సాంస్కృతిక కార్యక్రమాలు, గంతులూ, చిందులూ

కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి విశ్రాంతి తీసుకునే దాక మనం అనేక పనులు చేస్తుంటాం, అనేక విషయాలు ఆలోచిస్తుంటాం. ఒక్కోసారి ఆ ఆలోచన మనల్ని చాలా లోతైన పరిశీలన చేయిస్తుంది, సమస్యలకు సాధనలను తెలుపుతుంది, ప్రపంచానికి కొత్త మార్గాలనూ అందిస్తూంటుంది. అలాటి సమయాల్లోనే అనిపిస్తుంది, మనం కనుగొన్న ఆ అద్భుత విషయమో లేక మంచి మాటో అందరికీ తెలియపఱచాలని. సరిగా అలా అనుకునే వారి కోసమే ఈ శీర్షిక. ఎప్పుడైనా ఏదైనా ఆలోచన విస్తృతంగా చేసినపుడు వెంటనే ఒక వ్యాసంలా వ్రాసి మాకు పంపండీ. ఈ శీర్షికలో పాఠకులెవరైనా పాల్గొనచ్చు. ఇంకెందుకాలస్యం? మీ ఆలోచనలకు ఓ మంచి రూపం ఇవ్వండి.

ఈ రోజుల్లో తెలుగు సంస్థల సాంస్కృతిక కార్యక్రమాల్లో సరికొత్త సినిమాపాటలకు పిల్లలు చేసే నృత్యాలు లేకుండా జరగటంలేదు. అవకాశం ఉంటే వీటిలో పెద్దలుకూడా పాల్గొంటారు. వీటిలో ఎక్కువ శాతం ఏ భారతీయ సంస్కృతినీ ప్రతిబింబించవనేది తెలిసినదే. ఇదొక కొత్త సంప్రదాయంగా నిలదొక్కుకుంటోందని కూడా అనుకోవచ్చు. ఈ పరిస్థితిలో మనం కొన్ని విషయాలను గురించి ఆలోచించుకోవడం అవసరమేమో.

తెలుగు కార్యక్రమాలంటే ఏమిటో అందరూ ఒకలాగా ఆలోచించరు. చాలామంది లెక్కన అది నలుగురూ చేరి సరదాగా కాలం గడుపుకునే ఒక అవకాశం మాత్రమే. ఈ అభిప్రాయంలో తప్పేమీ లేకపోవచ్చు. అయితే ఒకప్పుడు ఇటువంటి అభిప్రాయం ఉండేదికాదు. మరొకటేమిటంటే మనం మన పిల్లలకు ఎటువంటి సాంస్కృతిక వాతావరణాన్ని పరిచయం చేస్తున్నామో చాలామంది ఆలోచిస్తున్నట్టు కనబడదు. ఆంధ్రప్రదేశ్‌లో 30, 40 సంవత్సరాల కిందట పుట్టి పెరిగినవారు ఎటువంటి సాంస్కృతిక పరిస్థితుల్లో ఎదిగారో ఇప్పటి తరం అటువంటి అనుభవాలను పొందే అవకాశం తగ్గిపోతోంది. ఇది ప్రవాసాంధ్రుల విషయంలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నవారికి కూడా కలుగుతున్న అనుభవమే. కాలం గడుస్తున్నకొద్దీ మార్పులు అతివేగంగా జరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఏ విధంగానైనా నష్టపోతున్నారంటే అందుకు బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే.

ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. సంస్కృతి, సంస్కారం అనేవి సహజంగా పిల్లలకు అబ్బే విషయాలు కావు. మంచి అలవాట్లనూ, మర్యాదలనూ నేర్పినట్టే వీటినికూడా పెద్దలు బుద్ధిపూర్వకంగా పిల్లలకు నేర్పాలి. నాగరికతలో ఒక భాగమైన సంస్కారంకూడా వారసత్వంగా పిల్లలు అందిపుచ్చుకుంటారు. అయితే అది ప్రతి సందర్భంలోనూ సరిగ్గా జరగకపోవచ్చు. వ్యక్తిగత విమర్శగా భావించకపోతే పేరుపొందిన కుటుంబాల్లోకూడా దీన్ని గమనించవచ్చు.

ఉదాహరణకు 1940లలో యువకులుగా, నటులుగా గొప్ప సమకాలీన సంస్కృతివల్ల ప్రభావితులైన ఎన్.టి.రామారావు, నాగేశ్వరరావు, జగ్గయ్య తదితరులు మధ్యతరగతినుంచి వచ్చినప్పటికీ ఆనాటి మేధావుల ప్రభావానికి లోనై తమ సంస్కారాన్ని పెంపొందించుకున్నారు. సినీ, సాహిత్యాది రంగాల్లో అనుభవజ్ఞులైన త్రిపురనేని రామస్వామి, గూడవల్లి రామబ్రహ్మం, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, బి.ఎన్.రెడ్డి, సముద్రాల, కె.వి.రెడ్డి తదితరులంతా వీరి సాంస్కృతిక వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడంతో వీరి ప్రతిభ పెరిగింది. తరవాతి కాలంలో రామారావు రాజకీయోపన్యాసాల్లోనూ, నాగేశ్వరరావు సాంస్కృతికసభల్లోనూ, జగ్గయ్య రచనల్లోనూ ఈ విలువలన్నీ ద్యోతకం అయేవి. అయితే ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఎదిగిన వీరందరూ తమ పిల్లలకు ఆ రకం సాంస్కృతిక వారసత్వాన్ని అందించగలిగారా? ఈనాడు మనం బాలకృష్ణ, లేదా నాగార్జున తదితరులనుంచి అటువంటి సంస్కారాన్ని ఆశించగలమా? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు రాకపోతే దానికి కారణమేమిటి? ఒకవేళ వారికి అటువంటి సంస్కారం అబ్బకపోతే అందుకు బాధ్యులెవరు? లేదా, వారికి మరొకరకం సంస్కారం అబ్బిందా? అది ఎటువంటిది? సమాజం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కనక ఈ కొత్త సంస్కారం తెలుగువారికి ఏ విధంగానైనా పనికొస్తుందా? తెలుగు సంస్కృతికి ప్రతీక అయిన నటరంగంలో ఉన్నతులైన ఇటువంటివారితో పోలిస్తే సామాన్యుల సంగతేమిటి?

పక్కదారి పట్టినట్టుగా అనిపిస్తున్న ఈ చర్చలోని అంశం ఒకటే. పెద్దవారు పూనుకుంటే తప్ప పిల్లలకు సరైన సంస్కారం అందుబాటులోకి రాదు. ఘంటసాల, బాలమురళీకృష్ణ పాటలనూ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాటలనూ విని ఆనందించిన పెద్దలు వాటిని వదిలేసి ప్రస్తుతపు 'గంతులేసే' సంగీతాన్ని మాత్రమే తమ పిల్లలకు పరిచయం చేస్తే దాని ప్రభావం వారిపై ఎలా ఉంటుంది?

పెద్దవారికి తెలిసిన తెలుగుదనం, సంస్కృతి వగైరాలు ప్రస్తుత పరిస్థితిలో పిల్లలకు తెలిసే అవకాశం తక్కువే. తమ చిన్నతనంలో తెలుగు సాహిత్యం, సినిమాలు వగైరాలతో పరిచయం ఉన్న పెద్దవారికి అప్పుడప్పుడూ కొత్తసినిమాల 'మాస్' సంస్కృతితో కలిగే ప్రమేయం వారిని పెద్దగా ప్రభావితం చెయ్యకపోవచ్చు. కాని తమ పిల్లలకు ఏ రకం తెలుగు పాటలతోనూ, డాన్సులతోనూ ప్రమేయం కల్పిస్తున్నారో వారు ఆలోచించాలి. ఇతరత్రా ఏమీ తెలియని ఆ పిల్లలకు తెలుగు సంస్కృతి అంటే నూటికి నూరుపాళ్ళూ ఇదేనేమో అనే తప్పుడు అవగాహన ఏర్పడితే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

ప్రస్తుతం పాతికేళ్ళున్న తెలుగు యువతీయువకుల్లో చాలామందికి తెలుగు రాయడం, చదవడం రాదనేది గమనించాలి. అందువల్ల వారికెంత నష్టం కలుగుతోందో కాని మొత్తం మీద తెలుగు భాషకూ, తెలుగుజాతికీ నష్టం ఏదైనా కలిగితే అందుకు బాధ్యత మాత్రం పూర్తిగా వారి తల్లిదండ్రులదే. ఒకప్పుడు సమాజంలో కళారూపాల ద్వారా ఏదో రకం తెలుగు సంస్కృతి నలుగురికీ అందుబాటులో ఉండేది. అందువల్ల అటువంటి వాతావరణం సృష్టించడానికి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం ఉండేదికాదు. ప్రవాసాంధ్రుల విషయంలో ఈ పని సాంస్కృతిక సంఘాలద్వారానే జరగాలి. అందుకనే నిర్వాహకులకు సగటు సభ్యుల కంటే ఉన్నతమైన సాంస్కృతిక అవగాహన ఉండి తీరాలి. కేవలం ఎక్కువమందిని ఆకర్షించడానికో, ఏదో ఒక డాన్సులో ప్రతివారి పిల్లలూ పాల్గొనే విధంగా చెయ్యడానికో చవకబారు పాటలను తెలుగు సంస్కృతి పేరుతో సరఫరా చెయ్యడం దీర్ఘకాలికంగా హాని కలిగిస్తోంది.

ఇటువంటివే ఏర్పాటుచేస్తూ ఉండకపోతే 'జనం రారు' అనే నిర్వాహకుల భయం నిరాధారమైనది. ఈ తెలుగు ప్రేక్షకులే పొరుగు భాషాసంఘాల కళాప్రదర్శనలకు టికెట్లు కొనుక్కుని మరీ వెళతారు. సాంస్కృతిక సమావేశాలు రాజకీయసభలు కావు. వాటి 'విజయాన్ని' హాజరైనవారి సంఖ్యతో ముడిపెట్టకూడదు. ప్రేక్షకుల సంఖ్యాబలాన్ని పెంచేవి సినిమాలు. వాటికి లక్ష్యం ధనార్జనే. ఎక్కువమందికి నచ్చేది నేలబారు సంస్కృతి అయినా సినిమాలు తీసేవారికి అభ్యంతరం ఉండదు. 'కలాపోసన'తో వారికి ప్రమేయం ఉండదు. అందుచేత కేవలం సినిమాల్లోదే కళ అనుకునేవారు పూర్తిగా పొరబడినట్టే.

ఉన్నత సాంస్కృతిక ప్రమాణాల సంగతి ఎలా ఉన్నా, తామో, తమ పిల్లలో పాల్గొంటే తప్ప ఏ కార్యక్రమానికీ హాజరుకాని తెలుగు కుటుంబాలు తయారవుతున్నాయి. తమ ఐటం పూర్తవగానే వీరి కళాసక్తి తగ్గిపోతుంది. కొన్ని తెలుగు కుటుంబాల్లో పిల్లలకు శాస్త్రీయనృత్యాలూ, సంగీతమూ నేర్పే అలవాటు ఉంటుంది. అయితే స్టేజీ ఎక్కడానికి అంత శ్రమపడనవసరం లేదనే సందేశం పిల్లలకు ఇవ్వబడుతూ ఉంటుంది. బ్రేక్ డాన్సూ కష్టసాధ్యమే కావచ్చుగాని చప్పట్లతో ప్రోత్సహించడాన్నిబట్టి మంచి కళలకు ప్రత్యేకత ఏమీ లేదనే సందేశంకూడా పిల్లలకు అందుతూ ఉంటుంది.

పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టకుండా, మంచి పోషకవిలువలున్న ఆహారాన్ని పెట్టే తల్లిదండ్రులు కూడా దేశీయ, జాతీయ సంస్కృతి విషయంలో వారిని ఏ రకమైన పోషకాలు అందుతున్నాయో లక్ష్యపెట్టరు. తిండి అయినా, సాంస్కృతిక విలువలైనా పిల్లలకు తల్లిదండ్రుల ద్వారానే లభించాలి గనక ఈ విషయాలను గుర్తు చెయ్యడం అవసరమవుతోంది. చూయింగ్ గం ఇష్టం కదా అని పిల్లలకు అదే తినిపిస్తామా?

