అమెరికా సందర్శనం - బండారు శ్రీనివాస రావు బండారు శ్రీనివాసరావు గారు తెలుగువారికందరికీ సుపరిచితులే- ఆకాశవాణి లో AIR-హైదరాబాద్, మాస్కో లలో వార్తలు చదువుతూ,దూరదర్సన్లో ప్రోగ్రాం డైరెక్టర్ గా చేస్తూ, ఒక ప్రముఖ జర్నలిస్టుగా పేరుతెచ్చుకుని, అనేక వార్తాసంబంధిత కార్యక్రమాలను వారు నడిపారు. ప్రతినేలా వారిని సుజనరంజనికి ఒక శీర్షిక వ్రాయమని అడిగితే వారు అంగీకరించారు. త్వరలో వారి సహకారంతో ఒక సరిక్రొత్త శీర్షిక మీముందుకు తేబోతున్నాము. ప్రస్తుతం వారి అమెరికా సందర్శన అనుభవాలను, అమెరికాకి క్రొత్తగా వస్తున్న పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే విధంగా వ్రాసారు. అది అందరికీ ఉపయోగపడుతుందని మీ ముందుకు తెస్తున్నాం.
(రెండవ భాగం)

రెండు బెలూన్లు - ఒక థాంక్స్

ఓ రోజు మా మనుమరాలిని కూర్చోబెట్టుకిని నేనూ మా ఆవిడ రెండు మైళ్ళ దూరంలో వున్న ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్ళాము. త్రోవలో ఒకచోట 'గరాజ్ సేల్ ' అని ఓ చిన్న బోర్డుపెట్టారు. అది స్పుటంగా కనిపించడానికి వీలుగా దానికి గాలిలో ఎగిరే రెండు బెలూన్లు వ్రేలాడదీసారు. అది చూసి మా మనుమరాలు 'బెలూన్- బెలూన్ ' అని అరిచింది. దాని ముచ్చటచూసి కొనిపెడదామన్నా అవి ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియదు. తిరిగి వస్తుంటే ఆ బెలూన్లు మళ్ళీ కనిపించాయి.వాటిని చూపిస్తూ మా మనుమరాలు మళ్ళీ ' బెలూన్- బెలూన్ ' అని కేకలు పెట్టింది. ఈ లోగా ఓ కారు వచ్చి అక్కడ ఆగడం ఎవరో దిగి ఆ గరాజ్ సేల్ బోర్డుని బెలున్లని తీసుకుపోవడం జరిగింది. మరో రెండు బ్లాకులు దాటి ఇంటికి చేరే సమయంలో మా ప్రక్కగా వున్న సందులో ఓ కారు వచ్చి ఆగింది. అందులోనుంచి దిగిన అమెరికన్ రెండు బెలూన్లు తీసి మా అమ్మాయికి ఇచ్చాడు. అతనేదో ఇంగ్లీషులో చెప్పాడుకానీ ఒక పట్టాన అర్థంకాలేదు. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే అర్థం అయ్యిందేమిటంటే మా మనుమరాలు బెలూన్ చూపించి అడగటం అతను చూసాదు. అయితే ఈలోగా సిగ్నల్ పడటంతో ముందుకు వెళ్ళిపోయి మమ్మల్ని వెతుక్కుంటూ వెనక్కు వచ్చాడు. ఇలాంటి సంస్కారాలనీ సహృదయతనీ మెచ్చుకోకుండా ఉండగలమా! ఇటువంటి సందర్భాల్లో మనోభావాలకు అద్దంపట్టే చిన్న ఇంగ్లీషుపదం ఒకటుంది. అదే ' థాంక్ యూ ' !

నడిచేవారిదే రోడ్డు

ఇక్కడి వారికి ఏమున్నా లేకపోయినా సొంత కారు మాత్రం వుండితీరాలి. కారు లేకపోతే కాలూ చేయీ ఆడదు. రోడ్లమీద నడిచే వారు అంతంతమాత్రానే కానవస్తారు. కానీ వాళ్ళదే ఇక్కడ హవా. ఎంతో వేగంగా వెళ్ళే వాహనమైనా సరే నడిచివెళ్ళేవారు కనిపించగానే ఆగిపోతుంది. వాళ్ళు రోడ్డుదాటి వెళ్ళేవరకు అన్నివాహనాలు ఠక్కున నిలబడిపోతాయి. నడిచి వెళ్ళేవారిని ఢీకొడితే అదో పెద్దనేరం. ఆ కేసునుండీ బయటపడాలంటే పెద్దమొత్తంలో నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వుంటుంది. రద్దీగావున్న రోడ్లని క్రాస్ చేయడానికి రోడ్లప్రక్కన్ సిగ్నల్ పుష్ బటన్లుంటాయి. వాటిన్ ప్రెస్ చేస్తే రోడ్డుదాటడానికి వీలుగా రెడ్లైట్ మారిపోయి తెల్లదీపం వెలుగుతుంది. ఇలాంటివి అన్ని నగరాల్లోని అన్ని క్రాస్ రోడ్లవద్దా ఏర్పాటుచేసారు. ట్రాఫిక్ కు సంబంధించి కొట్టొచ్చినట్లు కనిపించే విషయం ఏమిటంటే ఎక్కడా రోడ్లమీద ట్రాఫిక్ పోలీసులు కనపడరు. వాళ్ళు హమేషా వాహనాల్లో తిరుగుతూ అతివేగంగా వెళ్ళే వాహనాలను అదుపు చేస్తుంటారు. వీళ్ళని కాప్స్ అని పిలుస్తారు. అంటే కానిస్టేబుల్ ఆన్ పాట్రోల్. జాతీయ రహదారులపై ఈ పోలీసుల హెలికాప్టర్లలో గస్తీ తిరుగుతుంటారు. వాహనదారులు భయపడేది వీరికే. అతివేగంగా వెళ్ళే వాహనాలను పట్టుకోవడానికి అప్పుడప్పుడు వీరు రోడ్లప్రక్క చెట్ల మాటున మాటువేస్తారు. వీరి వాహనంలో వైర్ లెస్, టెలీఫోన్, కంప్యూటర్ మొదలయిన వాటితోపాటు ఒక గన్ వుంటుంది. ఈ మెషిన్ ని వాహనాలవైపు గురి పెట్టి వుంచుతారు. నీమిత వేగాన్ని మించి వెళ్ళెకారుని ఈ యంత్రం గుర్తించి కారునెంబర్ తో సహా నమోదు చేస్తుంది. మనవైపు చలాన్ చెయ్యడం అంటాము కదా! ఇకడ టిక్కెట్ ఇవ్వడం అంటారు. వాళ్ళ కంప్యూటర్ లో కారు నెంబరుని బట్టి వాహనదారుడి వివరాలు తెలిసిపోతాయి. టికెట్ ఇంటికే వస్తుంది. కోర్టులో జర్మానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి టిక్కెట్ల సంఖ్య పెరిగిందంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమాటిక్ గా రద్దయిపోతుంది. లైసెన్స్ పోయి కారు నడపలేకపోతే జీవచ్చవం కిందే లెక్క, అంతే కాకుండా ఎక్కువ సార్లు పోలీసులకు దొరికిపోతే కారు ఇన్స్యూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది. మరోసారి కారు కొనుక్కోవాలంటే అప్పుపుట్టదు. పౌరులందరికీ సోషల్ సెక్యూరిటీ నెంబరు ఇచ్చి కంప్యూటర్లలో వివరాలన్నీ నిక్షిప్తం చేయడం ద్వారా అన్ని రకాల ఆక్రమాలకూ కళ్ళాలు వెయ్యగలిగారు. చెల్లని చెక్కులు ఇవ్వడం, అద్దెలు ఎగగొట్టడం, ప్రమాదకరంగా కార్లని నడపటం ఇలా ఏది చేసినా కంప్యూటర్ల ద్వారా తెలిసిపోతుంది. ఇలాంటివారికి బ్యాంకుల్లో అప్పుపుట్టదు. ఈ విధంగా క్రమబద్దమైన జీవనానికి ప్రజలు అలవాటు పడేలా చేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానానికి వినియోగించిన తీరు హర్షనీయం.

