో నుండి ఐదువందలు రూపాయలు కోతవేసాడు. ఈ నెల నుండి నాకు ఐదు వందల రూపాయలు తక్కువగా వస్తాయి. అంటూ బాధగా కళ్ళుమూసుకున్నాడు.

తన నిజాయితీకి ప్రతిఫలంగా ఒక ఐదువందలు రూపాయల ఇంక్రిమెంట్ వస్తే, ఇంట్లో ఖర్చులకు వెసులుగా ఉంటుందని ఆశించిన రాజేశ్వరికి, ఎదురు చూడని ప్రతిఫలం ఎదురు కావడంతో భర్త చెప్పిన మాటతో నొటమాట రాలేదు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech