సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.
మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు జనవరి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.
ఈ మాసం సమస్య
"కం: అందమె ఆనందమంచు అద్దము చూచెన్ "
క్రిత మాసం సమస్య క్రితమాసం సమస్య(పుల్లెల శ్యామసుందర్ గారు పంపిన ప్రశ్న)
"ఆ.వె// చెట్టునెక్కె నేమి చేయలేక"
ఈ సమస్యకు వచ్చిన పూరణలు మాకు అందినవారిగా ఇలా వున్నాయి.
మొదటి పూరణ - కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి, విజయవాడ
సింగమెదురురాగ చీల్చువాడ,
అనుచుపలుకుచుండ శునకము భౌమన,
చెట్టునెక్కె నేమి చేయలేక
రెండవ పూరణ - భోగ పప్పు
అదుపు లేని రీతి నాట లాడ,
తోటమాలి నుండి తొలగిపోజాలక,
చెట్టునెక్కెనేమిచేయలేక
మూడవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే
ఒక్కరాయి విసిరె కుక్క మీద
కుక్క వెంటపడగ బిక్క మొహము వేసి
చెట్టునెక్కె నేమి చేయలేక
నాల్గవ పూరణ - బాతల సుబ్రహ్మన్యం, రోచెస్టర్, మిచిగన్
మట్టు పెట్టగ నెంచు మృగ రాజు మదమణంచి
మొట్టగా బిగి లేని మార్జాలమపుడు
చెట్టునెక్కె నేమి చేయలేక
ఐదవ పూరణ - తల్లాప్రగడ, శన్ హోసే, కాలిఫోర్నీ
గుఱ్ఱమెక్కినారు గురువుగారు!
అప్పడాల కఱ్ఱ నాలి చూపగ, వారు
చెట్టునెక్కె ఏమిచేయలెక!
ఆరవ పూరణ -తుమ్మల శిరీష్ కుమార్, హైదరాబాదు
చట్టమునకు పాత చుట్టమొకడు!
పట్టుబట్టి భటులు చుట్టుముట్ట నతడు
చెట్టునెక్కెనేమి చేయలేక!
మరొక పూరణ
నీళ్ళ ట్యాంకులెక్కి దూకేస్తాననడం ఈ మద్య ఆంద్రదేశంలో ఎక్కువయ్యిందిట. దాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్రాశారు....
బ్లాకుమెయిలుకొకడు ప్లాను వేసె!
మింటి ట్యాంకులచట కంటికాన కకట
చెట్టునెక్కెనేమిచేయలేక!
భక్త హనుమ
సీ.//శర్వాంశ సంజాత శార్వర గర్వాది
భంజన తేజస్వి ఆంజనేయ !
జగదద్భుతాఖండ చండప్రచండ
సిద్ధగధాదండ యుద్ధయోద్ధ !
పటుగాత్రుడా చిత్రభానోజ్వలమొనరి
నీవంపు ఖలహృతినింపు నింపు !
సర్వలోకాలోక సంచార సౌఖ్యుండ
గగనఘంటాపద గమనశీల !
తె.గీ.// అట్టి వాడను ఎవ్వారు పట్టగలరు?
క్షతదగాత్ర ఖలులకు రాక్షస ఖలతకు,
శక్తి కరిగి దొరికెననా యుక్తులెండి?
రక్తి కట్టునీ యాటయూ! రామచంద్ర !
శర్వాంశ = శివుని ఆంశ
సంజాత = తో పుట్టినవాడ
శార్వర = చిట్టచీకటి
గర్వాది = పొగరు, చీకటినీ
భంజన = అణచగల
తేజస్వి = తేజస్సుతో వెలిగేటివాడ
ఆంజనేయ != ఆంజనీ పుత్రుడా!
జగదద్భుత= సర్వ జగత్తుకీ ఒక అద్భుతమైన
అఖండ = ఓడింపవీలుకాని
చండప్రచండ = తీక్షణమైన, మహాపరాక్రమంతో
సిద్ధగధాదండ = సిద్ధించిన గధా దండంతో
యుద్ధయోద్ధ != యుద్ధానికి వేళ్ళే వీరుడా!
పటుగాత్రుడా = దృడమైన శరీరము కలవాడా
చిత్రభాను= సూర్యని
ఉజ్వలము= వేడి, తేజస్సు
ఒనరి= తగిలినవాడవై (హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుడిని మింగబోయి మూతి కాల్చుకొనుట విధితమే)
నీవంపు = నీవు పంపు
ఖలహృతిన్ = దుర్మార్గుల వినాశం
ఇంపు నింపు != అందాన్ని నింపుతుంది
సర్వలోక = అన్నిలోకాలనూ
ఆలోక = చూడగలిగి
సంచార = సంచరించే
సౌఖ్యుండ= సౌఖ్యముకలవాడ
గగనఘంటాపద = ఆకాశ మార్గాన
గమనశీల != తిరుగగలిగిన వాడా!
అట్టి వాడను ఎవ్వారు పట్టగలరు?= అట్టి నీవంటివాడను (హనుమంతుడంతవాడిని)ఎవరు పట్టుకోగలరు
క్షతద= రాత్రివంటి(నల్లని)
గాత్ర = శరీరముకలవారు (నల్లటి శరీరము కలవారు)
ఖలులకు = దుష్టులకు (లేక రాక్షసులకు)
రాక్షస = రాక్షసుల
ఖలతకు= దుశ్చేష్టలకూ
శక్తి కరిగి దొరికెననా = ఆతడి బలం తగ్గి దొరికిపోయాడా
యుక్తులెండి?= లేక యుక్తులన్నీ ఎండిపోయాయా (ఏవీ కావు)?
రక్తి కట్టును = (ఏది ఏమైనా సరె) రక్తి కడుతుంది
ఈ యాటయూ = (హనుమంతుని) ఈ ఆట కూడా!
రామచంద్ర !=రామచంద్రుడా!

































