36. ఇతరులకు నిను నెఱగతరమా

ఇతరులకు నిను నెఱగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర
హితులెఱుగుదురు నిను నిందిరామణా||

నారీకటాక్షపటు నారాచభయరహిత
శూరులెఱుగుదురు నిను చూచేటిచూపు
ఘోరసంసార సంకులపరిఛ్ఛేదులగు
ధీరులెఱుగుదురు నీ దివ్య విగ్రహము||

రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగులెరుగుదురు నిను ప్రణుతించువిధము
ఆగమోక్ష ప్రకారాభిగమ్యులు మహా
యోగులెఱుగుదురు నీవుండేటివునికి||

పరమభాగవత పదపద్మ సేవానిజా
భరణులెఱుగుదురు నీ పలికేటిపలుకు
పరగునిత్యానంద పరిపూర్ణ మానస
స్థిరు లెఱుగుదురు నిను తిరువేంకటేశ||


భగవంతుని తత్త్వాన్ని, అతని సాన్నిధ్యాన్ని తెలుసుకోవాలంటె ఎంతో సాధన అవసరం!
సతత సత్యవ్రత సంపన్నులై, సదాచార జీవనం గడుపుతూ అరిషడ్వర్గాలను జయించిన వారు మాత్రమే భగవంతుని గూర్చి తెలుసుకొనగలరు! అన్నమయ్య ఈ పాటలో పరమ నిత్యానంద, పరిపూర్ణ మానస స్థిరులు (నిత్యమూ భగవదానందాన్ని అనుభవిస్తూ, స్థితప్రజ్ఞత్వం కలవారు) మాత్రమే నిన్ను తెలుసుకొగలరని చెబుతూ, ఆ భగవంతుని దర్శించడానికి అనుసరించవలసిన పద్ధతి పరోక్షంగా తెలియజేయడం ఈ పాటలోని ప్రత్యేకత!

సతత సత్యవ్రతులు = ఎల్లప్పుడు సత్యమే వ్రతముగా కలవారు;
సంపూర్ణ మోహవిరహితులు = పూర్తిగా మోహముచే విడువబడినవారు
నారీకటాక్ష పటునారాచ భయరహితశురులు = స్త్రీల కడుగంటి చూపులనెడు వాడియైన బాణములవలన భయములేని వీరులు
దివ్య విగ్రహము = దివ్యమైన శరీరము;
రాగభోగ విదూరరంజితాత్ములు = రాగమునకు భోగమునకు దూరమై(పరమాత్మయందే)రంజింపమేయబడిన చిత్తముగలవారు
మహాభాగులు = గొప్ప భాగ్యవంతులు,
ఆగమోక్తప్రకారాభిగమ్యులు = శాస్త్రములందు చెప్పబడిన విధానమే ఆశ్రయింపవలసినదిగా గలవారు
పరమభాగవత పదపద్మ సేవానిజాభరణులు = శ్రేష్టులైన భగవద్భక్తుల చరన కమలముల యొక్క సేవయే తమకు ఆభరణముగా గలవారు
నిత్యానంద పరిపూర్ణ మానసస్థిరులు = శాశ్వతమైన ఆనందముతో నిండిన చిత్తముచే చపలరహితులైనవారు

 
37. ఇదిగాక సౌభాగ్యం
ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపముమఱి
యిదిగాక వైభవం బిక నొకటికలదా

అతివజన్మము సఫలమై పరమ యోగివలె
నితర మోహాపేక్ష లన్నియు విడిచె
సతి కోరికలు మహా శాంతమై యిదెచూడ
సతత విజ్ఞాన వాసనవోలె నుండె||

తరుణి హృదయము కృతార్ధత పొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయమంది యింతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ||


శ్రీ వేంకటేశ్వరుని చింతించి పరతత్త్వ
భావంబు నిజముగా పట్టే చెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ


అన్నమయ్య ఆధ్యాత్మ, శృంగార రీతులలో సంకీర్తనలు రచించాడు. రాశిలో శృంగార సంకీర్తనలు ఆధ్యాత్మ సంకీర్తనలకు మూడు రెట్లు ఎక్కువ. మధురభక్తి సంప్రదాయంలో ఆత్మార్ధంతో వ్రాసుకున్న ఈ శృంగార సంకీర్తనల పరమార్ధం ఆధ్యాత్మ తత్త్వమే! ఆధ్యాత్మ పద్ధతిలో ఒక యోగి లేక ముని లేక ఋషి నిరంతర భగవత్ చింతనలో ఏకాగ్రమైన చిత్తంతో భగవంతుణ్ణీ ఆరాధిస్తాడు. చివరకు తపస్సు సిద్ధించి వరుసగా భగవత్ సాలోక్యము, సాయుజ్యము, సామీప్యము, సారూప్యాన్ని పొందుతాడు. (స్థూలంగా భగవంతునిలో ఐక్యమవుతాడు) అలాగే శృంగార సంకీర్తనలో పేర్కొనబడిన నాయిక నిరంతరం అంతరంగ తలపుల తరంగాలలో భగవంతుని నిలుపుకొని తన కోరికల కుసుమములను ఆ భగవంతునికి సమర్పించి, ఆ విధముగా కోరికలు లేని స్థితికి చేరుకుని, నిశ్చల భావంతో పరతత్త్వాన్ని చింతించి చివరకు ఆ భగవంతునిలో ఐక్యమవుతుంది. ఇదీ మధురభక్తి శృంగారం లోని అంతరార్దం. ఈ పాటలోని నిగూఢార్ధం! నిత్యానిత్యవస్తు వివేకః’ ‘ఇహముత్ర ఫల భోగవిరాగః’, ‘శమదమాది సాధన సంపత్తిః’, ‘ముముక్షుత్వం’ అను నాలుగు వేదాంత సోపానాలు అధిరోహించిన ఈ పాటలోని నాయిక గూర్చి పూర్తిగా తెలుసుకొదలచినవారు ‘తాళ్ళపాక పద సాహిత్యం’ (తి.తి.దే. ప్రచురణ) లోని 5వ సంపుటం పీఠికలో కీ.శే. గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు వ్రాసిన విపుల వ్యాఖ్యానాన్ని చదువగలరు.ఆపేక్ష = కోరిక;
ఉల్లంబు = మనస్సు
తిరము + ఆయ = తిరమాయ = నిశ్చలస్థితికి చేరుకున్నది
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech