అమెరికాలో కూడా...?
డిసెంబర్ నెల. శీతాకాలం. ముసుర్లు కమ్ముకొని భోరున ఒకటే వర్షం కురుస్తోంది. సూర్యుడు మేఘాలా చాటున తొంగుట్టున్నాడు. మసక చీకట్లు కమ్ముకొన్నాయి. వీచే చలిగాలికి చెట్లు వణుకుతూ అటూ ఇటూ కదులుతున్నాయి. మొత్తానికి ప్రకృతిలో విషాదం నెలకొన్నట్టుంది.
బయట వాతావరణానికి తగ్గట్టే అఫీసులో కూడా అందరూ సీరియస్ గా పనిచేసుకుంటున్నారు. ఎందుకో ఈరోజు 'పని తక్కువ, మీటింగులు ఎక్కువ'లా కాకుండా ఎవరికివారు 'రాముడు మంచి బాలుడు'లా కాఫీలు చప్పరిస్తూ పనిచేస్తున్నారు.
అలాంటి వాతావరణాన్ని భంగపరుస్తూ పవర్ (అంటే ఇండియా పరిభాషలో కరెంటు అన్నమాట) ఉన్నట్టుండి పోయింది. అందుకు ప్రతిచర్యలా అందరి నోళ్ళలొంచి 'హాకారం' మూకుమ్మడిగా వెలువడింది. లాప్ టాప్ లు బాటరీ మీడ నడవడం మొదలెట్టాయి. లైట్లు ఆరిపోయాయి. కొన్ని క్షణాలు ఫ్లోరులో చీకటి ఆవరించుకొంది. మూలలకున్న నాలుగు ఎమర్జన్సీ లైట్లు వెలగడం మొదలెట్టాయి.
ప్లాను ప్రకారం ఇరవై సెకండ్లలో జెనరేటర్లు ప్రారంభమయ్యాయి. లైట్లు వెలగడం మొదలెట్టాయి. కాని ఏ.సీ. మాత్రం పనిచెయ్యడం లేదు. ఐదు నిమిషాల తర్వాత అందరి ఇన్ బాక్స్ ల్లో ఓ ఈమేయిల్ ప్రత్యక్షమయ్యింది. దాని సారాంశమేమిటయ్యా అంటే - 'తిరిగి పవర్ ఎప్పుడొస్తుందో ఇతమిద్ధంగా తెపియదు. బయట కరెంట్ కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారు. కరెంట్ పోవటానికి కారణం ఇంకా తెలియలేదు.'
నా మానాన పని చేసుకుంటూ పోతుంటే నా క్యూబ్ కు వచ్చాడు మమ్మల్ని ఇండియా నుండి విజిటింగ్ చేస్తున్న ఓ సహోద్యోగి. అతను అమెరికా రావడం ఇదే మొదటిసారి. ఉభయకుశలోపరి మా మాటలు పోయిన కరెంటు మీదకు మళ్ళాయి. అప్పుడు ఆ సహోద్యోగి 'అమెరికాలో కూడా కరెంటు పోతుందా?' అని ప్రశ్నించాడు. అతని ముఖంలోకి చూస్తే అలా ప్రశ్నించినపుడు అదో రకంగా చిన్నగా నవ్వాడు. పెదాలు ఒకదిక్కు వంగి మరోవైపు పైకి లేచాయి. అప్పుడు అతని మనసులోని భావాలను, ఆ ప్రశ్నలోని అర్థాన్ని పట్టుకోడానికి ప్రయత్నించాను. ఎన్నో రకాల అర్థాలు తోచాయి నాకు.
'అయ్యో! అమెరికా అంటే తుస్సేనా? ఇక్కడ కూడా కరెంటు చెప్మాచెయ్యకుండా పోతుందన్న మాట ' అని తీసేసి మాట్లాడినట్టు, 'ఏంటీ? అమెరికాలో కరెంటు పోయిందా? నమ్మశక్యం కావడం లేదు ' అని ఆశ్చర్యపోతున్నట్టు, 'మీరేదో అమెరికాలో గొప్పగా బతుకుతున్నారని గొప్పలు పోతారు. కాని మీరుకూడా ఇలా చీకట్లో అప్పుడప్పుడు బతుకుతున్నారన్న మాట ' అని నా బతుకు బండారం బయటపడట్టు... ఇలా ఎన్నెన్ని అర్థాలో గోచరించాయి.
'ఏంటీ, నేనిలా ఆలోచిస్తున్నానేమిటి? అతగాడు అడిగిన సాధారణమైన ప్రశ్నకు ఇలా వైపరీత్యాలు వెతుకుతున్నానేమిటీ?' అని నన్ను నేను నెమ్మది పరచుకోసాగాను.
అఫీసు పని అయిపోయిన తర్వాత లిఫ్ట్ లో వెడుతుంటే ఇద్దరు తెలుగు సహోదరులు మాట్లాడుకొంటున్నారు. (ఇకనుండి సహోదరులు అనటం తప్పేమో! ఎందుకంటే 'ఎవడి తెలుగు తల్లి ' అని ప్రశ్నిస్తూ కే.సీ.ఆర్. తెలంగాణా తల్లిని సృష్టించాడు కదా. అది వేరే విషయం అనుకోండి). అందులో ఒకతను మాటల మధ్యలో 'అంటే అమెరికాలో కూడా కరెంటు పోతుందన్న మాట ' అని అన్నాడు.
అది విన్న నేను గతుక్కుమన్నాను. మళ్ళీ అదే ప్రశ్న. కారు డ్రైవ్ చేస్తున్నా చెవిలో జోరిగలా అదే ప్రశ్న నన్ను అడుగుతున్నటనిపిస్తోంది. ఈ ప్రశ్నేదో యక్షప్రశ్నల్లో ఒకటైతే బావుణ్ణు. ధర్మరాజు తెలివిగా ఏదో సమాధానం చెప్పుండేవాడు.
ఇలా సరైన సమాధానం వెదకటం వేస్ట్ అనిపించి ఆ ప్రశ్నను వేరే కోణంలోంచి చూడటం మొదలెట్టాను. 'అంటే, ఇండియాలో నివసించే వాళ్ళకి గ్లోబలైజేషన్ వల్ల అన్ని తెలుసనుకొంటాం గానీ, ఇంకా కొన్ని అబ్బుర పరచే విషయాలున్నయన్న మాట. మరుగుననున్న నిజాలు ఇలా అప్పుడప్పుడు బయటపడి ఆశ్చర్యపెడతాయన్న మాట. అయినా నేనుకూడా అమెరికా స్టూడెంటు వీసా చేతపట్టుకొని, అందరు చెప్పినట్టు ఎనిమిది డాలర్లు జేబులో పెట్టుకొని అమెరికా వచ్చినవాణ్ణే కదా. ఇంకా ఇలాంటి 'అమెరికాలో కూడా...' సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని నా గతకాలపు జీవిత పుటలను తిరిగెయ్యటం మొదలెట్టాను. జ్ఞాపకాల గనులను తవ్వటం ప్రారంభించాను.
నేను అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఇండియా వెళ్ళినప్పుడు మా మేనమామ 'ఒరేయ్! అమెరికాలో కూడా నేలమీద మట్టి ఉంటుందా?' అని అడిగాడు. అతను ఒట్టి భోళా మనిషి. ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడుతాడు. కానీ అతను వేసిన ఈ ప్రశ్నలో వ్యంగ్యం అగుపడలేదు. కొంత సిన్సియారిటీ ఉన్నట్టనిపించింది. 'అమెరికా అంతటి గొప్ప దేశంలో దుమ్ము కొట్టే మట్టినేల ఎందుకుంటుంది. ఎదో బంగారం లాంటిది పరిచుంటుంది ' అని అతని ఉద్దేశం అనిపించింది.
అలా సాయంత్రం మా ఊర్లో బజార్లో లుంగీ కట్టుకొని నడుస్తుంటే ఇద్దరు పెద్ద మనుషులు ఎదురయ్యారు. పరామర్శల తర్వాత 'అమెరికా నుండి ఎలా వచ్చావు? కారు తోలుకుంటా?' అని అడిగాడు ఓ పెద్దాయన. వెంటనే ఇంకో పెద్దాయన 'ఛస్! అమేరికా ఇక్కడుందా? చాలా దూరం. విమానంలో రావాలి. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది. ఇక్కడ మనం ఇలా నిటారుగా నిల్చుంటే అమెరికాలో కాళ్ళు భూమికి తగిలించి తలకిందులుగా వేళ్ళాడినట్టుంటుంది ' అని కొద్దిగా అమెరికా గురించి ఎక్కువగానే చెప్పాడు.
అలా మాటలు కార్లు, విమానాలు దాటి అమెరికా జీవితం మీదకు మళ్ళింది. మళ్ళీ మొదటి పెద్దాయన 'అమెరికాలో పనిమనుషులు కూడా పని చెయ్యటానికి ఇంటికి కార్లలో వస్తారట గదా!' అని బోల్డెంత ఆశ్చర్యపొయ్యాడు. అన్నట్టు మనదేశంలో కూడా ఆ కాలం ఎంతో దూరం లేదు. 'నానో' కారు వస్తున్నది కదా. ఇక అందరూ కార్లలో తిరిగే యోగం పట్టపోతున్నది. అది వేరే విషయం అనుకోండి.
మావూరి పెద్దాయనికి బోల్డెంత ఆశ్చర్యం కలిగినట్టు నాకు కూడా అమెరికాలో కొన్ని బోల్డెంత ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురయ్యాయి.
వచ్చిన కొత్తలో యూనివర్సిటీలో నడుస్తుంటే రోడ్డు రిపేరు చేస్తున్న ఇద్దరు అమెరికన్లను చూచాను. వాళ్ళు తెల్లగా ఉండి, బ్లూ జీన్స్ వేసుకొని, బూట్లు తొడుక్కొని, నెత్తిమీద హ్యాట్స్ తో అమెరికన్ ఆక్సెంట్ లో ఇంగ్లీషు మాట్లాడుతూ పనిచేస్తుంటే నాకు చూడ ముచ్చటగా అనిపించింది. అప్పుడు నాకనిపించింది, 'అమెరికాలో రోడ్డు రిపేరు చేసేవాళ్ళు కూడా ఇలా రాయల్ గా ఉంటారన్న మాట '.
అలాగే మొదటిసారి మంగలిషాపుకు వెళ్ళినప్పుడు అక్కడకూడా అదే అనుభవం. ఆ వయసు మళ్ళిన బార్బర్ అంటీ అంటనట్టు, ముట్టీ ముట్టనట్టు 'బర్ 'మని శబ్దం చేసే మెషీన్ తో క్షౌరం చేసాడు. క్షౌరం చేస్తున్నంత సేపు అతను బొగురు గొంతుతో ఏదేదో మాట్లాడాడు. నాకు అందులో ఐదు పదాలు కూడా అర్థమైతే ఒట్టే. నా మాటలు అతనికి ఏ మాత్రం అర్థం కాలేదని ఘంటాపథంగా చెప్పగలను. ఇండియాలో ఊర్లో స్కూల్లో 'గో, వెంట్, గాన్; డూ, డిడ్, డన్ ' అంటూ నేర్చుకొన్న ఇంగ్లీషు అంతా, అమెరికా రావడనికి కష్టపడి నేర్చుకొన్న వొకాబ్యులరీ అన్నీ తుంగలో కలిసిపోయాయి. అప్పుడనిపించింది, 'అమెరికాలో క్షురకులు కూడా చాలా గొప్పగా ఉంటారన్నమాట '.
యూనివర్సిటీలో చదివేటప్పుడూ ఓ పంజాబీ, ఓ పాకిస్థానీ, ఓ బంగ్లాదేశీ రూం మేట్లగా ఉండేవాళ్ళు. పాకిస్థానీ దోస్త్ కి చదవటం బద్ధకం వేసి రూం వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆ సదరు దోస్త్ ఎవరికెంత డాలర్లు ఇవ్వాలని లెక్కలేస్తే నాకు ఐదు డాలర్లు ఇవ్వాలని తేలింది. డాలర్ల బదులు నాకు అతని పాత వాక్ మన్, కాసెట్లు ప్లే చేసేది ఇచ్చాడు. దాన్ని ఓ రోజు నేను చెవుల్లో పెట్టుకొని ఇంకో ఫ్రెండ్ కారులో అతని మిత్రుణ్ణి కలవటానికి వెళ్ళం. అప్పుడు నేను ఆ వాక్ మాన్ ని కారు ఫ్రంట్ సీట్లో వదలి సదరు మిత్రుణ్ణి కలిసి వెనక్కి వచ్చి చూస్తే వాక్ మాన్ మాయం. తెరిచున్న కారు కిటికీలోంచి ఎవరో ఆ పాత వాక్ మన్ ని స్వాహా చేసారు. ఐదు డాలర్ల ఎక్కువైన ఆ కాలంలో నాకు చాలా బాధ వేసింది. అప్పుడు తెలిసింది, 'అమెరికాలో కూడా చిల్లర దొంగలుంటారని.'
జీవితం సజావుగా సాగాలంటే, పని చెయ్యటం, తిండి తినడమే కాకుండా, శరీరానికి కూడా వ్యాయామం కల్పించాలి కాబట్టి ఇంటికి దగ్గర్లోనున్న ఫిట్ నెస్ సెంటర్లో చేరాను. అయితే అంతకు ముందు ఆ సెంటర్ లాకర్ రూం లో నా వస్తువులు కొన్ని మర్చిపోయాను కాబట్టి వాటిని తీకొందామని ఫిట్ నెస్ సెంటర్ కి చేరాను. ఆ లాకర్ రూం లో పనిచేసే అబ్బాయిని నా వస్తువుల గురుంచి ఆరా తీసాను. నేను వేసే అన్ని ప్రశ్నలకి అతని సమాధానం ఒకటే. చిరునవ్వు. అతని సూపర్ వైజర్ తో మాట్లాడితే తెలిసింది అతనికి స్పానిష్ తప్ప ఇంగ్లీష్ రాదని. అప్పుడనిపించింది, 'అమెరికాలో కూడా ఇంగ్లీష్ అస్సలు రానివాళ్ళు ఉంటారని'.
అవును, ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ సిలికాన్ వేలీలో అక్షరం ముక్క ఇంగ్లీష్ రాకున్నా తెలుగువాడు బెదరనవసరం లేదు. ఎంచక్కా ప్రతిరోజు పచ్చి తెలుగు మాట్లాడుకుంటూ, తెలుగు తిండి తింటూ, కొత్తగా రిలీజయ్యే తెలుగు సినిమాలు చూస్తూ పదహారణాల తెలుగు బతుకు బతకొచ్చు. హైద్రాబాదులో తెలుగు రాకుంటే బతకలేం కాని, సిలికాన్ వేలీలో ఇంగ్లీష్ రాకున్నా ఖచ్చితంగా బతకొచ్చు. ఇది నిక్కం.
అలా ఆలోచిస్తూ ఒక ఇంటర్ సెక్షన్లో రెడ్ లైట్ వస్తే ఆగాను. రోడ్డు మధ్యలో ఓ మనిషి అట్ట ముక్క చేతుల్లో పట్టుకొని నిబడి ఉన్నాడు. అట్ట ముక్కలో ఏదో రాసి వుంది. అది చదివితే తెలిసింది అతను హోం లెస్ పర్సన్ అని(అచ్చ తెలుగులో, నీడ లేని మనిషని), ఆకలిగా ఉందని, తోచినంత ధర్మ చెయ్యండని అభ్యర్థిస్తున్నాడు. తినడానికి తిండి లేకపోవడమనేది పేదరికానికి ప్రతీకాష్ఠ. ఆ సన్నివేశం మనసుని కలిచివేస్తుంటే, అప్పుడనుకున్నాను 'ఈ ల్యాండ్ ఆఫ్ అప్పర్చున్యుటీస్ లో కూడా నీడ, కూడు లేని ఆభాగ్యులుంటారని'.
గ్రీన్ లైట్ వచ్చింది గామోలు. వెనకనున్న కారతను మెల్లగా హాంక్ చేసాడు. ఈ 'అమెరికాలో కూడా...?' ఆలోచనల్లోంచి తేరుకొని ముందుకెళ్ళాను.

