శాస్త్రీయసంగీతమూ, నాట్యాలూ, మంచి సాహిత్యమూ అంటే అందరికీ సరిపడదు. ఒక్కొక్కప్పుడు బోరు కొడతాయి కూడాను. అయితే చెత్త సినిమాపాటలు కట్టడానికికూడా మంచి సంగీతజ్ఞానం అవసరమే. అలాగే సినిమాల డ్రిల్లు డాన్సులు కంపోజ్ చేసేవారు కూడా సుశిక్షితులే. ఏ కళకైనా వ్యాకరణం, లేదా గ్రామర్ ఉంటుంది. అది శాస్త్రీయంగా నేర్చుకోవలసిందే. అటువంటివి నేర్చుకున్న వందమంది పిల్లల్లో ఒకరిద్దరికి నైపుణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. సంస్కృతి కొనసాగడానికి వారే బాధ్యులవుతారు. కళాకారులు ఆకాశంనుంచి ఊడిపడరు కనక అందుకు అవకాశాలు తల్లిదండ్రులే కల్పించాలి. కళలను అభ్యసించే పిల్లలు అందరూ మంచి కళాకారులు కాకపోయినా కనీసం మంచి శ్రోతలైనా అవుతారు. జాతికి గుర్తింపునిచ్చే సంస్కృతి ఆ విధంగానే బతికి బట్ట కడుతుంది.

లలితకళలవల్ల పిల్లలకు మానసికంగా మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటారు. ప్రసిద్ధ గాయకవిద్వాంసుడు నూకల చినసత్యనారాయణ మంచి సంగీతం వారి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుందనీ, కొన్నిరకాల సంగీతం వారిలో పశుప్రవృత్తిని ప్రేరేపిస్తుందనీ అన్నారు. ఇది గమనించవలసిన విషయం. ప్రసిద్ధ శాస్త్రీయగాయనీ గాయకులలో చాలామంది చిన్నతనంలో తమ తల్లులు పాడిన గీతాలూ, భజనల కారణంగానే తమకు సంగీతం మీద ఆసక్తి కలిగిందని చెపుతారు. తెలుగువారికి ఈ విషయంలో ఆసక్తి తగ్గడానికి తెలుగుతల్లులకు సంగీతంమీది నిరాసక్తతే కారణమయితే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. స్త్రీలను తప్పుపట్టడానికి ఇది చెప్పటంలేదు. లలితకళల వంటి సున్నితభావనలు తల్లినుంచి అందినంత సులువుగా తండ్రినుంచి అందవనేది తెలిసినదే.

అయితే తెలుగు సమాజాలు సరదా కార్యక్రమాలు నిర్వహించకూడదా? తప్పక నిర్వహించాలి. ఏటా ఒకటి రెండుసార్లు పిల్లలూ, పెద్దలూ అందరూ ఉత్సాహంగా పాల్గొనేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి తీరాలి. ఇవికాక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు - అంటే సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు విధిగా నిర్వహించాలి. వాటిని చౌచౌ పద్ధతిలోకాక తక్కిన అంశాలేవీ లేకుండా ఏర్పాటుచెయ్యాలి. అంటే శాస్త్రీయసంగీత కచేరీనో, నాట్యప్రదర్శననో ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటితో మరేదీ చేర్చకూడదు. రెండు గంటలసేపు ఒక ఉత్తమ ప్రదర్శనను ఓపికగా కూర్చుని ఆస్వాదించడం అందరికీ అలవాటుచెయ్యాలి. అటువంటి ప్రోత్సాహం లభిస్తే కళాకారులు మరింతగా శ్రమించి, రాణిస్తారు. తెలుగు నాటికలనూ, నాటకాలనూ తప్పనిసరిగా ఏర్పాటు చేసి, స్థానిక నటీనటులను తయారుచేసుకోవాలి.

తమ భాషనూ, సంస్కృతినీ గౌరవించని జాతి ఏ సంస్కృతినీ గౌరవించదనేది పెద్దలు ఏనాడో చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ సంగతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగుసంఘాల ప్రస్తుత కార్య నిర్వాహకులకు మరొకసారి గుర్తుచెయ్యవలసివస్తోంది. ఎందుకంటే వారు పాపం నిన్నటి బాలలు. తమ తల్లిదండ్రులు పెట్టిన సాంస్కృతిక ఆహారం జీర్ణించుకుని పెరిగినవారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)