యోగ తేజస్వి - పతంజలి మహాముని

మదిలో రస స్ఫూర్తి ఇనుమడించిన వేళ, ప్రపంచంలో తనకున్న శక్తియుక్తులన్నిటినీ కూడదీసుకుని కళాకారుల మనస్సు కళా సృష్టి చేస్తుంది. కొన్ని వందల భావాలు ఒకే చిత్రంతో చెప్పడానికి తన కుంచెను సర్వ రీతుల్లో ఆనందనర్తనమాడిస్తారు చిత్రకారులు. సరిగ్గా ఆ సంగతులను తెలుసుకుని ఆనందిచేదే రసజ్ఞ హృదయం. కుంచె కొసల నుండి జాలువారే వేలాది భావాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ శీర్షిక. ప్రతి నెలా శ్రీ శేషగిరి రావు గారి చిత్రాలకు వెనుక కథ ఇందులో మీకోసం.....




"యోగః కర్మసు కౌశలం" అన్న భవద్గీత ఉక్తి ననుసరించి సర్వకర్మలలో నైపుణ్యంతో కూడినది, కుశలత్వమును కలిగించేది యోగము. కర్మ, జ్ఞాన, భక్తి యోగముల యొక్క ప్రాధాన్యాన్ని వ్యాసమహర్షి భవద్గీతతో ఉటంకించగా, ఆ సర్వయోగ దర్శనాన్ని ఒక గ్రంధ రూపంలో అందించిన మహాత్ముడు "ద్రష్ట" "స్రష్ట" పతంజలి మహర్షి.

"ఆదిశేషువు" అవతారమూర్తి పతంజలి మహర్షి. దాన్ని తెలియచేస్తూ ఈ చిత్రకారులు శ్రీ కొండపల్లి శేషగిరి రావుగారు పతంజలి తలపై ఆది శేషువు రూపాన్ని చిత్రించారు. మనసు యోగం చేత, శరీరమును వైద్యం చేత, అపశబ్ద ప్రయోగములను వ్యాకరణంచేత సంస్కరించవలెనని తెలిపిన మహనీయుడు పతంజలి.

"యోగేన చిత్తస్య, ఏదేన నాచా, మలా శరీరస్వచ వైద్య కేన|
యోన పాకరోత్తం ప్రవరా మునీనాం, పతంజలి ప్రాంజలిరానత్యోస్మి||

"యోగః చిత్త వృత్తి నిరోధకః" అనే యోగదర్శన సూత్రం ద్వారా మనస్సును పరిపరి విధాలైన మార్గాలనుండి మళ్ళించగలిగేదే యోగము. శారీరక సాధనవల్ల శరీరం దారుఢ్యాన్ని పొందితే, యోగం వల్ల శరీరం, మనస్సు తేజోమంతమైన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్గించి కైవల్య ప్రాప్తి కల్గిస్తాయి.

"మనః యేన మనుష్యాణాం కారణం బాధ మోక్షయో" అన్నట్ట్లు సర్వబంధాలకు కారణమైన మనస్సును నియంత్రించాల్సిన వసరం ఉంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నీయంత్రించి, మనస్సును, అంతః కరణ శక్తులని అదుపుచేయగల్గితే మనిషి, మనీషి అవుతాడు.

సుషుమ్నా నాడి నుండి సహస్రార చక్రం వరకు ఉన్న షట్చక్రాలను ఉత్తేజ పరచి జ్యోతి స్వరూపుడైనపరమాత్మ దర్శనం పొందే అవకాశాన్ని కల్గించేదే యోగసాధన. కాల సర్పంలా వెనుక భాగాన్ని ఆక్రమించి బ్రహ్మరంధ్రం వరకు సాగిన ఈ వెన్నుపూసలో ఉండే శక్తులన్నీ మేల్కొల్పడం ద్వారా మోక్షమార్గాన్ని పొందవచ్చునని తెలుపుతోంది ఈ చిత్రం.

జ్ఞాన తేజస్సును అగ్ని స్వరూపంతో సరిపోల్చి యోగశక్తితో ఇంద్రియాలను మనస్సును నియంత్రించి, ఆసన స్థితిలో, మనోనేత్రం ద్వారా (జ్ఞాన చక్షువు) (అంతర్ముఖమైన శక్తితో మాత్రమే) ముక్తి సాధన సాధ్యమనే సత్యాన్ని నిరూపిస్తోంది ఈ చిత్రం.

యోగ విద్యకు అధిదేవత 'నటరాజు ' అని నిరూపిస్తూ ఈ చిత్రంలోని నటరాజు యోగరూపం కనిపిస్తుంది.

"తత్ సృష్ట్యా తదేవానుప్రావిశత్" అనే ఉపనిషద్వాక్యము ద్వారా అలౌకిక చైతన్యం సర్వ వ్యాపి అని, లోకభిన్నమని, యోగ శాస్త్ర సిధ్ధాంతం తెలుపుతోంది. పాశ్చ్యాత్యుల పరిణామ సిధ్ధాంతాన్ని ఖండించి, భారతీయుల మూల సిధ్ధాంతాన్ని, ఆధ్యాత్మికత సంపదను తెలిపేదిగా ఉంది ఈ చిత్రం.

మహా కవి కాళిదాసు ఉక్తి ప్రకారం
"అల్ప స్వహేతో బహుహేతుమిచ్చన్|
విచార మూఢ పరిభాసి మేత్యం||"

అల్ప విషయాలకై గొప్ప పరమార్ధ తత్వాన్ని విడిచిపెట్టే వాడు మూర్ఖుడని, అశాశ్వతమైన దేహమును నమ్మి, శాశ్వతమైన అమృత తత్వాన్ని దూరం చేసుకోవడం తగదన్న బోధన గావించిన పతంజలి మహర్షికి సమస్త జీవకోటి "యోగాంజలి" ఘటించడమే యదార్ధ నివాళి.

ఇంతటి అపురూప చిత్రాన్ని అందించి, భారతీయ ఆధ్యాత్మిక విలువలకు అద్దం పట్టిన ఆచార్య డా| కొండపల్లి శెషగిరి రావు గారి చిత్ర రచనా చమత్కృతి రసజ్ఞ హ్రుదయ రంజకమైనదని చెప్పడానికి గర్విస్తున్నాం.

ఆచార్య డా|| కొండపల్లి శెషగిరి రావు గారికి ఈ విషయంలో జాతియావత్తూ ఋణపడి ఉంటుందున్నదన్నది నిత్యసత్యం.

రచయిత: శ్రీమతి నర్సమాంబ (సంధ్య)
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)