కాళిదాసు కుమార సంభవం : రెండవ భాగం
మొదటి భాగానికై ఈ లంకె నొక్కండి.
'వేదవేత్తలలో శ్రేష్టుడైన ఓ మహాత్మా! నా సఖి చెప్పినది సత్యం. అందరాని పండ్లను ఆశించినట్లు నేను శివుని కోరుకున్నాను. నా కోర్కె నెరవేరడానికి మరో మార్గం కనిపించక ఈ తపస్సు సాధనంగా చేసుకున్నాను' అని పలికింది.
అందుకు బ్రహ్మచారి 'శివుణ్ణి నేనెరుగుదును. అయినా ఒకసారి తిరస్కరించిన ఆ శంకరుణ్ణి నీవు మళ్ళీ ఎందుకు కోరుతున్నావు?' అని శివుని అనేక విధాల నిందిస్తూ పార్వతి మనస్సు మళ్ళించడానికి ప్రయత్నించాడు.
ఆ బ్రహ్మచారి కర్ణకఠోరమైన మాటలకు పార్వతికి కోపం వచ్చింది. 'శివుడు ఎలాంటివాడని నీవు విన్నావో అలాంటివాడే అవనీయి. నా మనసు మాత్రం ఆయనమీదే లగ్నమై ఉంది. నీవు ఆక్షేపించి ప్రయోజనం లేదు' అని, తరువాత చెలికత్తెలతో అతనిని పంపించి వేయమని చెప్పి వెళ్ళబోతుండగా, శంకరుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఆమె చేయి పట్టుకున్నాడు. 'ఓ సుందరాంగీ! నీవు నీ తపస్సు చేత నన్ను ఆకట్టు కున్నావు. నేటినుంచి నేను నీకు దాసుడను' అని పలికాడు. 'నన్ను మీరు మా తండ్రి హిమవంతుని వలన ప్రదాన పూర్వకంగా పరిగ్రహించండి. అది నాకెంతో సంతోషం' అని చెలికత్తె ద్వారా తెలుయజేసింది. శివుడు కూడా అలాగేనని కష్టం మీద ఆమెను విడిచి వెళ్ళాడు.
తరువాత నక్షత్రరూపాన అకాశమున వెలుగొందే తేజోమూర్తులగు సప్త ఋషులను మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే వారు అరుంధతితో కూడా ఆయన ఎదుట ప్రత్యక్షమైనారు.
'ఈశ్వరా! మేము బ్రహ్మచర్యాశ్రమంలో ఎంతో నిష్టగా వేదాలు అభ్యసించాము. గృహస్థంలో శాస్త్రప్రకారం అగ్నియందు హోమాలు చేసాము. వానప్రస్థంలో చాంద్రయణాది వ్రతాలు ఆచరించాము. ఇలా మేము చేసిన సకల తపస్సులకూ, సమస్త పుణ్యాలకూ ఫలం ఈ రోజు మాకు పండింది. సకల జగత్తులకూ ప్రభువైన నీవు, మమ్ములను తలుచుకోవడంవలన మాకు మనసులోనే కోరడానికి శక్యంకాని భాగ్యం కలిగింది. నిన్ను స్మరించినవాడు కృతార్థులలో శ్రేష్టుడు. అలాంటి నీవే మమ్ములను స్మరించావు. మేము ఎంత కృతార్థులమో చెప్పవలసిన పని లేదు.
ఓ భగవంతుడా! ఇప్పుడు మాకు కనిపిస్తున్న నీ రూపం లోకాలను సృష్టించేదా, లేదా లోకాలను కాపాడేదా, లేక సంహరించేదా? నీవీ రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరవు? మాకు చెప్పవలసినది. ఒకవేళ ఈ విషయం రహస్యమైనదీ, మాకు చెప్పరానిదీ అయితే, పోనీ చెప్పనక్కరలేదు. మమ్మలను ఎందుకు తలుచుకున్నావో అదైనా చెప్పు. మేము ఏమి చేయాలో చెప్పు, మా వలన కావలసిన పనేమిటో ఆఙ్ఞాపించు' అని సప్తరుషులు శంకరుని ప్రశ్నించారు.
అందుకు శివుడు 'ఓ మహర్షులారా! నేను చేసే పని ఏదీ కూడా నా కోసం కాదు. ఆ విషయం మీకు తెలుసు. ఇతరుల కోసమే నేను - పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమాని - అను ఎనిమిది రూపాలు ధరించి తిరుగుతున్నాను. అలాంటి నన్ను శత్రువులచే పీడితులైన దేవతలు పుత్రుణ్ణి కనమని వేడుకున్నారు. నేను పార్వతిని సంగ్రహించ దలిచాను. పార్వతిని నాకిచ్చి వివాహం చేయమని మీరు వెళ్ళి హిమవంతుని అడగవలసినది. ఓషధీప్రస్థానానికి వెళ్ళండి. ఎలాగైనా ఈ కార్యం నెరవేర్చండి. మళ్ళీ వచ్చి నన్ను ఈ మహాకాశీ నది ఒడ్డున కలుసుకోండి' అని చెప్పాడు. సప్తర్షులు, అరుంధతి మనోవేగముతో ఆకాశానికి ఎగసి, హిమవంతుడు రాజధాని ఓషధీప్రస్తానానికి వెళ్ళారు. విషయమంతా వివరించారు.
శివుడికి తన కూతురుని ఇవ్వడం హిమవంతునికి పూర్ణంగా ఇష్టమే. అయినప్పటికీ, తన భార్య మేనక అంగీకారం కూడా తీసుకుని, పార్వతిని 'అమ్మాయీ! విశ్వాత్ముడైన శివుడికి నిన్ను ఇవ్వదలుచుకున్నాము. అడగడానికి వచ్చినవారు మహామునులు. నీకు గార్హస్థ్య ప్రయోజనం చేకూరింది' అని చెప్పి మునులతో 'అయ్యలారా! ఇదిగో శివుడికి ఇల్లాలు. మీకు మ్రొక్కుతున్నది' అని పలికాడు.
తాము వచ్చిన పని నెరవేరినందుకు మహర్షులు హిమవంతుని అనేక విధముల పొగిడి, నేటికి నాల్గవరోజు పెళ్ళికి అనుకూలమైనదని చెప్పి, పార్వతి మనోరధం ఈడేరునట్లు దీవించి, శెలవు తీసుకుని వెళ్ళిపోయారు. శివుడిని కలుసుకుని జరిగినదంతా వివరించారు. తమతమ తావులకు వెళ్ళిపోయారు.
శుక్ల పక్ష తిథి. ఆనాడు సప్తమశుద్దిగల లగ్నంలో పార్వతి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. దేవతలంతా మహేశ్వరునికి తలా ఒక విధంగా సేవ చేసారు. పరబ్రహ్మ ఏకరూపమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే మూడు విధాలుగా విలసిల్లినది. ఈ మూర్తుల జేష్ఠ, కనిష్ఠ భావములు తాత్కాలితాలే కాని శాశ్వతం కావు. ఒక సమయంలో విష్ణువు శివుడికి జ్యేష్ఠుదవుతాడు. మరొకప్పుడు, శివుడు విష్ణువుకు జ్యేష్ఠుదవుతాడు. వేరొకప్పుడు శివకేశవులకు, బ్రహ్మ, ఇంకొకప్పుడు బ్రహ్మకు శివకేశవులు జ్యేష్ఠులవుతూ ఉంటారు.
అత్యంత వైభవంగా వివాహకార్యం యధావిధిగా జరిగిన తరువాత నూతన దంపతులు బ్రహ్మ దేవునికి నమస్కరించారు. 'కళ్యాణీ! వీర పుత్రుని కను' బ్రహ్మ పార్వతిని ఆశీర్వదించాడు. శంకరుని ఏమని దీవించాలో తోచలేదు.
వధూవరులు లౌకికాచారం ప్రకారం చతురస్ర వేదిక వద్దకు పోయి బంగారు ఆసనాలపై కూర్చున్నారు. లక్ష్మీ దేవి ఆ ఆదిదంపతులకు పద్మాన్ని గొడుగుగా పట్టింది. సరస్వతి శంకరుని సంస్కృతములోను, పార్వతిని ప్రాకృతములోను సంభోదిస్తూ సంస్కృత ప్రాకృత వాఙ్మయాలతో స్తోత్రం చేసింది.
ఇంద్రాది దేవతలు తలలువంచి నమస్కరిస్తూ శాపాంతం సమకూరగా సశరీరుడగు మన్మధుని సేవలు గైకొనవలసిందని శివుని ప్రార్ధించారు. శివుడు కూడా మన్మధునిపై కోపం విడిచి దేవతలపై అనుగ్రహ వీక్షణాలు ప్రసరింపజేసాడు.
అందరినీ వీడ్కొల్పి శివుడు పార్వతి చేయిపట్టుకుని రమణీయమైన క్రీడామందిరములోకి ప్రవేశించాడు. శంకరుడు ఉమాదేవితో సురత క్రీడల తేలుతూ హిమవంతుని ఇంట్లో నెల రోజులు గడిపాడు. కుమార్తె ఎడబాటుకు చింతపడుతున్న హిమవంతునికి నచ్చజెప్పి శివుడు పార్వతితో వృషభ వాహనము ఎక్కి తన నివాసానికి బయలు దేరాడు.
మహేశ్వరుడు ఉమాదేవితో క్రీడిస్తూ నూఱు ఋతువులు గడిపాడు. ప్రియురాలిని కూడి క్రీడామందిరములో సుఖిస్తున్న ఈశ్వరుడికి ఒకనాడు ఒక పావురం కనపడింది. అది ఆ మందిరం లోనే తిరుగుతూ పార్వతి కంఠ స్వరాన్ని అనుకరిస్తున్నది. మన్మధుడు రతీదేవితో కూడి జలక్రీడలాడే అమృతసరోవరం నుండి అప్పుడే బయటకి వచ్చిన నురుగులా రమణీయంగా ఉన్నదా పావురం.
శంకరుడు ఆ పావురాన్ని చూసి క్షణంసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అగ్నిహోత్రుడే ఆ కపోత రూపం ధరించి వచ్చాడని గ్రహించాడు. రుద్రుని ముఖం భయంకరంగా మారిపోయింది. అది గమనించిన అగ్నిహోత్రుడు వెంటనే నిజరూపంలో చేతులు జోడించి 'ప్రభూ! సకల లోకాలకూ నీవే ఈశ్వరుడవు. రాక్షసులవల్ల బాధపడుతున్న దేవతలంతా నిన్ను కొలుస్తునారు. ప్రియురాలితో కూడి సుఖిస్తూ నూఱు ౠతువులు గడిపావు. అయినా నీవు కటాక్షించనందువల్ల ముక్కోటి దేవతలూ, ఇంద్రుడూ దిగులుగా ఉన్నారు. నీవు ఎక్కడ ఉన్నదీ చూచి రమ్మని పంపారు. సమయోచితంగా ఈ పావురం రూపం ధరించి వచ్చాను.దేవా! ఇకనైనా ప్రసన్నుడవుకా. నీ కుమారుని మాకు ప్రసాదించు. అతన్ని సేనాపతిగా చేసుకు ఇంద్రుడు నీ కటాక్షంతో తిరిగి స్వర్గ రాజ్యాన్ని సంపాదించుకుంటాడు.' అని అగ్నిహోత్రుడు విన్నవించగా, శంకరుడు ప్రసన్నుడైనాడు.
ఇంద్రుని సేనానాయకుడు, తారకాసురుణ్ణి సంహరించగలిగినవాడు అయిన కుమారుడు జన్మించడం కోసం, జరగవలసిన దాని గురించి ఇంచుక ఆలోచించాడు. తరువాత, ఊర్ధ్వ రేతస్కుడైన శివుడు, పార్వతితో రతిక్రీడ వేళ పతనమైన వీర్యాన్ని అగ్నిహోత్రుడియందు ఉంచాడు. అది ఒక మహా తేజస్సు. యుగాంతమందు కాలాగ్నిలా దుస్సహమైనది. అటువంటి శివ వీర్యం అగ్నిహోత్రుడు ధరించిన వెంటనే అతని దేహం వివర్ణమైంది. మధ్య మసక కమ్మిన అద్దంలా అయింది అతని రూపం.
అయితే రతి సుఖం అనుభవించేవేళ ఇలా అంతరాయం కలిగినందున పార్వతికి ఎక్కడలేని రోషం పుట్టుకువచ్చింది. 'ఓయీ, అగ్నిహోత్రా! నీవు సర్వ భక్షకుడవు, క్రూర కర్ముడవు, ధూమంతో కూడినవాడవు, కుష్టురోగపీడితుడవు అవుదువు గాక' అని శపించింది.రోషకషాయిత లోచన అయిన పార్వతిని శివుడు ఊరడించాడు.
దేవతలను యధోచితంగా పరామర్శించి అక్కడనుండి బయలుదేరి శివుడు పార్వతీ సహితుడై తన నివాసమైన కైలాసం చేరుకున్నాడు. అక్కడే యధేచ్చగా చాలా కాలం విహరించాడు. దేవలోకంలో ఇంద్రుడు దగ్గరకు అగ్నిహోత్రుడు వచ్చి జరిగినదంతా వివరించి 'దేవేంద్రా! శివవీర్యం నన్నిప్పుడు కాల్చివేస్తున్నది. కాలిపోతున్న నా ప్రాణాలు కాపాడు' అని వేడుకున్నాడు.
'అగ్నిదేవా! నీవు వెంటనే వెళ్ళి గంగానదిలో మునుగు. గంగ నీ తాపం తప్పక చల్లారుస్తుంది. శివతేజస్సును ఆమె నీ నుండి స్వీకరించి భరించగలదు' అని చెప్పాడు. ఇంద్రునివద్ద శెలవు తీసుకుని అగ్నిహోత్రుడు వెళ్ళి మందాకినిలో మునిగాడు. అప్పుడు అతనిలో ఉన్న శివతేజస్సును గంగ స్వీకరించింది. అగ్నిహోత్రుడు తాపం నుండి విముక్తుడై అక్కడినుండి వెడలిపోయాడు.
మాఘమాసంలో ఒకనాడు ఆరుగురు కృత్తికలు గంగానదిలో స్నానం చేయడానికై వచ్చి గంగలో మునిగారు. మరుక్షణంలోనే శివవీర్యం వారిలో ప్రవేశించింది. గర్భాలలో శివవీర్యం ప్రవేశించడం వలన కృత్తిగలు ఆరుగురూ గర్భవతులైనారు. ఆ విషయం గ్రహించినవారు తమ భర్తలను తలచుకుని భయభ్రాంతులైనారు. చివరికి వారు గర్భభారం భరించలేక గంగ ఒడ్డున గల రెల్లు వనంలో తమ గర్భస్థ పిండాలను విడిచిపెట్టి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఆవిధంగా మునిపత్నులు విడిచివెళ్ళిన గర్భజాతం ఆరుముఖాలుగల ఒక చక్కని శిశువుగా రూపొందింది. అప్పుడు ఇంద్రాది దేవతలు అక్కడకు వచ్చారు. పరిశుద్ధులై గంగను అనేక విధాల ప్రార్ధించారు. అప్పుడు గంగ దివ్యరూపం ధరించి ఆరుముఖాలుగల ఆ పిల్లవాడికి పాలు ఇచ్చింది. గంగాదేవీ స్తన్యం త్రాగగానే ఆ బాలుడు క్షణక్షణం పెరిగి అందరికీ కన్నుల పండుగ చేసాడు.
ఆ బాలుడి గురించి కృత్తికలు, గంగ, అగ్ని తమలోతాము తీవ్రంగా వాదించుకున్నారు. ఆ శిశువు తమ కుమారుడంటే తమ కుమారుడని తగువులాడు కుంటున్నారు. అదే సమయంలో శివుడు పార్వతీ సమేతుడై దివ్యవిమానంలో అక్కడకు వచ్చాడు. ఆరు రోజులవాడు, ఆరు ముఖాలవాడు అయిన ఆ శిశువును ఆదిదంపతులు చూచారు.
పార్వతి శంకరుడితో 'దేవా! ఈ బాలుడు ఎవరు? ఈ అగ్ని, గంగా, కృత్తికలు ఎందుకు తగువులాడు కుంటున్నారు? ఎవరి బిడ్డ?' అని అడిగింది.
'దేవీ! కుమారుడు నీ కుమారుడే - ఆనాడు మనం రతిక్రీడ సలుపుతున్న తరుణంలో అగ్ని పావురం రూపంలో మన వద్దకు వచ్చాడు. నేనా అగ్నియందు నీ తేజస్సు ఉంచాను. అది అతనినుండి గంగకు సంక్రమించింది. కృత్తికలు గంగలో స్నానం చేసినప్పుడు గంగనుండి కృత్తికల గర్భంలో చేరింది. వారు గర్భవతులై గర్భజాతమును రెల్లు వనంలో విడిచివెళ్ళారు. అదే ఈ శిశువు. పర్వత రాజపుత్రీ! ఈ బాలుణ్ణి ఒడిలో చేర్చుకో' అని పలికాడు. జగన్మాత బిడ్డను దరి చేర్చుకున్నది. చంద్రశేఖరుడు ఆమెకు చెయ్యి అందించగా ఆమె శివుని చేయి పట్టుకుని పిల్లవానితో విమానం అధిరోహించింది. అప్పుడు సమస్త జగత్తు ఆనందం పొందింది. ఒక్క తారకాసుని రాజ్యం మాత్రం భయంతో కంపించింది.
కుమారుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమవుతూ పార్వతీ పరమేశ్వరులకు కన్నులపండుగ చేసాడు. శివుని కుమారుడైన షణ్ముఖుడు ఆరు రోజులకే నవయువకుడైనాడు. మహాబుద్ధిశాలియై, ప్రఙ్ఞావంతుడై, సకల శాస్త్రాలు, శస్త్రాస్త్ర విద్యలూ నేర్చుకున్నాడు.
రాక్షసులు పెడుతున్న బాధలు భరించలేక ఇంద్రుడు దేవతలతో శివుని సన్నిధికి వెళ్ళాడు. 'ఈశ్వరా! నీవు సర్వఙ్ఞుడవు. నీకు తెలియనిదేమున్నది. ఆ తారకాసురుడు దేవతలను పీడిస్తున్నాడు. బ్రహ్మ వరంవలన గర్వితుడై వాడు మూడులోకాలనూ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాడి బాధలు పడలేక బ్రహ్మదేవుని ప్రార్ధించాము. శివుని కుమారుడు మీకు సేనాపతియై తారకాసురుని సంహరిస్తాడని చెప్పాడు. ప్రభూ! అప్పటి నుంచీ ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము' అన్నాడు.
ఈశ్వరుడు రోషకషాయిత లోచనుడై దేవతల కష్టాలు విని జాలి పడ్డాడు. యుద్ధం చేయాలని అమిత కుతూహులముతో ఉన్న కుమారస్వామి వంక జూచి 'నాయనా నీవు దేవతలకు సేనాపతిగా ఉండి యుద్ధంలో ఆ తారకాసురుని సంహరించు' అని చెప్పాడు.
తండ్రి ఆఙ్ఞ విని కుమారస్వామి సరేనన్నట్టు తలవాల్చి ప్రణమిల్లాడు. 'నాయనా! వీరాగ్రేశ్వరుడవై దేవతల విరోధిని జయించి రా' అని శివుడు, 'తండ్రీ! శత్రువులను జయించి నన్ను వీరమాతను చెయ్యి. నా జన్మ చరితార్ధం కావించు' అని పార్వతి పలికారు.
షణ్ముఖుడు తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది వెళ్ళివస్తానని చెప్పి వారి అనుఙ్ఞపొంది స్వర్గ లోకానికి బయలుదేరాడు. ఇంద్రాదిదేవతలు కూడా పార్వతీపరమేశ్వరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, కుమారస్వామి వెంట ప్రయాణమైనారు.
ఇంద్రుడు ముక్కోటిదేవతలను కూడి కుమారస్వామిని దేవసేనాపతిగా శాస్త్ర విధిని అభిషిక్తుని చేసాడు. దేవసైన్యం మొత్తం గొప్ప తేజస్సుతో ప్రకాశించింది. అసంఖ్యాకమైన దేవసేన తారకునిపై దండెత్తి వెడుతుంది. ఆకాశం విరిగి పడుతున్నట్టుగా ధ్వని పుట్టింది. దేవసైన్యం మేరుపర్వతానికి దిగువన గల విశాలమైన ఒక ప్రదేశం చేరుకున్నది.
ఈ వార్త విన్న తారకాసురుడు మహాబలాఢ్యులైన తన సేనానాయకులను పిలచి, సమర సన్నాహాలు చేయమని ఆఙ్ఞాపించాడు. వెంటనే యుద్ధానికి సర్వం ఆయత్తం చేసారు. తారకుడు రధం ఎక్కాడు. అపారమైన రాక్షస సేన అతని వెనక నడచింది. అప్పుడు అనేకములైన మహాత్పాతాలు పుట్టాయి. రాక్షసులలో కొందరు పెద్దలు, విఙ్ఞులు కొందరు కీడు మూడనున్నదని గ్రహించారు. యుద్ధం మాని సైన్యమును వెనుకకు తరలించమని తారకుడికి హిత బోధ చేసారు. దుర్మదాంధుడైన రాక్షస రాజు వారి బోధనలను పెడచెవిన పెట్టాడు.
అప్పుడు ఆకాశవాణి 'ఓరీ మదోన్మతుడా! నీవు జయశీలురైన ఇంద్రాది దేవతలతో కూడిన ఈశ్వరుని కుమారునిపై యుద్ధానికి పోతున్నావు. ఆ బాలుడు ఆరు రోజుల ప్రాయం వాడే అయినప్పటికీ నీ రాక్షస సైన్యం అతనిని ఎదుర్కో లేదు. మూర్ఖుడా, ఇకనైనా నీ ప్రయత్నం మానుకుని కుమారుని శరణు వేడుకో. బ్రతికిపోతావు' అని గంభీర స్వరంలో పలికింది. త్రిలోక విజేత అయిన తారకుడు భయంతో కంపించాడు. రోషం, కోపం ఒక్కసారిగా పెల్లుబికి వచ్చాయి.
యుద్ధం మొదలైంది. రెండు మహాసముద్రాలు ఒకదానికొకటి కలిసినట్లనిపించింది. అప్పుడు పుట్టిన ధ్వనులు సకల లోకాలనూ కంపింప చేసాయి.
మహోత్సాహంతో పోరు సాగించారు. రాను రాను యుద్ధం ఘోరమైంది. ఉభయపక్షాలవారూ ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేసారు. రణరంగం యావత్తూ పీనుగుల పెంట అయ్యింది. యుద్ధభూమిలో నక్కలూ, పిశాచాలూ నాట్యం చేసాయి. అక్కడ ప్రవహించిన నెత్తుటేరులలో ఏనుగులు మునిగిపోయినవి.
దేవసైన్యాలు అంతకంతకూ మహోత్సాహంతో యుద్ధం చేస్తూ ఉండడం చూచిన తారకుడు బిగ్గరగా వికటాట్టహాసం చేసి, విల్లు అందుకుని తన శరవర్షంతో దిక్పాలకులను ముంచివేసాడు. దిక్పాలకులు కూడా ఏ మాత్రం చెదరక తారకునిపై శస్త్రాలు ప్రయోగించారు. రాక్షసుడు రోషంతో విజృంభించి భయంకరమైన సర్పాకారములైన బాణాలు అనేకం ప్రయోగించాడు. నాగపాశాలనే ఆ బాణాలు అగ్ని వలే ప్రజ్వరిల్లుతూ పోయి ఇంద్రాది దేవతలను బంధించి వేశాయి. అది చూచి దేవసైన్యం అంతా కలవర పడింది.
అయితే కుమారస్వామి అది గమనించి, ప్రసన్న దృష్టితో నాగపాశ బద్ధులైన ఇంద్రాది దేవతలవంక ఒక్కసారి చూచాడు. అదేమి చిత్రమోగాని నాగపాశ విముక్తులైనారు. దేవసైన్యం కుమారస్వామిని అనేక విధాల పొగిడింది. ఇదంతా చూచి తారకుడు భగ్గున మండిపడ్డాడు. తన రధాన్ని కుమారస్వామిపై పరిగెత్తించి 'ఒరే బాలకా! పార్వతీ పరమేస్వరులకు నీవు ఒక్కడవే పుత్రుడవు. నా బాణాలకు గురి అయి చావు ఎందుకు కొని తెచ్చుకుంటావు. నా మాటవిని రణరంగం నుండి తప్పుకో' అని హెచ్చరించాడు.
'ఓరీ దానవపతీ! గర్వంతో వాగడం నీకు తగదు సుమా! అనవసర ప్రేలాపన ఎందుకు? చేతనైతే ఆయుధం పట్టి యుద్ధం చేయి' అని పురిగొల్పాడు కుమారస్వామి. తారకుడు కోపంతో ఉడికిపోయి, దిక్కులు పిక్కటిల్లి పోయేటట్లు ధనుష్టంకారధ్వని చేసి, దివ్య బాణాలు సంధించి కుమారస్వామిపై ప్రయోగించాడు. అప్పుడు కారు చీకట్లు కమ్మాయి. కుమారస్వామి ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియలేదు. అయితే శివానందుడు చెక్కుచెదరక ధనుస్సును ఎక్కుపెట్టి, అల్లెత్రాటిని ఆకర్ణాంతం లాగి, వాడి శరాలు గుప్పించాడు. అప్పుడు చీకట్లు చీలిపోయాయి. కుమారుడు బాలభాస్కరునిలా ప్రకాశించాడు.
తారకుడు ఇక మామూలు శస్త్ర యుద్ధం లాభం లేదనుకున్నాడు. మాయా యుద్ధాన్ని ప్రారంభించి వాయువ్యాస్త్రాన్ని సంధించాడు. దేవసైన్యం యావత్తు ఎండుటాకులవలె గగన వీధిలో పరిభ్రమిస్తూ దిక్కుతోచక బిగ్గరగా కేకలు పెట్టసాగింది. దేవసైన్యం దురవస్థ చూచాడు కుమారస్వామి. వెంటనే తన అద్భుతమైన దివ్యశక్తిని ప్రదర్శించాడు. తృటికాలంలో దేవతలకు దురవస్థ తొలగి పోయింది. అదిచూచి తారకుడు వెంటనే శత్రుసంహారకారమైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దేవతలు ఎక్కడలేని భయంలో మునిగిపోయారు. నలుదిక్కులా చెల్లాచెదరై పరుగులు తీసారు. కుమారస్వామి ఆగ్నేయాస్త్రాన్ని అణచివేసే వారుణాస్త్రాన్ని తారకుడిపై ప్రయోగించాడు.
తన అస్త్రం నిరుపయోగం కావడంతో తారకుడు మండిపడి భీకర కరవాలం చేతపట్టి రధమునుండి దూకి కుమారస్వామిపై లంఘించాడు. అదిచూచి కుమారుడు మందస్మితవదనారవిందుడై అద్భుతమైన తన శక్తి ఆయుధాన్ని తారకునిపై ప్రయోగించాడు. అది తారకుని గుండె చీల్చి వేసింది. ప్రాణాలు కోల్పోయి నేలకూలాడు.
ఇంద్రాది దేవతలు మహదానందంతో పులకితగాత్రులై జయజయ ధ్వానాలతో షణ్ముఖుని కీర్తించారు. చాలాకాలంగా తమను అనేక బాధలు పెట్టి, అవమానాలపాలు చేసిన తారకుడు మరణించడంతో దేవకోటి, సమస్తలోకాలు, పంచభూతాలు సంతోషించాయి. దేవతలంతా కుమారస్వామి బాహుబలాన్ని, అద్భుతమైన మహిమను వేనోళ్ళ కీర్తించారు. సమస్తలోకాలలోనూ మరల శాంతీ, కాంతీ నెలకొన్నాయి. దేవతలకు తిరిగి స్వర్గలోకం లభించింది. ఇంద్రుడు ఎప్పటివలె అమరలోకాన్ని పాలిస్తున్నాడు

































