ఇప్పుడిది అవసరమా?
ఆ మధ్య నేను ఓ తెలుగు సినిమా చూసాను. అందులో ఒక యజమాని దగ్గర పనిచేసే ఒకతను ప్రతిసారి అవసరమైన దానికంటే ఎక్కువగా సమాచారం ఇతరులకి అందిస్తుంటాడు. అలాంటి సమయాల్లో ఆ యజమాని 'ఇప్పుడిది అవసరమా?' అని అతన్ని వారిస్తుంటాడు. ఈ మధ్య పత్రికల్లో వస్తున్న పోతన స్వస్థలం మీద వస్తున్న వాదోపవాదాలను చదువుతుంటే నాకు 'ఇప్పుడిది అవసరమా?' అన్న ఆ మాట స్ఫురణకు వచ్చింది.
'బమ్మెర పోతన ఏకశిలా నగరవాసి కాదు. అతడు కడప దగ్గరి ఒంటిమిట్ట వాడు ' అని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 'కడప ద్విశతాబ్ది ఉత్సవాల 'లో చేసిన ప్రకటన వల్ల మొదలైంది ఈ గొడవ. ఒకరినొకరు నిందించుకోవడం, మీరు అజ్ఞానులు అంటే, మీరు సంకుచిత స్వభావులు అని పరస్పర దూషణలాడడం వల్ల చిలికి చిలికి గాలివానలా తయారయ్యింది ఈ అంశం. సమంజసామంజసాలు పక్కనపెడితే భాగవతామృతాన్ని ఆంధ్రలోకానికి అందించిన పోతనామాత్యుని ఇలా రచ్చకీడ్చి ఒకరిమీద ఇంకొకరు బురద చల్లుకోవడం ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్న తలెత్తక మానదు.
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని ప్రజాకవి వేమన్న అన్నట్టు ఎల్ల కాలాల్లోను కొందరు మహాత్ములు ఈ భువిన పుడుతూనే ఉంటారు. ఇది మనకు చరిత్ర ద్వారా విదితమే. అలాంటివారు 'మహాత్ములు ' గా పరిగణించబడటానికి కారణాలు ఏమిటంటే, వారి దృక్పథం విశ్వమంత విశాలమైంది. ఆశయం ఆకాశమంత ఎత్తైంది. వారి ఆలోచనలు లోకకల్యాణనికి సంబంధితమైనవి. వారు తలపెట్టిన కార్యాచరణాలకు సరిహద్దులనేవి ఉండవు. తుపాకి తూటాకు బలై గాంధి నేలకొరిగినప్పుడు, యావత్తు భారతదేశం శోకించింది కాని గుజరాత్ లోని పోర్బందరు వాసులు మాత్రమే విలపించలేదు. ఎందుకంటే అతను మన భారతజాతికి మొత్తానికి తండ్రిలాంటి వాడు కాబట్టి. అలాగే, ఎక్కడో మెసిడోనియాలో జన్మించి, భారతదేశంలో మెషినరీ స్థాపించి, ప్రపంచంలోని నిర్భాగ్యులకి సేవ చెయ్యడం ద్వారా 'థెరెసా' ప్రపంచానికే 'జగజ్జనని 'గా గుర్తించబడింది.
పోతన భాగవతం మొదట్లో 'పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట ' అంటూ 'భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా దమ్మిచూలికైనా, విబుధ జనులవలన విన్నంత కన్నంత, తెలియ వచ్చినంత తేటపఱతు ' అంటూ వినయాన్ని ప్రదర్శిస్తూ సంస్కృత భాగవతంలోని భక్తితత్త్వాన్ని మనందరి కొరకు మధురమైన పల్కులలో తెనిగించాడే తప్ప ఏ ఒక్క ప్రాంతవాసులకో కాదు. శ్రీ మహాభాగవతము నిత్యనూతనమైనది. 'ఇందుగలడందు లేడని సందేహము వలదు...', 'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై...', 'వారిజాక్షులందు వైవాహికములందు...' మొదలుగాగల పద్యాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించడమే మన తెలుగువారికి కలిగిన అదృష్టం. అందుకే పోతన్న 'మనందరి తెలుగువాడు '.
అసలే ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ తత్త్వాలు, వేర్పాటు వాదాలు ప్రబలుతున్నాయి. రాష్త్రాన్ని రెండుగా కాదు, ఐదు భాగాలుగా విభజించాలన్న కోరికలు వినిపిస్తున్న ఈ తరుణంలో విజ్ఞులైన సాహితీవేత్తలు 'పోతన ఏ ప్రాంతానికి చెందినవాడు?' లాంటి సమస్యలు లేవనెత్తితే వాటికి వేరే రంగులు పులమబడి తప్పుడు చేతుల్లోకి మారిపోయే అవకాశమున్నది. ఆ తర్వాత చేతులు కాలాకా ఆకులు పట్టుకొని ప్రయోజనమేమి ఉండదు. సాహిత్యానికి ఎల్లలుండవు కాబట్టి, సాహిత్యాంశాలని ప్రాంతీయ వాదాలకి ముడిపెడితే మన తెలుగు సాహిత్యాన్ని మనమే కించపరచుకొన్న వారమవుతాం. పట్టువిడుపులు తెలిసిన సాహిత్యకారులు ఈ వివాదాన్ని ఇంతటితో ముగించి 'మావాళ్ళు గొప్పవాళ్ళు' అనే బదులు , 'గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు' అనే ధోరణి అవలంబిస్తే బాగుంటుంది.
మీ
మృత్యుంజయుడు
సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.

