విస్తట్లో అన్నీ వున్నా ....... ....

సుఖంగా బ్రతకాలనుకునే మనిషికి ఏమేమి అవసరమో అవన్నీ ఇక్కడ అందుబాటులో వున్నాయి. పరిశుభ్రమైన గాలి- పరిశుద్ధమైన నీరు- ఎల్లెడలా పచ్చదనం - విశాలమైన రోడ్లు - పొగలేని వాహనాలు - చక్కని ఇళ్ళు - మంచి చదువులు చదవటానికి- చదివిన చదువును సద్వినియోగం చేసుకోవడానికి సరైన అవకాశాలు - పరిమితులు లేని వ్యక్తి స్వేచ్చ, ఆడామగా తేడాలు తెలియని జీవన విధానం - సమృద్ధిగా తాగునీరు - సాగు నీరు, పుష్కలంగా కరెంటు సరఫరా - ప్రపంచ వాణిజ్యంలో తిరుగులేని డాలర్ వెలుగు, ఇవన్నీ అమెరికన్ల జీవనస్థాయిని ఎంతగానో పెంచుకుంటూ వెళ్ళాయి. సువిశాల నైసర్గిక స్వరూపం - తక్కువ జనభా - పుష్కలమైన సహజ వనరులు - ఇవి కూడా సంపన్న అమెరికా ఆవిర్భావానికి దోహదం చేసివుండవచ్చు. అయితే కష్టపడి పనిచేసే పౌరుల మనస్తత్వం - సాధారణ జీవితంలో నీతి నిజాయతీ ఆ దేశ సౌభాగ్యానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. సుఖంగా బ్రతకడం కాదు .... ఇంకెంతో మరెంతో సుఖంగా బ్రతకాలంటే ఏం చేయ్యాలో వాళ్ళకు తెలుసు. అందుకే వర్తమాన మానవ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్న అనేకానేక ఉపకరణాలను వారు కనుక్కోగలిగారు. రక్షణ వ్యవస్థకోసం రూపకల్పన చేసుకున్న ఇంటర్ నెట్ ని పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చి వారి జీవన శైలినే సమూలంగా మార్చివేయగలిగారు.

అయితే- ఏమిటట?

అయితే- ఏమిటి? ఇప్పుడు అనేక మంది అమెరికన్ల మనస్సులో నలుగుతున్న ప్రశ్న ఇది. అవును అన్నీ ఉన్నాయి కానీ వున్నదేదో లేకుండాపోయింది. అది లేకుండా ఇవన్నీవుండి ఏమిటి లాభం? సహజమైన మానవ సంబంధాలు మచ్చుకకు కూడా కానరాకుండా పోతున్నాయి. తల్లీ-తండ్రీ బంధాలు ఒకవయస్సు వరకే పరిమితమై పోతున్నాయి. కన్నవారిని ఏడాదిలో ఒక్కసారైనా కలుసుకోవడానికి ధన్యవాదాల దినం పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కన్నవారు- తాము కన్నవారితో కలిసుంటే ఓ వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.

స్పోకేన్ రివ్యూ

సియాటిల్ కి సుమారు మూడువందల మైళ్ళ దూరంలో వున్న స్పోకేన్ నగరం నుంచి ఈ పత్రిక 125 సంవత్సరాలకు పైగా ప్రచురితమవుతూ వస్తోంది. లోగడ రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయలక్ష్మి, ఆమె భర్త బాలాజీ ఉద్యోగరీత్యా ఆ నగరంలో సుమారు మూడేళ్ళుగా నివసిస్తున్నారు. నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని వాళ్ళ వూరు రావాలని పదే, పదే ఫోనులు చేస్తుండటంతో ఒక రోజు పనికట్టుకుని నేను-మా ఆవిడ బయలుదేరి స్పోకేన్ వెళ్ళాము. వాళ్ల ఇల్లు చూడ ముచ్చటగా వుంది. హైదరాబాదు నుంచి బాలాజీ తల్లి తండ్రులు- అమెరికాలో కొడుకు దగ్గిర వచ్చి ఆరు నెలలు ఉండి అంతకు ముందు నెలలోనే ఇండియా తిరిగి వెళ్ళారు. కొడుకు-కోడలితో తల్లితండ్రులు ఆరునెలలు కలిసి వుండడం అక్కడి వారికి ఎంతో వింతగా అనిపించింది. ఆ నోటా- ఈ నోటా ఆ విషయం తెలుసుకున్న ఆ పత్రిక విలేఖరి రెబెక్క నప్పీ, విజయలక్ష్మీ వాళ్ళ ఇంటికి వచ్చి - ఇంటర్వ్యూ చేసి ఫొటోలతోసహా మొదటి పుటలో ప్రచురించారు. రెబెక్కా ఆ పత్రికకు ఇంటరాక్టీవ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆవిడ ఆహ్వానం మేరకు డౌన్ టౌన్ రివర్ సైడ్ ఎవెన్యూలో వున్న స్పోకేన్ రివ్యూ కార్యాలయానికి వెళ్ళాము. అనేక అంతస్తులు కలిగిన ఈ భవనం చాలా పురాతనమైనది. చారిత్రక అవశేషాలు దెబ్బతినకుండా భవనంలోపల ఇంటీరియర్ ను మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా అధునాతనంగా తీర్చిదిద్దారు. సుమారు వందేళ్ళనాటి లిఫ్ట్ దగ్గిర నిలబడి ఫొటోలు దిగాము. రిబెక్క మమ్మల్ని కార్యాలంలోని వివిధ భాగాలకు తీసుకెళ్ళి అందులో పనిచేస్తున్న జర్నలిస్టులని పరిచయంచెయ్యడమే కాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్ లో కూర్చోపెట్టి ' ఫ్రెండ్స్ ఫ్రం ఇండియా 'అని పరిచయం చేశారు. పత్రిక చీఫ్ ఎడిటర్ ఎలాంటి భేషజాలు లేకుండా చక్కని హాస్యోక్తులతో కూడిన ప్రొఫెషనల్ సీరియస్నెస్ తో సమావేశాన్ని రక్తి కట్టించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రాంతాల విలేకర్లతో మాట్లాడి ఏ వార్తకు ఎలంటి ప్రాధాన్యతివ్వాలో అందరితో చర్చించి నిర్ణయంతీసుకోవడంతో ఆ సమావేశం ముగిసింది. తర్వాత చివరి అంతస్తులో వున్న క్యాంటీన్ కు వెళ్ళి కాఫీ కలుపుని తాగాము. మేడమీద పిట్టగోడలపై పెద్ద, పెద్ద గుడ్లగూబ పక్షుల బొమ్మలు కనిపించాయి మనవైపు వీధి వాకిళ్ళ వద్ద కనిపించే సిం హాల బొమ్మలమాదిరిగా వున్నాయి. క్షుద్రశక్తులు ప్రవేశించకుండా ఈ బొమ్మలు కాపాడతాయని తమ పూర్వీకులు నమ్మేవారని రెబెక్కా చెప్పారు.

