ఈ విషయములను ఆలోచించినపుడు ఆ
పద్ధతిని తెలుసుకోవాలన్న కుతూహలము పెరుగుతుంది. ఇటుంవటి
విషయములన్నీ రాశులమీద మరియు వాని విభిన్న స్వరూపములమీదనే ఆధారపడి
ఉంటాయి. ఆ వివరములను లోతుగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాము.
మేషము మేక. వృషభము ఎద్దు.
మిధునము వీణను బట్టిన స్త్రీ మరియు గదను ధరించిన పురుషుని జంట.
కర్కాటకము ఎండ్రకాయ. సింహము సింహమే. ఒక కన్య ఒక చేతిలో ధాన్యమును
మరియు మరియొక చేతిలో నిప్పును పట్టుకున్న స్వరూపము కన్యా రాశిది.
త్రాసును చేతితో పట్టుకున్న మనిషి తుల. మనిషి శిరస్సు మరియు
గుఱ్ఱపు మొండెము కలిగిన ఆకారము ధనూరాశిది. లేడి శిరస్సుతో ఉన్న
ముసలి మకరము. ఘటాధారి కుంభము. ఒకదానికొకటి తోక మరియు ముఖము
కలిసిఉన్న రెండు చేపల ఆకారము మీన రాశిది.
పై ఆకారములకు ఆధారములు చాలా
రకములుగ ఉన్నవి. ఆకాశములో ఆ తారాసముదాయముల సమకూర్పు అలా ఉన్నదన్నది
ఒక ఆధారము. అందు వర్ణింపబడిన పరిస్థితులకు అనుకూలమైన స్వభావము
వానికున్నదన్నది రెండవ ఆధారము. ఆకాశఘటనలకు ప్రతిబింబమే భూమిపైని
ఘటనలన్నది మూడవ ఆధారము. అన్నింటినీ మించి కర్మ ఫలితాని బట్టి
మనిషికి వచ్చే స్వరూపస్వభావముల ప్రతిబింబమే మహర్షుల వచననమునకు
ఆధారమన్నది నిర్వివాదాంశము.
దీని సత్యాసత్యములు
అన్వేషణాధారములయితే అనుభవాధారములు వాని పరిశీలనే. జాతకాదులయందు ఆ
యా రాశుల స్థితి, విభిన్న భావములయందు వాని కూర్పు ఆధారముగ వాని
విశ్లేషణ జాతకునిపై మనకు పట్టును కలిగిస్తాయన్నది అనుభవము ద్వారా
తెలిసే సత్యము.
ఇది ఎవరికైనా కలిగే
అనుమానమే. ఒకరాశికి సంబంధించిన లక్షణములు జాతకునిలో రావాలంటే ఆ
రాశి ముఖ్యమైన స్థానములో ఉండాలి మరియు బలమైనదై ఉండాలి.
బలము చాలా
రకములుగ ఉంటుంది. అన్నింటి కలయికతో దేని బలము అధికముగా ఉండునో
గ్రహించాలి. మేషాది నాలుగు రాశులు, ధనూరాశి మరియు కర్కరాశి
రాత్రియంబు బలమును కలిగియుండే రాశులు. అనగ రాత్రి జన్మించిన
జాతకులకు ఈ రాశులు బలముగా ఉండునని అర్థము. వీనిలో మిధునము తప్ప
మిగిలిన రాశులను పృష్ఠోదయ రాశులంటారు. సింహము, వృశ్చికము, కన్య,
తుల, కుంభము మరియు మీనరాశులు పగటికాలముయందు బలమును కలిగిన రాశులు.
వీనిలో మీనము ఉభయోదయ రాశి. మిగిలిన వాటిని శీర్షోదయరాశులంటారు.
ఇది
ఒకరకమైన బలము మాత్రమే. పరిస్థితులను బట్టి ఆ యా స్థానములందు
మిగిలిన విధానములను చర్చిద్దాము.
రాశి చక్రము 60 ఘడియలు లేక
24 గంటలలో ఒక భ్రమణము పూర్తి చేస్తుంది. అది తూర్పునుండి పడమరకు
తిరుగుతుంది. మనము ఏ సమయానికి లగ్నమును కట్టాలనుకుంటున్నామో లేక
మనకు కావలసిన సమయము ఏదైతే ఉన్నదో ఆ సమయములో ఆ రాశిచక్రముయొక్క ఏ
భాగమయితే తూర్పున క్షితిజమును తాకుతుందో ఆ భాగమునే లగ్నమంటారు. ఇది
జాతకచక్రము మొత్తములో ప్రధాన భూమికను నిర్వర్తిస్తుంది. అనగ
లగ్నస్థానములో ఉన్న రాశికి ప్రాధాన్యత పెరుగుతుంది.
దానికి ఎదురుగ 180 డిగ్రీలు
లేక అంశల దూరములో ఉన్న భాగము అదే సమయములో క్షితిజము కిందకు
వెల్లడానికి సిద్ధముగా ఉంటుంది. దానినే అస్తమరాశి, అస్తలగ్నము
అంటారు. ఇదే భాగమునుండి మనము భార్య మరియు భర్త గురించిన విషయములను
చర్చిస్తాము.
ఇక మిగిలిన భావముల గణన
లగ్నమునుండే ప్రారంభమవుతుంది. అనగ లగ్నస్థానములో ఉన్న రాశిని బట్టి
మిగిలిన వాటికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఒకే రాశి ఒక వ్యక్తికి
చాలా ముఖ్యమైనదైతే రెండవవానికి ప్రాధాన్యత లేనిది అవ్వచ్చు.
అందువలనే వాని స్థానము కూడ ప్రభావమును చూపుతుంది అన్నది
సత్యమన్నమాట.
ఇదే విధముగ లగ్నమునుండి
ప్రత్యేక స్థానములో ఉన్న రాశులు వాని ప్రాధాన్యతను ఈ విధముగ కలిగి
ఉంటాయి.
కేంద్రములు
ఏ
సమయానికైతే మనము లగ్నమును సాధిస్తున్నామో ఆ సమయములో నాలుగు
ముఖ్యదిశలను సూచించేవి కేంద్రస్థానములు. అవి ఒకదానినుండి ఒకటి 90
అంశల దూరములో ఉంటాయి. వానిలో తూర్పున లగ్నము, పశ్చిమమున సప్తమము,
ఊర్ధ్వమున దశమము, క్రిందిభాగమున చతుర్థము ఉంటాయి. ఈ నాలుగింటినీ
కేంద్రములు అంటారు. ఇవి శుభ స్థానములు.
త్రికోణములు
ఊర్థ్వమున ఉన్న రాశికి
ముందునుండి ఐదవది, వెనుకనుండి ఐదవది త్రికోణస్థానములు. ఈ రెండు
మరియు లగ్నము మూడింటినీ కలిపి త్రికోణములంటారు. ఈ మూడునూ
ఒకదానినుండి ఒకటి 120 డిగ్రీల అంతరములో ఉంటాయి. పరాశర మహర్షి
అనుసారము ఈ స్థానముల అధిపతులు జాతకులకు శుభులు మరియు అనుకూలురుగా
వ్యవహరిస్తారు.
ఈ కేంద్రములకు మరియు
త్రికోణస్థానములకు ఉన్న ప్రత్యేకత కారణముగ ఆ స్థావములో ఉన్న
రాశులకు ప్రాధాన్యత కలుగుతున్నది. కావున రాశులు తమ తమ స్వతస్సిద్ధ
ఫలములను ఇచ్చుటలో సమర్థములుగ ఉన్ననూ వానికి విశేషస్థానము
లభించకున్న ఆ ఫలముల ప్రభావము జాతకునిపై కనిపించే అవకాశము చాలా
తక్కువ అని గ్రహించాలి.
లగ్నమునకు ఒక రాశి ముందు
వెనుక, అదే విధముగ సప్తమమునకు ఒక రాశి ముందు వెనుక అశుభస్థానములు.
ఆ స్థానములలో గ్రహములు అంత అనుకూలములు కావు. మరియు ఆ రాశ్యధిపతులు
అంత మంచివారు కారు. కేంద్రములు నాలుగు, త్రికోణములు రెండు, 6, 8 12
స్థానములు మూడు మిగిలినవి మూడు స్థానములు. అందులో మూడవది,
పదకొండవది లగ్నమునుండి సమానదూరములో ఉంటాయి. ఆ స్థానములు అశుభములు
కాదు కానీ వాటి అధిపతులు పాపులు.
ఈ విధముగ పరిశీలిస్తే
గ్రహములకు గాని, రాశులకు గాని వాని స్వతస్సిద్ధస్వభావము కన్నా అవి
ఆక్రమించిన స్థానము చాల ముఖ్యమైనదని గ్రహిస్తున్నాము. కావున ఒక
జాతకుని పూర్వాపరములు రాశులు మరియు గ్రహముల ఆధారముగ పరిశీలించ
భావించినపుడు వాని వాని స్థానములను పరిశీలించినచో జాతకుని కర్మ
ఫలితమును చాలా సులభముగ విశదీకరించగలుగుతున్నామన్నది
స్పష్టమవుతుంది.
వచ్చే నెల గ్రహములగూర్చి
వాని ద్వారా జాతకుని పరిశీలించు విధానమును తెలుసుకుందాము.
సశేషము.... |