రోప్ వే

స్పోకేన్ లో వున్నప్పుడు అక్కడికి దగ్గర్లోవున్న సిల్వర్ రిసార్టుకి వెళ్ళాము. కింద బేస్ క్యాంప్ నుంచి గండోలాలో (రోప్ వే) ఆరు వేల అడుగుల ఎత్తువున్న రిసార్టుకి వెళ్ళాము. కింద బేస్ క్యాంప్ నుంచి గండోలాలో (రోప్ వే) ఆరు వేల అడుగుల ఎత్తువున్న రిసార్టుకి చేరుకున్నాము. ఈ రోప్ వే నిడివి 3.1 మైళ్ళు. ప్రపంచంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రోప్ వే లలో ఇదొకటి. గంటకు పదహారువందలమంది టూరిస్టులను, స్కీయింగ్ క్రీడాకారులను పైకి తీసుకుని వెళ్ళగల 112 క్యాబిన్ లు నిరంతరం పైకి క్రిందికి తిరుగుతుంటాయి. ఒక్కొక్క క్యాబిన్ లో 8 మంది వసతిగా కూర్చోడానికి వీలుంది. నిమిషానికి వెయ్యి అడుగుల వేగంతో కిందినుంచి పైకి, మంచుకొండల లోయలమీదుగా తీగెబాటపై ప్రయాణించడం నిజంగా మరుపురాని అనుభూతి. పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అంతా మంచు, తెల్లని మంచు, తడితగలని పొడిమంచు, అంత ఎత్తు నుంచి కొండ సానువులమీదుగా స్కీయింగ్ చేస్తూ వేగంగా జారిపోతున్న వారిని చూస్తే భళిరా అనిపించింది. ఉదయం పైకి వెళ్ళినవారు సాయంత్రందాకా స్కీయింగ్ క్రీడలో గడపవచ్చు. స్కీయింగ్ చేస్తూ దారి తప్పినవారిని క్షేమంగా వెనక్కు చేర్పించడానికి మంచుపై పరుగెత్తే చిన్న చిన్న మోటారు వాహనాలతో సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ గస్తీ తిరుగుటుంటారు.

అమెరికాలో బస్సు ప్రయాణం

స్పోకేన్లో మూడు నిద్దర్లు చేసి తిరిగి బస్సులో సియాటిల్ కు బయలుదేరాము. బస్సులో ప్రయాణించాలనే మా కోరిక ఈ విధంగా నెరవేరింది. అన్ని రంగాల మాదిరిగానే అమెరికాలో బస్సు సర్వీసులు ప్రైవేటురంగంలో వున్నాయి. రహదారులు వాహనాలు రెండూ బాగుండడంవల్ల బస్సు ప్రయాణం ఎలాంటి కుదుపులు లేకుండా ఆహ్లాదంగా సాగింది. కండక్టరు పద్ధతి లేదు. డ్రైవరే అన్నీ చూసుకుంటాడు. బస్సు కంట్రోల్స్ అన్నీ అతని చేతిలోవుంటాయి. మైక్రోఫోనులో దారిలో విశేషాలు వివరిస్తుంటాడు. బస్సు ఎన్ని వందల అడుగుల ఎత్తున కొండ శిఖరాలు దాటుతున్నది తెలియచేస్తుంటాడు. మరోగంటలో సియాటిల్ చేరుకుంటామనగా దారిలో విపరీతమైన మంచు కురవడం మొదలుపెట్టింది. బస్సు స్నోకార్నీ అనే చోట ఆగినప్పుడు చూస్తే హోటళ్ళు- ఇళ్ళు రహదారులు అన్నీ మంచుతో కప్పుకుపోయాయి. ఒక్క క్షణం మాస్కోలో వున్నామాఅనిపించింది. మంచు, వానవల్ల బస్సు వేగం మందగించింది. అలాగే మిగిలిన వాహనాలు కూడా.

ఎప్పుడూ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే వాహనాలు - అతి జాగ్రత్తగా నెమ్మదిగా నడవడం మొదలైంది. మంచు వల్ల రోడ్లపై ట్రాఫిచ్ గీతలు కనపడకపోవడం కూడా ఇందుకు కారణం. ఎవరు ఏలైనులో వెళుతున్నారో తెలియని పరిస్థితి. మార్గం మధ్యలో అనేక చోట్ల లైట్లతో అమర్చిన హెచ్చరిక సూచనలు కానవస్తూనే వున్నాయి. వాటిని పాటిస్తూ మా బస్సు డ్రైవరు కూడా రేడియో ఆన్ చేసాదు. వాతావరణం గురించి రోడ్ల పరిస్థితి గురించి ఏ ప్రాంతంలో ఎంత వేగంగా వెళ్ళాలో ఎక్కడ ట్రాఫిక్ జాం లు వున్నాయో ఆ వివరాలన్నీ రేడియోలో తెలియచేస్తున్నారు. ఈ దేశం లో రేడియో ప్రాధాన్యత ఎలా వుందో తెలుసుకుని రేడియో మనిషిగా ఎంతో గర్వంగా ఫీలయ్యాను.

మాస్కో గుర్తొచ్చిందని అన్నా కదా!

మాస్కో గుర్తొచ్చిందని అన్నా కదా! మాస్కోలో ఏడాదికి సుమారు పది మాసాలపాటు ఇదేమాదిరి మంచు వానలు వుంటాయి. ఆయినా వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తారు. రాత్రివేళల్లో రోడ్లపైకురిసిన మంచుని తొలగించే పనిలో వుంటారు. ఉప్పు ఇసుక కలిపి రోడ్లపైచల్లుతారు. ఆ వెనుక వచ్చే మరో వాహనం ఆ రెండిటినీ చీపురుతో ఊడ్చినట్లు చేస్తుంది. మరో వాహనం నీళ్ళు చిమ్ముతూ రోడ్లని కడుగుతుంది. మాస్కోలోమేమున్న సుమారు ఐదేళ్ళుకూడా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం కానీ ట్రాఫిక్ కు అంతరాయం కలగడంకానీ చూడలేదు. అక్కడి అప్పటి ప్రభుత్వ యంత్రాంగం శక్తియుక్తులన్నీ ప్రకృతిపోరాటానికే ఖర్చు చేశారా! అనిపించింది. ఇక్కడ అమెరికాలో పరిస్థితులు వేరుగా కానవచ్చాయి. రోడ్లపై గీతలు కనపడకపోతే ఇక్కడివారు కారు నడపలేరేమో.

ముసురు నగరం

సియాటల్ వాషింగ్టన్ రాష్ట్రంలో వుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి కి దీనికీ సంబంధంలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు. రాముడి రాజ్యంలో నెలకు మూడు వానలు కురిస్తే ఇక్కడ 30 రోజులూ వాన పడుతూనే వుంటుంది. అందుకే దీనికి గ్రీన్ స్టేట్ అని మరో పేరు పెట్టుకున్నారు. ఎక్కడచూసినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. పచ్చదనానికి పరిశుభ్రానికి సియాటల్ మరోపేరు. ముసురు ముసుగేసుకున్న ఈ నగరం రోడ్లపై ట్రాఫిక్ గీతలు అప్పుడే గీసినట్లుగా ఎలా మెరుస్తుంటాయో అర్థంకాదు. మేమున్న ఐదు నెలల్లో ఏ ఒక్క రోజుకూడా గీతలు కొత్తగా పెయింట్ చేసిన సందర్భం కానరాలేదు.

ప్రక్కనున్న కాలిఫోర్నియా రాష్టంతో పోలిస్తే వాషింగ్టన్ స్టేట్లో ముఖ్యంగా సియాటల్ లో ట్రాఫిచ్ ఆంక్షలు ఖచ్చితంగా అమలు జరుపుతున్నట్లు తోస్తుంది. కారులో సీట్ బెల్ట్-డ్రైవరు (సధారణంగా యజమానే అయివుంటారు) తో సహా ముందు, వెనుక కూర్చున్నవారంతా విధిగా ధరించాలి. లేకపోతే వందడాలర్ల జరిమానా వేస్తారు. చిన్న పిలలకు ప్రత్యేకమైన కారు సీట్లు వుండాలి. పిల్లలకారు సీట్లు విడిగా కొనుక్కుని కారులో బిగించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోను పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టుకోకూడదు. నెలల పిల్లలయినా సరే వెనుకనే వారికారు సీట్లు అమర్చుకోవాలి. సిటి మేయర్ గ్రెగ్నికిల్స్ మాటల్లో చెప్పాలంటే సియాతల్ అమెరికాలోనే చాలా చక్కని నగరం. ప్రకృతి ప్రసాదించిన విశాలమైన సరస్సులు, ఎత్తైన కొండలు- నదులు-నదీ మార్గాలు- కంటికి విందుచేసే పచ్చికబయళ్ళు, శీతల వాతావరణం, సమీపంలో సముద్రతీరం. అవన్నీ ఈ నగరానికి ఒక ప్రత్యేకతను, విశిష్టితను సంపాదించి పెట్టాయి.

పర్యాటకానికి పెద్దపీట

సియాటల్లోని అంతర్జాతీయ విమానాశ్రమం దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్టుల్లో ఒకటి. కార్ల పార్కింగ్ కోసం పలు అంతస్తుల భవనాలు అనేకం నిర్మించారు. ఒక్కో అంతస్తులో సుమారు అయిదు వందల కార్లవరకు వసతిగా పార్క్ చేసుకునే వీలుంది. వివిధ ప్రాంతాలకు అనేక దేశాలకు వెళ్ళే ప్రయాణీకులు త్వరత్వరగా తమ విమానాలను చేరడానికి వీలుగా అత్యంత వేగంతో నడిచే ఎలక్ట్రిక్ రైళ్ళు భూగర్భంలోనూ వెలుపల తిరుగుతుంటాయి. ఎస్కలేటర్లతో ఆధునిక దుకాణ సముదాయాలతో, రెస్టారెంట్లతో, ఫౌంటెన్లతో మెరిసే విధ్యుత్ దీపాలతో ఒక అధునాతన నగరంగా వుంటుంది.

ఎయిర్ ఫోర్స్ వన్

అమెరికాలో ప్రసిద్ధ కంపెనీలయిన బోయింగ్, మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాలు సియాటలోనే వున్నాయి. ఇన్ఫొసిస్ తరఫున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పాసులతో ఒక రోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫాక్టరీని ప్రవేశరుసుముతో సందర్శించే వీలు కల్పించారు. సందర్శకులను ప్రత్యేక బస్సుల్లో తీసుకువెడతారు. అన్నీ చూపించి విషయాలను విశిదపరిచేందుకు గైడ్లువుంటారు. బోయింగ్ విమానమే అతి పెద్దగావుంటుంది. వాటిని తయారుచేసే ఫాక్టరీ ఎంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను అన్నింటిని ఒక చోట చేర్చి విమానం రూపొందిస్తారు. బోయింగ్ విమానాలు తయారయ్యే వివిద దశలు గురుంచి కళ్ళకు కట్టినట్లు చేపే ఒక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వేలతోకూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకూ తయారయిన అధునాతన యుద్ధవిమానాలు, ప్రయాణికుల విమానాలు, సరుకుల రవాణా విమానాలు వుంచిన ఒక ప్రదర్శనశాల కూడావుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ' ఎయిర్ ఫోర్స్-1 ' పాత మోడల్ కూడా ప్రదర్శనలో వుంచారు. సందర్శకులు ఇందులోకి ఎక్కి కాక్ పిట్ తో సహా అమెరికా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటుచేసిన పడకగది, సమావేశమందిరం, పత్రికావిలేకరులతో మాట్లాడె హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టెలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టివీ మొదలైన ఆధునిక సమాచార పరికరాలన్నీ ఇందులో అమర్చారు.

అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది ఒక మరుపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ దేశంలో పర్యాటకరంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పటానికే. నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధ ప్రదేశమయినా టిక్కెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది ఈ కర్మాగారాన్ని సందర్శిస్తుంటారు.

స్నోకాల్మీఫాల్స్

ఒకరోజు స్నోకాల్మీఫాల్స్ కి కారులో వెళ్ళాము. సుమారు గంటన్నర ప్రయాణం. ఎత్తయిన పర్వతాలు, లోతయిన లోయలమీదుగా విశాలమైన రహదారి వుంది. రోడ్డుకు రెండు పక్కలా నింగిని తాకుతున్నాయా అనిపించే ఎత్తయిన చెట్లు. వాటిని నరికి అడవులను ధ్వంసం చేస్తున్న దాఖలాలు మచ్చుకు కూడా కనిపించవు. చెట్లను నరకడంపై గట్టి నిషేదాలు వున్నాయి. కార్చిచ్చుల కారణంగా అడవులు తగలబడిపోవడం తప్పిస్తే (ఇటీవల కాలిఫొర్నియాలో అలాంటివి జరిగి వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు కాలిపోయాయి) దొంగతనంగా చెట్లను నరకడం అన్నది జరుగదు. నిజానికి స్నోకాల్మీఫాల్స్ ఒక కృత్రిమ జలపాతం. లోయల్లో పారుతున్న నదిని ఒక ఎత్తయిన ప్రదేశం మీదుగా మళ్ళించి ఈ జలపాతం ఏర్పాటుచేసారు. పర్యాటకులకు అవసరమైన వసతులు అద్భుతంగా కల్పించారు. కాలిబాట ద్వారా లోయలోకి దిగి వెళ్ళి ధారగా దూకుతున్న జలపాతాన్ని చూడవచ్చు. పైనుంచి పడుతున్న జలధారలతో కింది భాగంలో సరస్సు మాదిరిగా తయారయింది. ఇందులో బోటింగ్ చేయడానికి రోజూ వందలాదిమంది అక్కడకు వస్తుంటారు. నిజానికి ఇది మన నాగార్జునసాగర్ వద్ద వున్న ఎత్తిపోతల జలపాతం మాదిరిగానే వుంది. అయినా పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడ చేసిన ఏర్పాట్లూ, రహదారి సౌకర్యాలు చూసి నేర్చుకోవలసింది వుంది.

మండేకొండ

మరో రోజు మౌంట్ రేనియర్ అనే అగ్నిపర్వతం చూడటానికి వెళ్ళాము. అక్కడకు వెళ్ళడానికి కొన్ని వేల అడుగుల ఎత్తున నిర్మించిన విశాలమైన ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలి. ముందే పేర్కోన్నట్లు ఇక్కడ ఘాట్ రోడ్ అంటే మలుపులు తిరుగుతూ వెళ్ళేరోడ్డుకాదు. ఏటవాలుగా సరాసరి కొండమీదికే రోడ్డునిర్మిస్తారు. ఒకటివెంట మరొకటి వందలాది కార్లు అమితవేగంతో ఆ రోడ్లపై వెళ్ళడంచూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మౌట్ రేనియర్ సజీవ అగ్నిపర్వతం. ఇది ఇంకా రగులుతూనేవుంది. ఏదో ఒకనాడు ఇది బద్దలుకాగలదని భావిస్తున్నారు. సందర్శకులకు ఇక్కడ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. రాత్రిపూట బసచేయడానికి అన్ని సదుపాయాలతో కూడిన హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు వున్నాయి. ఇది అగ్ని పర్వతమే అయినా నిజానికి ఒక మంచుకొండ. ఆ మంచుపై స్కీయింగ్ చేయడానికి రోజూ వందలాది వాహనాల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ అగ్నిపర్వతం చరిత్రను వివరించే పెద్ద ప్రదర్శనశాలకూడా వుంది.

దీనిలో ఒక రోజు

సియాటల్ నుంచి కెనడాకు రెండున్నర గంటల్లో కారులో వెళ్ళవచ్చు. అమెరికా-కెనడా సరిహదుల్లో పసిఫిక్ మహాసముద్రం దీవులు కొన్ని వున్నాయి. రోడ్డు ప్రయాణం ద్వారా మాత్రమే కాకుండా హెలికాఫ్టర్లు-విమానాల ద్వారాకూడా అక్కడికి చేరుకోవచ్చు. అనకోర్టెస్ అనే పట్టణం నుంచీ ఫెర్రీలద్వారా (పెద్ద పెద్ద మర బోట్లు) ఈ దీవుల్ని చేరుకోవచ్చు. మనతోపాటు మన వాహనాలను కూడా ఈ బోట్లలో తీసుకెళ్ళడానికి వీలుంది. నిర్ణీత రుసుము చెల్లించి సందీప్ కారుని నేరుగా పార్కింగ్ లాట్ లోకి చేర్చాడు. అయిదు వందలకార్లు అక్కడ పార్క్ చేయవచ్చు. పై అంతస్తులో పర్యాటకుల కోసం విశాలమైన లాంజ్ లు వున్నాయి. అన్నివైపులా నిలువెత్తు అద్దాలు బిగించడంవల్ల వెచ్చగా-హాయిగా పరిసరాలు గమనిస్తూ- సముద్రయానాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అందులో బారు- రెస్టారెంట్ తో సహా అన్ని రకాల వసతులు వున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు వున్నాయి. గంటన్నర ప్రయాణం తర్వాత సాన్ జు వాన్ (అమెరికన్లు సాన్ వాన్ అంటారు) దీవుల్లోని ప్రధానదీవి ఫ్రైడే హార్బర్ చేరుకున్నాము. కారు తీసుకుని విశాలమైన దీవిలో నున్నటి రహదారులపై కలయ తిరిగాము. దీనికి అన్నివైపులా పసిఫిక్ మహాసముద్రం. కొద్ది దూరంలోనే కెనడా సరిహద్దు. పేరుకు దీవి అయినా అన్ని సౌకర్యాలు వున్న చిన్నపాటినగరం.

రెస్టారెంట్లు-సినిమా థియేటర్లు- హోటళ్ళు, మ్యూజియం- చిన్న సైజు విమానాలు దిగటానికి ఎయిర్ పోర్ట్ - సంపన్నులయినవారు విడిది గృహాలుగా కొనుగోలుచేసిన ఖరీదయిన ఇళ్ళతో చూడ చక్కగా ఉంది. ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర-పెరుగన్నం లాగించి చూడాల్సినవి అన్నీ చూసి తిరిగివస్తుంటే వర్షం మొదలయింది. సాయంత్రం అయిదు గంటలకే చిమ్మచీకట్లు కమ్మె వాతావరణం. బోటు లంగరు వేసిన ప్రదేశం కనుక్కునేసరికి తాతలు దిగివచ్చారు. ఎలాగయితేనేం కారుతో సహా తిరిగి బోట్లోపడ్డాము.

మైలు రాళ్ళుదాటని అమెరికా

అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రత్యేకతవుంది. విస్తీర్ణంలో చాలా పెద్దది. వాణిద్య వినోదాల కేంద్రాలైన శాన్ ఫ్రాన్సిస్కో -లాస్ ఎంజెలిస్ -డిస్నీల్యాండ్ ఈ రాష్ట్రంలోనే వున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో అతి పెద్దనగరం. గంటకు వందకిలోమీటర్ల వేగంతో (అమెరికాలో దూరాన్ని మైళ్ళలో కొలుస్తారు. ఈ విషయంలో మనదేశమే అమెరికాకంటే ఓ మైలు ముందుంటుంది. వాళ్ళింకా మైలురాళ్ళు దాటలేదు). ప్రీవేలపై రోజూ కొన్ని గంటలపాటు కారులో ప్రయాణిస్తూ- సుమారు నెలరోజులు వుండికూడా నగరంలో సగం కూడా చూడలేకపోయాము. మా రెండో అన్నయ భండారు రామచంద్రరావు (స్టేట్ బ్యాంక్ సి,జి.ఎం.గా పనిచేసి రిటైరయ్యారు) ఇద్దరు కుమార్లు లాల్ బహదూర్, రాజేంద్రప్రసాద్ లు ఒరకిల్ కంపెనీలో చాలాకాలంగా పనిచేస్తూ - శాన్ ఫ్రాన్సిస్కోలో వుంటున్నారు. వీరిలో పెద్దవాడు లాల్ సొంత ఇల్లు కొనుక్కున్నాడు. మూడు పడకగదులు- రెండతస్తులు, ముందూ వెనుకా లాన్- పెరడ్లతో చాలా సౌకర్యంగావుంది. బయటతిరిగి వచ్చినప్పుడు కారుదిగి గరాజు తలుపు తెర్వాల్సిన అవసరంలెకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చునే ఒక మీటనొక్కి గరాజు తలుపు (షట్టరు) తెరవొచ్చు. లోనికి వెళ్ళగానే ఇలాగే మళ్ళీ మూసేయొచ్చు. అలీబాబా కథల్లో ఓపెన్ ససేం - షట్ ససేం అనగానే గుహద్వారం తెరుచుకుని - మూసుకున్నట్లుగా ఈ ఆటోమేటిక్ లాకింగ్ విధానం కారు గరాజువున్న ప్రతివారికీ అందుబాటులోవుంది.

క్రుకెడ్ రోడ్

శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అనేక కొండలమధ్య ఎగుడు దిగుడు రహదారులతోవుంది. అక్కడ క్రుకెడ్ రోడ్ ని చూడటానికి జనం ఎగబడి వస్తారు. దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. డౌన్ టౌన్ లోని ఒక కొండమీదకు నేరుగా ఎలాంటి వొంపులు లేకుండా ఒక రోడ్డువేసారు. అటూ ఇటూ ఎత్తయిన భవంతులు ఉన్నాయి. ఏటవాలుగా వున్న రోడ్డుపై కారులో ప్రయాణం చెయ్యడం థ్రిల్లింగ్ గా వుంటుంది. కారు వెనుక కారు-కారు ముందు కారు ఇలా కిందనుంచి పైదాకా వరసగా వెళుతుంటాయి. బ్రేకులు వేసుకుంటూ- వేగం సరి చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఏ మాత్రం ఏమరు పాటుగా వున్నా- ముందు కారుని ఢీకొనడమో లేదా వెనుక కారుపైకి జారిపోవడమో జరుగుతుంది. సరిగ్గా రెండు కిలోమీటర్ల పైచిలుకు అసిధారావ్రతం లాంటి ఈ ప్రయాణం చేశాక - హఠాత్తుగా శిఖరాగ్రం మీద నాలుగు వైపులకు వెళ్ళే క్రాస్ రోడ్స్ తగుల్తాయి. మాకారు పైదాకా వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రెడ్ లైట్ పడింది. కిందకు చూస్తే వ్రేలాడుతున్నట్లుగా వందలాది వాహనాలు. కొండ అంచుపై బల్లిలా అతుక్కునివున్నట్టు కారు ఆపుకుని గ్రీన్ సిగ్నల్ రాగానే రోడ్డుదాటాము. అంతటితో కథ ముగియలేదు. ఆ కొండపైనుంచి మళ్ళీ కిందకు రోడ్డుపై దిగాలి. అదే క్రుకెడ్రోడ్. ఇంగ్లీషు అక్షరం ' Z ' ఆకారంలో జిగ్ జాగ్ గా పైనుంచి కిందకి ఈ రోడ్డువేశారు. మిగిలిన ఖాళీస్థలాల్లో లాన్లు - పూలమొక్కలు ఆహ్లాదకరంగా పెంచారు. అనేక మలుపులు -అవీ అతి దగ్గరగావున్న మలుపులు దాటుకుంటూ కిందికి దిగి వెళ్ళాము. ఈ క్రుకెడ్ రోడ్డు ప్రయాణం కోసం రోజూ వేలాది కార్లు వస్తుంటాయి. అతి ప్రమాదకరమైన ప్రయాణం. ప్రమాదాలకు నిలయం. అయినా ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా కనపడడు. దారి ప్రక్కన స్పుటంగా కానవచ్చే నిబంధనలు చదువుకుంటూ - ఖచ్చితంగా వాటిని పాటిస్తూ వెడితే ఎలాంటి ఇబ్బందివుండదు.

' మిస్టరీ స్పాట్ '

మరోరొజు శాంతాక్రజ్ బీచ్ సమీపంలో రెడ్ వుడ్ అడవుల్లో వున్న 'మిస్టరీ స్పాట్ ' చూడటానికి వెళ్ళాము. నిజానికి ఇది చాలాచాలా చిన్న టూరిస్ట్ స్పాట్. 150 చదరపు అడుగులు వుంటుంది. కారు పార్కింగ్ స్థలం మాత్రం అతివిశాలంగావుంటుంది. సెలవు దినాల్లో గడిపేందుకు విడిదిగృహం నిర్మాణంకోసం అక్కడ స్థలాన్ని ఎవరో కొనుగోలుచేశారని - అక్కడవున్న వింతయిన భౌతిక పరిస్థితులవల్ల ఇల్లు కట్టలెక ' మిస్టరీ స్పాట్ ' గా పేరుపెట్టి పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేశారని చెబుతారు. అక్కడ విశేషమేమిటంటే ఆ 150 అడుగుల స్థలంలో భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు. నిట్టనిలువుగా మనిషి నిలబడలేడు. కనిపించని ఏదో శక్తి బ్యాలన్స్ తప్పిపోయేలా చేస్తుంది. ఫొటోలు-వీడియోలకన్నా- దీన్ని స్వయంగా చూస్తేనే అందులోని ఆకర్షణ అర్థం అవుతుంది. నిలబడ్డప్పుడు వెనక్కు విరుచుకు పడిపోతున్నట్టుగా వుంటుంది. ఏటవాలుగావున్న బల్లచెక్కపై బంతులు వేస్తే - అవి కిందనుంచి పైకి వస్తాయి. ద్వారబంధం పట్టుకుని వేళ్ళాడితే 30 డిగ్రీలవంపు తిరిగినట్టుగావుంటుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి ఓ ప్రక్కప్రయత్నాలు- పరిశోధనలు సాగిపోతున్నా మరోప్రక్క దీనిని చూడడానికి ఏటా వచ్చే సందర్శకుల సంఖ్య లక్షలు దాటిపోతోంది.

మాయలమారి నగరం

మా అమెరికా యాత్రలో అద్భుత ఘట్టం నవంబర్ లో మొదలయ్యింది. ఒక వీకెండ్ కు అటూ ఇటూ సెలవలను జోడించి లాల్ -లాస్ వేగాస్, గ్రాండ్ కానియన్ ట్రిప్ కు ఏర్పాటు చేశాడు. నిజానికి మేము సియాటల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి నెలరోజుల ముందుగానే హోటల్ గదులు -చూడవలసిన ప్రదేశాలకు ఎంట్రీ టిక్కెట్లు ఇంటర్ నెట్ లో బుక్ చేశాడు. నేనూ మా ఆవిడ, లాల్, లాల్ అత్తమామలు కరుణ-రామచంద్రం, స్నేహితుడు శ్రీనివాస్ అతడి భార్య జ్యోతి అంతా కలిసి రెంటల్ కార్లో బయలుదేరాము. లాల్ భార్య దీప-కుమార్తె స్పురిత (ఏణ్ణర్థం పసిపిల్ల) ఆ సాయంత్రం విమానంలో బయలుదేరి మేము లాస్ వేగాస్ కారులో చేరేసరికి అక్కడికి వచ్చేట్టుగా ఏర్పాటుచేశారు. ఎయిర్ పోర్టుకి వెళ్ళి ఎనిమిదిమంది సుఖంగా ప్రయాణించే ఒక పెద్ద కారుని రెంటల్ కంపెనీ నుంచి కిరాయికి తీసుకున్నాము. ఇలాంటి కంపెనీలు దేశంలో అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషలో వుంటాయి. ఇంటర్ నెట్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఒక చోటకారు తీసుకుని మరోచోట వదిలివేయవచ్చు. అతి ఖరీదయిన మెర్సిడిస్ వంటి కార్లుకూడా అద్దెకు దొరుకుతాయి. ఒక్కొక్క కంపెనీ వందలాది కార్లు మైన్ టైన్ చేస్తుంది. విశలమైన ఆవరణలో తళతళ మెరిసే సరికొత్త వాహనాలు ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో సిద్ధంగా వుంటాయి. నెట్లో వివరాలు సరిచూసుకుని కారు నెంబరు ఇస్తారు. తాళాలు కూడా కార్లకు తగిలించే వుంటాయి. మనకు కేటాయించిన కారుని తీసుకుని ఘూమ్మున వెళ్ళిపోవచ్చు. సొంతకార్లువున్నవారుకూడా దూరప్రయాణాలకు రెంటల్ కార్లనే వాడతారు. కారు తిరిగి స్వాధీనం చేసేటప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్రోల్తొ ఇవ్వాలి. తిరిగి ఇచ్చేటప్పుడు కారుని కనీసం చెక్ కూడా చెయ్యరు. కాకపోతే శుభ్రంగా తుడిచి అప్పచెప్పాలి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ వేగాస్ సుమారు అయిదువందల మైళ్ళదూరం. చాలావరకు ఎడారి భూములు. హైవే చాలా బాగుంది. అతి వేగంగా వేళ్ళే వారిని నియంత్రించడానికి పోలీసు పెట్రోలింగ్ వాహనాలు అస్తమానం గస్తీ తిరుగుతూనే వుంటాయి. ఇందుకోసం హెలికాప్టర్లను కూడా వాడుతున్నారు. మధ్యలో కారు ఆపి దారి వాకబు చేయడానికి వీలుండదు. రోడ్ మ్యాప్ ఆధారంగానే వెడుతుండాలి. హైవేని ఇక్కడ ఫ్రీవే అంటారు. వీటిమీద కాలినడక వెళ్ళేవారిని అనుమతించరు. మొత్తం దారంతా కొండలమయం. కొండ ఎక్కడం దిగడం, మరోకొండ ఎక్కడం దిగడం ప్రయాణమంతా ఇలాగేవుంటుంది.

వాహనాల రాకపోకల కోసం నాలుగేసి లేన్ల చొప్పున ఆ కొండలమీదుగా రోడ్లువేశారు. వొంపులు వుండవు. నాలుగు వేల అడుగులపైకి వెళ్ళి మళ్ళీ ఏటవాలుగా కిందికి దిగిపోతుంటాయి. అంతరిక్ష పరిశోధనలకంటే అమెరికాలో రోడ్లు నిర్మించి వాటిని మైన్ టైన్ చేస్తున్న విధానమే అపూర్వంగా తోచింది. మధ్యమధ్యలో ఏవోవో పట్టణాలు, పల్లెలు తగిలినా అవి ఫ్రీవేకు దూరంగా వుంటాయి. వాటికి వెళ్ళాలంటే ఫ్రీవేనుంచి ప్రక్కకు తొలగి వేరేమార్గంలో ఫ్లయివోవర్ల మీదుగా ప్రయాణించవలసి వుంటుంది. మార్గమధ్యంలో ఆహారపానీయాలకు వెతుక్కోవలసిన పనిలేదు. మెక్ డోనాల్డ్స్, బర్గర్ కింగ్, స్టార్ బక్స్ వంటివి అన్ని చోట్ల అందుబాటులోవుంటాయి. పెట్రోలు (గ్యాస్ అంటారు) ధరలే విచిత్రం. రోడ్డుకు ఇవతల బంకులో ఒక ధరవుంటే అవతల ప్రక్కన బంకులో ఇంకోధరవుంటుంది. కంపెనీనిబట్టి ధరలు ఏరోజుకారోజుమారుతూవుంటాయి. ధరల మార్పుని బంకుల్లో ప్రముఖంగా ప్రదర్శించారు.

నిద్రపోని నగరం

లాస్ వేగాస్ నిజంగా ఒక అద్భుతాల నగరం. ఒకదాన్నిచూసి ఔరా! అని ముక్కున వేలేసుకునేలోపే మరో అద్భుతం దర్శనమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జూదాలు ఆడేవారికి, ఆనందమే జీవనమకరందమని పాడుకుంటూ జీవితాన్ని హాయిగా గడపాలనుకునేవారికి ఈ నగరం రాజధాని. జూదగృహాలకు (క్యాసినోలు) చట్టరీత్యా అనుమతివుంది. వ్యభిచారం నగ్నప్రదర్శనలను పక్కకు పెడితే వీటిపై ఆసక్తిలేని పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకునే ఎన్నెన్నొ ఆకర్షణలు ఇక్కడ వున్నాయి. ఈ నగరంలో ప్రధానమైన వీధి కొన్ని మైళ్ళపొడవున అతివిశాలంగావుంటుంది. అటూ-ఇటూ విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోయే హోటళ్ళు. అక్కడ హోటళ్ళన్ని కాసినోలే. జూదమాడెవారు అక్కడ బసచేస్తుంటారు. కాసినోలకి క్షణం విరామముండదు. 365 రోజులూ- 24గంటలూ తెరిచేవుంటాయి. జూదమాడేవారికి అర్థనగ్న సుందరీమణులు రాత్రి-పగలు తేడాలులేకుండా మద్య-మాంసాలు సరఫరా చేస్తూనే వుంటారు. ప్రతిక్షణం వేలాది డాలర్లు చేతులుమారుతునేవుంటాయి. ఇక్కడ ప్రతిహోటలు ఒక ప్రత్యేక తరహాలో వుంటుంది. న్యూయార్క్, పారిస్, లండన్ ఇలాంటి పేర్లతో ఆ నగరాలకు నమూనాగా వీటిని నిర్మించారు. న్యూయార్క్ హోటల్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడవచ్చు. పారిస్ హోటల్ లో ఈఫిల్ టవర్, లండన్ హోటల్లో థేంస్ వంతెన కళ్ళకు కట్టినట్టుగా దర్శనమిస్తాయి. మేము అక్కడ వున్న మూడు రాత్రులూ- మూడు వేర్వేరు హోటళ్ళలో వుండేటట్టుగా లాల్ ఏర్పాటు చేసాడు. మొదటిరోజు సర్కస్ సర్కస్ అనే హోటల్ లో దిగాము. 30 అంతస్తులతో విశాలమైన ప్రాంగణంలోవుంది. కారుపార్కింగ్ కోసం నిర్మించిన భవనమే మనవైపు ఫైవ్ స్టార్ హోటల్ అంత వుంది. అన్ని హోటళ్ళకూ కారుపార్కింగులు ఇలాగే వుంటాయి. కాసీనోల్లోకి పిల్లల్ని అనుమతించరు. అందుకని వారి కాలక్షేపంకోసం రోలర్ కోస్టర్ జెయింట్ వీల్ మొదలయిన వాటితో హైదరాబాద్ ఎగ్జిబిషన్ అంత ప్రాంగణంవుంది. వేటికి విడిగా ఎంట్రీ టిక్కేట్లువుండవు. కాసీనోలతోసహా కొన్ని గంటలపాటు ఆ హోటల్లోనే తిరిగినా కూడా మొత్తం విశేషాలన్నీ చూడలేకపోయాము.

మర్నాడు పిరమిడ్ హోటల్ లో బస చేసాము. దీన్ని పిరమిడ్ ఆకారం లో నిర్మించారు. లిఫ్టులు కూడా ఏటవాలుగా పైకీ కిందకూ నడుస్తాయి. వాలుగా నిలబడి పైకి వెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హోటల్ లో ప్రతి విభాగాన్ని అరబ్ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అలాగే మరో హోటల్ లో రోం నగరంలోవున్నామా అనే భ్రాంతి కలుగుతుంది. వీధులు- దుకాణాలు పైన వినీల ఆకాశంతో సహా కృత్రిమంగా తీర్చిదిద్దారు. ఆకాశంలో మేఘాలు కదిలి వెడుతున్నట్లుగా కానవస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ ని కూడా ఆయా ప్రాంతాల ప్రాచీన వైభవం వెల్లివిరిసేలా తీర్చిదిద్దారు. హోటళ్ళ విస్తీర్ణం ఎక్కువకావడం వల్ల ఒకదానినుంచి మరో హోటల్ చేరుకునేందుకు ఒంటిస్తంభాలపై ప్రయాణించే ఎలక్ట్రిక్ ట్రైన్లు వున్నాయి. కొన్ని మైళ్ళ పొడుగున హోటళ్ళు కాసినోలు ఒకదాని వెంట మరొకటి ఒకదాన్ని మించి మరొకటి నిర్మించారు. ప్రతిహోటల్ కూడా పర్యాటకులను ఆకర్షించడానికి ఆరుబయలు స్థలంలో ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తుంది. ఇవన్నీ ఉచితమే. ఒక హోటల్ లో కొన్ని వందల అడుగుల ఎత్తువరకూ సంగీతానికీ, విద్యుత్ కాంతులకూ అనుగుణంగా ఎగసిపడే వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేస్తే మరో హోటల్ వారు నదిలో ప్రయాణించే ఒక నౌకపై దోపిడి దొంగలు దాడి చేసే దృశ్యాలను నేత్రపర్వంగా ప్రదర్శిస్తారు. మరో హోటల్ లో కృత్రిమ వర్షం కురవడం చూపించారు. వున్నట్టుండి ఉరుములు, మెరుపులతో హోటల్ వాతావరణం హఠాత్తుగా మారిపోతుంది. ఆకాశానికి చిల్లులు పడ్డట్టు హోరున వర్షం కురుస్తుంది. మరోచోట అగ్నిపర్వతం పేలుతుంది. అగ్ని కణాలు విరజిమ్ముతూ లావా ఎగిసి పడుతుంది. ఇలా ఒక్కొక్క కాసినోవారు ఒక్కొక్క విధమైన అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు.
(సశేషం- మళ్ళీ తరువాతి సంచికలో)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)